సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల ఫలితాలనుబట్టి కర్ణాటక తరహా వ్యూహాన్ని అనుసరించేలా పావులు కదుపుతోంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న జాగ్రత్తల మాదిరే క్యాంపు రాజకీయాలకు దిగాలని యోచిస్తోంది. కూటమికి పూర్తి మెజారిటీ వస్తే ఫలితాలు వెలువడిన మర్నాడే ఫ్రంట్ ముఖ్యమంత్రి చేత ప్రమాణస్వీకారం చేయించాలనే నిర్ణయానికి వచ్చిన హైకమాండ్.. ఒకవేళ ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకుంటే టీఆర్‌ఎస్‌కు అడ్డుకట్ట వేసేలా ఇతర పార్టీలు, స్వతంత్రులను కూడగట్టే పనిలో నిమగ్నమైంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించడం, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అవసరమైతే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఉంటుందన్న బీజేపీ ప్రకటనల నేపథ్యంలో కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది. నయానో, భయానో వారిని దారికి తెచ్చుకునేలా పార్టీలోని కీలక నేతలు కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పార్టీలో ట్రబు ల్ షూటర్‌గా, క్యాంపు రాజకీయాల్లో సిద్ధహస్తుడిగా పేరున్న కర్ణాటక మాంత్రి డీకే శివకుమార్‌ను హైకమాండ్ రంగంలోకి దించింది. ఆయనతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలపై పట్టున్న కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ను హైదరాబాద్‌కు పురమాయించినట్లు తెలుస్తోంది.
రాహుల్ వద్దకు.. ఆ తర్వాత గవర్నర్ చెంతకు
జాతీయ మీడియా సంస్థలన్నీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం, అందుకు భిన్నంగా ప్రజాకూటమే అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పడంతోపాటు ఈసారి స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారతారని పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడం ప్రజావ్యతిరేకతకు సంకేతమని భావించిన కూటమి పక్షాలు అధికారం ఖాయమన్న ధీమాతో ఉన్నా వారిలో ఎక్కడో చిన్న సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఏ ఒక్క అవకాశం కల్పించరాదని భావిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఢిల్లీకి పిలిపించింది. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. కూటమికి పూర్తి మెజారిటీ రాకుంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? ఇండిపెండెంట్లను దారికి తెచ్చే బాధ్యత, అవసరమైతే ఎంఐఎంతో సంప్రదింపులకు ఎవరు బాధ్యత తీసుకోవాలన్న అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కూటమిపక్షాలే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఉత్తమ్‌కు రాహుల్ కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సమావేశం అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఉత్తమ్... ఎయిర్‌పోర్టు నుంచే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ రాకుంటే కూటమిపక్షాలను ఒక్కటిగా గుర్తించాలని విన్నవించారు. ముందుజాగ్రత్తల్లో భాగంగానే గవర్నర్ వద్దకు వెళ్లినట్లు ఉత్తమ్ స్వయంగా ప్రకటించారు.
రంగంలోకి పెద్దలు...
ఎన్నికల ఫలితాలకు ముందే ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగారు. ఒకవేళ ఏ పార్టీకి పూర్తిస్థాయిలో మెజారిటీ రానిపక్షంలో ఇండిపెండెంట్లతో చర్చలు, వారికి చేకూర్చే ప్రయోజనాలపై హామీలు గుప్పించి తమవైపు తిప్పుకునేలా వ్యూహాలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే డీకే శివకుమార్‌ను హైకమాండ్ హైదరాబాద్ పంపింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్‌ను గట్టెక్కించడంలో డీకే కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ శాసనసభ్యులు బీజేపీ వైపునకు వెళ్లకుండా చేయడంలో డీకే చేసిన క్యాంపు రాజకీయాలే ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడ్డాయి. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలోనే తిష్టవేసిన డీకే... టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించి పార్టీ అభ్యర్థులకు సహకరించేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేలా చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆయనతోపాటు గులాం నబీ ఆజాద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ రానుండగా అవసరాన్నిబట్టి పార్టీ సీనియర్లు అహ్మద్ పటేల్, జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ తదితరులు హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక అవసరాన్నిబట్టి పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను క్యాంపుల నిమిత్తం బెంగళూరుకు తరలించేలా సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బాధ్యతను పూర్తిగా డీకే శివకుమార్‌కే హైకమాండ్ కట్టబెట్టింది.
రెబెల్స్‌కు గాలం...
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ రెబెల్ మల్‌రెడ్డి రంగారెడ్డికి పోలింగ్‌కు ముందు రోజే వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... నారాయణపేట నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్ తరఫున పోటీ చేసిన మరో రెబెల్ అభ్యర్థి శివకుమార్‌రెడ్డితోనూ రాయబారాలు నడుపుతోంది. ఆయనతో మాట్లాడే బాధ్యతను పార్టీ సీనియర్ నేత డీకే అరుణకు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే మక్తల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జలంధర్‌రెడ్డి, వైరా నుంచి పోటీ చేసిన రాములు నాయక్, రామగుండం నుంచి పోటీ చేసిన కోరుకంటి చందర్ సహా మరో ఒకరిద్దరు నేతలతో పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దారికొచ్చిన నేతలను క్యాంప్‌కు పంపేలా ఏర్పాట్లు సైతం చేసినట్లు తెలియవచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూనే ప్రభుత్వ ఏర్పాటుకు ఏమేం చేయాలో అన్నీ చేసేలా కాంగ్రెస్ గట్టి చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment