కేసీఆర్‌ 2.0.. బ్లాక్‌ బస్టర్‌ | TRS Grand Victory with 88 seats | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ 2.0.. బ్లాక్‌ బస్టర్‌

Published Wed, Dec 12 2018 4:19 AM | Last Updated on Wed, Dec 12 2018 4:34 PM

TRS Grand Victory with 88 seats - Sakshi

మందలు, మందలుగా ‘స్టార్‌ క్యాంపెయినర్లు’ దండెత్తి వచ్చినా.. ‘సింహం సింగిల్‌గా’నే పోరాడింది. కేసీఆర్‌ జపించిన సంక్షేమ మంత్రానికి పల్లెలన్నీ పోలింగ్‌ బూత్‌లకు వరుసకట్టాయి. ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ బాణం పట్టణాల్లో ప్రభంజనాన్ని సృష్టించింది. బాబుతో పొత్తు కాంగ్రెస్‌ పుట్టి ముంచింది. బాబు అండ్‌ బావ మరిదిల ఓవర్‌ యాక్షన్‌ను జనం ఛీకొట్టారు. మరోసారి కేసీఆర్‌కు జైకొట్టారు. ఒక్క ఖమ్మం జిల్లా మినహా గులాబీ రథానికి ఎక్కడా ఎదురేలేకుండా పోయింది.   

హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్‌ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా?. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది. చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు. నేను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదు. ఆయనకు పైత్యం ఎక్కువైంది. ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారు. అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారు.
    – మీడియాతో కేసీఆర్‌

తెలంగాణ గడ్డపై మళ్లీ టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడింది. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జై కొట్టిన ప్రజలు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నాయకత్వానికి అఖండ మెజార్టీతో ఆమోదం తెలిపారు. ధైర్యంగా ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకోవడం, మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేసీఆర్‌.. ఫలితాల్లోనూ అదే జోరుకు కొనసాగించారు. ప్రచారంలో అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన రాజకీయ యోధుడు మరోసారి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బకొట్టిన కేసీఆర్‌.. బీజేపీని దాదాపుగా గల్లంతు చేసినంత పనిచేశారు. తెలంగాణలో కారు జోరుకు ప్రొఫెసర్‌ కోదండరాం సార్‌ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ అఖండ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగులేదని గులాబీ దళపతి నిరూపించుకున్నారు. పదిహేను రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చిన ఒకే ఒక్కడుగా, టీఆర్‌ఎస్‌ ఏకైక స్టార్‌ క్యాంపెయినర్‌గా వాహ్వా అనిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టి.. ఆ దిశగానే పథకాలు రూపొందించారు. అందుకే.. రైతుబంధు ఆయన్ను రారాజుగా నిలిపింది. కల్యాణæలక్ష్మి ఓట్ల వర్షం కురిపించింది.

పింఛను పొందిన వారంతా బాసటగా నిలవడంతో టీఆర్‌ఎస్‌కు ఓట్ల పంట పండింది. మైనారిటీలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు మూకుమ్మడిగా అండగా నిలవడంతో గులాబీసేన తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూడబలుక్కుని కూటమిగా వచ్చినా కారు జోరు ముందు నిలవలేకపోయాయి. తెలంగాణను తామే అభివృద్ధి చేశానంటూ ప్రగల్భాలు పలికిన పచ్చపార్టీని 15 నుంచి 2 స్థానాలకే పరిమితం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ జనసమితిని.. అయ్యా మీ కో‘దండం’ అంటూ ఇంటికి పంపించేశారు. రాహుల్‌ ‘షో’ లతో ఓట్లు రాలుతాయని భావించిన కాంగ్రెస్‌ పార్టీకి చివరకు ఘోర పరాభవమే మిగిలింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 88 స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. రైతులు, పేద ప్రజల సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలతో తెలంగాణ ఉద్యమ రథ సారధి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రైతన్నలకు ఎకరాకు 4 వేల రూపాయలు ఇవ్వడం ద్వారా యావత్‌ తెలంగాణను ఫిదా చేసిన కేసీఆర్‌.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణ మాఫీ, సామాజిక పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్‌ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో ఇంకా తానే ఉన్నానని నిరూపించారు.

గత శాసనసభ ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్‌ ఆధారంగా 63 స్థానాలను నెగ్గిన టీఆర్‌ఎస్‌ ఈ సారి అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో దూకుడు ప్రదర్శించి సంఖ్యా బలాన్ని 88కు పెంచుకుంది. సీఎం కేసీఆర్‌ గజ్వెల్‌లో 58,290 ఓట్ల భారీ మెజారిటీతో గెలవగా.. సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీశ్‌ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించి.. సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ కూడా 89,009 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ నుంచి మరో 15 మంది 50 వేలకు పైగా మెజారిటీని సాధించడం గమనార్హం. అంతటా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా స్పీకర్‌ మధుసూదనాచారితో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందులాల్‌ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

ప్రజాకూటమికి పగటికలే!
కాంగ్రెస్‌ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రజాకూటమి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసింది. కేసీఆర్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు పురుడుపోసుకున్న ఈ కూటమి కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 99 (నాలుగు సీట్లలో టీజేఎస్, కాంగ్రెస్‌ స్నేహపూర్వక పోటీ) చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 19 స్థానాల్లో గెలుపొందగా, 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 8 స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్, మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ పార్టీలు కనీసం ఒక్క సీటునూ గెలవలేకపోయాయి. కేసీఆర్‌ హవా కారణంగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, కొండాసురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ఓటమి తప్పలేదు. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఏడు శాసనసభ స్థానాలను నిలబెట్టుకుని హైదరాబాద్‌ పాతబస్తీపై తన పట్టును నిలబెట్టుకుంది.

రాజేంద్రనగర్‌లో పోటీ చేయడం ద్వారా పార్టీని నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు మజ్లిస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. పార్టీ పోటీ చేసిన 118 స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌ గెలిచారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం నిర్వహించినా బీజేపీకి ఓట్లు రాలేదు. బీజేపీ ఎల్పీ నేత కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌లకు ఓటమి తప్పలేదు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ రామగుండంలో, ఇండిపెండెంట్‌ అభ్యర్థి రాములు వైరాలో గెలుపొందారు. టీజేఎస్‌ ఎక్కడా కనీస పోటీని ఇవ్వలేకపోయింది.  టీజేఎస్‌ పోటీ చేసిన చోట్లలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ దక్కింది. సీపీఎం, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ కూటమి ప్రయోగం దారుణంగా విఫలమైంది. గత ఎన్నికల్లో ఒక సీటును గెలిచిన సీపీఎం ఈ సారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

మెజారిటీ రికార్డుల మోత
50,000+ టీఆర్‌ఎస్‌ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు,ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు.
టీఆర్‌ఎస్‌ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందగా, ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. వర్ధన్నపేట నుంచి ఆలూరి రమేశ్‌ (టీఆర్‌ఎస్‌) 99,240 ఓట్లు, మేడ్చల్‌ నుంచి  జీహెచ్‌ మల్లారెడ్డి,(టీఆర్‌ఎస్‌) 87,990, బహదూర్‌పుర నుంచి మౌజం ఖాన్‌ (మజ్లిస్‌) 82,518 ఓట్లు, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌)80,264, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు (టీఆర్‌ఎస్‌) 73,698, హుస్నాబాద్‌ నుంచి సతీష్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌) 70,530 ఓట్లు,  దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్‌ఎస్‌) 62,500, జగిత్యాల నుంచి ఎం.సంజయ్‌కుమార్‌(టీఆర్‌ఎస్‌) 61,185 ఓట్లు, నారాయణ్‌ఖేడ్‌ నుంచి మహారెడ్డి గోపాల్‌ రెడ్డి (టీఆర్‌ఎస్‌) 58,508, రాజేంద్రనగర్‌ నుంచి ప్రకాశ్‌గౌడ్‌ (టీఆర్‌ఎస్‌) 58373, మహబూబ్‌నగర్‌ నుంచి శ్రీనివాస్‌ గౌడ్‌ (టీఆర్‌ఎస్‌) 57,775, నాగర్‌కర్నూల్‌ నుంచి మర్రి జనార్ధన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) 54,354, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీఆర్‌ఎస్‌) 53,053, వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) 51,586, కార్వాన్‌ నుంచి కౌసర్‌ మొహియుద్దీన్‌ (మజ్లిస్‌) 50,602 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 

బొటాబొటిగా గట్టెక్కారు
ఆసిఫాబాద్‌ నుంచి ఆత్రం సక్కు (కాంగ్రెస్‌) తన సమీప ప్రత్యర్థి కోవ లక్ష్మీ (టీఆర్‌ఎస్‌)పై కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందగా, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌(టీఆర్‌ఎస్‌) తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (కాంగ్రెస్‌)పై 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) ప్రత్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి (బీఎస్పీ)పై 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.

37మంది తాజా మాజీల ఓటమి
తెలంగాణ తొలి శాసనసభకు ఎన్నికైన 119 మంది తాజా మాజీ శాసనసభ్యుల్లో 82 మంది మళ్లీ శాసనసభకు తిరిగి ఎన్నిక కాగా, 37 మంది ఓడిపోయారు. 26 మంది తొలిసారిగా శాసనసభకు ఎంపికయ్యారు. వీరిలో టీఆర్‌ఎస్‌ నుంచి బాల్కసుమన్, సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, మాణిక్‌రావు, చంటి క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, సీహెచ్‌ మల్లారెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, కొప్పుల మహేష్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పట్నం నరేందర్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్‌ రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, జాజుల సురేందర్, కందాల ఉపేందర్‌ రెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, హరిప్రియా నాయక్, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, టీడీపీ నుంచి మెచ్చ నాగేశ్వర్‌రావు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి లావుడ్య రాములనాయక్‌ ఉన్నారు.

ఫలించిన కేసీఆర్‌ వ్యూహం
87సభలు 88సీట్లు
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచార వ్యూహం ఫలించింది.2014 ఎన్నికల తరహాలోనే ముందస్తు ఎన్నికల్లోనూ ప్రచార ప్రణాళికను అమలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 87 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. వీటిలో 88 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీల కంటే ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి చేసిన పనులు, కొనసాగాల్సిన పనులను వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కళ్ల ముందు అంతా కనిపిస్తోందని.. ప్రజలే అన్నీ పరిశీలించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్‌ ప్రచారంలో చెప్పిన అంశాలను ప్రజలు ఆమోదించారు.

అన్నలు ఇంటికి.. తమ్ముళ్లు అసెంబ్లీకి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు మండలికి ఎన్నికైన కొందరు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మరో ఆసక్తికర విషయమేంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేయడం, వారిలో అన్నలు ఓడి పోయి ఇంటి దారిపడితే, తమ్ముళ్లు గెలిచి అసెంబ్లీ దారిపట్టారు. వికారాబాద్‌ జిల్లాలో తాండూరు నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌ రెడ్డి చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టగా, మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి మాత్రం కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిపై గెలిచి మండలి నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కోమటిరెడ్డి సోదరుల్లో అన్న వెంకట్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోగా, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి మండలి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మల్లు రవి సోదరుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి గెలుపొందారు. ఇక్కడ కూడా అన్న ఓటిమి పాలవ్వడం.. తమ్ముడు అసెంబ్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురిలో రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఇద్దరూ మండలి సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ అసెంబ్లీకి పోటీచేసిన మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కూడా అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement