సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ఓటమికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. భాగస్వామ్యపక్షాల మధ్య పొత్తు సర్దుబాట్ల నుంచి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన వరకు అన్నీ ఆలస్యం కావడమే కూటమి కొంపముంచినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చవిచూశాయి. లోపభూయిష్టంగా సీట్ల సర్దుబాటు, పొత్తు సర్దుబాట్లలో ఆలస్యం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు తేలకపోవడం, స్నేహపూర్వక పోటీల పేరుతో గందరగోళం ఏర్పడటం, పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోవడంతో కారు జోరు ముందు కూటమి కునారిల్లింది.
అడుగడుగునా సాగదీత : కూటమిని తుదిరూపు వరకు తీసుకురావడంలో ప్రతిపక్షాలు విఫలమైనందునే ఇంతటి ఘోరపరాభవాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 6 రోజులకే.. అంటే సెప్టెంబర్ 12న కూటమి పక్షాల తొలి సమావేశం జరిగింది. అక్కడి నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ.. చర్చోపచర్చలు జరుపుతూ కూటమి ఏర్పాటును సాగదీశారు. చివరకు నామినేషన్ల గడువు ముగిసే నవంబర్ 19 ముందు రాత్రి వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. నామినేషన్ల గడువు చివరి రోజున కూడా ఏ పార్టీ ఎక్కడ పోటీచేస్తుందనే దానిపై స్పష్టత లేకుండానే ఇష్టారాజ్యంగా నామినేషన్లు వేశారు. మొత్తం 90–95 స్థానాల్లో పోటీచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏకంగా 99 చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది. టీజేఎస్‌కు కేటాయిస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేయడంతో టీజేఎస్ కూడా కాంగ్రెస్ పోటీకి దిగిన చోట్ల నామినేషన్లు వేసింది. మహబూబ్‌నగర్‌లో టీడీపీ పోటీచేసిన స్థానంలోనూ టీజేఎస్ నామినేషన్ దాఖలు చేసింది. సీపీఐకిచ్చిన 3 స్థానాల్లో రెండు చోట్ల (హుస్నాబాద్, వైరా)లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు బరిలో దిగారు. హుస్నాబాద్‌లో ఆ తర్వాత విరమించుకున్నా వైరాలో మాత్రం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు.
టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చిన గందరగోళం
సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు.. అంటే 72 రోజుల కసరత్తు తర్వాత కూడా సీట్ల సర్దుబాటులో స్పష్టత రాక స్నేహపూర్వక పోటీలతో గందరగోళం నెలకొంది. దీంతో కూటమి పక్షాల సర్దుబాటు సరిగా జరగలేదని, సీట్ల కోసం అన్ని పార్టీలు కొట్లాడుకుంటున్నాయనే భావన ప్రజలకు వచ్చింది. ఇదే గందరగోళం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందనే ప్రచారం చేయడంలో టీఆర్‌ఎస్ సఫలీకృతమైంది. కూటమి సీట్లు పంచుకునేలోపు తాము స్వీట్లు పంచుకుంటామన్న టీఆర్‌ఎస్ నేతలు హేళన చేసే స్థితిలో సీట్ల సర్దుబాటు జాప్యం కావడం, గందరగోళం నెలకొనడం ప్రజల్లో కూటమి పట్ల సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచలేకపోయింది.
ప్రజలకు చేరని మేనిఫెస్టోలు
ఇక, ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని కూడా కూటమి విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదేపదే వల్లెవేయడానికి పరిమితం అయ్యారే తప్ప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పింఛన్లు రెట్టింపు, మహిళా సంఘాలకు గ్రాంట్లు, రుణాలు, పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత రేషన్ తదితర ముఖ్య హామీలు ప్రజలను ఆకర్షితులను చేసే స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రచారం కాలేదు. దీనికి తోడు టీడీపీ మేనిఫెస్టోలో అమలు సాధ్యం కాని హామీలు, టీజేఎస్ మేనిఫెస్టోలోనూ ప్రజాకర్షక పథకాలు లేకపోవడం కూటమిని దెబ్బతీశాయి. అలాగే అమరుల ఎజెండా పేరుతో కూటమి పక్షాన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ప్రజలను ఆలోచింపజేసే హామీలను ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటి నేపథ్యంలో ఓటరన్న కూటమిని కనికరించకుండానే కారుకు పట్టం కట్టాడని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment