సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రచారంలోనూ బలంగానే కనిపించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో మాత్రం దారుణంగా చతికిలపడింది. మంగళవారం వెల్లడయిన ఎన్నికల ఫలితాల్లో ఒక్క ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, జీహెచ్‌ఎంసీ పరిధిలో (ఖమ్మం తప్ప) ఎక్కడా పట్టుమని నాలుగు సీట్లు సాధించలేని దుస్థితికి చేరుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5, నల్ల గొండలో 4, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. కొత్త జిల్లాల వారిగా చూస్తే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది.
దక్షిణ తెలంగాణలో..
ఎన్నికల ప్రచారంలో వచ్చిన ఊపును చూసి.. దక్షిణ తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ఆశించింది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈ మూడు జిల్లాల్లో చావు దెబ్బ తింది. నల్లగొండలో గత ఎన్నికలలో ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరో స్థానంలో మిత్రపక్షమయిన సీపీఐ గెలుపొందింది. కానీ, ఈ ఎన్నికల్లో హుజూర్‌నగర్, మునుగోడు, నకిరేకల్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. మహబూబ్‌నగర్‌లో 2014లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జీహెచ్‌ఎంసీలో హుష్‌కాకి..
కీలకంగా భావించిన జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ కాంగ్రెస్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 23 స్థానాల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీతో పొత్తు కలసివస్తుందని, తాము ఈసారి అనూహ్య ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఫలితం వేరోలా కనిపించింది. ఇక, పాతబస్తీలో ఎంఐఎంకు గట్టిపోటీ ఇస్తామని గొప్పలు చెప్పుకున్నా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమయ్యాయి. ఈ దెబ్బతో.. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ 3 జిల్లాలోనే!
కాంగ్రెస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికలలో గెలిచిన పాలేరు, మధిర స్థానాలను మళ్లీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడు కూడా ఆ స్థానాలను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం స్థానాన్ని ఈసారి పొత్తులో టీడీపీకి ఇచ్చి చతికిలపడింది. మహూబూబాబాద్ జిల్లా ఇల్లెందు స్థానాన్ని గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నిలబెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినప్పటికీ ఈసారి కొత్తగూడెం, భద్రాచలం, పినపాక స్థానాలను ఈసారి గెల్చుకుంది.
ఇదే జిల్లాలోని అశ్వారావుపేటను టీడీపీకి ఇచ్చింది. అక్కడ టీడీపీ గెలిచింది. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మంథని స్థానాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అనూహ్య గెలుపు సాధించింది. ములుగులో మంత్రి చందూలాల్‌ను కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఓడించారు. పాలేరులో కూడా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఓడించగలిగారు. మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. టీఆర్‌ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment