తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పెద్ద కుట్ర పూర్తిగా వికటించింది. నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అనికాలర్ ఎగరేసే ఓ నేత, ఏ ఎండకా గొడుగు పట్టే ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయం–ఇండస్ట్రీల అవకాశవాద కలబోత ముసుగులో ఆడిన నాటకం రక్తికట్టకపోగా అసలుకే ఎసరు తెచ్చింది. ఆశించిన ఫలితమేదీ నెరవేర్చకపోగా మిణుకుమిణుకుమంటున్న వారి విశ్వసనీయతకూ పెద్ద గండికొట్టింది. తామొకటి తలిస్తే జనమొకటి తలచె అన్నట్లు ప్రజాతీర్పు వారి కుయుక్తులను చిత్తు చేసింది. బెట్టింగ్ ప్రపంచంలో ఎందరినో బోల్తా కొట్టించిన వారి ‘ఎత్తుగడ పార్ట్–2’ చివరకు చీకట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం వరకే పరిమితమైంది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఫలానా సర్వే ఏమైంది?, ఫలితం ఎందుకిలా భిన్నంగా వచ్చింది?, విపక్షాలు మరీ ఇంత ఘోరమా?’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎడతెగని సందేహాలు! దీనికి సమాధానం తెలియాలంటే వెనక్కి తిరిగి కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూస్తాయి. ఎగ్జిట్ పోల్ భ్రమ కల్పిస్తూ, సర్వే అని బుకాయిస్తూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలపై అంచనాలొక పెద్ద రాజకీయ వ్యూహం! నాన్చి నాన్చి నాడు ఈ అంచనాలను వెల్లడించడం వెనుక రాజకీయ ‘ఒత్తిళ్లు’ పనిచేసినట్లు ప్రచారం జరిగింది. ఆ గణాంకాలకు, ఇప్పు డు వెల్లడైన ఫలితాలకు పొంతన లేకపోవడాన్ని అన్వయించినప్పుడు నాటి ప్రచారం నిజమేనేమో అనిపిస్తుంది! ఇక రాబోయే ఎన్నికల్లో జనం ఇటువంటి ఎత్తుగడల్ని ముందే ‘ఛీ’కొట్టనున్నారు. అది రేపు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికలైనా వారిది ఇదే పరిస్థితి! ‘ఇక ఆక్టోపస్ పని ఔట్!’ అన్నది ప్రస్తుత జనవాణి.
గెలుపును చిన్నబుచ్చే యత్నం...
రెండోసారి అంచనాలు వెల్లడించినప్పుడు ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని, పాలక టీఆర్‌ఎస్‌కు 35 స్థానాలు వస్తాయని ‘సర్వే’క్షకుడు వెల్లడించారు. దానికితోడు ఓ అశాస్త్రీయమైన ఎర్రర్ మార్జిన్ ప్రకటించారు. పనిలో పనిగా ముందే ఓ రాయి వేసి ప్రత్యర్థి గెలిస్తే ఆ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయ త్నం ప్రారంభించారు. తాము ఆశిస్తున్నట్టు పాలకపక్షం ఓడిపోయి, కూటమి గెలిస్తే సరేసరి! ‘ఆక్టోపస్ మళ్లీ సక్సెస్!’ అని బాకా ఊదుకోవచ్చు! కూటమే ఓడి, పాలకపక్షం తిరిగి గెలిస్తే.. ఏదో ఒక సాకు ముం దే సిద్ధం చేసుకున్నట్టు, ‘ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి, డబ్బు–మద్యం–ఇంకా ఇంకా... ఏవేవో ప్రభావలుండటం వల్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతోంది, అంచనా వేయడం మాకు కష్టమవుతోంది’ అని చెప్పడం వెను క ఉద్దేశం ఇదే! ఏ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ అయినా, ఎవరు ఎటు వేస్తున్నారు/వేయనున్నారు/వేశారు అన్నదే చూస్తారు తప్ప కారణాలు వెతికి, అంచనా తమకు చాలా కష్టంగా ఉందని ‘దీనాలాప న’ చేయరు! కానీ ఇక్కడ అదే చేశారు. ‘వీరు గెలిచే మరికొందరు స్వతంత్రుల’ని కొన్ని పేర్లు చెప్పి, ‘ఇంకొన్నిటి సమాచారం కూడా ఉంది కానీ అక్కడ నా మిత్రులు పోటీ చేస్తున్నారు కనుక అవి చాలా సున్నితమైనవి, నేను పేర్లు వెల్లడించను’ అని తన పక్షపాత ధోరణిని ఆయనే బయటపెట్టారు. ఇవి కల్లబొల్లి కబుర్లని తెలిసీ పతాక శీర్షికలు చేసి/బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి సాను‘కుల’ మీడియా తరించిం దని ప్రత్యర్థి రాజకీయపక్షాల వారు విమర్శించింది కూడా ఇందుకే! ఇదంతా ఓ విశాల కుట్రలో భాగమ ని సాధారణ పరిశీలకులకు కూడా స్పష్టమైంది.
ఎందుకీ తెగింపు?
ఏది చేసినా నిర్దిష్ట ప్రయోజనాలు ఆశించే చేస్తారని ఎప్పట్నుంచో ఈ సర్వేల పెద్దమనిషికి పేరు. కాకతా ళీయంగానో, యాదృచ్ఛికంగానో 4 సార్లు నంబర్లు కలవగానే.... ఓ గొప్ప సెఫాలజిస్టని, రాజకీయ/ఎన్నికల ఫలితాల విశ్లేషకుడనే పేరు ప్రచారంలోకి వచ్చింది. తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నపుడు ‘అబ్బో! అచ్చుగుద్దినట్టొచ్చింద’ని విస్తృత ప్రచారం చేసే సాను‘కుల’ మీడియా, నంబర్లు తేడా వచ్చినప్పుడు మాత్రం కిమ్మనదు. తప్పుడు విశ్వసనీయతను ముసుగు కప్పి మరీ కాపాడుతుంది. ఎప్పుడో మళ్లీ అవసరానికి పనికొస్తారు కదా అన్నది ఉమ్మడి ప్రయోజనం కావొ చ్చు! ఈ ఎన్నికల్లో కుట్రదారులు రెండంచెల నాటకమాడారు. ప్రజాక్షేత్రంలో అయోమయం సృష్టించి కూటమికి జవసత్వాలివ్వడం ఒకటైతే... బెట్టింగ్‌లకు ఆస్కారం పెంచడం రెండోది. సోదిలో కూడా లేని కూటమి దూసుకొస్తోందని, గెలుపు దిశగా పరుగెడుతోందని తప్పుడు రాతలు రాసిన అదే సాను‘కుల’ మీడియా ఈ చిలక జోస్యాలకు విస్తృత ప్రచారం కల్పించి వేదిక సిద్ధం చేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ‘ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వ తంత్రులు గెలుస్తారు, ఇదుగో ఈ ఇద్దరివి పేర్లు...’ అని తిరుపతిలో ఆ పెద్దమనిషి వెల్లడించినది టీజర్! ఆ ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు.
నారాయణపేటలో కె.శివకుమార్‌రెడ్డి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా బోథ్‌లో అనిల్‌జాదవ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక మిగతా ఇండిపెండెంట్ల పరిస్థితి అంతే సంగతి! అంచనాల పేరిట కూటమికి సత్తువ తెచ్చే ఈ కుట్రకు తెరలేచింది మాత్రం మీడియా పెద్ద మనిషి, రాజకీయ నేతతో సదరు ‘సర్వే’క్షకుడి భోజన భేటీలో అన్నది ప్రచారం. ఇక తమ అంచనాల పార్ట్–2 నాటకం, తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం 7 గంటలకు జరిగింది. ఆ సమయంలో విలేకరుల సమావేశమనగానే ఎవరైనా ‘ఎగ్జిట్ పోల్’ వివరాలు వెల్లడిస్తారేమో అనుకుంటారు. ఎగ్జిట్ పోల్ కాదని స్పష్టం చేసిన ఆయన... తాము సర్వే కూడా ఏమీ నిర్వహించలేదనీ ప్రకటించారు. ఎందుకిలా అంకెలు తరచూ మారుతున్నాయి? అని అడిగితే ‘మా వాళ్లు ఫీల్డులో ఉన్నారు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తున్నారు...’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment