దుబ్బాక టౌన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నాలుగు నక్సలైట్ దళాలు ఓకే నియోజకవర్గంలో పనిచేయడంతో దేశవ్యాప్తంగా దుబ్బాకకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మూడు జిల్లాల సరిహద్దులో అది కూడ ఉత్తర తెలంగాణ.. దక్షిణ తెలంగాణలను కలుపుతు మధ్యన ఉండే నియోజకవర్గం దుబ్బాక కావడంతో ఎన్నో సంచలన ఘటనలకు దుబ్బాక కేంద్ర బిందువుగా మారింది. రాజకీయంగా ఎంతో చైతన్య వంతమైన ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన చాలా మంది మహామహులు మంత్రి పదవితో పాటుగా, డిప్యూటీ స్పీకర్, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్లుగా, టీటీడీ బోర్డు మెంబర్లుగా బాధ్యతలు చేపట్టి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
ఎన్నో మార్పులు..
1952లో తొలిసారి రాజగోపాలపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఓయూ ప్రొఫెసర్ కే.వీ. నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలుపొందారు. 1957లో వంగ హనుమంతరెడ్డి అలియాస్ ఆశిరెడ్డి పీడీఎఫ్ తరపున గెలుపొందారు. 1962 ఎన్నికల్లో ఎంకే. మోహినోద్దీన్ కాంగ్రెస్ తరపున గెలిచారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎం.బీంరెడ్డి అనంతరం కాంగ్రెస్‌లో చేరారు.
1972లో దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 1978 లో దుబ్బాకకు చెందిన ఐరేని లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి శాసనసభ ఉపసభాపతి పదవిని పొందారు. 1983లో రాష్ట్రం అంతా టీడీపీ ప్రభంజనం వీచినా దొమ్మాటలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఐరేని లింగయ్య విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కొండపాకకు చెందిన డీ. రాంచంద్రారెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు.
1989, 1994, 1999లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. 2004లో టీఆర్‌ఎస్ నుంచి బరిలో దిగిన జర్నలిస్ట్ సోలిపేట రామలింగారెడ్డి ముత్యంరెడ్డిపై గెలుపొందారు. అనంతరం 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఏర్పడిన దుబ్బాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకు ముత్యంరెడ్డి గెలుపొందారు. 2014లో ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి ఘనవిజయం సాధించారు.
ఉద్యమాల ఖిల్లాగా...
అనేక విప్లవోద్యమాలకు, తెలంగాణ పోరాటంలో దుబ్బాక నియోజకవర్గం దిక్చూచిగా నిలిచింది. భౌగోళికంగా మొదటి నుంచి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు సరిహద్దులో ఉండడంతో నియోజకవర్గంలో విప్లవోద్యమ ప్రభావం అధికంగా ఉంది. నియోజకవర్గంలో దుబ్బాక, ఇందుప్రియాల్, గీరాయిపల్లి పీపుల్స్‌వార్ గ్రూపు దళాలతో పాటుగా జనశక్తి కూడవెళ్లి దళాలు చాలా సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేశాయి.
వీటితో పాటుగా జనశక్తి వీరన్న వర్గం, ప్రజాప్రతిఘటన దళాలతో పాటుగా పీపుల్స్‌వార్‌లో, జనశక్తి పార్టీలో కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ స్థాయి నాయకులు ఉండడం, పెద్ద సంఖ్యలో విప్లవోద్యమాల్లో స్థానిక ప్రజలు భాగస్వాములు అయ్యారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో సైతం రాష్ట్రంలోనే ఇక్కడ అధికంగా ఆందోళనలు జరిగాయి. దీంతో వందలాది మందిపై పోలీసు కేసులు నమోదు కావడం, జైలు జీవితాలు గడపడం ఈ గడ్డ దిక్కార స్వభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
మొదట దొమ్మాట..
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిదశలో రాజగోపాలపేటగా ఉన్న ఈ నియోజకవర్గంలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలు ఉండేవి. ఆ తర్వాత 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజగోపాలపేట స్థానంలో దొమ్మాట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. దొమ్మాటలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, కొండపాక మండలాలు ఉండేవి. 2001లో మిరుదొడ్డి, కొండపాక మండలాల నుంచి 17 గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా తొగుట మండలాన్ని ఏర్పాటు చేశారు.
కీలకమైన పదవులు..
నియోజకవర్గం నుంచి ఎన్నికైన అనేక మంది శాసనసభ్యులు రాష్ట్ర కేబినెట్‌లో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టారు. 1978లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐరేని లింగయ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. 1994లో టీడీపీ నుంచి రెండవసారి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, 1999లో టీడీపీ నుంచి గెలుపొందిన ముత్యంరెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి రాష్ట్రశాసన సభ అంచనాల కమిటి చైర్మన్‌గా నియమితులయ్యారు.
కూడవెళ్లి వాగే ఆధారం..
గోదావరికి ఉపనదిగా పిలువబడే కూడవెళ్లి వాగు నియోజకవర్గంలో 56 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇదే ఈ ప్రాంతానికి ఏకైక నీటి వనరు. వరుస కరువులతో కేవలం బూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేయడం తప్ప మరేలాంటి సౌకర్యాలు ఇక్కడ లేవు. ఇక్కడి ప్రజలు అనేక మంది వ్యవసాయం, చేనేత, బీడీ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు.
2009లో దుబ్బాకగా..
2009 ఎన్నికల ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో దుబ్బాక కేంద్రంగా నియోజకవర్గం ఆవిర్భవించింది. గతంలో దొమ్మాటలో ఉన్న కొండపాక మండలాన్ని గజ్వేల్ నియోజకవర్గంలో చేర్చి అప్పటి రామాయంపేట నియోజకవర్గంలో ఉన్న చేగుంట మండలాన్ని దుబ్బాకలో చేర్చారు. దుబ్బాక మండలంలోని 11 గ్రామాలు, మిరుదొడ్డి మండలంలోని ధర్మారం సిద్దిపేట నియోజకవర్గంలో ఉండగా వాటిని దుబ్బాకలో కలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా రాయపోల్, నార్సింగ్ మండలాలు ఏర్పాటు చేసింది.దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్ ఏడు మండలాలతో పాటుగా గజ్వేల్ మండలంలోని ఆరపల్లి గ్రామంతో కలిసి దుబ్బాక నియోజకవర్గంగా ఉంది.
ఓటర్లు
పురుఝలు - 92,453
స్త్రీలు - 95,413
మొత్తం -1,87,866
Comments
Please login to add a commentAdd a comment