Prajakutami
-
సెంటిమెంట్ ముందు నిలవలేకపోయాం
సాక్షి,హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెంటిమెంట్ రాజకీయాల ముందు ప్రజా కూటమి నిలవలేకపోయిందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విశ్లేషించారు. కూటమి ఎజెండా బాగా ఉన్నా, వాటిలోని అంశాలను కేసీఆర్ మొదట విమర్శించినా ఆ తర్వాత పెన్షన్లు, నిరుద్యోగ భృతికి మరో రూ.16 కలిపి టీఆర్ఎస్ తమ వాగ్దానాలనే కాపీ కొట్టిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ ప్రచారంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను టీఆర్ఎస్ తెరమీదకు తీసుకొచ్చిందని, దీంతో సెటిలర్లంతా టీఆర్ఎస్ పక్షానే నిలిచారన్నారు. మఖ్దూంభవన్‌లో బుధవారం ఆ పార్టీ నాయకులకు అజీజ్ పాషా, పల్లా వెంకటరెడ్డి లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలకు వామపక్షాలకు ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు. సీట్ల సర్దుబాటులో జాప్యమే ముంచింది కూటమి సరైన సమయంలో ఏర్పడినా, సీట్ల సర్దుబాటులో జాప్యం, సమన్వయలోపాల కారణంగా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఖమ్మం జిల్లా మాత్రమే ప్రజాకూటమికి అండగా నిలిచిందని, మిగతా జిల్లాల్లో భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కుదరలేదన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్కు సగానికి సగం సీట్లు తగ్గుతాయని తాము అంచనా వేసినా సెంటిమెంట్ రాజకీయాలతోనే కేసీఆర్ విజయం సాధించారన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అన్న సందేహాలు కూడా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ జరిగిందని, వీటి నియంత్రణలో ఈసీ విఫలమైందన్నారు. త్వరలోనే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున, ప్రజాకూటమి మరింత సమన్వయంతో బలోపేతం కావడం ద్వారా కేసీఆర్ ఏకపక్ష విధానాలకు చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కలిసి పోటీచేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని, తాము కాంగ్రెస్ కూట మిలో, బీఎల్ఎఫ్ కూటమిలో సీపీఎం పోటీచేశాయన్నారు. సీపీఐకు ఇచ్చిన 3 సీట్లలో మిత్రధర్మాన్ని పాటించడంలో కాంగ్రెస్ విఫలమైందని సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి విమర్శించారు. -
ఖాతా తెరవని టీజేఎస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. ఉద్యమ ఆకాంక్షల నినాదం పెద్దగా పని చేయలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఒక కుటుంబం పెత్తనం చేస్తూ, ఇష్టానుసారం వనరులను దోచుకుంటూ, హక్కులను హరిస్తూ, నిరంకుశంగా పాలిస్తూ, ప్రజలధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మౌనంగా ఉండకూడదన్న సంకల్పంతోనే పార్టీ పెడుతున్నాం అంటూ ప్రజల ముందుకు వచ్చిన టీజేఎస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. 2018 మార్చి 31న ఏర్పడిన టీజేఎస్.. ఏప్రిల్ 29న భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో సొంతంగా, మరో 4 స్థానాల్లో ప్రజా కూటమిలో స్నేహపూర్వక పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. కూటమిలో టీడీపీ భాగస్వామి కావడం, సభల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడంతో ప్రజలు కూటమిని కూడా తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్ కూడా తన ఉనికిని కో ల్పోయింది. టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కపిలవాయి దిలీప్‌కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అంబర్‌పేటలో నిజ్జన రమేశ్‌ది అదే పరిస్థితి. వర్ధన్నపేటలో పి.దేవయ్య, సిద్దిపేటలో ఎం.భవాని రెండో స్థానంలో నిలిచారు. స్నేహపూర్వక పోటీ కింద వరంగల్ ఈస్ట్‌లో గాదె ఇన్నయ్య, దుబ్బాకలో రాజ్‌కుమార్, ఆసిఫాబాద్‌లో విజయ్‌కుమార్, ఖానాపూర్‌లో భీంరావును పోటీలో దింపినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. భవిష్యత్తు ఏంటి? టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కూటమి అధికారం లోకి వస్తే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలను తీసుకొని పార్టీ ని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న టీజేఎస్‌కు ఆ అవకాశమూ లేకుండాపోయింది. ఈ నేప థ్యంలో పార్టీ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. -
వికటించిన రాజకీయ కుట్ర!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పెద్ద కుట్ర పూర్తిగా వికటించింది. నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అనికాలర్ ఎగరేసే ఓ నేత, ఏ ఎండకా గొడుగు పట్టే ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయం–ఇండస్ట్రీల అవకాశవాద కలబోత ముసుగులో ఆడిన నాటకం రక్తికట్టకపోగా అసలుకే ఎసరు తెచ్చింది. ఆశించిన ఫలితమేదీ నెరవేర్చకపోగా మిణుకుమిణుకుమంటున్న వారి విశ్వసనీయతకూ పెద్ద గండికొట్టింది. తామొకటి తలిస్తే జనమొకటి తలచె అన్నట్లు ప్రజాతీర్పు వారి కుయుక్తులను చిత్తు చేసింది. బెట్టింగ్ ప్రపంచంలో ఎందరినో బోల్తా కొట్టించిన వారి ‘ఎత్తుగడ పార్ట్–2’ చివరకు చీకట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం వరకే పరిమితమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఫలానా సర్వే ఏమైంది?, ఫలితం ఎందుకిలా భిన్నంగా వచ్చింది?, విపక్షాలు మరీ ఇంత ఘోరమా?’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎడతెగని సందేహాలు! దీనికి సమాధానం తెలియాలంటే వెనక్కి తిరిగి కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూస్తాయి. ఎగ్జిట్ పోల్ భ్రమ కల్పిస్తూ, సర్వే అని బుకాయిస్తూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలపై అంచనాలొక పెద్ద రాజకీయ వ్యూహం! నాన్చి నాన్చి నాడు ఈ అంచనాలను వెల్లడించడం వెనుక రాజకీయ ‘ఒత్తిళ్లు’ పనిచేసినట్లు ప్రచారం జరిగింది. ఆ గణాంకాలకు, ఇప్పు డు వెల్లడైన ఫలితాలకు పొంతన లేకపోవడాన్ని అన్వయించినప్పుడు నాటి ప్రచారం నిజమేనేమో అనిపిస్తుంది! ఇక రాబోయే ఎన్నికల్లో జనం ఇటువంటి ఎత్తుగడల్ని ముందే ‘ఛీ’కొట్టనున్నారు. అది రేపు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికలైనా వారిది ఇదే పరిస్థితి! ‘ఇక ఆక్టోపస్ పని ఔట్!’ అన్నది ప్రస్తుత జనవాణి. గెలుపును చిన్నబుచ్చే యత్నం... రెండోసారి అంచనాలు వెల్లడించినప్పుడు ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని, పాలక టీఆర్ఎస్కు 35 స్థానాలు వస్తాయని ‘సర్వే’క్షకుడు వెల్లడించారు. దానికితోడు ఓ అశాస్త్రీయమైన ఎర్రర్ మార్జిన్ ప్రకటించారు. పనిలో పనిగా ముందే ఓ రాయి వేసి ప్రత్యర్థి గెలిస్తే ఆ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయ త్నం ప్రారంభించారు. తాము ఆశిస్తున్నట్టు పాలకపక్షం ఓడిపోయి, కూటమి గెలిస్తే సరేసరి! ‘ఆక్టోపస్ మళ్లీ సక్సెస్!’ అని బాకా ఊదుకోవచ్చు! కూటమే ఓడి, పాలకపక్షం తిరిగి గెలిస్తే.. ఏదో ఒక సాకు ముం దే సిద్ధం చేసుకున్నట్టు, ‘ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి, డబ్బు–మద్యం–ఇంకా ఇంకా... ఏవేవో ప్రభావలుండటం వల్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతోంది, అంచనా వేయడం మాకు కష్టమవుతోంది’ అని చెప్పడం వెను క ఉద్దేశం ఇదే! ఏ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ అయినా, ఎవరు ఎటు వేస్తున్నారు/వేయనున్నారు/వేశారు అన్నదే చూస్తారు తప్ప కారణాలు వెతికి, అంచనా తమకు చాలా కష్టంగా ఉందని ‘దీనాలాప న’ చేయరు! కానీ ఇక్కడ అదే చేశారు. ‘వీరు గెలిచే మరికొందరు స్వతంత్రుల’ని కొన్ని పేర్లు చెప్పి, ‘ఇంకొన్నిటి సమాచారం కూడా ఉంది కానీ అక్కడ నా మిత్రులు పోటీ చేస్తున్నారు కనుక అవి చాలా సున్నితమైనవి, నేను పేర్లు వెల్లడించను’ అని తన పక్షపాత ధోరణిని ఆయనే బయటపెట్టారు. ఇవి కల్లబొల్లి కబుర్లని తెలిసీ పతాక శీర్షికలు చేసి/బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి సాను‘కుల’ మీడియా తరించిం దని ప్రత్యర్థి రాజకీయపక్షాల వారు విమర్శించింది కూడా ఇందుకే! ఇదంతా ఓ విశాల కుట్రలో భాగమ ని సాధారణ పరిశీలకులకు కూడా స్పష్టమైంది. ఎందుకీ తెగింపు? ఏది చేసినా నిర్దిష్ట ప్రయోజనాలు ఆశించే చేస్తారని ఎప్పట్నుంచో ఈ సర్వేల పెద్దమనిషికి పేరు. కాకతా ళీయంగానో, యాదృచ్ఛికంగానో 4 సార్లు నంబర్లు కలవగానే.... ఓ గొప్ప సెఫాలజిస్టని, రాజకీయ/ఎన్నికల ఫలితాల విశ్లేషకుడనే పేరు ప్రచారంలోకి వచ్చింది. తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నపుడు ‘అబ్బో! అచ్చుగుద్దినట్టొచ్చింద’ని విస్తృత ప్రచారం చేసే సాను‘కుల’ మీడియా, నంబర్లు తేడా వచ్చినప్పుడు మాత్రం కిమ్మనదు. తప్పుడు విశ్వసనీయతను ముసుగు కప్పి మరీ కాపాడుతుంది. ఎప్పుడో మళ్లీ అవసరానికి పనికొస్తారు కదా అన్నది ఉమ్మడి ప్రయోజనం కావొ చ్చు! ఈ ఎన్నికల్లో కుట్రదారులు రెండంచెల నాటకమాడారు. ప్రజాక్షేత్రంలో అయోమయం సృష్టించి కూటమికి జవసత్వాలివ్వడం ఒకటైతే... బెట్టింగ్‌లకు ఆస్కారం పెంచడం రెండోది. సోదిలో కూడా లేని కూటమి దూసుకొస్తోందని, గెలుపు దిశగా పరుగెడుతోందని తప్పుడు రాతలు రాసిన అదే సాను‘కుల’ మీడియా ఈ చిలక జోస్యాలకు విస్తృత ప్రచారం కల్పించి వేదిక సిద్ధం చేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ‘ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వ తంత్రులు గెలుస్తారు, ఇదుగో ఈ ఇద్దరివి పేర్లు...’ అని తిరుపతిలో ఆ పెద్దమనిషి వెల్లడించినది టీజర్! ఆ ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. నారాయణపేటలో కె.శివకుమార్‌రెడ్డి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా బోథ్‌లో అనిల్‌జాదవ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక మిగతా ఇండిపెండెంట్ల పరిస్థితి అంతే సంగతి! అంచనాల పేరిట కూటమికి సత్తువ తెచ్చే ఈ కుట్రకు తెరలేచింది మాత్రం మీడియా పెద్ద మనిషి, రాజకీయ నేతతో సదరు ‘సర్వే’క్షకుడి భోజన భేటీలో అన్నది ప్రచారం. ఇక తమ అంచనాల పార్ట్–2 నాటకం, తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం 7 గంటలకు జరిగింది. ఆ సమయంలో విలేకరుల సమావేశమనగానే ఎవరైనా ‘ఎగ్జిట్ పోల్’ వివరాలు వెల్లడిస్తారేమో అనుకుంటారు. ఎగ్జిట్ పోల్ కాదని స్పష్టం చేసిన ఆయన... తాము సర్వే కూడా ఏమీ నిర్వహించలేదనీ ప్రకటించారు. ఎందుకిలా అంకెలు తరచూ మారుతున్నాయి? అని అడిగితే ‘మా వాళ్లు ఫీల్డులో ఉన్నారు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తున్నారు...’ అని చెప్పుకొచ్చారు. -
కేసీఆర్ 2.0.. బ్లాక్ బస్టర్
మందలు, మందలుగా ‘స్టార్ క్యాంపెయినర్లు’ దండెత్తి వచ్చినా.. ‘సింహం సింగిల్‌గా’నే పోరాడింది. కేసీఆర్ జపించిన సంక్షేమ మంత్రానికి పల్లెలన్నీ పోలింగ్ బూత్‌లకు వరుసకట్టాయి. ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ బాణం పట్టణాల్లో ప్రభంజనాన్ని సృష్టించింది. బాబుతో పొత్తు కాంగ్రెస్ పుట్టి ముంచింది. బాబు అండ్ బావ మరిదిల ఓవర్ యాక్షన్‌ను జనం ఛీకొట్టారు. మరోసారి కేసీఆర్‌కు జైకొట్టారు. ఒక్క ఖమ్మం జిల్లా మినహా గులాబీ రథానికి ఎక్కడా ఎదురేలేకుండా పోయింది. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా?. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది. చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు. నేను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదు. ఆయనకు పైత్యం ఎక్కువైంది. ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారు. అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారు. – మీడియాతో కేసీఆర్ తెలంగాణ గడ్డపై మళ్లీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జై కొట్టిన ప్రజలు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి అఖండ మెజార్టీతో ఆమోదం తెలిపారు. ధైర్యంగా ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకోవడం, మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేసీఆర్.. ఫలితాల్లోనూ అదే జోరుకు కొనసాగించారు. ప్రచారంలో అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన రాజకీయ యోధుడు మరోసారి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బకొట్టిన కేసీఆర్.. బీజేపీని దాదాపుగా గల్లంతు చేసినంత పనిచేశారు. తెలంగాణలో కారు జోరుకు ప్రొఫెసర్ కోదండరాం సార్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ అఖండ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగులేదని గులాబీ దళపతి నిరూపించుకున్నారు. పదిహేను రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చిన ఒకే ఒక్కడుగా, టీఆర్ఎస్ ఏకైక స్టార్ క్యాంపెయినర్‌గా వాహ్వా అనిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టి.. ఆ దిశగానే పథకాలు రూపొందించారు. అందుకే.. రైతుబంధు ఆయన్ను రారాజుగా నిలిపింది. కల్యాణæలక్ష్మి ఓట్ల వర్షం కురిపించింది. పింఛను పొందిన వారంతా బాసటగా నిలవడంతో టీఆర్ఎస్కు ఓట్ల పంట పండింది. మైనారిటీలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు మూకుమ్మడిగా అండగా నిలవడంతో గులాబీసేన తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూడబలుక్కుని కూటమిగా వచ్చినా కారు జోరు ముందు నిలవలేకపోయాయి. తెలంగాణను తామే అభివృద్ధి చేశానంటూ ప్రగల్భాలు పలికిన పచ్చపార్టీని 15 నుంచి 2 స్థానాలకే పరిమితం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ జనసమితిని.. అయ్యా మీ కో‘దండం’ అంటూ ఇంటికి పంపించేశారు. రాహుల్ ‘షో’ లతో ఓట్లు రాలుతాయని భావించిన కాంగ్రెస్ పార్టీకి చివరకు ఘోర పరాభవమే మిగిలింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 88 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. రైతులు, పేద ప్రజల సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలతో తెలంగాణ ఉద్యమ రథ సారధి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రైతన్నలకు ఎకరాకు 4 వేల రూపాయలు ఇవ్వడం ద్వారా యావత్ తెలంగాణను ఫిదా చేసిన కేసీఆర్.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణ మాఫీ, సామాజిక పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో ఇంకా తానే ఉన్నానని నిరూపించారు. గత శాసనసభ ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా 63 స్థానాలను నెగ్గిన టీఆర్ఎస్ ఈ సారి అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో దూకుడు ప్రదర్శించి సంఖ్యా బలాన్ని 88కు పెంచుకుంది. సీఎం కేసీఆర్ గజ్వెల్లో 58,290 ఓట్ల భారీ మెజారిటీతో గెలవగా.. సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీశ్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించి.. సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కూడా 89,009 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ నుంచి మరో 15 మంది 50 వేలకు పైగా మెజారిటీని సాధించడం గమనార్హం. అంతటా టీఆర్ఎస్ గాలి వీచినా స్పీకర్ మధుసూదనాచారితో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందులాల్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రజాకూటమికి పగటికలే! కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రజాకూటమి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసింది. కేసీఆర్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు పురుడుపోసుకున్న ఈ కూటమి కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 99 (నాలుగు సీట్లలో టీజేఎస్, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీ) చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందగా, 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 8 స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్, మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ పార్టీలు కనీసం ఒక్క సీటునూ గెలవలేకపోయాయి. కేసీఆర్ హవా కారణంగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, కొండాసురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ఓటమి తప్పలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఏడు శాసనసభ స్థానాలను నిలబెట్టుకుని హైదరాబాద్ పాతబస్తీపై తన పట్టును నిలబెట్టుకుంది. రాజేంద్రనగర్‌లో పోటీ చేయడం ద్వారా పార్టీని నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు మజ్లిస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. పార్టీ పోటీ చేసిన 118 స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలిచారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం నిర్వహించినా బీజేపీకి ఓట్లు రాలేదు. బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌లకు ఓటమి తప్పలేదు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ రామగుండంలో, ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు వైరాలో గెలుపొందారు. టీజేఎస్ ఎక్కడా కనీస పోటీని ఇవ్వలేకపోయింది. టీజేఎస్ పోటీ చేసిన చోట్లలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ దక్కింది. సీపీఎం, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమి ప్రయోగం దారుణంగా విఫలమైంది. గత ఎన్నికల్లో ఒక సీటును గెలిచిన సీపీఎం ఈ సారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మెజారిటీ రికార్డుల మోత 50,000+ టీఆర్ఎస్ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు,ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందగా, ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. వర్ధన్నపేట నుంచి ఆలూరి రమేశ్ (టీఆర్ఎస్) 99,240 ఓట్లు, మేడ్చల్ నుంచి జీహెచ్ మల్లారెడ్డి,(టీఆర్ఎస్) 87,990, బహదూర్‌పుర నుంచి మౌజం ఖాన్ (మజ్లిస్) 82,518 ఓట్లు, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్)80,264, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు (టీఆర్ఎస్) 73,698, హుస్నాబాద్ నుంచి సతీష్‌కుమార్ (టీఆర్ఎస్) 70,530 ఓట్లు, దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్) 62,500, జగిత్యాల నుంచి ఎం.సంజయ్‌కుమార్(టీఆర్ఎస్) 61,185 ఓట్లు, నారాయణ్‌ఖేడ్ నుంచి మహారెడ్డి గోపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 58,508, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్ (టీఆర్ఎస్) 58373, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్) 57,775, నాగర్‌కర్నూల్ నుంచి మర్రి జనార్ధన్‌రెడ్డి (టీఆర్ఎస్) 54,354, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీఆర్ఎస్) 53,053, వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (టీఆర్ఎస్) 51,586, కార్వాన్ నుంచి కౌసర్ మొహియుద్దీన్ (మజ్లిస్) 50,602 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బొటాబొటిగా గట్టెక్కారు ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు (కాంగ్రెస్) తన సమీప ప్రత్యర్థి కోవ లక్ష్మీ (టీఆర్ఎస్)పై కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందగా, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్(టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీఆర్ఎస్) ప్రత్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (బీఎస్పీ)పై 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 37మంది తాజా మాజీల ఓటమి తెలంగాణ తొలి శాసనసభకు ఎన్నికైన 119 మంది తాజా మాజీ శాసనసభ్యుల్లో 82 మంది మళ్లీ శాసనసభకు తిరిగి ఎన్నిక కాగా, 37 మంది ఓడిపోయారు. 26 మంది తొలిసారిగా శాసనసభకు ఎంపికయ్యారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్, సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, మాణిక్‌రావు, చంటి క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, సీహెచ్ మల్లారెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, కొప్పుల మహేష్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పట్నం నరేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జాజుల సురేందర్, కందాల ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, హరిప్రియా నాయక్, పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ నుంచి మెచ్చ నాగేశ్వర్రావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి లావుడ్య రాములనాయక్ ఉన్నారు. ఫలించిన కేసీఆర్ వ్యూహం 87సభలు 88సీట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార వ్యూహం ఫలించింది.2014 ఎన్నికల తరహాలోనే ముందస్తు ఎన్నికల్లోనూ ప్రచార ప్రణాళికను అమలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 87 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. వీటిలో 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీల కంటే ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి చేసిన పనులు, కొనసాగాల్సిన పనులను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కళ్ల ముందు అంతా కనిపిస్తోందని.. ప్రజలే అన్నీ పరిశీలించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ ప్రచారంలో చెప్పిన అంశాలను ప్రజలు ఆమోదించారు. అన్నలు ఇంటికి.. తమ్ముళ్లు అసెంబ్లీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు మండలికి ఎన్నికైన కొందరు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మరో ఆసక్తికర విషయమేంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేయడం, వారిలో అన్నలు ఓడి పోయి ఇంటి దారిపడితే, తమ్ముళ్లు గెలిచి అసెంబ్లీ దారిపట్టారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టగా, మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి మాత్రం కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిపై గెలిచి మండలి నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరుల్లో అన్న వెంకట్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోగా, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి మండలి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మల్లు రవి సోదరుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి గెలుపొందారు. ఇక్కడ కూడా అన్న ఓటిమి పాలవ్వడం.. తమ్ముడు అసెంబ్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురిలో రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఇద్దరూ మండలి సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ అసెంబ్లీకి పోటీచేసిన మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కూడా అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
కూటమి ఓటమికి కారణాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ఓటమికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. భాగస్వామ్యపక్షాల మధ్య పొత్తు సర్దుబాట్ల నుంచి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన వరకు అన్నీ ఆలస్యం కావడమే కూటమి కొంపముంచినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చవిచూశాయి. లోపభూయిష్టంగా సీట్ల సర్దుబాటు, పొత్తు సర్దుబాట్లలో ఆలస్యం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు తేలకపోవడం, స్నేహపూర్వక పోటీల పేరుతో గందరగోళం ఏర్పడటం, పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోవడంతో కారు జోరు ముందు కూటమి కునారిల్లింది. అడుగడుగునా సాగదీత : కూటమిని తుదిరూపు వరకు తీసుకురావడంలో ప్రతిపక్షాలు విఫలమైనందునే ఇంతటి ఘోరపరాభవాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 6 రోజులకే.. అంటే సెప్టెంబర్ 12న కూటమి పక్షాల తొలి సమావేశం జరిగింది. అక్కడి నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ.. చర్చోపచర్చలు జరుపుతూ కూటమి ఏర్పాటును సాగదీశారు. చివరకు నామినేషన్ల గడువు ముగిసే నవంబర్ 19 ముందు రాత్రి వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. నామినేషన్ల గడువు చివరి రోజున కూడా ఏ పార్టీ ఎక్కడ పోటీచేస్తుందనే దానిపై స్పష్టత లేకుండానే ఇష్టారాజ్యంగా నామినేషన్లు వేశారు. మొత్తం 90–95 స్థానాల్లో పోటీచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏకంగా 99 చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది. టీజేఎస్‌కు కేటాయిస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేయడంతో టీజేఎస్ కూడా కాంగ్రెస్ పోటీకి దిగిన చోట్ల నామినేషన్లు వేసింది. మహబూబ్‌నగర్‌లో టీడీపీ పోటీచేసిన స్థానంలోనూ టీజేఎస్ నామినేషన్ దాఖలు చేసింది. సీపీఐకిచ్చిన 3 స్థానాల్లో రెండు చోట్ల (హుస్నాబాద్, వైరా)లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు బరిలో దిగారు. హుస్నాబాద్‌లో ఆ తర్వాత విరమించుకున్నా వైరాలో మాత్రం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. టీఆర్ఎస్కు కలిసొచ్చిన గందరగోళం సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు.. అంటే 72 రోజుల కసరత్తు తర్వాత కూడా సీట్ల సర్దుబాటులో స్పష్టత రాక స్నేహపూర్వక పోటీలతో గందరగోళం నెలకొంది. దీంతో కూటమి పక్షాల సర్దుబాటు సరిగా జరగలేదని, సీట్ల కోసం అన్ని పార్టీలు కొట్లాడుకుంటున్నాయనే భావన ప్రజలకు వచ్చింది. ఇదే గందరగోళం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందనే ప్రచారం చేయడంలో టీఆర్ఎస్ సఫలీకృతమైంది. కూటమి సీట్లు పంచుకునేలోపు తాము స్వీట్లు పంచుకుంటామన్న టీఆర్ఎస్ నేతలు హేళన చేసే స్థితిలో సీట్ల సర్దుబాటు జాప్యం కావడం, గందరగోళం నెలకొనడం ప్రజల్లో కూటమి పట్ల సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచలేకపోయింది. ప్రజలకు చేరని మేనిఫెస్టోలు ఇక, ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని కూడా కూటమి విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదేపదే వల్లెవేయడానికి పరిమితం అయ్యారే తప్ప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పింఛన్లు రెట్టింపు, మహిళా సంఘాలకు గ్రాంట్లు, రుణాలు, పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత రేషన్ తదితర ముఖ్య హామీలు ప్రజలను ఆకర్షితులను చేసే స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రచారం కాలేదు. దీనికి తోడు టీడీపీ మేనిఫెస్టోలో అమలు సాధ్యం కాని హామీలు, టీజేఎస్ మేనిఫెస్టోలోనూ ప్రజాకర్షక పథకాలు లేకపోవడం కూటమిని దెబ్బతీశాయి. అలాగే అమరుల ఎజెండా పేరుతో కూటమి పక్షాన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ప్రజలను ఆలోచింపజేసే హామీలను ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటి నేపథ్యంలో ఓటరన్న కూటమిని కనికరించకుండానే కారుకు పట్టం కట్టాడని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
నాలుగంటే 'నాలుగే'
2014 ఎన్నికల్లో గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.హుజూర్నగర్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాలను మళ్లీ నిలబెట్టుకుంది. 2014లో గెలిచిన ముథోల్, జగిత్యాల, జహీరాబాద్, వనపర్తి, అలంపూర్, గద్వాల, నల్లగొండ, నాగార్జునసాగర్, కోదాడ, డోర్నకల్, ఖమ్మం, కల్వకుర్తి, చేవెళ్ల, నారాయణ్‌ఖేడ్, మిర్యాలగూడ, పరిగి, మక్తల్ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే, గత ఎన్నికలలో ఓడిపోయిన 15 స్థానాల్లో కాంగ్రెస్ ఈసారి గెలిచింది. ఎల్లారెడ్డి, కొల్లాపూర్, సంగారెడ్డి, మంథని, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మునుగోడు, నకిరేకల్, మహేశ్వరం, భద్రాచలం, పినపాక, వైరా, తాండూరు, ఎల్బీ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ‘ఏజెన్సీలు’ హస్తగతం గిరిపుత్రులు హస్తానికే మొగ్గు చూపారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కారు జోరు మీద ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌వైపే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో మూడు, ఏటూరు–నాగారం పరిధిలో రెండు, భద్రాచలం పరిధిలో 5 రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కూటమి తరపున కాంగ్రెస్ బలపర్చిన టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో లంబాడాలు, ఆదివాసీలకు మధ్య నెలకొన్న వివాదంలో ప్రభుత్వం సైతం పెద్దగా జోక్యం చేసుకోకపోవడంతో ఆదివాసీలు కాంగ్రెస్ వెపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
పరాభవమే మిగిలింది
సాక్షి, హైదరాబాద్: సామాజిక వర్గాల అభ్యున్నతే ఎజెండాగా ఉద్యమించిన నేతలకు ఈ ఎన్నికల్లో పరాభవమే ఎదురైంది. బీసీ సంఘం నేతగా జాతీయస్థాయి ఖ్యాతి ఉన్న ఆర్.కృష్ణయ్య గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎల్బీనగర్లో పోటీ చేసి గెలుపొందగా ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో మిర్యాలగూడలో పోటీ చేసి పరాజయం పొందారు. బీసీ కులాల ఐక్యవేదిక పేరుతో మనపార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి మంత్రి పద్మారావు చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆదివాసీల ఉద్యమాన్ని ఉదృతంగా నడిపించిన సోయం బాబురావు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బాబురావు మినహా కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్యలు స్థానికేతర నేతలు కావడం, నామినేషన్లకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వీరి పేర్లను ప్రకటించడంతో వారికి క్షేత్రస్థాయిలో ప్రచారం కత్తిమీదసాములా మారింది. ఊహించని విధంగా టికెట్లు ఇవ్వడమే వీరి ఓటమికి కారణాలని చెప్పొచ్చు. -
రెండు ఏనుగుల మధ్య నలిగిపోయాం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్–కాంగ్రెస్ కూటమి అనే రెండు ఏనుగుల మధ్య నలిగిపోయామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు సీపీఎం–బీఎల్ఎఫ్ ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. సామాజిక న్యాయ సాధనకు ప్రత్యామ్నాయ విధానాలు కావాలంటూ సిద్ధాంతాలు మాట్లాడిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ చివరకు కాంగ్రెస్ చంకలో చేరడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి సానుకూల ఫలితాలకు కారణమయ్యాయని తెలిపారు. -
వీవీ ప్యాట్లపై హైకోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేశారనే అనుమానంతో వీవీ ప్యాట్లతో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజాకూటమి.. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, కూటమి పక్షాన కలిసి కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు యోచిస్తున్నారు. దీనిపై బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఓటర్ల జాబితా అవకతవకల నుంచి ఈవీఎం యంత్రాల నిర్వహణ వరకు ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని మొదటి నుంచి చెబుతున్నామని, దీనిపై ఈసీ స్పందన కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని భావిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఇప్పటికే న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ వీవీ ప్యాట్ల ద్వారా కొనసాగేంత వరకు కోర్టులో పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. కోర్టుకు ఎప్పుడు వెళ్లాలన్నది కూటమి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. 15 లేదా 16న సీఎల్పీ సమావేశం.. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 15 లేదా 16 తేదీల్లో జరగనుంది. తెలంగాణతోపాటు ఎన్నికలు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున పార్లమెంటుకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కాంగ్రెస్ అధిష్టానం నుంచి నేతలు వచ్చి సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి లేదా ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పదవీ కాలం ఈ నెలలోనే నాలుగేళ్లు అవుతున్నందున ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలనుకుంటే సీఎల్పీ నేతగా అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో ఎన్నికలను ఎదుర్కొన్న భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తమ్, భట్టిలలో ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు, మరొకరు సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఈసీ స్పందించకపోతే కోర్టుకు: కుంతియా వీవీ ప్యాట్లపై కోర్టుకు వెళ్లే విషయమై ఉత్తమ్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పందించారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారుల సహకారం, డబ్బు బలంతోనే కేసీఆర్ విజయం సాధించారని, ఈవీఎంలను తారుమారు చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, సీఈసీ తమ ఫిర్యాదుపై స్పందించని పక్షంలో కోర్టుకు వెళతామని చెప్పారు. -
కూటమిని ఒక్కటిగా చూడాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవచ్చన్న (హంగ్) అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కూడిన ప్రజాకూటమి నేతలంతా సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. ఎన్నికలకు ముందే తాము ప్రజాకూటమి (పీపుల్స్ ఫ్రంట్)గా ఏర్పడినందున కూటమిపక్షాలను ఒకే జట్టుగా చూడాలని విన్నవించారు. అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే తమ నాలుగు పార్టీలకు కలిపి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించి ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, అజహరుద్దీన్, సంపత్‌కుమార్, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ సీనియర్లు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావులతోపాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు గవర్నర్‌ను కలిశారు. ఎన్నికలకు ముందే ప్రజాఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన లేఖను అందజేశారు. ‘ఎన్నికలకు ముందే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడ్డాయన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో నాలుగు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. దీంతోపాటే కామన్ ఎజెండాను ఈసీకి సమర్పించిన కాపీని మీ దృష్టికి తెస్తున్నాం. ఎన్నికల్లో గెలిస్తే కూటమి సంయుక్తంగా ప్రభుత్వ ఏర్పాటు చేస్తుంది.. కలసి పనిచేస్తుంది. ఈ అంశాన్ని మీ పరిశీలన, సమాచారం నిమిత్తం తెలియజేస్తున్నాం’ అని లేఖలో నేతలు పేర్కొన్నారు. లేఖతోపాటు ప్రజాకూటమి ఏర్పాటు, కామన్ మినిమం ప్రోగ్రాం, కొత్త ప్రభుత్వంలో ఫ్రంట్‌లోని పక్షాలకు న్యాయమైన భాగస్వామ్యం వంటి అంశాలపై గతంలో పార్టీలు చేసిన తీర్మాన కాపీలను గవర్నర్‌కు అందజేశారు. 80 సీట్లు మావే: ఉత్తమ్ గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కూటమికి 80 స్థానాలు దక్కే అవకాశం ఉందని, అయినా ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగానే నరసింహన్‌ను కలిశామని స్పష్టం చేశారు. ‘ఎన్నికల ఫలితాలు మ్యాజిక్ ఫిగర్‌కి దగ్గరగా ఉన్నప్పుడు ఏ పార్టీని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న దానిపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డ కూటమిని ఒక్కటిగా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఎన్నికలకు ముందే జట్టుగా కలసి పోటీ చేశాయి. ఆ డాక్యుమెంట్, కామన్ ఎజెం డాను గవర్నర్‌కు అందజేశాం. పెద్ద పార్టీని ప్రభు త్వ ఏర్పాటుకు పిలవాల్సి వస్తే కూటమికి వచ్చే సీట్లను ఒకే పక్షానికి వచ్చినట్లుగా పరిగణించాలని చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పార్టీలు ఇతర పార్టీలతో కలిసే అవకాశం ఉందని, అయితే ఎన్నికలకు ముందు కలిసిన పార్టీలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కోరామన్నారు. -
ముబారక్..మళ్లీ మీరే సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలు రావొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో లంచ్ మీటింగ్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం 1:30 గంటలకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనంపై ఆయన ఒక్కరే ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తొలుత ఇరువురు నేతలు హైదరాబాదీ బిర్యానీ, ఇతర సంప్రదాయ వంటకాలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత మూడు గంటలపాటు సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాల అంచనాలపై వారు చర్చించుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు రోజే వారు సమావేశం కావడం... ప్రజాకూటమి నేతలు గవర్నర్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటులో తొలుత తమకే అవకాశం ఇవ్వాలని కోరిన సమయంలోనే ఈ భేటీ జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో కేసీఆర్‌తో ఉండే టీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం ఈ భేటీలో పాల్గొనలేదు. ప్రజాకూటమి రాజకీయ వ్యూహాలు, ఎన్నికల ఫలితాల సర్వేల వివరాలపైనా వారు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఒవైసీ కేసీఆర్‌తో మాట్లాడుతూ ‘మాకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ భారీగా ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటుంది. మరోసారి మీరు సీఎం అవుతున్నారు. మీకు ముందస్తు శుభాకాంక్షలు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో మీ పంథాను ఇదే తీరుగా కొనసాగించాలి’అని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై కేసీఆర్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు ఉత్సాహంగా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారని అన్నారు. ‘మాకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ మంచి ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది’అని చెప్పారు. టీఆర్ఎస్కు మా మద్దతు కొనసాగుతుంది: ఒవైసీ ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా, స్పష్టమైన ఆధిక్యంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు కొనసాగిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం ఒవైసీ ప్రగతి భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు. దీంట్లో ఎలాంటి సందేహాలు అవసరంలేదు. ఈ విషయంలో మేము, కేసీఆర్ పూర్తి ధీమాతో ఉన్నాం. టీఆర్ఎస్ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఏ పార్టీ అవసరం ఉండదు. ఎంఐఎం మద్దతు అవసరం లేకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. టీఆర్ఎస్ సొంత బలంతో కేసీఆర్ సీఎం అవుతున్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు నుంచి ఇదే చెబుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్కు మా మద్దతు అవసరం ఉండదు. అసెంబ్లీ రద్దుకు ముందే కేసీఆర్‌తో ఉన్నామని చెప్పాం. గతంలోలాగే టీఆర్ఎస్కు మా మద్దతు కొనసాగుతుంది. ఎంఐఎంకు అధికార వ్యామోహం లేదు. మేము ప్రజలపక్షాన, పేదల పక్షాన ఉంటాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, జాతి నిర్మాణానికి కలసి పని చేస్తాం. ఇది నా నగరం. హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో నేనే చెప్పగలను. ఇలాంటి వాతావరణం ఇక ముందు కూడా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు బాగున్నాయి. అందుకే నేను మోటార్ సైకిల్‌పై వచ్చా’అని ఒవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ సినిమా ముగిసింది... ‘అసదుద్దీన్ మాతో ఉన్నాడంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అన్నారు. అవన్నీ అవాస్తవాలే. నాతో ఎవరు మాట్లాడారో వారే ఈ విషయాలు చెప్పాలి. దీనిపై వాళ్లనే అడగాలి. మా పార్టీ చీఫ్ నేనే. ఎంఐఎం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తుందని నేను ఎçప్పుడూ చెప్పలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండు రోజుల ముందు థియేటర్లో సినిమా చూశాడు. తెలంగాణలో వారి సినిమా ముగిసింది. వారలా సినిమా చూస్తూనే ఉండాలి. బీజేపీకి ఇప్పుడున్న ఐదు సీట్లే రావు. అవీ తగ్గిపోతాయి. బీజేపీ వాళ్లవి ఒట్టి మాటలే. తెలంగాణలో బీజేపీకి సత్తా లేదు. గాలి పటం (ఎంఐఎం ఎన్నికల చిహ్నం) ఎగురుతుంది. ఎనిమిది సీట్లలో విజయం సాధించబోతున్నాం’అని ఒవైసీ ధీమా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ ‘కర్ణాటక వ్యూహం’!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ఫలితాలనుబట్టి కర్ణాటక తరహా వ్యూహాన్ని అనుసరించేలా పావులు కదుపుతోంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న జాగ్రత్తల మాదిరే క్యాంపు రాజకీయాలకు దిగాలని యోచిస్తోంది. కూటమికి పూర్తి మెజారిటీ వస్తే ఫలితాలు వెలువడిన మర్నాడే ఫ్రంట్ ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం చేయించాలనే నిర్ణయానికి వచ్చిన హైకమాండ్.. ఒకవేళ ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకుంటే టీఆర్ఎస్కు అడ్డుకట్ట వేసేలా ఇతర పార్టీలు, స్వతంత్రులను కూడగట్టే పనిలో నిమగ్నమైంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్కు ఇప్పటికే మద్దతు ప్రకటించడం, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అవసరమైతే టీఆర్ఎస్కు మద్దతు ఉంటుందన్న బీజేపీ ప్రకటనల నేపథ్యంలో కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది. నయానో, భయానో వారిని దారికి తెచ్చుకునేలా పార్టీలోని కీలక నేతలు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పార్టీలో ట్రబు ల్ షూటర్‌గా, క్యాంపు రాజకీయాల్లో సిద్ధహస్తుడిగా పేరున్న కర్ణాటక మాంత్రి డీకే శివకుమార్‌ను హైకమాండ్ రంగంలోకి దించింది. ఆయనతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలపై పట్టున్న కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను హైదరాబాద్‌కు పురమాయించినట్లు తెలుస్తోంది. రాహుల్ వద్దకు.. ఆ తర్వాత గవర్నర్ చెంతకు జాతీయ మీడియా సంస్థలన్నీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం, అందుకు భిన్నంగా ప్రజాకూటమే అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పడంతోపాటు ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారతారని పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడం ప్రజావ్యతిరేకతకు సంకేతమని భావించిన కూటమి పక్షాలు అధికారం ఖాయమన్న ధీమాతో ఉన్నా వారిలో ఎక్కడో చిన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు ఏ ఒక్క అవకాశం కల్పించరాదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఢిల్లీకి పిలిపించింది. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. కూటమికి పూర్తి మెజారిటీ రాకుంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఇండిపెండెంట్లను దారికి తెచ్చే బాధ్యత, అవసరమైతే ఎంఐఎంతో సంప్రదింపులకు ఎవరు బాధ్యత తీసుకోవాలన్న అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కూటమిపక్షాలే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఉత్తమ్‌కు రాహుల్ కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సమావేశం అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఉత్తమ్... ఎయిర్‌పోర్టు నుంచే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ రాకుంటే కూటమిపక్షాలను ఒక్కటిగా గుర్తించాలని విన్నవించారు. ముందుజాగ్రత్తల్లో భాగంగానే గవర్నర్ వద్దకు వెళ్లినట్లు ఉత్తమ్ స్వయంగా ప్రకటించారు. రంగంలోకి పెద్దలు... ఎన్నికల ఫలితాలకు ముందే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగారు. ఒకవేళ ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ రానిపక్షంలో ఇండిపెండెంట్లతో చర్చలు, వారికి చేకూర్చే ప్రయోజనాలపై హామీలు గుప్పించి తమవైపు తిప్పుకునేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే డీకే శివకుమార్‌ను హైకమాండ్ హైదరాబాద్ పంపింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్‌ను గట్టెక్కించడంలో డీకే కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు బీజేపీ వైపునకు వెళ్లకుండా చేయడంలో డీకే చేసిన క్యాంపు రాజకీయాలే ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలోనే తిష్టవేసిన డీకే... టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించి పార్టీ అభ్యర్థులకు సహకరించేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేలా చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనతోపాటు గులాం నబీ ఆజాద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ రానుండగా అవసరాన్నిబట్టి పార్టీ సీనియర్లు అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ తదితరులు హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక అవసరాన్నిబట్టి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంపుల నిమిత్తం బెంగళూరుకు తరలించేలా సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బాధ్యతను పూర్తిగా డీకే శివకుమార్‌కే హైకమాండ్ కట్టబెట్టింది. రెబెల్స్‌కు గాలం... ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్ మల్రెడ్డి రంగారెడ్డికి పోలింగ్‌కు ముందు రోజే వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... నారాయణపేట నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేసిన మరో రెబెల్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డితోనూ రాయబారాలు నడుపుతోంది. ఆయనతో మాట్లాడే బాధ్యతను పార్టీ సీనియర్ నేత డీకే అరుణకు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే మక్తల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జలంధర్‌రెడ్డి, వైరా నుంచి పోటీ చేసిన రాములు నాయక్, రామగుండం నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ సహా మరో ఒకరిద్దరు నేతలతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దారికొచ్చిన నేతలను క్యాంప్‌కు పంపేలా ఏర్పాట్లు సైతం చేసినట్లు తెలియవచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూనే ప్రభుత్వ ఏర్పాటుకు ఏమేం చేయాలో అన్నీ చేసేలా కాంగ్రెస్ గట్టి చర్యలు తీసుకుంటోంది. -
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పలువురు కరీంనగర్ జిల్లా ఉద్దండులు మంగళవారం వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ భవిష్యత్‌ను తేల్చుకోబోతున్నారు. వీరిలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మాజీ విప్ కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్, మాజీ మంత్రులు టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఆరెపెల్లి మోహన్, బీజేపీ నేతలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బండి సంజయ్ తదితరులు ఉన్నారు. కొందరి గెలుపోటములు, మరికొందరి మెజార్టీ హెచ్చుతగ్గులపై జోరుగా చర్చ, బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. హ్యాట్రిక్ వీరులు, డబుల్ హ్యాట్రిక్ రేసు ఈటల రాజేందర్ 2004 ఎన్నికలు, 2008 ఉపఎన్నికల్లో కమలాపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత హుజూరాబాద్ నుంచి 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో వరుస విజయాలతో సత్తాచాటారు. తాజాగా గెలిచిస్తే డబుల్ హ్యాట్రిక్ సాధిం చినట్లు అవుతుంది. తాజా మాజీ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మేడారం నుంచి టీడీపీ తరఫున 1994లో పోటీ చేసి ఓటమిపాలుకాగా, 2004, 2008లో రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత ధర్మపురి నుంచి 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో విజయం సాధించారు. ఈసారి గెలిచి డబు ల్ హ్యాట్రిక్ సాధించాలని కలలు గంటున్నారు. 2009, 2010 (ఉపఎన్నిక), 2014 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించిన మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్‌బాబు, మంత్రి కేటీఆర్ నాలుగోసారి(సిరిసిల్ల) గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు 2009, 2010 (ఉప ఎన్నిక), 2014లో గెలిచారు. గతంలో ఒకసారి మెట్పల్లిలో ఓడిపోయారు. ఈసారి ఐదో ప్రయత్నంగా పోటీకి సై అంటు న్నారు. మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌నేత శ్రీధర్‌బాబు 1999, 2004, 2009 ఎన్నికల్లో మంథని నుంచి వరుసగా గెలిచారు. 2014లో ఓటమి చెందిన ఆయన ఇప్పుడు ఐదోసారి పోటీ చేశారు. 1999లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి తర్వా త నాలుగుసార్లు ఓటమి చెంది.. ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పదోసారి బరిలో జీవన్‌రెడ్డి జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి పదోసారి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. టీడీపీ నుంచి మొదటగా1983లో గెలిచారు. 1989, 1996 (ఉపఎన్నిక), 1999, 2004, 2014లో విజయం సాధించగా.. 1985, 1994, 2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. గంగుల కమలాకర్(కరీంనగర్) హాట్రిక్ కోసం యత్నిస్తున్నారు. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ రెండోసారి కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
గెలుపు తీరం చేరుతారా?
సాక్షి, హైదరాబాద్: పార్టీలు మారినా ఆశించిన ఫలితం దక్కుతుందా? ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న కోరిక నెరవేరుతుందా? రాజకీయాల్లో ఏళ్ల సీనియారిటీ ఉన్నా వివిధ పార్టీలకు చెందిన పలువురు నేత లను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలివే.. గతంలో తామున్న పార్టీలు టికెట్లు నిరా కరించినా మరో పార్టీ గుర్తుపై పోటీ చేసినా సొంత చరిష్మాతో గెలుస్తామన్న ధీమాతో వారంతా ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. మరి కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలు వడనున్న నేపథ్యంలో పోటీ చేసిన ఈ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరిగింది. పార్టీ మారినా తమకు సానుకూల ఫలితాలు వస్తాయా లేదా అని తెలుసుకోవాలన్న ఆత్రుత నెలకొంది. పార్టీ మారిన వారి భవితవ్యం ఎలా ఉంటుందా అని ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే దాదాపు 32 నియోజక వర్గాల్లో పలువురు అభ్యర్థులు పార్టీలు మారి పోటీలో దిగారు. వారిలో ఎంతమందిని విజయం వరిస్తుందో నేడు తేలనుంది. మాజీ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు.. పార్టీలు మారి ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న నేతల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. వారిలో జి.వినోద్, ఎ.చంద్రశేఖర్, దానం నాగేందర్, బోడ జనార్దన్ ఉండగా, తాజా మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, ఆర్.కృష్ణయ్య, బాబుమోహన్, కొండా సురేఖ పార్టీలు మారి పోటీలో దిగారు. కొండా సురేఖ టీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి పరకాలలో పోటీ చేస్తున్నారు. బాబుమోహన్ గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అందోల్‌లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్.కృష్ణయ్య ఈసారి మిర్యాల గూడలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. గెలుపు గుర్రాల పేరుతో.. పార్టీలు మారిన వారికి అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాయి. అందులో కాంగ్రెస్ నుంచి వచ్చిన దానం నాగేందర్‌కు, టీడీపీ నుంచి వచ్చి గొల్ల మల్లయ్యయాదవ్‌కు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వగా, టీఆర్ఎస్, టీడీపీ, ఎంబీటీ నుంచి వచ్చిన 8 మందికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన ఐదుగురికి బీజేపీ టికెట్లు ఇవ్వగా, బీజేపీ నుంచి వచ్చిన పగిడిపాటి దేవయ్యకు టీజేఎస్ టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో టికెట్లు లభించకపోవడంతో ఏడుగురు బీఎస్పీ నుంచి బరిలో దిగారు. కాంగ్రెస్‌లో టికెట్లు లభించక మరో నలుగురు బీఎల్ఎఫ్ నుంచి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన మరో ముగ్గురు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో దిగగా, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. గట్టి పోటీ ఇచ్చే నేతలు 20 మందిపైనే.. పార్టీ మారి మరో పార్టీ గుర్తుతో పోటీ లోకి దిగిన అభ్యర్థుల్లో గట్టిపోటీ ఇచ్చే వారు ఎక్కువమంది ఉండగా, వారిలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులున్నారు. ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి కొద్ది మంది మాత్రం పెద్దగా పోటీ ఇవ్వకపోయినా పార్టీలు మారి పోటీ చేస్తున్న 32 మంది అభ్యర్థుల్లో 20 మందికిపైగా గట్టిపోటీ ఇస్తున్న వారే ఉన్నారు. ఓట్లు చీల్చడం ద్వారా కొంతమందికి గెలిచే అవకాశం ఉండగా, మరికొంత మంది ఎదుటి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
11/12 టెన్షన్.. చివరి ఎత్తులు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో హైదరాబాద్‌లో రాజకీయం వేడెక్కింది. హంగ్ రావొచ్చంటూ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అధికారం కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో పార్టీలు, అభ్యర్థులతోపాటు ప్రజల్లోనూ మంగళవారం విడుదలయ్యే ఫలితాలకు ముందే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. సోమవారం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో మూడుగంటలపాటు చర్చలు జరిపారు. అటు విపక్ష కాంగ్రెస్ తన భాగస్వామ్యపక్షాల నేతలతో కలిసి గవర్నర్‌ను కలిసింది. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో కూటమి మొత్తాన్ని ఒక యూనిట్‌గా గుర్తించాలని డిమాండ్ చేసింది. హంగ్ వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ నాగర్ కర్నూలు టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ చేశారంటూ వార్తలు రావడం రాజకీయంగా దుమారం రేపింది. వివాదాలకు దూరంగా ఉండే విశ్వేశ్వర్‌రెడ్డిపై ఆరోపణలు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే.. మునుపటి శాసనసభలో కంటే ఈసారి తమ బలం పెంచుకుంటామని గట్టి నమ్మకంతో ఉన్న బీజేపీ.. ఈ సారి హంగ్ ఏర్పడితే కింగ్‌మేకర్ పాత్ర పోషించాలన్న ఉత్సాహంతో ఉంది. అసద్, సీఎంల కలయికపై ఆసక్తి ఓట్ల లెక్కింపునకు కొద్ది గంటల ముందు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. సెక్యూరిటీని పక్కకు పెట్టి ద్విచక్ర వాహనంపై ప్రగతి భవన్ వెళ్లడం.. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎంను కలువడానికి ముందు.. టీఆర్ఎస్ సొంతంగా మెజారిటీ సాధించబోతుందంటూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. అసద్ మూడు గంటలసేపు ప్రగతి భవన్లో ఉండటం.. రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్కు మెజారిటీకి ఏమైనా సీట్లు తక్కువ పడితే మజ్లిస్ పార్టీ నుంచి మద్దతు లేఖ తీసుకునేందుకే.. ఈ సమావేశం జరిగి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావించారు. ‘మామూలుగా అయితే, ఫలితాల ప్రకటన తరువాత టీఆర్ఎస్ గెలిస్తే అభినందించడానికి వెళ్లవచ్చు. లేదంటే టీఆర్ఎస్కు మెజారిటీకి సీట్లు తక్కువ పడితే మద్దతు ఇస్తామని చెప్పడానికి వెళ్లవచ్చు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీ ముందు రోజే వెళ్లడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు భారీ మెజారిటీ వస్తుందని చెప్పడం వల్ల అపోహలకు కొంత మేర తెరపడిందని చెప్పొచ్చు’అని రాజకీయ విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ సీనియర్ నేతలు కొందరు.. గెలుస్తారని భావిస్తున్న ఇండిపెండెంట్లు, బీఎస్పీ, బీఎల్ఎఫ్ అభ్యర్థుల మద్దతు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను టీఆర్ఎస్ తోసిపుచ్చింది. తాము మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు సాధించి గద్దెనెక్కబోతున్నామని పునరుద్ఘాటించింది. హంగ్ భావనలో కాంగ్రెస్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును బట్టి అర్థమవుతోంది. కౌంటింగ్‌కు ముందు రోజే ఆ పార్టీ నేతలు కొందరు.. గెలిచే అవకాశాలున్న ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులతో రాయబారాలు నడిపారు. రామగుండం టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్‌కు కేబినెట్ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి శివకుమార్‌రెడ్డితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డి తన మద్దతు కాంగ్రెస్‌కేనని ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైతే ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనేది చెప్పలేమని ఓ కాంగ్రెస్ నాయకుడే వ్యాఖ్యానించారు. ఓ వైపు గెలుస్తారనుకున్న ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు కోరుతూనే మరోవైపు తమ కూటమిని ఒక యూనిట్‌గా గుర్తించాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ విధానం చూస్తే కచ్చితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న భావనలో వారు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ, ఇండిపెండెంట్లే కీలకం! ఓట్ల లెక్కింపునకు ముందే టీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. కొద్ది స్థానాల్లో గెలువగలిగే సత్తా ఉన్న బీజేపీ, ఇండిపెండెంట్లు కీలకం అవుతారేమోనన్న చర్చ జరుగుతోంది. అయితే పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగినందున హంగ్ ఉండకపోవచ్చనే వాదనలూ వినబడుతున్నాయి. ఏదేమైనా కౌంటింగ్‌కు ముందే రెండు ప్రధాన పార్టీలు తమ జాగ్రత్తలో తాము ఉన్నాయనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా తనకు మంత్రిపదవి ఇస్తేనే మద్దతు ఇస్తానని రామగుండం స్వతంత్ర అభ్యర్థి పేర్కొనడం గమనార్హం. అంటే రాష్ట్రంలో హంగ్ వస్తే తప్ప ఇండిపెండెంట్లకు మంత్రి పదవి ఆఫర్ చేసే పరిస్థితి రాదు. గెలుస్తారని అనుకుంటున్న మిగిలిన వారు గుంభంగానే ఉన్నారు. ‘ముందు ఓట్ల లెక్కింపు జరగాలి. అప్పుడు మద్దతు ఎవరికనేది నిర్ణయించుకుంటామ’ని ఓ అభ్యర్థి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హంగ్ వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంలో బీజేపీకి స్పష్టమైన వైఖరి లేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, అదీ మజ్లిస్‌తో రాంరాం చెపితేనే సాధ్యమని శనివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. అయితే.. తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదంటూ సోమవారం వివరణ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికల్లా రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ మార్పులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
రేపు గవర్నర్‌ను కలిసే అవకాశముంటుందో లేదోనని..!
సాక్షి, హైదరాబాద్ : రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే గవర్నర్ నరసింహన్‌ను కలిసినట్లు ప్రజాకూటమి నేతలు తెలిపారు. గవర్నర్‌తో భేటీ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఎస్ కన్వీనర్ కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విలేకరులతో మాట్లాడారు. ప్రజాకూటమికి రాజ్యాంగబద్ధత ఉంది : ఉత్తమ్ ఎన్నికలకు ముందే సమూహంగా ఏర్పడిన ప్రజాకూటమికే రాజ్యాంగబద్ధత ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. రేపు(మంగళవారం) ఫలితాలు వెలువడగానే అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానం పలకాల్సిన సందర్భం వస్తే కూటమిని ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశామని తెలిపారు. రేపటి రోజున గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కుతుందో లేదోననే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా ఆయనను కలిశామన్నారు. ఒకవేళ ఫలితాలు దగ్గరదగ్గరగా వస్తే మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరామన్నారు. పొత్తుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కు గవర్నర్ కు అందజేశామని తెలిపారు.గెలిచిన అభ్యర్థులకు భద్రత కల్పించాలని విఙ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కూటమికే సంపూర్ణ మెజారిటీ : కోదండరాం కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐలతో కూడిన ప్రజాకూటమికే సంపూర్ణ మెజారిటీ వస్తుందని కోదండరాం అన్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితే గనుక వస్తే ఇలాంటి విషయాల్లో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్ నివేదికను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు చేయాలన్నారు. కీడెంచి మేలు ఎంచాలి కదా : రమణ ప్రజాకూటమిని తెలంగాణ ప్రజలు ఆదరించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నందున కీడెంచి మేలు ఎంచాలనే తీరుగా ముందుగానే గవర్నర్‌ను కలిశామన్నారు. తన రాజకీయ మనుగడ కోసం, అధికార దాహంతో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. -
రాజ్‌భవన్‌కు ప్రజాకూటమి నేతలు
సాక్షి, హైదరాబాద్ : ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా తమదే అధికారం అని టీఆర్ఎస్, ప్రజాకూటమి నేతలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నప్పటికీ హంగ్ ఏర్పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు తెరవెనుక మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీర్ఎస్కు మద్దతునిస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడంతో ప్రజాకూటమి నేతలు అప్రమత్తమయ్యారు. సోమవారం గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా జానారెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, కోదండరాం, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. మాకే అవకాశం ఇవ్వాలి.. అత్యధిక స్థానాల్లో గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తమకే అవకాశం ఇవ్వాలని ప్రజాకూటమి నేతలు గవర్నర్ నరసింహన్‌ను కోరారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఒకే పార్టీగా పరిగణించాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు కూటమి నేతలు గవర్నన్‌కు వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డామని కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలు పేర్కొన్నారు. అన్ని పార్టీలు కలిసి కామన్ మినిమ్ ప్రోగ్రామ్ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. -
ఏం జరిగింది.. ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపునకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రజాఫ్రంట్ నేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతోపాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్ తదితరులు ఆదివారం సాయంత్రం పార్క్ హయాత్ హోటల్లో సమావేశమై పోలింగ్ సరళిని సమీక్షించారు. ఫలితాల అనంతరం ఏం చేయాల న్న దానిపైనా చర్చించారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన స్థానాల్లో పరస్పర ఓట్ల బదిలీ ఎలా జరిగిందన్న దానిపై ప్రధానంగా సమీక్షించారు. కూటమి స్ఫూర్తి క్షేత్రస్థాయికి వెళ్లిందని, అన్నిపార్టీల కార్యకర్తలు సమష్టిగానే ఎన్నికల్లో పోరాడారనే అభిప్రాయానికి వచ్చా రు. ఎన్నికల ఫలితాలను బట్టి కూటమిగా ఏ విధంగా ముందుకు పోవాలనే దానిపై కూడా నేతలు కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తే ఎవరి గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాలని, అన్ని పార్టీలకు ప్రాధాన్యత కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ప్రతికూల ఫలితాలు వస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాలని, అది కూడా కూటమి స్ఫూర్తితోనే సాగాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఇండిపెండెంట్ల పరిస్థితేంటి... సమీక్షలో భాగంగా కొన్ని ఆసక్తికర అంశాలపై కూడా కూటమి నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యం గా ఐదు నుంచి ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో గట్టెక్కే అవకాÔ¶శముందన్న పరిస్థితుల్లో వారిని తమ వైపునకు ఎలా తిప్పుకోవాలన్న దానిపై కూడా చర్చించారు. కూటమి పక్షాన రెబెల్స్‌గా ఉన్న వారు గెలిచినా ఎలాగూ తిరిగి వస్తారని, టీఆర్ఎస్ రెబెల్స్లోని గెలుపుగుర్రాలను తమ వైపునకు తిప్పుకుని ముందుగానే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై ఉండాలనే చర్చ కూడా జరిగింది. కూటమి పక్షాలు ఆశించిన ఫలితాలు రాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం సహకారం అవసరమయ్యే పక్షంలో ఏం చేద్దామన్న దానిపై కూడా నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో మాట్లాడాలా వద్దా అన్న దానిపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. అందరం ఒక్కటే... ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు తమకు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, మిశ్రమ ఫలితాలు వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఎలా అడ్డుకోవచ్చన్న దానిపై కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు సొంతంగా మెజార్టీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించిన పక్షంలో గవర్నర్ ఆ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉందనే అభిప్రాయం భాగస్వామ్య పక్షాల సమావేశంలో వ్యక్తమైంది. కూటమిలోని అన్ని పార్టీలకు కలిపి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ స్థానాలు వస్తే కూటమినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ముందుగానే గవర్నర్‌ను కోరాలని ఆయా పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించారు. ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకున్నందున సుప్రీంకోర్టు తీర్పు మేరకు కూటమికే అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాలని, ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించారు. -
టెన్షన్.. టెన్షన్.. కూటమిలో తీసి‘వెత’లు
సాక్షి, హైదరాబాద్: గెలిచేదెవరు... ఓడేదెవరు. అధికారం ఎవరికి, ప్రతిపక్షంలో ఎవరుంటారు? వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్ధుల్లోనే కాదు. సాధారణ ప్రజానీకంలోనూ ఇదే చర్చ. ఒకవైపు ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎన్నికల ఫలితాలపై నగరంలో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికలే చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు అభ్యర్థులు సైతం తమ తప్పొప్పులను, బలాబలాలను సమీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో పోలింగ్ బూత్‌లో నమోదైన ఓట్లను అంచనా వేస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందనే అంశంపైన బూత్‌స్థాయి కార్యకర్తలతో జరుపుతున్న సంప్రదింపులు తారాస్థాయికి చేరాయి. ఫలితాలు వెలువడేందుకు మరో రెండు రోజుల గడువు ఉన్న దృష్ట్యా ఈ రెండు రోజుల పాటు ఒక్కో అభ్యర్ధి తన నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లలో కాలనీలు, బస్తీల వారీగా తమకు పట్టున్న ప్రాంతాలను, నమోదయ్యేందుకు అవకాశం ఉన్న ఓట్లను అంచనా వేస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడం, ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో కొంతమంది అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమకు బాగా ఆదరణ, పట్టున్న ప్రాంతాల్లోనే ఓట్లు గల్లంతైపోవడంతో గెలుపుపై విశ్వాసాన్ని కోల్పోతున్నారు. నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలు, ప్రచార కార్యక్రమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. యథావిధిగా పోలింగ్ శాతం చాలా తక్కువగానే నమోదైంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ పోలింగ్ ఏ పార్టీలకు పట్టం కట్టగలదనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు తమ గెలుపుపైన స్పష్టమైన ధీమా వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు అంతర్మథనంలో పడిపోయారు. కూటమిలో తీసి‘వెత’లు... ఉప్పల్ స్వరూప్‌నగర్‌కు చెందిన ఒక పోలింగ్ బూత్ వద్ద ఓ మహిళ తనకు నచ్చిన హస్తం గుర్తు కనిపించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి అక్కడ ప్రజాకూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థి బరిలో ఉన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలనుకున్నవాళ్లు సైకిల్‌పై వేయాలి. కానీ ఆ మహిళ చేతి గుర్తుకు తప్ప మరో గుర్తుకు ఓటు వేసేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. ఒక్క ఉప్పల్లోనే కాదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపోటములపైన ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలనుకున్న వాళ్లకు చేయి గుర్తు మాత్రమే కనిపించడం, కొన్ని చోట్ల టీజేఎస్ గుర్తు కనిపించడంతో ఓటర్లలో విముఖత వ్యక్తమైంది. ఇక ప్రచారంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసేందుకు వెనుకడుగు వేశారు. (చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...) అలాగే తెలుగుదేశం వాళ్లు కూడా కాంగ్రెస్‌కు మనస్ఫూర్తిగా ప్రచారం చేయలేకపోయారు. పై స్థాయిలో కూటమి పటిష్టంగానే ఉన్నప్పటికీ పోలింగ్ బూత్‌ల స్థాయిలో ఈ లోపం ప్రస్ఫుటమైంది. టీజేఎస్‌కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో ఏ ఓటు ఏ అభ్యర్ధికి పడిందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితులన్నింటిపైనా అభ్యర్థులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్లోనే ఇదే తరహా అంతర్మథనం కొనసాగుతోంది. ప్రత్యర్ధులతో తాము పోటీపడగలిగామా లేదా అనే అంశంతో పాటు, ఆశించిన ఓట్లు తమ ఖాతాలోనే పడతాయా లేక, ప్రత్యర్థుల ఖాతాలో చేరతాయా అనే దిశగా చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ ఉత్కంఠ ఇలాగే ఉండనుంది. ఓటు జారి గల్లంతయిందే.... గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఒక్కో నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతైపోవడం రాజకీయ పార్టీలకు ఆశనిపాతంగా మారింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోనే సుమారు 40 వేల ఓట్లు గల్లంతైనట్లు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్పురా, తదితర నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వరకు తరలివచ్చిన ఓటర్లు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు లక్షలాది మంది నగరవాసులు తమ సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వెళ్లారు. దీంతో అనేక చోట్ల అభ్యర్ధుల అంచనాలు తలకిందులయ్యాయి. కలిసొస్తాయనుకునున్న కాలనీలు, బస్తీల్లో ఓట్లు గల్లంతైపోవడం, కాదనుకున్న చోట్ల పెద్ద ఎత్తున ఓట్లు నమోదుకావడంతో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులను ఆందోళనకు గురి చేసింది. దీంతో తాజాగా ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు నమోదయ్యాయి. వాటిలో తమకు దక్కేవెన్ని అనే కోణంలో విస్తృతంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు తమ ప్రచార తీరుతెన్నులను సైతం సమీక్షించుకుంటున్నారు. ప్రత్యర్థులతో ధీటుగా తమ ప్రచారం కొనసాగిందీ లేనిదీ కార్యకర్తలతో కలిసి చర్చిస్తున్నారు.లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అన్ని పార్టీల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
చంద్రబాబు జోక్యం ప్రతికూలమే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు.. ప్రజా కూటమిపై ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు చూపబోతోందని సీపీఎం అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని పేర్కొంది. మొదట్లో కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉండొచ్చునని భావించినా తెలంగాణ అనుకూల సెంటిమెంట్ పెరగడంతో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది. శనివారం మఖ్దూమ్ భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, బీఎల్ఎఫ్కున్న అవకాశాలను గురించి సమీక్షించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, 17 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్చార్జీలు హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజలకిచ్చే పింఛను డబ్బును పెంచడం, రైతుబంధు పథకం, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారి కోసం సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒకరూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించినందువల్లే.. ఆ పార్టీకే మళ్లీ పట్టంగడుతున్నారని విశ్లేషించారు. మైనారిటీల ఓట్లు పెద్ద సంఖ్యలో పడటం కూడా టీఆర్ఎస్కు కలిసొచ్చే అంశమన్నారు. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి... తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణలో మరోసారి చంద్రబాబు వేలుపెడితే ఇక్కడి రాజకీయాలు, పరిస్థితుల్లో కూడా ప్రతికూల మార్పులొస్తాయనే ప్రజలు భావించారని అభిప్రాయపడింది. కూటమిని మొత్తం తన చుట్టే తిప్పుకోవడం, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడం మొదలుకుని, తానే ముందుండి నడిపించడం కూడా ఇక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణమైందని అంచనా వేసింది. ఎన్నికలకు ముందు చివరి 4,5 రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన విస్తృత ప్రచారం, ప్రస్తావించిన అంశాలు కూటమిపై ప్రతికూల ప్రభావం చూపాయని అభిప్రాయపడింది. సీపీఎంగా పోటీచేసిన భద్రాచలం, మిర్యాలగూడలలో, బీఎల్ఎఫ్ అభ్యర్థులున్న నారాయణ్‌పేట్, మధిరలలో కనీసం ఒక్కోస్థానంలోనైనా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది. -
‘కల్వకుంట్ల’ పాలనకు కాలం చెల్లింది
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ‘కల్వకుంట్ల’ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే ప్రజా కూటమి విజయం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడిందని ఆరోపించారు. పోలింగ్ రోజున రోహిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడి ఇందులో భాగమేనన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళుతుండగా తనపై మెట్పల్లి వద్ద జరిగింది సాధారణ దాడి కాదని, తనను హతమార్చే కుట్ర అని ఆరోపించారు.పక్కా ప్రణాళిక ప్రకారం దాడి చేశారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో కాంగ్రెస్ విజయం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో సైతం ప్రజలు ‘ప్రజాకూటమి’వైపు మొగ్గు చూపారన్నారు. తాము ఎగ్జిట్ పోల్ సర్వేలను విశ్వసించబోమని, గతంలో చాలా ఎన్నికల విషయంలో ఆ సర్వేలు తప్పని తేలిందని గుర్తు చేశారు. లగడపాటి సర్వేపై కేసీఆర్, కేటీఆర్‌లకు వణుకుపుడుతోందన్నారు. ఆయన సర్వే తమకు అనుకూలంగా వచ్చినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఎగిరెగిరి గంతులేసి, వ్యతిరేకంగా వస్తే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందే: కుసుమ కుమార్ ఇక సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేయాల్సిందేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ అన్నారు. తెలంగాణలో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తెలంగాణ ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమైందన్నారు. వంశీచంద్‌రెడ్డిని పరామర్శించిన ఉత్తమ్ హైదరాబాద్: ప్రత్యర్థుల దాడిలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో కల్వకుర్తి ప్రజాకూటమి అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఉత్తమ్ -
80 పదిలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి 75 నుంచి 80 సీట్లలో గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలతో సంబంధం లేకుండా.. తామే గెలుస్తామన్నారు. ఈ నెల 12న తెలంగాణలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. నిన్న మొన్నటివరకు 105–106 స్థానాల్లో గెలుస్తామన్న కేసీఆర్, కేటీఆర్‌లు ఇప్పుడు 80 సీట్లలో తమదే విజయం అంటున్నారని.. 11న ఫలితాల తర్వాత 30 స్థానాలకే పరిమితం అవుతా రని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలను 2019 పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారని, ఈ సెమీఫైనల్స్‌లో కాంగ్రెస్ పార్టీ 5–0తో క్లీన్‌స్వీప్ చేస్తుంద న్నారు. శనివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో ఆయన ప్రజాకూటమి నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి(టీడీపీ), చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి(సీపీఐ), విద్యాధర్‌రెడ్డి (టీజేఎస్), మంద కృష్ణమాదిగ(ఎమ్మార్పీఎస్), టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ సరళి తమకు అను కూలంగానే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా కేసీఆర్ కుటుంబం చేసిన మోసం పై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతో రాజకీయ, రాజకీయేతర శక్తుల కలయిక తమకు కలిసొస్తుందన్నారు. దుర్మార్గపు, అణచివేత, నియంతృత్వ పాలన అవసరం లేదని తాము చేసిన విజ్ఞప్తిని ప్రజలు అర్థం చేసుకున్నారని ఉత్తమ్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రకటించిన హామీలు కూడా ప్రజల మనసులను హత్తుకున్నట్లు భావిస్తున్నామన్నారు. కూటమి స్ఫూర్తితో పనిచేసిన కారణంగా ఓట్ల బదిలీ కూడా 100% జరిగిందని ఆయన పేర్కొన్నారు. కూటమిలోని అన్ని పార్టీలు, సంస్థల కార్యకర్తలు, నేతలు, పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పక్కాగానే ఉన్నారు ఆత్మగౌరవం లేని పాలన తమకు అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓట్లేసేందుకు వెళ్లారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. తాము కేసీఆర్‌కు గులామ్లము కాదనే ఈ ఎన్నికలతో తెలంగాణ ప్రజలు చెప్పబోతున్నారన్నారు. రోజురోజుకూ కూటమికి ప్రజాదరణ పెరిగిందని, దీనికి తగ్గట్లుగానే ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. అందుకే వందల కోట్ల ధనాన్ని వెదజల్లినా ఓటర్ల ఆలోచనను ప్రభావితం చేయలేకపోయారని, తమకు 75–80 స్థానాలు వస్తాయని, కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఓటు రూపంలో అస్త్రం సంధించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ టీడీపీ తరఫున ధన్యవాదాలు చెపుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ప్రజల్లో సానుకూల సంకేతాలు కనిపించాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి చెప్పారు. కూటమి సర్దుబాటు మరో 10–15 రోజుల ముందు జరిగి ఉంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచేందుకు వీలుండేదని వ్యాఖ్యానించారు. టీజేఎస్ నేత విద్యాధర్‌రెడ్డి మాట్లాడుతూ నియంతృత్వ, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పారదర్శక ప్రజాపాలన కోసం ఓట్లేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కూటమి స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్ ఓటమి, కూటమి గెలుపు ఖాయమయ్యాయన్నారు. దొరలు ఓడిపోతున్నారని, ప్రజాస్వామ్యం గెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్‌దీప్ ఫోన్ చేసి.. ఎగ్జిట్‌పోల్స్ సర్వేల గురించి విలేకరులు అడగ్గా, వాటి గురించి కంగారుపడాల్సిన అవసరం లేదని ఉత్తమ్ చెప్పారు. టీఆర్ఎస్కు 72–91 స్థానాలు వస్తాయని ఇండియాటుడే చానల్ ఎగ్జిట్‌పోల్స్‌లో చెప్పారని, కానీ, తమ సర్వేను చూసి ఆందోళన చెందవద్దని, తెలంగాణలో ఇరుపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఆ పోల్‌ను నిర్వహించిన రాజ్దీప్సర్దేశాయ్ తనకు ఫోన్ చేసి చెప్పాడని ఉత్తమ్ వెల్లడించారు. తనకు ఫోన్ చేసి చెప్పడమే కాకుండా ఇదే విషయాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేశాడని చెప్పారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వార్తలురాసిన విలేకరులు, పత్రిక, టీవీ చానళ్ల యజమానులకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఇంకా సమయం ఉందని, ఉద్యోగులు ఆలోచించుకుని ఐఆర్, పీఆర్సీ అమలు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కోసం కూటమి అభ్యర్థులకు ఓట్లేయాలని కోరారు. ఈవీఎంలు జరభద్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) విషయంలో కూటమి నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కోరారు. కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉన్నందున అధికార పార్టీ ఈవీఎంలను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉందని ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈవీఎంల రవాణా జరుగుతున్నప్పుడు, స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచినప్పుడు, ఆ తర్వాత వాటిని కౌంటింగ్ కేంద్రాన్ని తీసుకువచ్చేటప్పుడు కూటమి నేతలు ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంపై ఈవీఎంను పెట్టినప్పుడు ఆ ఈవీఎం నెంబర్ రాసుకోవాలని సూచించారు. ఇందుకోసం పోలింగ్ ఏజెంట్లనే కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతిస్తే బాగుంటుందని, ఈ మేరకు కూటమి అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపరిచిన తర్వాత అధికారులు కూడా అక్కడికి వెళ్లకూడదని, కొన్ని చోట్ల కొందరు అధికారులు ఆ గదుల్లోకి వెళ్లి వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, ఈ విషయంలో కలెక్టర్లు, ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఈసీ విఫలమయిందని ఉత్తమ్ ఆరోపించారు. లక్షలాది మంది అర్హుల ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతయ్యాయని తాము మొదటి నుంచీ చెపుతున్నప్పటికీ ఈసీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని, ఇప్పుడు సాక్షాత్తూ ఎన్నికల సీఈవోనే ఓటర్ల గల్లంతుపై క్షమాపణలు అడగడం శోచనీయమన్నారు. -
పీపుల్స్ ఫ్రంట్ సర్కార్ ఏర్పడుతుంది: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ప్రజాఫ్రంట్ కూటమిని గెలిపిస్తుందన్నారు. వివిధ జాతీయ టీవీ చానళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరిగా లేవని, ఆ సంస్థలకు రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉంటుందని భావించట్లేదన్నారు. వివిధ సర్వేలు వెల్లడించిన అంశాలకు భిన్నమైన ఫలితాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలు, అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన చెప్పారు. -
లెక్కల్లో బిజీబిజీ !
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగియడంతో ప్రజాకూటమి నేతలు ఇప్పుడు లెక్కలు వేసే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ సరళి పరిశీలనతో పాటు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే దానిపై క్షేత్రస్థాయి నుంచి కసరత్తు మొదలుపెట్టారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన బృందంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పోలింగ్ సరళిపై దృష్టి పెట్టారు. ఫలానా నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి... అందులో పోలింగ్ స్టేషన్లవారీగా ఎలా పోలింగ్ జరిగింది... గతం కన్నా ఎక్కువ లేదా తక్కువ ఓట్లు ఆ పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఎందుకు వచ్చాయి.. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎన్నిఓట్లు పడ్డాయి.. టీఆర్ఎస్ వైపు ఎంతమంది ఓటర్లు మొగ్గు చూపారనే దానిపై ఆయన కూలంకషంగా కసరత్తు ప్రారంభించారు. ఉత్తమ్‌తోపాటు కూటమిలోని ఇతరపార్టీల నేతలు కూడా ఈ పనిలోనే శనివారమంతా బిజీబిజీగా గడిపారు. నేరుగా పార్టీ నేతలతో... పోలింగ్ సరళిని అంచనా వేయడంతోపాటు నియోజకవర్గాలవారీగా పోలింగ్ అనుకూలతలు, ప్రతికూలతలపై కూటమినేతలు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు. నియోజకవర్గాలవారీగా ఓ అవగాహనకు రావడంతోపాటు పోటీ చేసిన అభ్యర్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకుంటున్నారు. దీంతోపాటు పార్టీ మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులతో నేరుగా మాట్లాడుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం మీద ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రత్యేక కసరత్తు చేస్తూ పూర్తిస్థాయి సమాచారాన్ని నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ సర్వేలు ఏం చెపుతున్నాయి.. వివిధ సర్వే సంస్థలు ఎలాంటి ఫలితాలనిస్తున్నాయి...అనే దానిపై కూడా కూటమి నేతలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మిత్రుల స్థానాల్లో ఎనిమిదింటిపై ఆశ పార్టీలవారీగా చూస్తే కూటమి భాగస్వామ్యపక్షాలైన కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేశాయి. టీడీపీ, టీజేఎస్, సీపీఐలు తాము పోటీ చేసిన స్థానాల్లోని పరిస్థితులపై ఆరాకు పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమి పెద్దన్నగా ఇతర పార్టీలు పోటీ చేసిన నియోజకవర్గాల్లో కూడా లెక్కలు తీస్తోంది. టీడీపీ 13, టీజేఎస్ 4 (కాంగ్రెస్ అభ్యర్థులు లేనివి), సీపీఐ 3 కలిపి మొత్తం 20 స్థానాల్లో వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపై పరిశీలన చేస్తోంది. టీడీపీ పోటీ చేసిన కొన్ని స్థానాలు మినహా, మిగిలిన చోట్ల పరిస్థితి ఆశాజనకంగా లేదనే అంచనాకు కూడా వచ్చింది. దీంతో మిత్రపక్షాలు పోటీ చేసిన చోట్ల గరిష్టంగా 7–8 స్థానాలు మాత్రమే తమకు రావచ్చని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తాము కనిష్టంగా 53 స్థానాలు గెలవాల్సి ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. -
బెట్టింగ్ బంగార్రాజులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా బెట్టింగ్ జరుగుతోంది. పోలింగ్ సరళిపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఓటరు నాడిని సరిగ్గా అంచనా వేయలేదనే ప్రచారం ఊపందుకోవడంతో అన్ని చోట్లా బెట్టింగ్‌కు తెరలేచింది. అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో కూడిన విపక్ష ప్రజాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురైందనే వాదన బలంగా ఉండటం, చాలా చోట్ల అభ్యర్థులు పొటాపొటీగా తలపడటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందన్న అంచనా సర్వత్రా నెలకొంది. దీనికితోడు ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలరనే పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉండటం ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై పందేలు జోరందుకున్నాయి. అభ్యర్థుల గెలుపోటములతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏమిటనే అంశాలపై బెట్టింగ్ బంగార్రాజులు రంగంలోకి దిగారు. రూ. 5 వేలు మొదలు రూ. 10 లక్షల వరకు పందేలు కాస్తున్నారు. పందెంలో గెలుపొందితే పెట్టిన మొత్తానికి రెట్టింపు, ఆపైన ఇచ్చేలా కొందరు ఆఫర్లు ప్రకటిస్తుండటంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. సీమాంధ్రలోనూ భారీగా పందేలు... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీమాంధ్ర ప్రాంతం లోనూ తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది. తెలంగాణలో కంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బెట్టింగ్ మరింతగా సాగుతోంది. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు నగదుతో ఔత్సాహికులు బెట్టింగ్‌లో పాల్గొం టుండగా... కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా ప్లాట్లను కూడా పందెంలో పెడుతున్నారు. మరికొందరైతే ఏకంగా ఒప్పంద పత్రాలు సైతం రాసుకుంటున్నారు. సాధారణంగా ఆంధ్రా ప్రాంతంలో కోడి పందేలు భారీ స్థాయిలో జరగడం సాధారణమే అయినా ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు కూడా అదే స్థాయిలో జరుగుతుండడం గమనార్హం. సీట్లెవరికి..? మెజారీటీ ఎక్కడ? బెట్టింగ్ ప్రక్రియలో వివిధ అంశాలను పేర్కొంటే కేటగిరీలవారీగా పందెం కాస్తున్నారు. ఎక్కువ సీట్లు వచ్చే పార్టీ ఏమిటనే దానిపైనే ఎక్కువగా బెట్టింగ్ నడుస్తోంది. ఆ తర్వాత ప్రముఖుల గెలుపోటములు, మెజారిటీపై పందెం జోరుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఎవరిది పైచేయి అనే అంశంపైనా ఎక్కువ మంది బెట్టింగ్ చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా పోలింగ్ నమోదు కావడంతో పట్టణ ప్రాంతాల్లో సీట్లు, గ్రామీణ ప్రాంతాల్లో సీట్లు ఏయే పార్టీలకు వస్తాయి... జీహెచ్ఎంసీ పరిధిలో సీట్లు, మెజారిటీ, హైదరాబాద్ జిల్లా, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల గెలుపోటములపైనా పందేలు జరుగుతున్నాయి. చూపంతా తెలంగాణపైనే... దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలకు ఈ ఎలక్షన్లను సెమీఫైనల్‌గా భావించిన రాజకీయ పార్టీలు ఆ మేరకు ప్రచారపర్వాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీకి సిద్ధమయ్యాయి. మొత్తంగా అన్ని పార్టీలకు చెందిన అతిరథ మహారథులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని టీఆర్ఎస్ ముందుకెళ్లగా... అధికార పార్టీని పడగొట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పోరాడింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు ఎక్కువ సీట్లు గెలవాలని నిర్ణయించిన బీజేపీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో ఎవరికి వారు తీవ్రంగా శ్రమించినప్పటికీ... ఓటరు నాడి మాత్రం అంతుచిక్కలేదు. ఉత్తరాదిలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలో ఎన్నికల ఫలితాలపై కొంత స్పష్టత వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం తేలకపోవడంతో దేశమంతా రాష్ట్ర ఫలితాలపైనే ఆసక్తి చూపుతోంది. -
ప్రజాకూటమిదే విజయం
కొడంగల్/వంగూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిదే విజయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం కొడంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారని పేర్కొన్నారు. కొడంగల్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకుల ప్రలోభాలకు జనం లొంగలేదన్నారు. కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందని ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన వచ్చే ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనువిప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు చీకటిరోజులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్ ఫాంహౌస్‌కు, కేటీఆర్ అమెరికాకు పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. 11వ తేదీ నుంచి టీఆర్ఎస్లో హరీశ్‌రావు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా హరీశ్‌రావు ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మామ, బావమరిది తెలంగాణను వదిలిపెట్టి పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి అమావాస్య చీకటి చుట్టుకుందన్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపిన కేసీఆర్ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కొడంగల్ ప్రజలు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొడంగల్‌కు అన్యాయం చేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్‌కు ముస్లింలు తగిన తీర్పు ఇస్తారని చెప్పారు. ఎమ్ఐఎం ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తు నిర్ణయాన్ని ప్రకటించాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ యూసుఫ్, విజయకుమార్, ప్రశాంత్, బాన్‌సింగ్, నాగులపల్లి నరేందర్, కష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఓటు వేసిన రేవంత్ రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు నిరంకుశ పాలన సాగించిన కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో శక్రవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మాకే ‘పట్టం’..!
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ తమకు అనుకూలంగానే జరిగిందని, తమ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటవుతుందని ప్రజాకూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయా పార్టీలు భావిస్తు న్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోలింగ్ సమయంలో బహిర్గతమైందని, యువత, మహిళల ఓట్లు తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో తాము పుంజుకున్నామని, దక్షిణ తెలంగాణలో గతంలోలాగే గెలిచినా, జీహెచ్ఎంసీ పరిధిలో ఊహించని ఫలితాలొ స్తాయని కూటమినేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలో వెనుకబడిందని, దక్షిణ తెలంగాణలో ఆపార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించట్లేదని అంచనా వేస్తున్నారు. మహిళలు, రైతు లు, యువకులు, నిరుద్యోగులకు తమ మేని ఫెస్టోలో ఇచ్చిన ప్రాధాన్యమే తమను విజయతీరాలకు చేరుస్తుం దని కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్య నేత వ్యాఖ్యానించారు. యువత, మహిళలపైనే ఆశలు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, ముఖ్యంగా యువత, మహిళలు తమ వైపు మొగ్గుచూపుతారనే అంచనాలో కూటమి వర్గాలున్నాయి. నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ లాం టి హామీలు నిరుద్యోగ యువతలో ఆశలు కల్పించాయని, వారంతా తమకే ఓటు వేసి ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహిళల విషయానికి వస్తే ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్వయం సహాయక గ్రూప్‌లకు గ్రాంటు, రుణంతో పాటు రెట్టింపు చేసిన పింఛన్లు, రూ.2 లక్షల రైతు రుణమాఫీలు ఓటర్లను తమవైపు చూసేలా చేశాయని భావిస్తున్నారు. కాగా, జాతీయ చానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నింటిలో తాము ఓడిపోతామని తేలడం కూటమి వర్గాలకు మింగుడు పడట్లేదు. కొన్ని చానెళ్లు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ ఇవ్వడం, మరికొన్ని చానెళ్లు టీఆర్ఎస్సే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో బాబుతో పొత్తు అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ పార్టీ బలంగా ఉందని భావించిన జీహెచ్ఎంసీతో పాటు ఒకటి, రెండు జిల్లాల్లో టీడీపీతో ప్రయోజనం మాట ఎలా ఉన్నా మిగిలిన చోట్ల నష్టపోయామనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ‘టీడీపీతో పొత్తు విషయంలో జాతీయ చానెళ్లు జరిపిన చర్చ వాస్తవానికి దగ్గరగా ఉందా అనిపిస్తోంది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన బాబు మా కొంప ముంచుతాడేమో అనే భయం వేస్తోంది. ఏదేమైనా ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం’అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఏమీ కాదంటూ గుంభనాన్ని ప్రదర్శిస్తుండగా, మం చికో, చెడుకో జరిగింది జరిగిపోయిందని, ఇప్పుడేం అనుకున్నా ఉపయోగమేంటని కొం దరు నిర్వేదం వ్య క్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం చంద్రబాబు రాకతో ప్రతికూలంగా మారిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. 64–72 సీట్లు: గూడూరు పోలింగ్ ముగిసిన అనంతరం గాంధీభవన్‌లో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి అధికారంలోకి రాబోతోందని, 64–72 స్థానాల్లో కూటమి విజయం సాధించబోతోం దని జోస్యం చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అదనపు ఈవీఎంలపై కాంగ్రెస్ కేడర్ డేగకన్ను వేసి ఉంచాలని, వీటిసాయంతో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. అవి కాంగ్రెస్‌కు వ్యతిరేకమే.. జాతీయ చానళ్లు ఎన్నికల ఫలితాల విషయంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. జాతీయ చానళ్ల సర్వేలు అబద్ధమైతే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ కేడర్ సైన్యంలాగా పోరాడేందుకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. -
వరంగల్ అర్బన్‌లో భారీగా నగదు పట్టివేత
-
సిటీ సెంటర్లో సీన్ ఎవరిది?
‘చార్ సౌ సాల్’ చారిత్రక భాగ్యనగరంలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. ఒకవైపు చూస్తే ఆకాశహార్మ్యాలు.. మరోవైపు వందలాదిగా వెలిసిన మురికివాడలు.. తీరైన రహదారులు ఒకదిక్కు.. దారీతెన్నూ లేనివి మరో దిక్కు.. స్విమ్మింగ్‌పూల్స్ ఒకవైపు.. వర్షమొస్తే మురుగు, వర్షపునీరు కలిసి సుడిగుండంలా మారిన ముంపు ప్రాంతాలు మరోవైపు. ఇలా పేదా–గొప్ప తారతమ్యం లేకుండా అందరినీ అక్కున చేర్చుకొని ఆదరిస్తోన్న విశిష్ట సంస్కృతికి ఈ భాగ్యనగరం సొంతం. పాత, ప్రధాన నగరాలతో కూడి, శివార్లతో అలరారుతోన్న రాజధానిలో ప్రధాన నగరం (కోర్‌సిటీ)లో ఎన్నికల పోరు పతాకస్థాయికి చేరింది. రాజకీయాలు రసవరత్తరంగా మారాయి. సనత్‌నగర్: ‘సీన్’ రిపీట్? దేశంలోనే మొదటి పారిశ్రామికవాడగా ఖ్యాతి చెందిన సనత్‌నగర్ పేరుతోనే ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్న తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్ మధ్య ప్రధాన పోటీ ఉంది. తలసాని శ్రీనివాస్‌యాదవ్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరి మంత్రి పద వి చేపట్టారు. నియోజకవర్గంలో 30 శాతం మురికివాడలే ఉన్నాయి. వారి ఓట్లే కీలకం. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని తలసాని భావిస్తున్నారు. హైటెన్షన్ వైర్ల తొలగింపు, మంచినీటి రిజర్వాయర్ల నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం తనకు కలిసివస్తుందని ఆశ పెట్టుకున్నారు. టీడీపీ నుంచి పోటీలో ఉన్న కూన వెంకటేష్‌గౌడ్.. గత ఎన్నికల్లో తనకు టిక్కెట్ దక్కకుండా అన్యాయం జరిగిందన్న సానుభూతి ప్రజల్లో ఉందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలకు తోడు పార్టీ ఓట్‌బ్యాంక్ పదిలంగా ఉందన్న అంచనాతో ఉన్నారు. అంబర్‌పేట: ఎవరిదో సంబరం! ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల ఓటర్లతో మినీ ఇండియాను తలపించే ఈ నియోజకవర్గంలో ద్విముఖ పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వరుసగా మూడుసార్లు గెలుపొందిన కిషన్‌రెడ్డికి నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లతో ముఖాముఖి పరిచయం ఉంది. సౌమ్యునిగా, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరున్న ఆయన తన గెలుపు నల్లేరు మీద నడకేనని భరోసాతో ఉన్నారు. అయితే, మూడుసార్లు గెలిచినా చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదనే అసంతృప్తి కూడా ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్.. కేసీఆర్ సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్ష అని భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లపై ఆయన అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఎంఐఎం బరిలో లేకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే పార్టీలో అసమ్మతి తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ట్రాఫిక్, నాలాల సమస్యలు ప్రభావం చూపనున్నాయి. ఖైరతాబాద్: రాజెవరు? పేదెవరు? మురికివాడలు, ఆధునిక కాలనీలు, పేదా గొప్ప తారతమ్యం స్పష్టంగా కనిపించే ప్రాంతాలతో కూడిన ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ), దానం నాగేందర్ (టీఆర్ఎస్), దాసోజు శ్రవణ్ (కాంగ్రెస్) హోరాహోరీ తలపడుతున్నారు. ప్రచారంలో మూడు పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బస్తీలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ దృష్టి పెట్టగా, కాలనీలు, అపార్ట్మెంట్లపై బీజేపీ కన్నేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు ఓట్ల చీలిక చిక్కులు ఎదురుకానున్నాయి. టీఆర్ఎస్ రెబెల్.. బీఎస్పీ తరఫున బరిలో ఉన్న మన్నె గోవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానం నాగేందర్ మైనార్టీ ఓట్లను పెద్ద మొత్తంలో కూడగట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి చింతల రాంచంద్రారెడ్డి విద్యావంతులు, అపార్ట్మెంట్లు, కాలనీవాసుల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇతర పార్టీల అసంతృప్తులపై ఆయన దృష్టిపెట్టారు. కాంగ్రెస్ అభ్యర్ధి దాసోజు శ్రవణ్‌కు టీడీపీ సహకారం ఇప్పుడిప్పుడే లభిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ ఎంతగా పుంజుకుంటే ఆయనకు అంతగా లాభం. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆ ఓట్లు ఎటుపడితే వారిదే విజయం. కంటోన్మెంట్: ‘ట్రిపుల్’ ఫైట్ దేశ రక్షణశాఖకు ఆయువుపట్టుగా నిలిచిన నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. బరిలో మొత్తం 19 మంది ఉన్నా.. ప్రధాన పార్టీలకు చెందిన జి.సాయన్న (టీఆర్ఎస్), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), ఎన్.శ్రీగణేశ్ (బీజేపీ) మధ్యే పోటీ ఉంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న, ఒకసారి ఎమ్మెల్యే, రెండుమార్లు ఎంపీ అయిన సర్వే సత్యనారాయణ 24 ఏళ్ల తర్వాత మళ్లీ అసెంబ్లీ బరిలో ముఖాముఖి తలపడుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు నలుగురు తనవైపు ఉండడం, పార్టీ బలగం, సుదీర్ఘ రాజకీయ అనుభవం, టీడీపీ–టీజేఎస్ ఓట్లు తనకు కలిసి వస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి సర్వే భావిస్తున్నారు. ఇక కంటోన్మెంట్ బోర్డు సభ్యుల్లో ఎనిమిది మంది తనవైపు ఉండడం, స్థానిక కార్పొరేటర్ మద్దతు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తాను చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని సాయన్న భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీగణేష్ నాలుగేళ్లుగా ప్రజా సమస్యలపై తాను చేసిన పోరాటాలు, బీజేపీ ఇమేజ్ కలిసివస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ముషీరాబాద్: ముగ్గురు ‘బాస్’ల పోరు ఇక్కడ ముక్కోణ పోటీ నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, టీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్ మధ్య పోరు రసవత్తరంగా ఉంది. ముగ్గురికి గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏడోసారి పోటీ చేస్తున్న లక్ష్మణ్.. గతంలో రెండుసార్లు గెలిచి మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఠా గోపాల్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి రాత్రికి రాత్రే టికెట్ దక్కించుకున్నారు. నాడు లక్ష్మణ్‌పై పోటీచేసి రెండో స్థానానికే పరిమితమయ్యారు. హోం మంత్రి నాయినిని కాదని ఈసారి మళ్లీ టికెట్ దక్కించుకున్న గోపాల్ ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రజాకూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం.అనిల్‌కుమార్ యాదవ్ తొలిసారి పోటీలోనే తలపండిన రాజకీయ నాయకులను ఢీకొంటున్నారు. తండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులైన ఎం.అంజన్‌కుమార్ యాదవ్ తెరవెనక ఉండి చక్రం తిప్పుతున్నారు. పోటీలో ఉన్న ముగ్గురూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఇక్కడ మైనార్టీల ఓట్లు 40 వేల వరకు ఉన్నాయి. వీరు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. నియోజకవర్గంలోని బూత్, డివిజన్ స్థాయి కార్యకర్తల బలం, జాతీయ స్థాయిలో పార్టీ ఇమేజ్ తనకు కలిసివస్తుందన్న నమ్మకంతో లక్ష్మణ్ ఉన్నారు. గతంలో ఓడిపోయాననే సానుభూతి, ఎంఐఎం టీఆర్ఎస్కు మద్దతునిస్తుండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అండతో గట్టెక్కుతానని ముఠా గోపాల్ భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఓటుబ్యాంక్, యువత ఓట్లు తనకు దక్కుతాయని అనిల్‌కుమార్ యాదవ్ అంచనా వేసుకుంటున్నారు. 14 బస్తీల్లో నివసిస్తున్న వారికి ఇళ్లపట్టాల సమస్య, హుస్సేన్‌సాగర్ నాలా కాలుష్యం, అశోక్‌నగర్ బ్రిడ్జి వెడల్పు, మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం వంటివి ఇక్కడ ప్రభావం చూపే అంశాలు. ‘హిల్స్’లో పాగా కోసం ఒకవైపు సంపన్నుల నివాసాలు.. ఆ పక్కనే మురికివాడల్లోని పూరిగుడిసెలతో ఉండే ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్యెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నవీన్‌యాదవ్ పోటీ పడుతున్నారు. 80వేలకు పైగా ఉన్న ముస్లిం ఓట్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. పార్టీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తనకు కలిసివస్తాయని గోపీనాథ్ భావిస్తున్నారు. అయితే ఆయనకు పార్టీ నేతల నుంచి వ్యక్తమౌతోన్న వ్యతిరేకత చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇక దివంగత నేత పీజేఆర్ కుమారునిగా తనకు పేదల్లో ఆదరణ ఉందని, టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని విష్ణువర్ధన్‌రెడ్డి అంచనా. అయితే కిందిస్థాయి క్యాడర్‌తో సఖ్యత లేదన్న విమర్శ ఉంది. ఇక స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు నియోజకవర్గ వ్యాప్తంగా క్యాడర్ ఉంది. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. మైనార్టీల ఓట్లు భారీగా తనకు లభించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. లష్కర్లో తళుక్కుమనేదెవరు? సికింద్రాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆపద్ధర్మ మంత్రి టీ.పద్మారావుగౌడ్‌కు కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్థి బండపెల్లి సతీష్‌కుమార్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ ముందుండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆలస్యంగా ఖరారు కావడం, మహాకూటమి నేతలను కలుపుకుపోవడంలో జ్ఞానేశ్వర్ కాస్త వెనుకబడ్డారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ముస్లిం మైనార్టీ ఓట్లే తనను గట్టెక్కిస్తాయని పద్మారావు ఆశతో ఉన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యమకారులను ఆదరికంచకపోవడం వంటి అంశాలపై కొంత అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండడంతో వారి ఓట్లపైనే జ్ఞానేశ్వర్ ఆశ పెట్టుకున్నారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఆయన మహాకూటమి నాయకులను కలుపుకుపోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి బండపెల్లి సతీష్.. నియోజకవర్గంలో తాను చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలతో యువత ఓట్లు భారీగా పొందుతానని భావిస్తున్నారు. నియోజకవర్గంలో ముగురునీటి సమస్య ప్రధానమైనది. భారీ వర్షాలు కురిసినపుడు నాలా పరివాహక ప్రాంతాలు ముంపునకు గురవడం రివాజుగా మారింది. రహదారుల విస్తరణ కూడా ప్రభావం చూపనుంది. -
వరంగల్‌లో రూ.3.5 కోట్ల నగదు స్వాధీనం
కాజీపేట: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని సిద్దార్ధనగర్‌లో ఓ ఇంట్లో దాచి ఉంచిన సుమారు రూ.3.5 కోట్ల నగదును బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వర్ధన్నపేట ప్రజా ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ పి.దేవయ్యకు సమీప బంధువైన కాంగ్రెస్ నాయకుడు గంగారపు అమృతరావు ఇంటి సమీపంలో ఉంటున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి నివాసంలో ఈ నగదు దొరికింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దార్ధనగర్‌లో నివాసం ఉండే అమృతరావు తన ఇంటి పక్కన ఉన్న కేరళ వ్యక్తి ఇంటిని బుధవారం అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చిన కొద్దిసేపటికే ముగ్గురు యువకులు లగేజీ బ్యాగ్‌లతో రెండు కార్లలో వచ్చారు. ఆ కొద్దిసేపటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. ఆ ఇంటిలో ఉన్న దాదాపు రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. యువకుల మధ్య గొడవే పట్టించిందా... రెండు వాహనాల్లో నగదును తెచ్చిన యువకులు బహిరంగంగా రోడ్డుపై గొడవ పడడమే డబ్బుల గుట్టు తెలియడానికి కారణమైందనే చర్చ కాజీపేట పట్టణంలో జరుగుతోంది. ఎన్నికల అవసరాల కోసం తెచ్చిన డబ్బులు ఎవరి వద్ద ఉండాలనే విషయంలో యువకులు రోడ్డుపై వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అటుగా వచ్చిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విషయాన్ని ఆరా తీసి అధికారులకు సమాచారం అందించడంతో చాకచక్యంగా వ్యవహరించి నగదును పట్టుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అమృతరావు ఇంటిపై దాడి.. అమృతరావు ఇంటిలో ఇంకా ఏమైనా నగదు నిల్వలు ఉండొచ్చనే ఉద్దేశంతో పోలీసులు తనిఖీలు చేశారు. యువకులు డబ్బులతో వచ్చిన వాహనాలను తనిఖీ చేయగా కాంగ్రెస్ కండువాలు, జెండాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. -
ఆశీర్వదించండి... ప్రజాపాలన తెస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కలలుకన్న తెలంగాణను నిర్మించడంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు విఫలమయ్యారని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, ముస్లింలీగ్‌తో కూడిన ప్రజాకూటమి నేతలు ఆరోపించారు. ఆయన నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలన్నా, ప్రజాపాలన రావాలన్నా తమను గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే పాలనలో అందరినీ భాగస్వాములను చేస్తామని, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల పరిరక్షణ, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. విజయవంతమైన డైనమిక్ తెలంగాణను నిర్మిస్తామన్నారు. ఇందుకు తెలంగాణ ప్రజలు ఈసారి తమను ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలంగాణ అధ్యక్షుడు ఘనీ సాహెబ్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఏఐసీసీ అధికార ప్రతినిధులు మధుయాష్కీగౌడ్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా, కర్ణాటక ఎంపీ నాసిర్ హుస్సేన్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు రాహుల్, చంద్రబాబు, ఉత్తమ్ సమాధానాలిచ్చారు. ఆ సమాధానాలు వారి మాటల్లోనే... కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిందే... రైతు సంక్షోభం అనేది జాతీయ సమస్య. రైతులంటే అప్పులే అనే భావనలో ప్రస్తుత పాలకులున్నారు. కానీ మేం జాతిసంపద అనుకుంటున్నాం. 15 మంది బడాబాబులకు రూ. 3.50 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్రధాని మోదీ కోట్లాది మంది రైతులకు దాన్ని ఎందుకు వర్తింపజేయలేదు? మేం రైతు రుణమాఫీని తెలంగాణలో చేసి చూపిస్తాం. సాంకేతిక పరిజ్ఞా నంతో ఇక్కడి రైతులను జాతీయ, ప్రపంచ స్థాయిలో అనుసంధానిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు గౌరవం లభించాలి. రైతుల భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరు అవుతారనేది అప్రస్తుతం. కేసీఆర్‌ను గద్దెదించడమే మా మొదటి లక్ష్యం. అది జరిగిన తర్వాత సీఎం ఎవరనే చర్చ ప్రారంభమవుతుంది. మేం ఎవరికీ తాయిలాలు ఇవ్వాలనుకోవట్లేదు. ఉపాధి కల్పన, రైతుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తాం. జిల్లాస్థాయిలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం. విద్య, వైద్య రంగాలకు అదనపు నిధులు కేటాయిస్తాం. ప్రభుత్వ సంస్థల్లోనే నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తాం. నోట్ల రద్దు అనేది యువకులు టార్గెట్‌గా మోదీ చేసిన నేరం. ఆ నిర్ణయాన్ని కేసీఆర్ ఎలా సపోర్ట్ చేశారు? జీఎస్టీ అమలు ఇలా కాదని ఎందుకు చెప్పలేకపోయారు? అందుకు కారణం ఒక్కటే.. అవినీతి. ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కుడిని కాదు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావాలి. అందుకే మేం గెలుస్తామన్న విశ్వాసం ఉంది. ఇందుకు కేసీఆర్ వ్యవహారశైలి కూడా అద్దం పడుతోంది. గత కొన్ని రోజులుగా ఆయన ఆహార్యం, చేస్తున్న వ్యాఖ్యలు, తిట్లు ఆయన అభద్రతకు, నైరాశ్యానికి అద్దంపడుతున్నాయి. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిందే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఇంకెవరినీ కన్విన్స్ చేయాల్సిన పనిలేదు. దేశంలోని అన్ని వ్యవస్థలపై మోదీ, అమిత్ షా దాడి చేస్తున్నారని చంద్రబాబు నన్ను కలిసినప్పుడు చర్చించుకున్నాం. – రాహుల్ తెలంగాణ నేతలే పాలిస్తారు... కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పాలన జరుగుతుందనే వ్యాఖ్యలు అర్థరహితం. రాబోయే కూటమి ప్రభుత్వంలో పాలన హైదరాబాద్ నుంచే జరుగుతుంది. తెలంగాణ నేతలే పాలిస్తారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు. ఏమీ మాట్లాడటానికి లేకనే అసందర్భంగా కేసీఆర్ ఈ ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా ఇలాంటివి చెప్పి లబ్ధి పొందాలని చూస్తున్నారు. – ఉత్తమ్ కాళేశ్వరం తప్ప అన్నీ నేనే.. తెలంగాణలో కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులన్నీ నేను ప్రారంభించినవే. వాటిని కాంగ్రెస్ కొనసాగించింది. నేను ప్రాజెక్టులు అడ్డుకుంటాననేందుకు ఆధారాలున్నాయా? అదంతా తప్పుడు ప్రచారం. 2,500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్ తయారు చేసింది ఎవరు? ఆ విజన్ నేనే ఇచ్చాను. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? మేమంతా కూర్చొని మాట్లాడుకొని అన్ని విషయాలను పరిష్కరించుకుంటాం. ఇప్పటికే మాట్లాడుకున్నాం. మేమంతా కలసి తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇక్కడి పాలనలో నేను జోక్యం చేసుకునేది ఏమీ ఉండదు. తెలంగాణ ప్రజలే భాగస్వాములవుతారు. కోదండరాం కమిటీ మా మేనిఫెస్టోను అమలు చేస్తుంది. సమస్యలు, అభివృద్ధిపై మాట్లాడలేక టీఆర్ఎస్ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. – చంద్రబాబు -
తెలంగాణలోనూ సత్తా చాటుతాం
సాక్షి, భూపాలపల్లి/నిర్మల్/బోధన్, కరీంనగర్ సిటీ: ఈ ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ సత్తా చాటుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నిర్మల్ జిల్లా భైంసాలో, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో, కరీంనగర్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత, అభివృద్ధి పాలన బీజేపీతోనే సాధ్యమని, ఒకసారి అవకాశమిస్తే రామరాజ్యం స్థాపిస్తామని చెప్పారు. ప్రజాకూటమి, టీఆర్ఎస్, ఎంఐఎం కూటమి దోచుకునేందుకే ఉన్నాయన్నారు. తెలంగాణలో నక్సల్స్, ఐఎస్ఐ ఏజెంట్లను నిర్మూలించడం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఎంఐఎం ముందు తలవంచుతున్నాయని చెప్పారు. ఎంఐఎంను భూస్థాపితం చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా, కరీంనగర్‌ను కరిపురంగా పేర్లు మారుస్తామని పేర్కొన్నారు. -
దగా.. దగుల్బాజీ కూటమి..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను తిరిగి ఏపీలో కలిపేందుకు సమైక్య వాదులంతా చేతులు కలిపారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలం గాణ రాకుండా ఆఖరి నిమిషం వరకు అడ్డుకుని, వచ్చాక కుట్రలకు తెరలేపిన చంద్రబాబుతో వాళ్లు చేతులు కలపడమే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. మహాకూటమి లక్ష్యాలపై పలు అను మానాలు, ప్రశ్నలను లేవనెత్తారు. ‘తెలంగాణలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ఎన్నికలు కాదు’అన్నారు. తెలంగాణ ఉనికిని, మనుగడను ప్రశ్నించడానికి వస్తున్న కూటమిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘నేను మంత్రిగా మాట్లాడ ట్లేదు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నా. తెలంగాణలో తెలంగాణ పౌరులే పోటీ చేయాలి.. వారే అధికారంలో ఉండాలి. కానీ నేడు జరుగుతున్న దేంటి?’అని ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి కుట్రల కూటమి, దగుల్బాజీ కూటమి అని దుయ్యబట్టారు. అది చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు 1956లో ఉపముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణను ఏపీలో కలిపి, అధికారం కోసం ఇప్పుడు మరోసారి అదే కుట్రలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. కూటమిలో మిగిలింది కాంగ్రెస్, టీడీపీలేనని విమర్శించారు. కోదండరాం, సీపీఐ చాడ వెంకటరెడ్డిల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో సాగరహారం ఫొటోలు వేయించుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. అనేక కుట్రలు చేశారు ఇపుడు కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయంటూ ధ్వజమెత్తారు. కాకినాడ సభలో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. కరెంటు కష్టాలపై నిలదీసినందుకు బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపించిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలతో విసిగిపోయిన కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. 2004లో కాంగ్రెస్‌తో జై తెలంగాణ అనిపించినా, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పెట్టించిన ఘనత టీఆర్ఎస్దేనని స్పష్టం చేశారు. 2009లో కేసీఆర్ దీక్షతో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న ప్రకటన చేయించాడన్నారు. కానీ అదే రాత్రి రాజీనామా డ్రామాలతో కుట్రలకు తెరలేపిన బాబు వచ్చిన తెలంగాణను వెనక్కి పోయేలా చేసాడని ఆరోపించారు. 2014లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తిరిగి తెలుగుజాతిని కలిపే శక్తి ఒక్క టీడీపీకే ఉందన్న బాబు మాటలకు అర్థమేంటని ప్రశ్నించారు. పథకం ప్రకారం.. తన కోవర్టులను ముందుగా కాంగ్రెస్‌లోకి.. ఇపుడు పొత్తు పేరిట తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని కరాఖండిగా చెప్పిన అప్పటి సీఎం కిరణ్‌తో చేతులు కలపడం కుట్రలో భాగమేనన్నారు. జిల్లాలకు ఎందుకు పోవట్లేదు? కూకట్పల్లి, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగిన చంద్రబాబు తెలంగాణ జిల్లాలకు ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీతో చేతులు కలిపిన కాంగ్రెస్ నేతలంతా సమైక్యవాదులేని హరీశ్‌రావు మండిపడ్డారు. పొన్నాల, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పులిచింతలను దగ్గరుండి కట్టి తెలంగాణకు తెగని అన్యాయం చేశారన్నారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలించుకుపోయిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోతే.. తిరిగి ఆంధ్రలో కలిపేస్తామన్న బలరాం నాయక్ది ఏ పార్టీ అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగం విని బుద్ధి చెప్పాల్సిన పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్, జీవన్‌రెడ్డిలు ఎలా చప్పట్లు కొడతారని వాపోయారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని జానారెడ్డి ఎలా అంటారని ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, భట్టివిక్రమార్క అంతా సమైక్యపాట పాడినవాళ్లేనని వార్తా క్లిప్పింగులతో సహా ప్రస్తావించారు. 7తర్వాత సమైక్యవాదం.. అధికారం కోసం ఘోరంగా దిగజారిన కాంగ్రెస్ నేతలంతా బాబు ట్రాప్‌లో పడిపోయారని ఆరోపించారు. తెలంగాణను ఆగం చేయాలన్న లక్ష్యం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న చంద్రబాబు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలిపే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 7 తర్వాత ఆంధ్రలో సమైక్యవాదం సెంటిమెంటు రగిలించి ఏపీ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం బాబు చేపడతాడని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి, కుట్రలను పసిగట్టి కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పి ఓడించాలని పిలుపునిచ్చారు. బాబు ఫొటోలు ఎందుకు తీసేస్తున్నారు? చంద్రబాబుతో చేతులు కలిపిన కూటమి కూకట్పల్లి, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసిందన్నారు. ప్రకటనల్లోనూ ఆంధ్రులు ఉన్న చోట మాత్రమే బాబు ఫొటో వచ్చేలా జాగ్రత్తలు పడుతున్న వారి కష్టాన్ని చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ఎందుకు చంద్రబాబు ఫొటో పెట్టట్లేదని, పచ్చ కండువాలు ఎందుకు కప్పుకోవట్లేదని ప్రశ్నించారు. కోర్టు తీర్పు చెంపపెట్టు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేయడాన్ని హరీశ్‌రావు స్వాగతించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు మనుగడ ఉండదన్న స్వార్థ బుద్ధితో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులపై తప్పుడు కేసులు వేశారని ఆరోపించారు. మొన్నటిదాకా వారితోనే కలసి నడిచిన రచనారెడ్డే వారి కుట్రలను బయటపెట్డడమే ఇందుకు నిదర్శనమన్నారు. పాలమూరు కాంగ్రెస్ నేతలైన నాగం జనార్దన్‌రెడ్డి అవినీతి పేరిట, వన్యప్రాణులకు హాని అని హర్షవర్ధన్‌రెడ్డిలు వేసిన కేసులు వీగిపోయాయన్నారు. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు నాగంకు కోర్టు రెండుసార్లు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. దీంతో నిన్నటి దాకా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ డొల్ల అని తేలిపోయిందన్నారు. ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, అవినీతి జరిగిందని ఆరోపించిన రాహుల్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోబెల్స్ బాబు పాలమూరుకు వ్యతిరేకంగా కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్ మైనార్టీ నేతలు మంత్రి హరీశ్, మున్సిపల్ చైర్మన్ గొర్రె భాస్కర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. -
నువ్వేమన్నా శుద్దపూసవా?
సాక్షి, పెద్దపల్లి/ఉట్నూర్/కోరుట్ల/గోదావరిఖని: ‘‘తప్పు చేయకపోతే నువ్వేమన్నా శుద్దపూసవా..? ఎమ్మెల్యేలను కొనడానికి రూ.50 లక్షల బ్యాగ్‌తో అడ్డంగా దొరికింది నీ మనిషి రేవంత్‌రెడ్డి కాదా.. తెలంగాణకు నీళ్లివ్వద్దని, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలను ఆపాలని కేంద్రానికి 30 ఉత్తరాలు రాసింది నువ్వు కాదా’అంటూ ఏపీ సీఎం చంద్రబాబునుద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమ వారం పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల జిల్లా కోరుట్ల, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని, నీళ్లివ్వొద్దంటున్న చంద్రబాబు, కాంగ్రెస్‌లను నమ్ముకుంటే నిండా మునుగుతామని, మన వేలుతో మన కన్నే పొడుచుకున్నట్లు, మన రైతుల నోట్లో మనమే మన్ను కొట్టినట్లయితదని చెప్పారు. తెలంగాణను దోచుకోవడానికి ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. వారికి అధికారం ఇస్తే ఢిల్లీ కాంగ్రెస్ సిఫారసులతో అమరావతి టీడీపీ చేతిలో కీలుబొమ్మలా ఉండేవారు తెలంగాణకు సీఎం అవుతారని విమర్శించారు. తద్వారా తెలంగాణను మరింత దోచుకోవడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పహిల్వాన్లంతా ఒక్కటయ్యారు కేసీఆర్‌పై కుట్రతో ఒకప్పుడు బద్దశత్రువుల్లా ఉన్న కాంగ్రెస్.. టీడీపీ ఒక్కటయ్యాయని కేటీఆర్ పేర్కొన్నా రు. కేసీఆర్‌ను పడగొట్టేందుకు దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పలు పార్టీల పహిల్వాన్లు అంతా ఒక్కటై రాష్ట్రంపై మొసలికన్నీరు కారుస్తున్నారని, వారిని విశ్వసించవద్దన్నారు. సింగిల్‌గా బరిలో ఉన్న సింహంలాంటి కేసీఆర్‌ను ఎదిరించే ధైర్యం లేక గుంపులుగా వస్తున్నా కూటమి నేతలకు గుణపాఠం చెప్పాలన్నా రు. ప్రజాశక్తి అండతో కేసీఆర్ మాయకూటమిని చిత్తు చేయడం ఖాయమన్నారు. తెలంగాణ తామిచ్చామం టూ కాంగ్రెస్ నేతలు ఏదేదో చెబుతున్నారని, దిక్కులేక.. ఇయ్యకపోతే ఈపు చింతపండైతదనే పరిస్థితి వస్తేనే ఇచ్చారన్నారు. సోనియాను తాను ఒక్క మాట అంటే రోషం వచ్చిందని, కానీ అన్ని తిట్లు తిట్టిన బాబుతో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. మీకు సిగ్గు, రోషం లేదా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నిం చారు. తీగలు ముట్టుకుంటే కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని ప్రధాని మోదీనుద్దేశించి వ్యాఖ్యానించారు. జిల్లాకు నలుగురు సీఎంలు టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతాడని చిన్నపిల్లాడైనా చెబుతాడని, మరి కాంగ్రెస్ గెలిస్తే ఎవరవుతారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జిల్లాకు నలుగురు సీఎంలు ఉన్నారని, 40 మంది సీఎంలు 60 నెలలు..నెలన్నరకొక్కరు మారుతారన్నారు. అమరావతిలో చంద్రబాబు, రాహుల్‌లు కూర్చొని లాటరీ తీసి సీల్డ్ కవర్లో పంపిస్తారని ఎద్దేవా చేశారు. తెల్లారిలేస్తేనే చంద్రబాబు ఇంటికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళుతున్నాడని, కాంగ్రెస్ నిర్ణయాలు ఢిల్లీలయితున్నయో...అమరావతిలో అవుతున్నాయో తెలియడం లేదన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక దేశంలోని పహిల్వాన్లంతా రాష్ట్రంలో దిగారని ఎద్దేవా చేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ పారిశ్రామిక ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ ఇస్తామన్నారు. నల్లసూరీల పిల్లల కోసం మైనింగ్ ఇంజినీర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. 100 పడకల మాతాశిశుసంరక్షణ ఆసుపత్రి మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు. కాంట్రాక్టు కార్మికుల తక్కువ డబ్బులు వస్తున్నాయి.. వారికి కూడా జీతాలు పెంచే విధంగా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చినట్లే ఫీలవుతున్న ‘గడ్డం’ గ్యాంగ్ వరంగల్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ హన్మకొండ: గడ్డం గ్యాంగ్ అధికారంలోకి వచ్చినట్లే ఫీలవుతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి, హన్మకొండ, వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు అరూరి రమేష్, దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర పార్టీ టీడీపీని భుజాల మీద ఎత్తుకొచ్చిన కాంగ్రెస్ కూటమిని ప్రజలు మట్టి కరిపిస్తారన్నారు. ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ పార్టీ కరివేపాకులా, గంజిలో ఈగలొ తీసేసిందని విమర్శించారు. కేసీఆర్‌ను ఓడించేందుకు దేశవ్యాప్తంగా మచ్చల్ పైల్వాన్లు వస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి ఆశీర్వదిస్తే.. రాష్ట్ర ప్రజలు మరోసారి టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే ప్రస్తుతమున్న పింఛన్లను డబుల్ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు అందిస్తామన్నారు. రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశామని, అధికారంలోకి రాగానే రూ.లక్ష రుణామాఫీ అమలు చేస్తామన్నారు. 12 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల కింద రూ.2016 అందిస్తామన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత దేశంలో టీఆర్ఎస్కే దక్కుతుందని చెప్పారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ. 10 వేలు అందిస్తామని చెప్పారు. గిరిజనులను రాజకీయంగా ఉన్నతికి చేర్చేందుకు గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. కాయితీ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలనలో ఉందని, నిరుత్సాహానికి గురికావద్దని సూచించారు. బీడీ కార్మికులకు 2018 వరకు పీఎఫ్ సడలింపు ఇచ్చి అందిరికీ పింఛన్లు ఇస్తామన్నారు. నేత కార్మికుల సంక్షేమానికి సిరిసిల్ల తరహాలో చర్యలు చేపడతామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు 50 ఏళ్లలో చేయని పనులను తాము నాలుగేళ్లలో చేశామన్నారు. ప్రజలు ఆగం కావద్దని...ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. -
కూటమి నేతలు రాజకీయ బ్రోకర్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ జన సమితి(టీజేఎస్)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, అడ్వొకేట్ రచనారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆమెతోపాటు మర్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ప్రకటించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధినేత కోదండరాంపై రచనారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూటమి కూర్పే లేదన్నారు. ఈ విషకూటమితో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మరో రాష్ట్రానికి చెందిన సీఎం ఇక్కడ ప్రచారానికి రావడమే తప్పని, తెలంగాణ ప్రజలు ఎంతో అవగాహన కలిగిన వారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారని, ఆయన చేసే కుట్రలు వారికి బాగా తెలుసని చెప్పారు. కూటమిలో ఏ క్యాడర్ పనిచేస్తలేదని, కూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమిలోని నేతలు రాజకీయ బ్రోకర్లుగా తయారయ్యారని, కూరగాయల మాదిరిగా అసెంబ్లీ సీట్లు అమ్ముకున్నారని తీవ్రంగా విమర్శించారు. టీజేఎస్ పెట్టడానికి కారణాలు ఏంటి? మీరు చేస్తున్నదేంటి? అని ప్రశ్నిస్తూ టీజేఎస్‌ను నమ్ముకున్న వారిని నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే ప్రజాకూటమి ఫిక్స్ అయిందని, కూటమితో కోదండరాం అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కూటమిలో సామాజిక న్యాయంలేదు... ప్రజాకూటమి కూర్పులో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రచనారెడ్డి ఎద్దేవా చేశారు. ఉద్యమకారులకు ప్రాధాన్యం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని, దీంతో మైనార్టీలకు ఏవిధంగా న్యాయం జరిగినట్లో చెప్పాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని మండిపడ్డారు. కోదండరాం కాంగ్రెస్‌తో కలసి తనకు తానే ఓటమి చెందుతున్నారని, అసలు కూటమి ఏర్పడింది.. గెలువడానికా లేక ఓడిపోవడానికా అని ప్రశ్నించారు. కోదండరాం కూటమి కన్వీనర్ అంటే.. ఏ దేశానికి రాజు? అని ఎద్దేవా చేశారు. పార్టీకి కామన్ మినిమం ప్రోగ్రాం లాంటి పెద్ద, పెద్ద పదాలు పనికిరావన్నారు. టీజేఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోతే రాజ్యసభ, ఎమ్మెల్సీ, బోర్డుమెంబర్ పదవి కూడా ఇవ్వరని, కనీసం వారి ఫోన్లను కూడా కాంగ్రెస్ వారు ఎత్తరని ఎద్దేవా చేశారు. తమ వెంట పడి టీజేఎస్‌లో చేరేవరకు వదిలిపెట్టలేదని, చేరాక పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. టీజేఎస్‌కు అడిగినన్ని టికెట్లు ఇవ్వనప్పుడు కోదండరాం కూటమి నుంచి ఎందుకు బయటకు రాలేదని, చర్చల పేరుతో హోటళ్లలో సమావేశాలు పెట్టి ఎందుకు టైంపాస్ చేశారని దుయ్యబట్టారు. రాహుల్ పారాచూట్లకు టికెట్లు ఇవ్వవద్దని, కుటుంబంలో ఒక్కటే టికెట్ ఇవ్వాలని, వరుసగా మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు కేటాయించవద్దని చెప్పినా దాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తుంగలో తొక్కారని ఆరోపించారు. ఎందుకూ పనికిరాని పొలిటికల్ బ్రోకర్లు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోదండరాం.. మమ్మల్ని ఎందుకు పా ర్టీలోకి తెచ్చావు? నిన్ను నమ్ముకుని వచ్చిన వారిని మోసం చేశావు, వారి భవిష్యత్ ఇక్కడికే అంతమైంది. కాంగ్రెస్‌తో మీ డీలింగ్ ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘16 నుంచి 18 పేర్ల తో జాబి తా తయారు చేసి, గంటకు ఒకరి పేరు జాబితాలో మార్చారు. నీవు అది తీసుకో, నేను ఇది తీసుకుంటానంటూ బఠానీలూ, పల్లీల్లా బేరసారాలు చేశారు’ అని ఆమె విమర్శించారు. రచనారెడ్డి సస్పెన్షన్.. టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రచనా రెడ్డి, మర్రి ఆదిత్యరెడ్డిలను ప్రాథమిక సభ్య త్వం నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, అధికార ప్రతినిధి జి.వెంకట్‌రెడ్డి విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యక లాపాలకు పాల్పడినందున వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ప్రశ్నిస్తే నాపై దాడికి యత్నం... అన్నింటికీ డబ్బులేనని, అలాంటప్పుడు కూటమి ఎందుకని రచనారెడ్డి ప్రశ్నించారు. మర్రి కుటుంబాన్ని కూడా కూటమిలో బాధితులుగా చేశారన్నారు. తాను ఒక్కసారే సీటు అడిగానని, ఎవరో డబ్బులు ఇచ్చి తనతో స మావేశం పెట్టించారనే దాంట్లో వాస్తవంలేదని ఆమె అన్నారు. జనసమితి సమావేశాల్లో ప్రశ్నిస్తే తనపై దాడి చేసేందుకు యత్నించా రని ఆరోపించారు. కోదండరాం 2014 వరకు ఉద్యమం చేశారని, తరువాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గడిచిన నాలుగేళ్లలో కూటమిలోని సభ్యులు ఎవరూ ఏం చేయలేదని, వారు ఏం చేయలేకపోవడంవల్లే తాను న్యాయస్థానంలో కేసులు వేశానని తెలిపారు. మర్రి ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ కూటమిలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవమని, తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేపట్టాలన్నారు. ‘కోదండరాం ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసిన మాట వాస్తవం కాదా.. అమిత్ షా 40 సీట్లు ఇస్తామని ఒప్పుకోలేదా..’ అని ప్రశ్నించారు. కూటమి ఏర్పాటుకు ముందే ఉప్పల్ సీటును టీడీపీ నేత దేవేందర్‌గౌడ్ కుమారుడికి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కోదండరాం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, వర్ధన్నపేట సీటును అడగకున్నా టీజేఎస్‌కు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. -
తెలుగుజాతి కలయికకు కేసీఆర్ అడ్డు
హైదరాబాద్: తెలుగుజాతి కలయికకు కేసీఆర్ అడ్డంకిగా మారారని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఎల్బీ నగర్, మలక్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. దేశాన్ని నరేంద్ర మోదీ, తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. పెద్ద మోదీ, చిన్న మోదీ(కేసీఆర్) కుమ్మక్కయి డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా రాష్ట్రాలు, దేశాలు తిరిగి అందరిని మెప్పించి హైదరాబాద్‌ను దేశానికే మణిహారంలా తీర్చిదిద్దానన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో చేసిన పని ఒక్కటీ లేదన్నారు. మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు.. ‘గత ఎన్నికల్లో గ్రేటర్లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే పదవుల కోసం 10 మంది ఎమ్మెల్యేలు మూటగట్టుకుని అమ్ముడు పోయారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు చరిత్ర హీనులుగా మిగిలి పోతారు’ అని చంద్రబాబు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రజాకూటమికే పట్టం కట్టనున్నారని బాబు జోస్యం చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌కు మద్దతుగా హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్‌బీ కాలనీలో రోడ్‌షోల్లో ప్రజాగాయకుడు గద్దర్, మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్‌తో కలసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌బీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో గతి తప్పిన పాలనను గాడిలో పెట్టే నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి తాను ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు. గోద్రా అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిని తానేనని బాబు తెలిపారు. నన్ను తిడితే వారికే నష్టం.. అభివృద్ధిని అడ్డుకుంటున్నానని కేసీఆర్ తనను విమర్శిస్తున్నారని, అయితే ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని చంద్ర బాబు ప్రశ్నించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావటం లేదని, తనను తిడితే వారికే నష్టం కలుగుతుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 37 ఏళ్లు ఒకరిపై ఒకరు పోరాడుకున్నామని, ఇప్పుడు దేశం కోసం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కలసి పనిచేస్తున్నామని తెలిపారు. మలక్‌పేట రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో బ్యాంకుల్లో, ఏటీఎంలో డబ్బుల్లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కేసీఆర్, కేటీఆర్ తనను తిట్టే పరిస్థితికి వచ్చారని, మోదీకే భయపడని తాను కేసీఆర్‌కు భయపడతానా అని అన్నారు. ఫౌంహౌస్ నుంచి పరిపాలన చేస్తున్న కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఫాంహౌస్‌కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెత్తనం కోసం కాదని.. కేవలం సేవ చేయడానికే వచ్చానని పేర్కొన్నారు. -
ఉద్దండుల నల్లగొండ..ఎగిరేది ఏ జెండా?
సాయుధ పోరు నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు.. అడుగడుగునా నల్లగొండ జిల్లా రాజకీయ చైతన్య ఖిల్లా. 12 నియోజకవర్గాలతో కూడిన ఈ జిల్లా.. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ను సమానంగా ఆదరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 5, సీపీఐ 1 స్థానం గెలవగా, టీఆర్ఎస్ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇక్కడి వారే కావడం, ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న ఈ జిల్లాపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కుల, వర్గ సమీకరణలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు. కేసీఆర్ వ్యూహాలకు చెక్‌పెట్టి జిల్లాపై పట్టును నిలుపుకునేందుకు కాంగ్రెస్ సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము నెగ్గడంతో పాటు తమ వర్గం అభ్యర్థులను గెలిపించుకోవడం జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి అగ్ర నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారింది. తుంగతుర్తి: పోటీ జబర్దస్తీ తుంగతుర్తిలో తాజా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్) మరోసారి పోటీపడుతున్నా రు. తెలంగాణ సెంటిమెంట్‌తో గత ఎన్నికల్లో కిశోర్ స్వల్ప మెజా ర్టీతో గెలుపొందారు. గురజాల–మానాయికుంట బ్రిడ్జి నిర్మాణం, సంక్షేమ పథకాలు, తిరుమలగిరి, మోత్కూరును మున్సిపాల్టీలుగా చేయడం తన విజయానికి కలిసి వస్తాయన్న నమ్మకంతో కిశోర్ ఉన్నారు. అయితే, నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ ప్రచారానికి రావడం లేదు. కాగా, ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. తన విజయానికి దోహదపడుతుందనే ధీమాతో అద్దంకి దయాకర్ ఉన్నారు. తుంగతుర్తికి సాగు నీళ్లు తీసుకురాకపోవడాన్ని ప్రచార అస్త్రంగా చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో బంధుగణం భారీగా ఉండటం, గతంలో ఓడిపోయాననే సానుభూతితో గెలుపొందుతాననే ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ వడ్డేపల్లి రవి ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారు. సూర్యాపేట: ముగ్గురి పోటీతో ఉత్కంఠ రాజకీయ చైతన్యానికి మారుపేరైన సూర్యాపేటలో మూడు ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. ఆపద్ధర్మ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి (టీఆర్ఎస్), మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్), సంకినేని వెంకటేశ్వరరావు (బీజేపీ) మధ్య పోటీ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులు, సూర్యాపేట జిల్లా ఏర్పాటు, మెడికల్ కాలేజీ వంటి అంశాలు తనకు మేలు చేస్తాయనే ధీమాతో జగదీశ్‌రెడ్డి ఉన్నారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా స్వల్ప మెజారిటీతో గెలిచిన ఆయన.. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కావడంతో భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించిన పటేల్ రమేశ్‌రెడ్డి తొలుత బెట్టుచేసినా ఆ తర్వాత కలిసిరావడంతో దామోదర్‌రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. ఇక, గత ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచిన సంకినేని.. తన అంగ, ఆర్థిక బలాలతో ప్రత్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ముగ్గురిలో పేట ప్రజానీకం ఎవరిని ఎన్నుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. జనం గుండెచప్పుడు - ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాలపై జిల్లాలోని రైతుల్లో సానుకూలత ఉంది - భూములున్న వారికి ప్రభుత్వం రైతుబంధు కింద డబ్బులు పంపిణీ చేస్తోందని, భూమి లేని పేదలైన తమకు ఏమీ ప్రయోజనం లేదని వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు అంటున్నారు - వృద్ధాప్య పింఛన్‌ను రూ.1,000, వికలాంగ పింఛన్‌ను రూ.1,500కు పెంచడంపై వృద్ధులు, వికలాంగులు ఆనందంగా ఉన్నారు - నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ స్థానాల్లో నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్న ముస్లింలలో 12 శాతం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది - శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు అక్కడి నుంచి డిండి ప్రాజెక్టుకు నీళ్లను తరలించేందుకు చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం పనులు త్వరగా పూర్తి కావాలని రైతులు కోరుకుంటున్నారు - ప్రజా కూటమి తరఫున చంద్రబాబు ప్రచారం నిర్వహించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది - పాతికేళ్ల తర్వాత తొలిసారిగా మూసి నది నీళ్లు రెండు పంటలకు ఇవ్వడంపై సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాల్లో కొంత వరకు సానుకూలత ఉంది. నల్లగొండ: ఎవరికో దండ? నల్లగొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్), కంచర్ల భూపాల్‌రెడ్డి (టీఆర్ఎస్) మధ్య రసవత్తరమైన పోరు జరుగుతోంది. తీవ్ర పోటీ ఉన్నా.. ఇక్కడి నుంచి వరుసగా ఐదోసారి గెలిచేందుకు వెంకట్‌రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నా రు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటుబ్యాంకు ఉంది. గతంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన కోమటిరెడ్డి ముఖ్య అనుచరులు మళ్లీ తిరిగి పాత గూటికి చేరడంతో వెంకట్‌రెడ్డి పుంజుకున్నారు. నిర్ణయాత్మకమైన ముస్లింల ఓట్లు ఈసారి చీలనుండడం ఆయనను కలవరపెడుతోంది. గత నాలుగు దఫాలుగా నియోజకవర్గంలో చేసిన పనులు, సా ధించుకున్న మాస్ లీడర్ ఇమేజ్ ప్లస్ కా నుంది. గత ఎన్నికల్లో స్వతంత్రుడిగా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డిపై కొంత సానుభూతి ఉంది. నాలుగుసార్లు కోమటిరెడ్డిని గెలిపించారని, తనకు ఒక చాన్స్ ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘ఎర్ర’కోటలో ఎవరికి చోటు? సీపీఐ కంచుకోట దేవరకొండలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ (టీఆర్ఎస్), బాలునాయక్ (కాంగ్రెస్) తలపడుతున్నారు. 2014లో సీపీఐ నుంచి గెలిచి ఆపై టీఆర్ఎస్లో చేరిన రవీంద్రకుమార్.. ఈసారి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి గెలిపిస్తాయని నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సైతం చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండడం, సీపీఐ కేడర్ కలిసిరావడంతో గెలుపుపై బాలునాయక్ ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి 4,216 ఓట్ల తేడాతో ఓడిపోయిన బిల్యానాయక్ ఇటీవల రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ, కూటమి నుంచి టికెట్ దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. ఇది బాలునాయక్‌కు కొంత ప్రతికూలం కానుంది. భువనగిరి: కోటలో గెలుపు వేటగాళ్లు కాకతీయ రాజుల కోట భువనగిరిలో తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి (టీఆర్ఎస్), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. టీడీపీ సీనియర్ నేత ఉమామాధవరెడ్డి కొంత కాలం కింద టీఆర్ఎస్లోకి చేరడంతో శేఖర్‌రెడ్డి బలం కొంత పెరిగింది. మూసీ ప్రాజెక్టు కింద బునాదిగాని కాలువను వెడల్పు చేయడంతో పంటలకు నీటిసరఫరా పెరగడం ఆయనకు కలిసొచ్చే అంశం. బోర్లు, వాటర్ ఫిల్టర్ల ఏర్పాటు, పేద విద్యార్థులకు చదువులు చెప్పించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అనిల్‌కుమార్‌రెడ్డి పేరుతో కొత్త ముఖాన్ని బరిలోకి దించింది. ఈయన టీఆర్ఎస్కు గట్టి పోటీనిస్తున్నారు. ఇక, యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా రెండోసారి పొటీ చేస్తున్న జిట్టా బాలకృష్ణారెడ్డికి ఈసారి బీజేపీ మద్దతునిస్తోంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఈయనపై కొంత సానుభూతి ఉంది. హుజూర్నగర్: బిగ్ ఫైట్ హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. శానంపుడి సైదిరెడ్డి (టీఆర్ఎస్) నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే సీఎం పదవికి పోటీలో ఉంటారనే ప్రచారంతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఆయనకు కలిసొచ్చే అంశాలు. పీసీసీ చీఫ్ బాధ్యతల కారణంగా ఆయన ప్రచారంలో కొంత వెనకబడ్డారు. అయినా, పోలింగ్‌కు రెండు రోజుల ముందు రంగంలో దిగి పరిస్థితులను అనుకూలం గా మార్చుకుంటారనే పేరుంది. ఎన్ఆ ర్‌ఐ అయిన సైదిరెడ్డి కొత్త ముఖమైనా.. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, రైతు ల నుంచి ఆదరణ లభిస్తుండడం ఆయనకు ఊపునిస్తోంది. ఈయనిక్కడ తం డ్రి పేరుపై సేవలందిస్తున్నారు. రాజకీ య అనుభవం లేకున్నా.. నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగణం ఉంది. మునుగోడు: ఎవరి తోడు? మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (టీఆర్ఎస్), ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్) హోరాహోరీ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో బలహీన ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో సునాయాసంగా గెలిచిన ప్రభాకర్‌రెడ్డి..ఈసారి రాజగోపాల్‌రెడ్డి రూపంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని ప్రచారం సాగిస్తున్నారు. ఇక, అసెంబ్లీలో అడుగుపెట్టాలనే చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి రాజగోపాల్‌రెడ్డి తొలిసారి ఇక్కడ పోటీకి దిగారు. ఎంపీ, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయనకు నియోజకవర్గంపై పట్టుండటం సానుకూల అంశం. నకిరేకల్: పాతకాపుల బరి ఒకనాటి కమ్యూనిస్టుల కంచుకోట, మినీ పశ్చిమబెంగాల్‌గా పేరొందిన నకిరేకల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పో టీ నువ్వానేనా అన్నట్టుంది. గెలిస్తే మంత్రిని చేస్తానని ఇటీవల సీఎం కేసీ ఆర్ హామీ ఇచ్చారనే ప్రచారంతో తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (టీఆర్ఎస్) ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్) గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఈయన గెలుపును కోమటిరెడ్డి బదర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆలేరు: యాదగిరీశుడిపైనే భారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ్మస్వామి నిలయమైన ఆలేరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి (టీఆర్ఎస్) ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను నమ్ముకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ చూపిన చొరవ టీఆర్ఎస్కు కలిసి రానుంది. ఇక్కడి గుండాల మండలం జనగాం జిల్లాకు వెళ్లిపోవడం కొంత ఇబ్బందికరం. తపాస్‌పల్లి నీళ్లు రాజపేట మండలానికి కాకుండా సిద్దిపేటకు తరలించారనే చర్చ ఉంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత, గతంలో చేసిన పనులు, పరిచయాలతో గెలుపే లక్ష్యంగా భిక్షమ య్య (కాంగ్రెస్) ప్రచారం చేస్తున్నారు. ఆయనకు కొంత వరకు బీసీ ఓట్లు ప్లస్ కానున్నాయి. ఇక్కడ నాలుగుసార్లు గెలి చిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిం హులు (బీఎల్ఎఫ్) మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన కొంత వరకు పోటీ ఇవ్వనున్నారు. రెండు పార్టీల ‘సాగర్’ మథనం కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో మమేకమైపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. సీఎల్పీ నేతగా పనిచేయడం వల్ల జానారెడ్డి ప్రజలకు కొంత దూరమయ్యారనే ప్రచారం ఉంది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నోముల నర్సింహయ్యకు బీసీల మద్దతు కొంతవరకు ఉండటం అనుకూలాంశం. జానారెడ్డికి దశాబ్దాలుగా వెన్నుదన్నుగా నిలిచిన ద్వితీయ శ్రేణి ముఖ్యనేతలు టీఆర్ఎస్లో చేరడం కలిసొచ్చే అంశం. బీజేపీ అభ్యర్థి నివేదితరెడ్డి చీల్చనున్న ఓట్లు వీరి గెలుపోటములను నిర్దేశిస్తాయని అంచనా. కోదాడ: ధాటిగా పోటీ రాష్ట్ర సరిహద్దులో ఉన్న కోదాడలో పీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి, తాజా మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య యాదవ్ (టీఆర్ఎస్) నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. ఈ స్థానాన్ని నిలుపుకోవడం ఉత్తమ్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఉత్తమ్‌తో పాటు ఆయన భార్య నియోజకవర్గానికి దూరమయ్యారనే వాదన ఉంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగా టీడీపీ టికెట్ లభించక బొల్లం మల్లయ్య యాదవ్ చివరిక్షణంలో టీఆర్ఎస్లో చేరి టికెట్ పొందారు. గతంలో రెండుసార్లు ఓడిపోయారనే సానుభూతి ఆయనపై ఉంది. బీసీల మద్దతు కలిసిరావచ్చు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి శశిధర్‌రెడ్డి రెబల్‌గా తప్పుకున్నా.. మల్లయ్యకు ప్రచారంలో సహకరించడం లేదు. ఇక్కడి ఫలితంపైనా అంతటా ఆసక్తి నెలకొంది. మిర్యాలగూడ: పోటాపోటీగా.. వ్యాపార కేంద్రమైన మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతుల భాస్కర్‌రావు (టీఆర్ఎస్), ఆర్.కృష్ణయ్య (కాంగ్రెస్) బరిలో నిలిచారు. జానారెడ్డి అనుచరుడైన భాస్కర్‌రావు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటే టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తదితరులు సహకరిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆర్.కృష్ణయ్యకు చివరి నిమిషంలో టికెట్ రావడంతో ప్రచారంలో కొంత వెనకబడ్డారు. రాష్ట్రంలోని వివిధ బీసీ కుల సంఘాల నేతలు మిర్యాలగూడలో తిష్టవేసి ఆయన గెలుపునకు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన అమరేం దర్‌రెడ్డి కూడా కృష్ణయ్యకు మద్దతు తె లుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ కుమారుడు ధిరావత్ స్కైలాబ్ స్వతంత్రంగా పోటీ చేస్తుండడంతో గిరి జనుల ఓట్లు చీలి..కాంగ్రెస్ ఓట్లకు గం డిపడొచ్చు. గతంలో 3సార్లు ఇక్కడ గెలి చిన సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు. ఇంకో ఐదారేళ్లుండాలె.. ఎడారిలో గిన్నిగిన్ని నీళ్లు పడేటోళ్లకు ఇబ్బందిగా ఉంటది గానీ నీళ్లు ఉన్నోళ్లకి మాత్రం పంటలు ఫుల్లు. 24 గంటలు కరెంట్ ఇచ్చుడు మేలు. ఇంతకు ముందు ఘోరమైన పరిస్థితి ఉండేది. మూడు గంటల కరెంట్ వల్ల ఏమైతది. ఆ వట్టి మడి పట్టాలంటే కాసేటి నీళ్లు తాగతదా? రైతుబంధు వచ్చింది. చచ్చిపోయినోళ్లకు రైతుబీమా వచ్చింది. ఆసామికి ఎలాంటి ఢోకా లేదు. ఇంకో ఐదారు సంవత్సరాలు ఈ సర్కారుంటే రైతులు కొలుకుంటరు ఇగ. – బీ మాధవరెడ్డి, దీపకుంట, నల్లగొండ మా గురించి ఆలోచించాలి పిల్లలకు కొలవులున్నయని పింఛన్ ఆపేశారు. కొడుకు ఉద్యోగం చేసుకుంటూ ఏడో ఉంటడు. వాడి ఇంటి కిరాయికి, పిల్లల చదువులకే వాడి సంపాదన సరిపోదు. ఇగ మాకేం ఇస్తడు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మా ఇద్దరి (భార్యభర్తలు)కి పింఛన్ వచ్చేది. ఇప్పుడు ఇవ్వకపోతే కష్ట మైతోంది. సర్కారు మాసొంటోళ్ల గురించి ఆలోచించాలె. మాకు కూడా పింఛన్ ఇస్తే సర్కారుకు రుణపడి ఉంటాం. – ఎరుకుల పెద్దులు, పర్వతగిరి, కనగల్ జర మమ్మల్నీ చూడుండ్రి భూమి ఉన్నోళ్లకు ఎకరానికి రూ.4 వేలు చొప్పున ఇస్తున్రు. మోటార్లకు కరెంట్ బిల్లులు లేవు. ఇవన్నీ వాళ్లకే దక్కుతుంటే కూలీ చేసే మాలాంటోళ్లు ఎప్పుడూ వెనకబడాల్నా సారూ! మా అసోంటోళ్లకు కూడా ఎకరమైనా ఇస్తే ఆ కేసీఆర్ సారు మీద అభిమానాన్ని జీవితాంతం యాద్ జేస్కుంటం. తమామ్ లేనోడ్ని ఇంకా వెనకపడేస్తురు కాదు.. పైకి తీసుకురావాల్నె. మా బతుకులూ బాగుండాలె.. – నిర్మల, చండూరు, కార్మికురాలు -
కొత్త ఎ‘జెండా’
వనపర్తి: గత ముప్పై ఏళ్లుగా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ఈసారి జత కట్టాయి. ప్రజా కూటమిగా ఏర్పడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అన్ని పార్టీల జెండాలు పట్టుకోలేక.. అన్నింటినీ కలిపి ఒకే జెండాగా కుట్టించారు. ఈ జెండాలతో వనపర్తి ప్రజాకూటమి అభ్యర్థి చిన్నారెడ్డికి మద్దతుగా కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. -
కూటమికి విరుగుడు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రత్యేక ఎన్నికల వ్యూహం సిద్ధం చేసింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా ప్రణాళిక రూపొందించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంద సీట్లలో గెలుపే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. ప్రజాకూటమి నుంచి పోటీ ఉందని భావించే సెగ్మెంట్లలో ఈ వ్యూహానికి మరింత పదునుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి వ్యూహాలకు దీటుగా పోల్ మేనేజ్మెంట్ ఉండేలా టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆదేశాలిచ్చారు. ఒక్కో సెగ్మెంట్ వారీగా వ్యూహం ఎలా ఉండాలనేది వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ అధిష్టానం ముఖ్యులు రంగంలోకి దిగారు. ప్రజాకూటమి ప్రభావం ఉందని భావించే సెగ్మెంట్లలో ప్రత్యేక వ్యూహం అమలు చేయడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్న సీట్లను గెలుచుకునే విషయంలో గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 34 అసెంబ్లీ స్థానాలు కీలకం కానున్నాయి. దీంట్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు టీఆర్ఎస్ బూత్ స్థాయిలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉంది. అసంతృప్తులకు, అసమ్మతివాదులకు బుజ్జగింపుల ప్రక్రియను త్వరగా పూర్తి చేసింది. సోషల్ మీడియా ప్రచారంలోనూ ఇదే పంథా వ్యవహరించింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అమలు చేసిన ‘వంద ఓటర్లకు కమిటీ’వ్యూహాన్ని గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అమలు చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల మూడు నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేలా చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను, అభ్యర్థి విజయాలను... ఆయా నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరుకు చేరవేయడమే లక్ష్యంగా ‘వంద ఓటర్లకు కమిటీ’వ్యూహం అమలు చేయనున్నారు. ఇప్పటికే బూత్ స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ కమిటీ కంటే మెరుగైన పోల్ మేనేజ్మెంట్ ఉండేలా కొత్త విధానం ఉండనుంది. వంద మంది ఓటర్లే ఉండటంతో వీరు కచ్చితంగా పోలింగ్ బూతుకు వచ్చేలా, టీఆర్ఎస్కు మద్దతు తెలిపేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదేశించారు. బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఇదే వ్యూహం అమలవుతోంది. ప్రచారంపై అధినేత సమీక్ష... కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శనివారం విరామం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సరళిపై సమీక్షించనున్నారు. నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులను అభ్యర్థులకు వివరించి తుది వ్యూహాలను ఎలా అమలు చేయాలో ఆదేశించనున్నారు. ఆదివారం నుంచి మళ్లీ ప్రచారం మొదలుకానుంది. గడువు ముగిసే డిసెంబర్ 5 వరకు వరుసగా ప్రచారం నిర్వహించనున్నారు. గజ్వేల్ బహిరంగ సభతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. నలుగురిపై వేటు.. టీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా, ఇతర పార్టీ తరుఫున పోటీ చేస్తున్న నలుగురు నేతలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. గడ్డం వినోద్ (బెల్లంపల్లి), గజ్జల నగేశ్ (కంటోన్మెంట్), జలంధర్‌రెడ్డి (మక్తల్), శంకర్ (షాద్‌నగర్)ను సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన జారీ చేసింది. పరేడ్‌గ్రౌండ్‌లో హైదరాబాద్ నగర సభ! నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్ హైదరాబాద్‌లోని సెగ్మెంట్లకు కలిపి ఒకే సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై అస్పష్టత వీడటంలేదు. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ కలిసి ఉమ్మడిగా పీపుల్స్ ఎజెండా పేరుతో కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించాయి. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో మేనిఫెస్టోను ప్రకటిస్తారని తెలిసింది. -
తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజాకూటమి తమ కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)లో భాగంగా పీపుల్స్ ఫ్రంట్–పీపుల్స్ ఎజెండా పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు విలేకరులతో మాట్లాడారు. తమది మహాకూటమి కాదని ప్రజాకూటమి అని ఉత్తమ్ చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరించిన అంశాలతో కూడిన ఎజెండాను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎజెండా అమలు కమిటీ కన్వీనర్‌గా కోదండరాం ఉంటారని, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ నేతలు సభ్యులుగా ఉంటారన్నారు. కేబినెట్ హోదాలో కోదండరాం ఎజెండా అమలు కోసం పనిచేస్తారని వివరించారు. ఏకకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కుటుంబంలో అర్హులందరికీ పింఛన్ ఇస్తామన్నారు. పాలనా రంగంలో మార్పులు తెస్తాం: కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ, అవినీతిపూరిత పాలన అంతమొందించడానికి పాలనా రంగంలో మార్పులు తెస్తామని కోదండరాం చెప్పారు. అమరవీరుల ఆకాంక్షలే తమ ఎజెండా అన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తామని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు ప్రాధాన్యత పెంచుతామన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరుగుతోందని, జిల్లా కేంద్రంగా కూడా అభివృద్ధి జరగాలని, ఉపాధి లభించాలని, అందరికీ అభివృద్ధి దక్కాలని తాము కోరుకుంటున్నామన్నారు. డిసెంబర్ 12 తర్వాత తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 51 నెలల పాలనలో కేసీఆర్ విస్మరించిన రంగాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చామని, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని ఎల్. రమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బోర్డులను పటిష్టం చేస్తామన్నారు. ప్రజాఫ్రంట్ మేనిఫెస్టోలోని అంశాలు పాలనా రంగంలో మార్పులు - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలపట్ల తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే విధానాలు, నిర్ణయాలు. - కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం. - గత నాలుగేళ్లలో భారీ కాంట్రాక్టుల రూపకల్పన తీరుపై, కాంట్రాక్టుల అవార్డులపై పునర్విచారణ. - కాలపరిమితిని అనుసరించి విధిగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ, రాజకీయ కారణాలతో సర్పంచ్‌లను సస్పెన్షన్ చేయకుండా చట్టసవరణ. - స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బలోపేతం. జిల్లాలు, జోనల్ వ్యవస్థల సమీక్ష. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం - అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అన్ని ఉద్యమ కేసుల ఎత్తివేత. సంవత్సరంలోగా అమరులకు స్మృతి వనం. - తొలి, మలిదశ ఉద్యమకారులకు గుర్తింపు. ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం, పింఛన్ సౌకర్యం. ఉపాధి/ఉద్యోగం - ఏటా ఉద్యోగ కేలండర్. మొదటి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు. - పాలిటెక్నిక్, డిగ్రీ ఆపైన చదువుకున్న నిరుద్యోగులకు నెలవారీ నిరుద్యోగ భృతి. - ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతన ప్రాతిపదికన జీతాల సవరణ. - ప్రభుత్వ ఉద్యోగులకు సీసీఎస్‌కు బదులుగా పాత పింఛన్ విధానం. త్వరలోనే పీఆర్సీ ప్రకటన అమలు. సాంప్రదాయిక వృత్తులు - ఆర్థిక వ్యవస్థకు భరోసా ఇవ్వగలిగే రీతిలో వృత్తుల ఆధునీకరణ, శిక్షణ, పనిముట్ల అందజేత. - ప్రతి వృత్తికి విడిగా ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు, రాయితీలు. మార్కెట్‌తో అనుసంధానం. - పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. గల్ఫ్ కార్మికులు - ప్రైవేటు రిక్రూటింగ్ ఏజెన్సీలు రద్దు. ప్రభుత్వ సంస్థల ద్వారానే రిక్రూట్మెంట్, శిక్షణ. - విదేశాల్లో ఇబ్బందులు పడే కార్మికుల సహాయం కోసం ప్రత్యేక ఎన్నారైశాఖ. - హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్ ఏర్పాటుకు కృషి. - వైద్య బీమా, ప్రమాద బీమా. భూసేకరణ విధానం - నాలుగేళ్లలో జరిగిన అన్ని భూసేకరణలపై సమీక్ష. పెండింగ్‌లో ఉన్న వాటిపై 8 నెలల మారటోరియం. - నష్టపరిహారం, సహాయ పునరావాస విధానాల రూపకల్పన, అమలులో మానవీయకోణం. - 2016 భూసేకరణ చట్టంలోని అమానవీయ, రైతు వ్యతిరేక అంశాల తొలగింపు. విద్య - విద్యా రంగానికి బడ్జెట్ పెంపు, పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వహణ, నియంత్రణకు ప్రత్యేక కమిషనరేట్. - ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థులందరికీ రెసిడెన్షియల్ విద్య. - సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు. - ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ/జూనియర్ కాలేజీ. నియోజకవర్గం కేంద్రంలో పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాల. జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్. - మహిళా, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు. మౌలిక సదుపాయాలు - 100 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్. - టెలిస్కోపిక్ బిల్లింగ్ విధానం రద్దు. పాత విధానంలోనే బిల్లులు. - ఇంటిపన్ను హేతుబద్ధీకరణ. ప్రతి గ్రామానికీ పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం. - హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలందరికీ సొంత ఇళ్లు. శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధి. సాంస్కృతిక రంగం - జానపద, సంప్రదాయ కళల పరిరక్షణ, గుర్తింపు, గౌరవ వేతనం. - తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, గౌరవ వేతనం. - చారిత్రక కట్టడాలు, అవశేషాలు, ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, - తెలంగాణ సినీరంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ. తెలంగాణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు. పారిశ్రామిక రంగం - పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులు. పారిశ్రామిక కాలుష్యాన్ని అరికట్టడం. - ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు విధానం. సింగరేణికి అనుబంధంగా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహం. కొత్త ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కు నో. - గృహ, కుటీర పరిశ్రమలకు ప్రత్యేక కార్పొరేషన్. - అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు. - జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు. వైద్యం/ఆరోగ్యం - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల పటిష్టం. అంగన్వాడీ, ఆశావర్కర్లు పీహెచ్‌సీలకు అనుసంధానం. - పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌లు, ఉచిత వైద్య పరీక్షలు. - ప్రతి నియోజకవర్గ కేంద్రంలో లేబర్ రూంలు, ఆపరేషన్ థియేటర్ స్పెషలిస్టుల నియామకం. æ ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ హెల్త్‌కేర్ మిషన్. - 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి వచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు. సమానత్వం–సామాజిక న్యాయం–సాధికారత - కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల అమలు. పేదలకు భూమిపై హక్కు. భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ. - ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పటిష్టంగా అమలు. బీసీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు. - మైనారిటీల సంక్షేమం కోసం సచార్, సుధీర్ కమిటీల నివేదికల అమలు. - కేంద్రంపై ఒత్తిడి చేసి ఎస్సీ వర్గీకరణ అంశం త్వరితగతిన అమలు. - అర్హులైన ఎస్సీ, ఎస్టీల గృహావసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. - దివ్యాంగులకు జిల్లా కేంద్రాల్లో జూనియర్ కాలేజీ స్థాయి వరకు రెసిడెన్షియల్ విద్య. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, ఈబీసీలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్లు. - మహిళలకు పావలా వడ్డీ రుణాలు. బీడీ కార్మికులు, అసంఘటితరంగ మహిళలకు వేతనాల పెంపు. - అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కనీస వేతన చట్ట సవరణ. - ఆసరా పథకం లబ్ధిదారుల వయసు 65 నుంచి 58కి కుదింపు. వృద్ధులకు నెలకు రూ. 2 వేలు, దివ్యాంగులకు రూ. 3 వేల పింఛన్. - అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్,వైద్యం, గృహవసతి, సంక్షేమానికి ప్రత్యేక నిధి. - ఐదేళ్లలోపు ప్రాక్టీస్ చేస్తున్న లాయర్లకు ప్రతి నెలా స్టైపెండ్. - యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి. - వయోవృద్ధుల ప్రయాణాల్లో 50 శాతం రాయితీ, ఉచిత వైద్య సదుపాయం, మానసికోల్లాస కేంద్రాల ఏర్పాటు. వ్యవసాయం - జల విధానం ప్రకటన. గొలుసుకట్టు చెరువుల మరమ్మతు, సమర్థ నిర్వహణ. సూక్ష్మ, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు ఊతం. భారీ ప్రాజెక్టులు వేగంగా పూర్తి. - విత్తనం వేసే సమయంలోనే పంటలకు మద్దతు ధర ప్రకటన. - రూ. 2 లక్షలలోపు ఏకకాల రుణమాఫీ, రైతులకు సకాలంలో వడ్డీలేని రుణాలు. - ధరల స్థిరీకరణ, మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం రూ. 10 వేల కోట్ల నిధి. - రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏటా రూ. 10 వేలు. - ముంపు బాధితులకు తక్షణ సాయం. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులకు జీవిత బీమా. -
ఒకేసారి 2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: అసమానతలు లేని తెలంగాణ సాధన, పరిపాలనలో మార్పు, అమరులు, ఉద్యమ కారుల ఆకాంక్షల సాధన ప్రాతిపదికగా తెలంగాణ జన సమితి (టీజేఎస్) తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. పారదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత సుపరిపాలన ధ్యేయంగా తాము పని చేస్తామని.. విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రతిరోజు ఉదయం ఒక గంటపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా పౌర సమాజ సూచనలు, సలహాలు తీసుకునేలా పరిపాలన చేస్తామని పేర్కొంది. సామాజిక న్యా యం, సాధికారత, అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి ప్రధానాంశాలుగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం పార్టీ అధ్యక్షుడు కోదండరాం విడుదల చేశారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ.. - రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంటరుణాల మాఫీ - అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు. ఉపాధి లభించే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి - ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎత్తివేత - వాస్తవ కౌలుదారులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం - తెలంగాణ మ్యూజియంగా ప్రగతిభవన్ - పేదరైతులను నిరాశ్రయులను చేస్తున్న 2016 భూసేకరణ చట్టం తొలగింపు, 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు - ప్రైవేటు యూనివర్సిటీల చట్టం రద్దు - రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఆర్టికల్ 8 రద్దుకు కృషి - అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల కోసం వారానికి మూడు గంటల కేటాయింపు - ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మీడియం బోధన. ప్రతి మండలంలో ఐటీఐ ఏర్పాటు - పేద, మద్య తరగతి ప్రజల ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చడానికి ఢిల్లీ తరహాలో ‘బస్తీ క్లినిక్’ల ఏర్పాటు - జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు - రిజర్వ్ పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్ - గ్రామ పంచాయతీ సిబ్బంది రెగ్యులరైజేషన్ - హైదరాబాద్ నగర ట్రాఫిక్ అధ్యయనం, రోడ్ల మరమ్మతులు - గృహనిర్మాణం కోసం బీపీఎల్ కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లింపు - పేద కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 100–200 యూనిట్ల వరకు సగం ధరకే విద్యుత్తు. గృహ, వ్యాపార, కుటీర పరిశ్రమలు, దోభిఘాట్, హెయిర్సెలూన్లకు విద్యుత్‌చార్జీల తగ్గింపు - సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకం, కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి నిరాకరణ - చేనేత కార్మికులకు 8 గంటల పనిదినం. లేబర్ యాక్టు అమలు - గీత కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.6లక్షల జీవిత బీమా - గీత కార్మికులకు గృహానిర్మాణ పథకం కింద రూ.5 లక్షలు - పెట్రోల్, డీజీల్, గ్యాస్ రేట్లపై రాష్ట్ర పన్నులు తగ్గింపు - ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు - బీసీ, ముస్లిం మైనార్టీల కోసం సబ్‌ప్లాన్ - అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు 3 నెలల పాటు ఆర్థిక సహాయం - వికలాంగుల పింఛను రూ.2500కు పెంపు - అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా అమరులకు స్మృతివనం - సీపీఎస్ విధానం రద్దు. వేతన పెంపు కమిటీ సిఫా ర్సులు అమలు - కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత - బెల్టుషాపుల మూసివేత. పర్మిట్ రూముల రద్దు - 65 సంవత్సరాల పైబడిన జర్నలిస్టులకు పెన్షన్ - బీడీ కార్మికులకు నెలకు రూ.3వేల పెన్షన్. ఎన్నికల అధికారిపై ఫిర్యాదు.. స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి చింతా స్వామిని తప్పుదారి పట్టించిన ఎన్నికల అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కోదండరాం తెలిపారు. నామినేషన్ సమయంలో రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థిని ఒక్కరు, రికగ్నైజ్డ్ పార్టీ అభ్యర్థిని పది మంది బలపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే స్టేషన్ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి పది మందిని తీసుకెళ్లినప్పటికీ.. అక్కడి ఎన్నికల అధికారి ఒక్కరు బలపరిస్తే సరిపోతుందని చెప్పారని తెలిపారు. దీంతో ప్రస్తుతం తమ పార్టీ అభ్యర్థి నామినేషన్ గందరగోళంలో పడిందన్నారు. ముందు మీరు..తర్వాతే మేం! ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమకు ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో కేటాయించకపోగా.. వరంగల్ ఈస్ట్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లలో రెండు స్థానాలను ఇస్తామని చెప్పి, వాటిని కూడా తేల్చలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తమకు ఇచ్చిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో నిలిపిన నేపథ్యంలో ముందుగా వారు విత్‌డ్రా చేసుకోవాలని, తర్వాతే తాము ఆ పని చేస్తామని స్పష్టంచేశారు. మంగళవారం టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. తాము కూటమి లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని, అయితే అందుకు తమ పార్టీని ఫణంగా పెట్టే పరిస్థితి తెచ్చుకోలేమని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా, ఇవాళ నష్టం జరిగినా.. రేపు కూటమి బతికే విధంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఎజెండా అమలు విషయంలో కూటమిలోని ఇతర పక్షాలు సహకరించకపోతే ఊరుకోబోమని స్పష్టంచేశారు. కూటమిని సరిగ్గా నడిపిస్తేనే ప్రజలకు లాభం జరుగుతుందని, ఈ విషయాన్ని కూటమిలో పెద్ద పక్షమైన కాంగ్రెస్ గుర్తించనంత కాలం ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. ఆ పాత్రను సరిగ్గా నిర్వహించాలంటే కాంగ్రెస్ కొంత కలుపుకొని పోయే తత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలని సూచించారు. వరంగల్ ఈస్ట్ తమకు ఇస్తామన్నందునే ఇన్నయ్యను బరిలో దింపామని కోదండరాం తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ తక్షణ ప్రయోజనాల రీత్యా మరో అభ్యర్థికి సీటు ఇచ్చిందన్నారు. ఇప్పటికీ తమకు ఇచ్చిన స్థానాలను వదిలిపెట్టకుండా వెంట పడితే ఎలా? అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందన్నారు. ఇది కూటమికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. తమకు ఇస్తామన్న మిర్యాలగూడ సీటును ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారని, ఆ విషయం తమకు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగానే ఈ విషయం చెబితే తమ పార్టీ అభ్యర్థిని నిలిపే విషయంలో ఆలోచించేవారమని పేర్కొన్నారు. -
‘అన్ని సర్వేల్లోనూ ప్రజా కూటమిదే విజయం’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజాకూమిదే గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెపుతున్నాయి.. ఈ 15 రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కూటమిదే విజయమని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇక కేసీఆర్ ఫాంహౌజ్‌కు, కేటీఆర్ అమెరికాకు పోవాల్సి వస్తదని ఎద్దేవా చేశారు. దోచుకున్న డబ్బుతో ఎన్నికను ప్రభావితం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాజీ అయిపోయాడని, ఇక మాజీగానే ఆయన ఉంటారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. మేడ్చల్ సభతో తెలంగాణలో కీలక మార్పులు ఈ నెల 23న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ఉత్తమ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4గంటలకు వారు బేగంపేటకు చేరుకొని కారు ప్రయాణం ద్వారా మేడ్చల్ చేరుకుంటారని చెప్పారు. సాయంత్రం 5 నుంచి 6గంటలకు బహిరంగ సభలో ప్రసంగం ఉంటుందన్నారు. కార్యకర్తలు అందరూ సోనియా, రాహుల్‌కు స్వాగతం పలుకాలని కోరారు. ప్రతి ఒక్కరిని సభకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కీలకమార్పులు జరుగనున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. -
ప్రచారానికి రెడీ!
సాక్షి, చెన్నై : ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రజాకూటమి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈనెల 26వ తేదీన మదురై వేదికగా జరగనున్న మహానాడుతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పు సంతరించుకోనున్నదని ఆ కూటమి వర్గాలు ప్రకటించాయి. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి కూటమి నేతలు కలసి కట్టుగా ప్రచార బాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలసి ప్రజా కూటమి ఇటీవల ఆవిర్భవించిన విషయం తెలిసిందే. తమతో దోస్తీ కట్టాలని ఇప్పటికే డీఎండీకే అధినేత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్లకు ప్రజా కూటమి నేతలు పిలుపునిచ్చి ఉన్నారు. విజయకాంత్ మాత్రం ఆ కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నా, జీకేవాసన్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మదురై వేదికగా ఈ నెల 26వ తేదీన బ్రహ్మాండ మహానాడుకు ఈ కూటమి చర్యలు చేపట్టింది. ఈ వేదిక మీద విజయకాంత్, వాసన్ ప్రత్యక్షమైన పక్షంలో రాష్ట్రంలో మెగాకూటమిగా ప్రజా కూటమి అవతరించడం ఖాయం. అయితే, ఇది సాధ్యమయ్యేనా అన్న ప్రశ్న సైతం బయలు దేరి ఉన్న వేళ గురువారం ప్రజా కూటమిలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మార్పున కు వేదికగా ఆ మహానాడు నిలవబోతున్నదని ధీమా వ్యక్తం చేయడం విశేషం. ప్రచారానికి సిద్ధం: ఈ నలుగురు నేతలు ఉదయం సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్లు, ప్రచార పర్వానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు. తదుపరి మీడియాతో నలుగురు నేతలు మాట్లాడారు. మదురై వేదికగా జరగనున్న మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకురాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి బీటలు తప్పవని వ్యాఖ్యలు చేసిన వాళ్లు,వ్యాంగ్యాస్త్రాలు సంధించిన వారికి చెంప పెట్టుగా ఈ మహానాడు నిలవబోతున్నదన్నారు. తమ కూటమి వర్గాలు సమష్టిగా ప్రజా సమస్యలపై పోరుబాటను ఉధృతం చేశారని వివరించారు. ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా కార్యక్రమాల్ని విస్తృతం చేసినట్టు పేర్కొన్నారు. తమ కూటమి ఎన్నికల ప్రచారానికి ఫిబ్రవరి ఏడో తేదీన శ్రీకారం చుట్టబోతున్నదని వివరించారు. ఆరో తేదీన పుదుచ్చేరిలో భారీ బహిరంగ సభకు చర్యలు చేపట్టామని, ఏడో తేదిన ఎన్నికల ప్రచారానికి కడలూరు వేదికగా శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. అదే రోజు నాగపట్నంలో, ఎనిమిదో తేదిన తిరువారూర్, తంజావూరుల్లో, తొమ్మిదో తేదిన పుదుకోట్టై, శివగంగైలలో ఎన్నికల ప్రచారం సాగుతుంద న్నారు. తదుపరి పర్యటనల వివరాలు ఆ సమయంలో వెలువరిస్తామని, తొలి విడత పర్యటనలో అందరూ కలసి కట్టుగానే ప్రజల్లోకి వెళ్తామని, తదుపరి ఆయా ప్రాంతాల్లో గెలుపు లక్ష్యంగా నేతలందరూ తలా ఓ వైపుగా పర్యటనలు సాగిస్తారని చెప్పారు.