
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ ప్రభుత్వం ఏర్పడుతోంది. ఈసారీ ఇదే జరిగింది. 2014లో కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రచార గడువు ముగిసే రోజున గజ్వేల్‌లో నిర్వహించిన సభలో ‘గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే అధికారం వారిదే. గజ్వేల్‌నుంచి నన్ను మీరు గెలిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెస్తున్నారు’అని కేసీఆర్ అన్నారు. ఓటర్ల తీర్పు ఇలాగే వచ్చింది. కేసీఆర్‌కు ఇక్కడ ఈసారి భారీగా మెజారిటీ పెరిగింది. టీఆర్‌ఎస్‌కు సైతం సీట్లు అధికంగా పెరిగాయి.
దేశం నలుమూలల నుంచీ...
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రికార్డు స్థాయిలో స్థానాలు పొంది గెలుపొందడంతో కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖుులు మంగళవారం అభినందనలు తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, డీఎంకే కార్యదర్శి స్టాలిన్ ఫోన్‌లో సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలి పారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి ఫోన్‌లో సీఎంకు అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ మంగళవారం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఘన విజయం వైపు నడిపించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment