సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి టీడీపీ నిష్క్ర మించినట్టేనా? పార్టీ నేతలు వెళ్లిపోయినా కేడర్ మిగిలి ఉందంటూ ప్రగల్భాలకు పోయిన చంద్రబాబు అండ్ కో ఖేల్ ఖతం అయినట్లేనా? అంటే తాజా ఎన్నికల ఫలితాలు దాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ.. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కేవలం 2 స్థానాలకే పరిమి తమైంది. బాబు సహా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 40 మంది ఆర్థిక, అంగబలంతో రంగంలోకి దిగినా కేవలం ఖమ్మంలో 2 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.
ఇకపై మిత్రులూ కష్టమే...
ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే అలవాటున్న టీడీపీకి తెలంగాణలో రానున్న కాలంలో రాజకీయ మిత్రుడు కూడా దొరికే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీతో పూర్తిస్థాయిలో తెగతెంపులైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచ నా. దేశవ్యాప్తంగా సమీకరణలు ఎలా ఉన్నా.. ఈ ఫలితాలనుబట్టి తెలంగాణ వరకు కాంగ్రెస్–టీడీపీల మైత్రి కష్టమేననే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. టీడీపీ, చంద్రబాబు కారణంగానే కాంగ్రెస్ ఓటమి పాలయిందనే బలమైన వాదన కారణంగా కాంగ్రెస్, టీడీపీల మిత్రుత్వం ఈ ఎన్నికలతోనే ముగిసినట్లేనని, భవిష్యత్తులో ఈ పొత్తును కొనసాగించే సాహసం కాంగ్రెస్ చేయబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టులు, టీజేఎస్ లాంటి పార్టీలు కూడా టీడీపీతో కలసి వెళ్లేందుకు ముందుకు రావని, 2 అసెంబ్లీ స్థానాల బలంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం.
తెలుగు తమ్ముళ్ల నైరాశ్యం..
ఎన్నికల ఫలితాలు తెలుగు తమ్ముళ్లను పూర్తి నైరాశ్యంలో పడేశాయి. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లోనే గెలవడం, ఎక్కడా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాకపోవడం ఆ పార్టీ కేడర్‌ను కకావికలం చేసింది. కాంగ్రెస్ జెండాలు మెడలో ఉన్నాయని, గౌరవప్రదమైన స్థానాలు, ఓట్లు దక్కుతాయనే ఆశతో ఉన్న వారంతా ఫలితాలను చూసి డీలాపడిపోయారు. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌ల మద్దతుతో పోటీ చేస్తేనే గెలవలేకపోయిన తమ పార్టీ ఇక ఒంటరిగా మనుగడ సాధించలేదని తెలుగు తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment