ఇక్కడ గెలిచిన వారిదే అధికార పీఠం | Power Center Gajwel Constituency | Sakshi
Sakshi News home page

ఇక్కడ గెలిచిన వారిదే అధికార పీఠం

Published Tue, Nov 13 2018 2:16 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Power Center Gajwel Constituency - Sakshi

సాక్షి, గజ్వేల్‌ :  భిన్న సంస్కృతుల సమ్మేళనంగా విరాజిల్లుతోంది గజ్వేల్‌ నియోజకవర్గం. స్వయానా కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంగా.. ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు జన్మనిచ్చిన గడ్డగా.. తెలంగాణ ఉద్యమాన్ని అప్రతిహతంగా కొనసాగించిన నేలగా.. కవులు, కళాకారులకు నిలయంగా.. ‘వెజిటబుల్‌ హబ్‌’గా ఇలా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. సిక్కులు, గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిరపడడంతో మినీ ఇండియాను తలపిస్తోంది. రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. స్థానికేతరులకు అచ్చొచ్చిన నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్‌ 2014లో ఇక్కడి నుంచి గెలిచి స్వరాష్ట్ర తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. గత 13 ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం విశేషం.        

సెంటిమెంట్‌గా నియోజకవర్గాన్ని ఎంచుకున్న కేసీఆర్‌
ఏడు మండలాలతో కూడిన గజ్వేల్‌ నియోజవవర్గం పాత వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది. దీంతో ఈ మూడు జిల్లాల సంస్కృతి ఇక్కడ విస్తరించింది. ములుగు, వర్గల్, తూప్రాన్‌ మండలాలు గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఆనుకొని ఉండడంతో ఇక్కడ నగర వాతావరణం కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తుంటారు. ప్రజా ఉద్యమ గాయకుడు గద్దర్‌ పుట్టింది ఈ గడ్డ మీదనే. ఇక్కడి బిడ్డ అయిల నర్సింలు 1969లో తెలంగాణ తొలి దశ పోరాటంలో పాల్గొని గజ్వేల్‌ చౌరస్తా వద్ద జరిగిన పోలీసు కాల్పులకు నేలకొరిగాడు.  ‘అయిల నర్సింలు’ రక్తంతో తడిసిన ఈ నేల మలి దశ పోరాటంలోను అదే స్ఫూర్తిని చాటింది. తెలంగాణ ఉద్యమ రథ సారథి కేసీఆర్‌ 2014లో ఇక్కడి నుంచి గెలిచి స్వరాష్ట్ర తొలి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. గత 13 ఎన్నికల్లోనే ఇక్కడ గెలిచిన పార్టీయే అధికారంలోకి రావడం విశేషం.                                          

ప్రజా ఉద్యమాల పురిటి గడ్డ
దశాబ్ధాలుగా ఈ ప్రాంతం ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్నది. ప్రత్యేకించి ప్రత్యేక రాష్ట్ర ప్రజాస్వామిక ఆకాంక్షతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమంలో గజ్వేల్‌లోని చౌరస్తావద్ద విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిగాయి. ఇందులో పన్నెండేళ్ల వయసున్న అయిల నర్సింలు అనే బాలుడు పోలీసు తూటాలకు నేలకొరిగాడు. మరో విద్యార్థి సైతం గాయపడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కళలకు నెలవు...
ప్రజాగాయకునిగా ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన గద్దర్‌కు జన్మనిచ్చింది ఈ ప్రాంతమే. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో జన్మించిన ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచారు. తన అసమాన ప్రతిభతో సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన బీ నర్సింగరావుది గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ గ్రామమే. ‘మా భూమి, దాసి, రంగుల కల’ వంటి చిత్రాలతో ఆయన సంచలనాలకు కేంద్రబిందువయ్యారు. వీరిద్దరే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన పలువురు వర్ధమాన కవులు, కళకారులు తమదైన ప్రతిభను చాటుతున్నారు.

భిన్న సంస్కృతుల నిలయం
గజ్వేల్‌ నియోజకవర్గం భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. నియోజకవర్గంలోని కాళ్లకల్‌ పారిశ్రామిక ప్రాంతంలో దేశంలోని అనేక మతాలు వివిధ మతస్తులు, సంప్రదాయాలు కలిగిన వారు నివాసముంటున్నారు. ఇక్కడ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ములుగు మండలంలోని గంగాపూర్‌లో సుమారు 60కిపైగా సిక్కుల కుటుంబాలున్నాయి. వీరి కుటుంబాల్లో ఎక్కువమంది దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి సేవలందించడం విశేషం. ఇదిలా ఉంటే గజ్వేల్‌ పట్టణంలో గుజరాతీలు, కేరళవాసులు పెద్ద ఎత్తున స్థిరపడ్డారు. కేరళ వాసులు జరుపుకునే ‘ఓనమ్‌ ఉత్సవాలు’ ఇక్కడ ప్రతిఏటా ఘనంగా జరుగుతాయి. గుజరాతీలు సైతం తమ సంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. వీరంతా ఇక్కడి ప్రజలతో ఆత్మీయుల్లా కలిసిపోయారు. మనోహరాబాద్‌ మండలంలోని కాళ్లకల్‌ గ్రామం పారిశ్రామికీకరణ జరగడం వల్ల ఆ ప్రాంతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు నివసించడం వల్ల మినీ ఇండియా వాతావరణాన్ని కలిగి ఉంది.  

గజ్వేల్‌ ముఖ చిత్రం
మండలాలు 
గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తూప్రాన్, మర్కూక్, మనోహరాబాద్‌.  

ఓటర్లు 
మొత్తం         : 2,27,954
పురుషులు   : 1,14,362
మహిళలు    : 1,13,554
మొత్తం జనాభా : 3,50,980


‘వెజిటబుల్‌ హబ్‌’గా అవతరణ..
గణనీయమైన కురగాయల సాగుతో గజ్వేల్‌ నియోజకవర్గం ‘వెజిటబుల్‌ హబ్‌’గా ఆవిర్భవించింది. ఇక్కడి పండించిన కురగాయలే జంటనగరాలకు ఆధారం. ఇక్కడ పండించిన కురగాయలు సేకరించడానికి ఇక్కడ వివిధ మల్టినేషనల్‌ కంపెనీల కలెక్షన్‌ సెంటర్‌లు వెలిశాయి. ప్రభుత్వ పరంగా ములుగు మండలం వంటిమామిడిలో కురగాయాల మార్కెట్‌ ఏర్పాటైంది.  ఇక్కడి నుంచి జంట నగరాలకే కాకుండా ఢిల్లీ, బెంగుళూర్, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ములుగు మండల కేంద్రంలోని అటవీ పరిశోధనా కేంద్రంలో హర్టికల్చర్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. దీంతోపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఫారేస్ట్రీ కళశాలను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు.

గజ్వేల్‌ నియోజకవర్గ ముఖ చిత్రం
గజ్వేల్‌ 1962 నుంచి 2004వరకు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంగా ఉంది. ఆ సమయంలో ఎస్సీ ఎమ్మెల్యేలను అడ్డంపెట్టుకొని చక్రం తిప్పిన నేతలంతా ఇక్కడి రాజకీయాలను శాసించారు. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ‘జనరల్‌’గా మారటంతో తెరచాటు రాజకీయాలు చేసిన నేతలంతా ప్రత్యక్ష రాజకయాలకు దిగడంతో పరిస్థితులు ఆసక్తిరంగా మారాయి.

 స్థానికేతరులకు అచ్చొచ్చిన నియోజకవర్గం
1952లో ఎమ్మెల్యేగా గెలిచిన పెండేం వాసుదేవ్, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో పనిచేసిన జేబీ. ముత్యాలరావు, ఆర్‌.నర్సింహ్మారెడ్డి, 1983లో గెలుపొందిన అల్లం సాయిలు, 1985లో ఎమ్మెల్యేగా పనిచేసిన సంజీవరావు, 1989, 2004లలో గెలుపొందిన డాక్టర్‌ జే.గీతారెడ్డి, 1994లో విజయం సాధించిన డాక్టర్‌ జీ.విజయరామారావు, 1999లో పనిచేసిన సంజీవరావులు స్థానికేతరులే. స్థానిక నాయకత్వం బలంగా లేదనే కారణంతో గజ్వేల్‌లో కాంగ్రెస్, టీడీపీ రాజకీయాలను శాసించిన ఇక్కడి నేతలు స్థానికేతర నాయకులను ‘బరి’లోకి దింపి గెలిపించారు.

 2014లో కేసీఆర్‌ ‘ఇలాకా’గా ఆవిర్భావం 
2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని సెంటిమెంట్‌గా ఎంచుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అనుకున్న విధంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 2008 నుంచే ఇక్కడ ఫామ్‌హౌస్‌ ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్న కేసీఆర్‌ ఇదే తన ‘ఇలాకా’గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి నమూనగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 199062ఓట్లు పోలవగా, ఇందులో కేసీఆర్‌ 86372 ఓట్లను దక్కించుకున్నారు. టీడీపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 19218 ఓట్ల మెజార్టీని సాధించి విజయం సాధించారు.

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ హోరాహోరీ ప్రచారం
ఇదిలా ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున తిరిగి కేసీఆర్‌ బరిలో ఉండగా... కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంటేరు ప్రతాప్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. అభివృద్ధే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ ముందుకెళ్తుండగా... ప్రతాప్‌రెడ్డి గతంలో ఓడిపోయిన సానుభూతి, ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement