
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ తమకు అనుకూలంగానే జరిగిందని, తమ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పాటవుతుందని ప్రజాకూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయా పార్టీలు భావిస్తు న్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోలింగ్ సమయంలో బహిర్గతమైందని, యువత, మహిళల ఓట్లు తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో తాము పుంజుకున్నామని, దక్షిణ తెలంగాణలో గతంలోలాగే గెలిచినా, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఊహించని ఫలితాలొ స్తాయని కూటమినేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణలో వెనుకబడిందని, దక్షిణ తెలంగాణలో ఆపార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించట్లేదని అంచనా వేస్తున్నారు. మహిళలు, రైతు లు, యువకులు, నిరుద్యోగులకు తమ మేని ఫెస్టోలో ఇచ్చిన ప్రాధాన్యమే తమను విజయతీరాలకు చేరుస్తుం దని కాంగ్రెస్‌కు చెందిన ఓ ముఖ్య నేత వ్యాఖ్యానించారు.
యువత, మహిళలపైనే ఆశలు
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని, ముఖ్యంగా యువత, మహిళలు తమ వైపు మొగ్గుచూపుతారనే అంచనాలో కూటమి వర్గాలున్నాయి. నిరుద్యోగ భృతి, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ, మెగా డీఎస్సీ లాం టి హామీలు నిరుద్యోగ యువతలో ఆశలు కల్పించాయని, వారంతా తమకే ఓటు వేసి ఉంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహిళల విషయానికి వస్తే ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్వయం సహాయక గ్రూప్‌లకు గ్రాంటు, రుణంతో పాటు రెట్టింపు చేసిన పింఛన్లు, రూ.2 లక్షల రైతు రుణమాఫీలు ఓటర్లను తమవైపు చూసేలా చేశాయని భావిస్తున్నారు. కాగా, జాతీయ చానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నింటిలో తాము ఓడిపోతామని తేలడం కూటమి వర్గాలకు మింగుడు పడట్లేదు. కొన్ని చానెళ్లు టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇవ్వడం, మరికొన్ని చానెళ్లు టీఆర్‌ఎస్సే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి.
ఈ నేపథ్యంలో బాబుతో పొత్తు అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ పార్టీ బలంగా ఉందని భావించిన జీహెచ్‌ఎంసీతో పాటు ఒకటి, రెండు జిల్లాల్లో టీడీపీతో ప్రయోజనం మాట ఎలా ఉన్నా మిగిలిన చోట్ల నష్టపోయామనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ‘టీడీపీతో పొత్తు విషయంలో జాతీయ చానెళ్లు జరిపిన చర్చ వాస్తవానికి దగ్గరగా ఉందా అనిపిస్తోంది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన బాబు మా కొంప ముంచుతాడేమో అనే భయం వేస్తోంది. ఏదేమైనా ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం’అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఏమీ కాదంటూ గుంభనాన్ని ప్రదర్శిస్తుండగా, మం చికో, చెడుకో జరిగింది జరిగిపోయిందని, ఇప్పుడేం అనుకున్నా ఉపయోగమేంటని కొం దరు నిర్వేదం వ్య క్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం చంద్రబాబు రాకతో ప్రతికూలంగా మారిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది.
64–72 సీట్లు: గూడూరు
పోలింగ్ ముగిసిన అనంతరం గాంధీభవన్‌లో టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాకూటమి అధికారంలోకి రాబోతోందని, 64–72 స్థానాల్లో కూటమి విజయం సాధించబోతోం దని జోస్యం చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అదనపు ఈవీఎంలపై కాంగ్రెస్ కేడర్ డేగకన్ను వేసి ఉంచాలని, వీటిసాయంతో టీఆర్‌ఎస్ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు.
అవి కాంగ్రెస్‌కు వ్యతిరేకమే..
జాతీయ చానళ్లు ఎన్నికల ఫలితాల విషయంలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటాయని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. జాతీయ చానళ్ల సర్వేలు అబద్ధమైతే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, లోక్‌సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ కేడర్ సైన్యంలాగా పోరాడేందుకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment