అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కొందరు ముఖ్య నేతలు తాము ఇన్నాళ్లూ కొనసాగిన పార్టీని వదిలి ఎదుటి పక్షంలో చేరారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కొత్తగా పార్టీలో వచ్చి చేరిన నేతలు ఎంత మేర ప్రభావం చూపుతారనే అంశంపై అన్ని నియోజకవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల కేవలం నేతలు వలస రాగా, వారి వెంట ఉన్న అనుచరగణం మాత్రం సొంత పార్టీలోనే కొనసాగుతున్నారు. వలస నేతల్లో కొందరు ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొంటుండగా, మరికొందరు స్తబ్ధుగా ఉంటున్నారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ రద్దయిన నాటి నుంచి జిల్లాలో వలసల రాజకీయం జోరందుకుంది. అసెంబ్లీ రద్దుకు ముందే టీఆర్‌ఎస్ ముందస్తు వ్యూహంలో భాగంగా చేరికలను అమలు చేస్తూ వచ్చింది. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటూ వచ్చిన టీఆర్‌ఎస్ తాజాగా టీజేస్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డితో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో బుచ్చిరెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు.
పీపుల్స్ ఫ్రంట్‌లో సీట్ల సర్దుబాటులో భాగంగా తనకు అవకాశం దక్కకపోవడంతో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ ఇటీవల సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రజా సంఘాల్లో చురుకైన నేతగా పేరున్న బీరయ్య యాదవ్.. తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో పార్టీని వీడిన కొలన్ బాల్‌రెడ్డి తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరగా, జిన్నారం జెడ్పీటీసీ సభ్యుడు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు.
మరోవైపు బీజేపీ టికెట్ ఆశించిన సతీష్‌గౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరి గూడెం మహిపాల్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో హుగ్గెల్లి రాములు, గుండప్ప వంటి కీలక నేతలను తన వైపు తిప్పుకోగలిగిన టీఆర్‌ఎస్, ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత విద్యుత్ బోర్డు మాజీ సభ్యుడు దశరథరెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుంది. అందోలులో కాంగ్రెస్ నేత జగన్మోహన్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు.
ఇతర పార్టీల్లోనూ వలస నేతలు..
ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తమవైపుకు తిప్పుకోవడంలో టీఆర్‌ఎస్ ముందంజలో ఉం డగా, ఇతర పార్టీలు కూడా స్థానిక రాజకీయ పరి స్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాయి. నారాయణఖేడ్‌లో 2016లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరిన కొందరు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు.. ఇటీవలే తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. జహీరాబాద్ నుంచి రెండు పర్యాయాలు పోటీ చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు వై.నరోత్తం కాంగ్రెస్‌లో చేరినా ప్రచారంలో అంతగా కనిపించడం లేదు.
పటాన్‌చెరు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన సపాన్‌దేవ్, జె.రాములు, అం జిరెడ్డి, శశికళ యాదవరెడ్డి వంటి నేతలు కాటా శ్రీనివాస్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొండాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు నాగరాణి ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు. అందోలులోనూ పలువురు మండల స్థాయి టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరి ప్రచారం నిర్వహిస్తున్నారు. అందోలు, సంగారెడ్డి బీజేపీ అభ్యర్థులు బాబూమోహన్, దేశ్‌పాండే టీఆర్‌ఎస్ నుంచి రాగా, నారాయణఖేడ్ బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి చివరి నిమిషంలో పార్టీలో చేరారు.
ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు ఎన్నికల ఫలితాలపై ఎంత మేర ప్రభావం చూపుతారనే అంశంపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. చేరికలు, వలసలను రాజకీయ ఎత్తుగడగా భావించిన అన్ని పార్టీలు, వివిధ పార్టీల అసంతృప్తులు, అసమ్మతి నేతలను తమ వైపునకు లాక్కునేందుకు ప్రాధాన్యత ఇచ్చాయి. ఎదుటి పార్టీ అభ్యర్థిపై మానసికంగా పైచేయి సాధించడంతో పాటు, ఓటర్లలోనూ బలమైన పార్టీగా ముద్ర వేసుకునేందుకు అన్ని పార్టీలు వలసల వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చాయి.
ఎన్నికల వేళ పార్టీలో చేరిన కొందరు నేతలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, తమకున్న బలాన్ని చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు వలస నేతలు మాత్రం చేరిక సందర్భంగా హడావుడి చేసి, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment