thummala nageswararao
-
‘ఆకేరు’పై రయ్ రయ్యంటూ..
తిరుమలాయపాలెం: పక్కపక్కనే ఉన్న జిల్లాలు.. వానొచ్చి వరదొస్తే తెగిపోయే సంబంధాలు.. వరద తగ్గేంతవరకు అటోళ్లు ఇటువైపు.. ఇటోళ్లు అటువైపు వెళ్లలేని పరిస్థితి. లోతట్టు వాగులపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ఏళ్లతరబడి ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా మూడు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి తీవ్రతను గుర్తించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల ప్రభుత్వం రూ.38.70కోట్ల నిధులను బ్రిడ్జి నిర్మాణాలతోపాటు రహదారుల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపుకోసం చెక్‌డ్యాంలు నిర్మించేందుకు మంజూరు చేసింది. ఆకేరు నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలతో అంతర్ జిల్లా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. ఆకేరు నదిపై చేపట్టిన మూడు బ్రిడ్జిల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఖమ్మం–మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ఆకేరు నదిపై రవాణా మార్గం సరిగా లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగించారు. తిరుమలాయపాలెం మండలం హైదర్‌సాయిపేట పరిధిలోని రావిచెట్టుతండా, అజ్మీరతండా పరిధిలోని రాకాసితండా, తిరుమలాయపాలెం పరిధిలోని ములకలపల్లి ప్రాంతాల్లో ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణాలతోపాటు రోడ్ల అభివృద్ధి, భూగర్భ జలాల పెంపు కోసం చెక్‌డ్యాం పనులు చేపట్టారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ.38,70కోట్లు మంజూరు చేయగా.. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే.. హైదర్‌సాయిపేట మీదుగా మహబూబాబాద్ జిల్లా ధర్మారం నుంచి మహబూబాబాద్ వెళ్లేందుకు తక్కువ దూరంలోనే ప్రయాణించొచ్చు. సుమారు 30 కిలో మీటర్ల మేర దూరం తగ్గుతుంది. పాతర్లపాడు రావిచెట్టుతండా వరకు రహదారి నిర్మాణంతోపాటు బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.14.10కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పనులు దక్కించుకున్న సంస్థ అతి తక్కువ కాలంలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసింది. అయితే మహబూబాబాద్ జిల్లా ధర్మారం వద్ద భూ సేకరణ సమస్యతో కొంత ఆలస్యం జరిగింది. ప్రస్తుతం భూ సేకరణ పూర్తికావడంతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ బ్రిడ్జి ప్రారంభమైతే పాతర్లపాడు, తిప్పారెడ్డిగూడెం, జల్లెపల్లి, హైదర్‌సాయిపేట ప్రాంతాల ప్రజలు మహబూబాబాద్ వెళ్లేందుకు దగ్గరి రహదారి ఏర్పడినట్లవుతుంది. సౌకర్యవంతంగా... అలాగే తిరుమలాయపాలెం మండల కేంద్రం నుంచి మహబూబాబాద్ జిల్లా ముల్కలపల్లికి వెళ్లేందుకు ఆకేరు నది ప్రవాహంతో గతంలో ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తిరుమలాయపాలెం నుంచి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.9.60కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో డోర్నకల్–తిరుమలాయపాలెం ప్రాంతాలకు దగ్గరి రహదారి ఏర్పడింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఆకేరు అవతల ఉన్న రాకాసితండాకు వెళ్లేందుకు బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో రెండు ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడ్డారు. వర్షాకాలంలో ఆకేరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో పశువులు, మనుషులు నదిని దాటుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలెన్నో. దీంతో ప్రభుత్వం రూ.15కోట్ల వ్యయంతో బ్రిడ్జితోపాటు చెక్‌డ్యాం నిర్మాణం, అజ్మీరతండా నుంచి రాకాసితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. ప్రస్తుతం 11 పిల్లర్లు, చెక్‌డ్యాం నిర్మాణం పూర్తికాగా.. బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఒకేసారి మూడు చోట్ల బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడంతో రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందనుంది. త్వరలోనే పూర్తి చేస్తాం.. హైదర్‌సాయిపేట, తిరుమలాయపాలెం ప్రాంతాల్లో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలు పూర్తికావొచ్చాయి. అజ్మీరతండా పరిధిలోని రాకాసితండా వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బ్రిడ్జి పిల్లర్లు పూర్తి చేసి రెండు స్లాబ్ నిర్మాణాలు చేపట్టాం. నెల రోజుల్లోగా స్లాబులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేసి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. – శ్రీకాంత్, ఆర్అండ్బీ ఏఈ, తిరుమలాయపాలెం -
పని చేయని గులాబీ ప్రభంజనం
సాక్షి, ఖమ్మం : శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అంతిమ తీర్పునిచ్చారు. గెలుస్తామని ధీమాగా ఉన్న దిగ్గజాలను ఓటమిబాట పట్టించారు.. కొత్త నేతలను అక్కున చేర్చుకుని అసెంబ్లీ బాట చూపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగిన ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను ప్రజాకూటమి కైవసం చేసుకోగా.. ఖమ్మంలో టీఆర్ఎస్.. వైరాలో స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎదురుచూసిన ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ.. రంగులు చల్లుకుంటూ.. బాణసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు విశిష్ట.. విలక్షణ తీర్పునిచ్చారు. టీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభంజనాల పర్వంలో టీఆర్ఎస్ సత్తా చాటుకుంటుందని భావించినా.. జిల్లా ఓటర్లు మాత్రం ఆ పార్టీని అనూహ్యంగా ఒక్క సీటుకే పరిమితం చేశారు. పార్టీలో నెలకొన్న ఇంటిపోరే కొంపముంచిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే స్వల్ప తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు అని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక రాజకీయ పక్షాలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం లభించగా.. ఈసారి మూడే మూడు పక్షాలకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్.. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి టీఆర్ఎస్ తరఫున జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి.. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక హోరాహోరీ పోరు సాగిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఆయన 3,567 ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగాల కమల్‌రాజ్ ప్రతిరౌండ్‌లో గట్టి పోటీ ఇవ్వడం.. ఏ రౌండ్లో ఎవరు వెనుకబడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో క్షణ క్షణం ఉత్కంఠ రేపింది. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య 19,002 ఓట్ల ఆధిక్యంతో వరుసగా మూడోసారి గెలిచారు. ఆయన సమీప ప్రత్యర్థి.. టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి 81,210 ఓట్లు లభించాయి. ఒకటి, రెండు రౌండ్లలో పిడమర్తి రవి కొంత ఆధిక్యత చూపినా.. మిగతా అన్ని రౌండ్లలో సండ్ర వెంకటవీరయ్య ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగిన వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లకావత్ రాములునాయక్.. 2,013 ఓట్ల మోజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌పై గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గత శాసనసభలోనూ సభ్యులుగా ఉండగా.. వారు మరోసారి అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించే అవకాశం ప్రజలు కల్పించారు. ఇక పువ్వాడ అజయ్‌కుమార్ రెండోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తొలిసారిగా.. పాలేరు నుంచి గెలుపొందిన కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరా నుంచి గెలుపొందిన లావుడ్యా రాములునాయక్ శాసనసభలో తొలిసారి ప్రవేశించనున్నారు. ఇదే రీతిలో ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు విశిష్టతను చాటిచెప్పింది. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వడం.. ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంతో.. ఆ జిల్లాలో అధికార పక్షమైన టీఆర్ఎస్కు ఒక్కసీటు లభించని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన కొత్తగూడెంలో ఈసారి కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించగా.. భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా 20 రోజుల క్రితమే అడుగిడిన పార్టీ సీనియర్ నేత పొదెం వీరయ్య అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఇక ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థిగా బాణోతు హరిప్రియ, పినపాకలో రేగా కాంతారావు విజయం సాధించడంతో ఆ జిల్లాలో టీఆర్ఎస్కు శాసనసభ స్థానమే లేని పరిస్థితి నెలకొనడం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో ఈ పరిస్థితి రావడంపై గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ‘పువ్వాడ’పైనే.. జిల్లాలో గత ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితి ఉందో.. ఈసారి సైతం అదే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్న రాజకీయ వర్గాలు ఈసారి జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు రాజకీయ చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మంత్రి తుమ్మల ఓటమి భారంతో ఉన్న క్షణంలో సీఎం కేసీఆర్ ఫోన్ చేసి హైదరాబాద్‌కు పిలిపించుకోవడం రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారినా.. పువ్వాడ అజయ్‌కుమార్‌కు పార్టీలోని యువ నేతతో ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయ అందలానికి అవకాశం కల్పిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపు పది రౌండ్ల వరకు ఎన్నికల ఫలితాలపై ఊపిరి బిగబట్టాల్సిన పరిస్థితే నెలకొంది. గెలుపు తీర్పు జిల్లా ఓటర్లు ఏకపక్షంగానే ఇచ్చినా.. మెజార్టీ విషయాన్ని మాత్రం ప్రతి రౌండ్లో పలువురు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. మెజార్టీ విషయంలో ఆయా పార్టీల అభిమానుల అంచనాలు దాదాపు తలకిందులయ్యాయి. తమ పార్టీ నేతలకు భారీ మెజార్టీ వస్తుందని ఊహించినా.. ఫలితాల సరళి మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో నేతలందరూ ఖిన్నులయ్యారు. ఇక చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలేవీ ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో కనీసం డిపాజిట్లను సైతం సాధించలేకపోయాయి. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద, సీపీఎం బలపరిచిన బీఎల్పీ అభ్యర్థి పాల్వంచ రామారావు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీచినా.. జిల్లాలో మాత్రం ప్రజాకూటమి సానుకూల పవనాలే మెజార్టీ నియోజకవర్గాల్లో కనిపించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. జిల్లాలో సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో ఓడిపోగా.. టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో ఓటమి చెందగా.. కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాలను గెలుపొందింది. ఇక సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఈ ఎన్నికల్లో తమ గత ప్రాభవాన్ని కాపాడుకోలేకపోయాయనే భావన ఈ ఎన్నికల ఫలితాలు కల్పించాయి. తుమ్మలకు స్వల్ప అస్వస్థత కాగా.. ఎన్నికల ఫలితాల అనంతరం పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంతలోనే సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
కాంగ్రెస్ ఖల్లాస్!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రచారంలోనూ బలంగానే కనిపించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో మాత్రం దారుణంగా చతికిలపడింది. మంగళవారం వెల్లడయిన ఎన్నికల ఫలితాల్లో ఒక్క ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో (ఖమ్మం తప్ప) ఎక్కడా పట్టుమని నాలుగు సీట్లు సాధించలేని దుస్థితికి చేరుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5, నల్ల గొండలో 4, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, జీహెచ్ఎంసీ పరిధిలో రెండు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. కొత్త జిల్లాల వారిగా చూస్తే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. దక్షిణ తెలంగాణలో.. ఎన్నికల ప్రచారంలో వచ్చిన ఊపును చూసి.. దక్షిణ తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ఆశించింది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈ మూడు జిల్లాల్లో చావు దెబ్బ తింది. నల్లగొండలో గత ఎన్నికలలో ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరో స్థానంలో మిత్రపక్షమయిన సీపీఐ గెలుపొందింది. కానీ, ఈ ఎన్నికల్లో హుజూర్నగర్, మునుగోడు, నకిరేకల్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. మహబూబ్‌నగర్‌లో 2014లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీలో హుష్‌కాకి.. కీలకంగా భావించిన జీహెచ్ఎంసీ పరిధిలోనూ కాంగ్రెస్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 23 స్థానాల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీతో పొత్తు కలసివస్తుందని, తాము ఈసారి అనూహ్య ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఫలితం వేరోలా కనిపించింది. ఇక, పాతబస్తీలో ఎంఐఎంకు గట్టిపోటీ ఇస్తామని గొప్పలు చెప్పుకున్నా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమయ్యాయి. ఈ దెబ్బతో.. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ 3 జిల్లాలోనే! కాంగ్రెస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికలలో గెలిచిన పాలేరు, మధిర స్థానాలను మళ్లీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడు కూడా ఆ స్థానాలను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం స్థానాన్ని ఈసారి పొత్తులో టీడీపీకి ఇచ్చి చతికిలపడింది. మహూబూబాబాద్ జిల్లా ఇల్లెందు స్థానాన్ని గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నిలబెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినప్పటికీ ఈసారి కొత్తగూడెం, భద్రాచలం, పినపాక స్థానాలను ఈసారి గెల్చుకుంది. ఇదే జిల్లాలోని అశ్వారావుపేటను టీడీపీకి ఇచ్చింది. అక్కడ టీడీపీ గెలిచింది. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మంథని స్థానాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అనూహ్య గెలుపు సాధించింది. ములుగులో మంత్రి చందూలాల్‌ను కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఓడించారు. పాలేరులో కూడా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఓడించగలిగారు. మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై విజయం సాధించారు. -
పాలేరు పట్టం ఎవరికో..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాత స్థానాన్ని పదిలపరుచుకునేందుకు టీఆర్ఎస్.. గత ఎన్నికల వరకు సుస్థిర స్థానంగా పేరున్న పాలేరును తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో పట్టు ఎవరిదనే అంశం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి కందాళ ఉపేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. సీపీఎం, బీజేపీ అభ్యర్థులతోపాటు మరో 10 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలు తాము చేసిన అభివృద్ధి, పార్టీకి ఉన్న అండదండల కారణంగా అత్యంత సునాయాసంగా విజయం సాధిస్తామని తొలుత భావించినా.. ఎన్నికల సమయం సమీపించే నాటికి కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ నెలకొంది. మంత్రి తుమ్మల ఈ నియోజకవర్గం నుంచి 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గా విజయం సాధించగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కందాళ ఉపేందర్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. మంత్రి తుమ్మల పాలేరు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి, అత్యంత కరువు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలానికి భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తేవడం, రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు, బోదకాలు బాధితులకు ప్రత్యేక పెన్షన్లు, నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో గల చెరువుల్లో మండు వేసవిలోనూ జలకళ ఉట్టిపడేలా నీరు నిల్వ ఉండేలా చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు తనను విజయ తీరానికి తీసుకెళ్తాయనే భరోసాతో ఉన్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐ అండదండలు తనను గెలిపిస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి విశ్వసిస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా 2016 ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించగా.. అనేకసార్లు కాంగ్రెస్, పలు పర్యాయాలు సీపీఎం విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఈ సీటును కైవసం చేసుకోలేదు. అయితే టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నికల్లో తమకు కలిసొచ్చే అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందగా.. టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఊరూరా ప్రచారం.. ఈనెల 7న జరిగే ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. నియోజకవర్గం కోసం తాను చేసిన అభివృద్ధి పనులను గ్రామగ్రామాన ప్రచారం చేయడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక అవగాహన ఉన్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తిరుమలాయపాలెం మండలంలో కరువు ఛాయలను రూపుమాపిన తీరును ఉదహరిస్తూ.. చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల అభివృద్ధితోపాటు సుదీర్ఘకాలంగా జిల్లా రాజకీయాలతో తనకు గల అనుబంధం విజయానికి సోపానం కాగలదని తుమ్మల భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య ప్రచార హోరు మాత్రం హోరాహోరీగా సాగుతోంది. ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థుల బలాలను, ఎదుటి పార్టీ అభ్యర్థుల బలహీనతలను ప్రధానంగా ప్రచారం చేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. నియోజకవర్గంలో కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలు ఉండగా.. దాదాపు అన్ని మండలాలు వ్యవసాయాధారిత మండలాలు కావడంతో గ్రామీణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధికి తాము భవిష్యత్‌లో చేసే పనులను ప్రణాళికాబద్ధంగా వివరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కూసుమంచి మండలం రాజుపేటకు చెందిన కందాళ ఉపేందర్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో స్థానికతను ప్రచారాస్త్రంగా సంధిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంపై అవగాహన ఉందని చెబుతుండగా.. మంత్రి తుమ్మల ఇదే రీతిలో మూడున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పాలేరు నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధం పెనవేసుకుని ఉందని, ఇక్కడి సమస్యలు, రైతాంగం ఇబ్బందులపై సమగ్ర అవగాహన ఉందని.. దీనికి అనుగుణంగానే భక్తరామదాసు ప్రాజెక్టు అందుబాటులోకి తెచ్చానని, సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసి తీరుతానని ఓటర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సీపీఎం అభ్యర్థి బత్తుల హైమావతి, బీజేపీ అభ్యర్థి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి గుర్రం అచ్చయ్య నియోజకవర్గంలో తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయం తమ పార్టీయే అని బీజేపీ అభ్యర్థి నినదిస్తుండగా.. అనేక ప్రజా ఉద్యమాలతో పాలేరు అభివృద్ధిలో భాగస్వామ్యమైన సీపీఎంకు మరోసారి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వాల మెడలు వంచి పనులు చేయించే అవకాశం ఇవ్వాలని ఇంటింటి ప్రచారంలో సీపీఎం అభ్యర్థి కోరుతున్నారు. -
మీ కోపాన్ని చూపించొద్దు..! : తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, అశ్వారావుపేటరూరల్: ‘‘నాపై, ఎంపీపై, తాటిపై మీకు కోపమున్నా, దానిని ఇప్పుడు చూపించొద్దు. ఆ కోపతాపాలేవైనా ఉంటే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం’’ అని, టీఆర్ఎస్ శ్రేణులను ఆ పార్టీ నేత తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ది చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ను ఓడించేందుకు దేశంలోని పార్టీలన్నీ ఏకమయ్యాయని, అయినప్పటికీ టీఆర్ఎస్ గెలుపును అవి అడ్డుకోలేవని అన్నారు. మండలంలోని వినాయకపురం గ్రామంలో ఆదివారం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గడిచిన పదేళ్లుగా మీ మొహాలు చూడని వారిని ఈ ఎన్నికల్లో ఓడించండి. మీ కోసం నేను 32 ఏళ్లు త్యాగం చేశా. నా కోసం మీరంతా తాటి వెంకటేశ్వర్లును ఐదువేల నుంచి పదివేల మెజార్టీతో గెలిపించాలి’’ అని కోరారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినప్పటికీ పోడు పట్టాలు ఇప్పించే బాధ్యత తనదేనని అన్నారు. రాష్ట్రంలో కళింగుల జనాభా దాదాపుగా నాలుగులక్షలు ఉందని, అశ్వారావుపేటలోనూ ఉన్నారని అన్నారు. వీరికి సంబంధించిన రిజర్వేషన్ సమస్యను పరిష్కారిస్తామని, ఆందోళన అవసరం లేదని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి, మొట్టమొదటిగా అశ్వారావుపేటలోని వెంకమ్మ చెరువును గోదావరి నీళ్లతో నింపుతామని అన్నారు. దబ్బతోగు, పెదవాగు ప్రాజెక్టులకు నీళ్లు అందిస్తామన్నారు. దురదపాడు ప్రాజెక్టు నిర్మాణం తన బాధ్యతనేనని అన్నారు. అశ్వారావుపేట మీదుగా రావాల్సిన జాతీయ రహదారి రద్దయినట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నేషనల్ హైవే, గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. భద్రాచలం నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా దేవరపల్లి వరకు నేషనల్ హైవే నిర్మాణ బాధ్యత కూడా తనదేనన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. టీఆర్ఎస్ పార్టీని గెలలిపించాలని కోరారు. ముందుగా, టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎంతో చేశానని అన్నారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, ఎంపీపీ బరగడ కృష్ణారావు, జడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జున్‌రావు పాల్గొన్నారు. రైతులకు మంచి రోజులు .. దమ్మపేట: టీఆర్ఎస్ పాలనలో రైతులకు మంచి రోజులొచ్చాయని, పంటల సాగు సక్రమంగా సాగిందని తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. మండలంలోని మందలపల్లి సాయికృష్ణ నర్సరీలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ సమావేశం జరిగింది. తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్న పార్టీ అభ్యర్థిని ఓడించాలని, టీ ఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును గెలిపిం చా లని కోరారు. కూటమికి అధికారమిస్తే.. మన కం టిని మనం పొడుచుకున్నట్టే అవుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, డీసీసీబీ డైరెక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, పార్టీ నాయకులు తూతా నా గమణి, పైడి వెంకటేశ్వరరావు, దారా యుగంధర్, కోటగిరి పుల్లయ్యబాబు, రావు గంగాధరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, కేవీ సత్యన్నారాయణ, అల్లం వెంకమ్మ, సరోజని, అడపా రాంబాబు, కొయ్యల అచ్యుతరావు, రెడ్డిమళ్ల చిట్టినాయన, దొడ్డా రమేష్, వెంపాటి భరత్ పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
మిత్రులు..ప్రత్యర్థులు..
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఈ కోవలోకే వస్తాయి. సుదీర్ఘకాలంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఒకే పార్టీలో చేరడం, ఒకే వేదిక మీదకు వచ్చి మాట్లాడటం.. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవటం.. రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సాక్షి, సత్తుపల్లి: టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే, సత్తుపల్లి కూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ పాలేరులో మూడు సార్లు, సత్తుపల్లిలో రెండుసార్లు.. మొత్తం 5 సార్లు ప్రత్యర్థులుగా తలపడ్డారు. పాలేరులో సంబాని రెండుసార్లు, సండ్ర ఒకసారి గెలిచారు. 2009 పునర్విభజనలో సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఇక్కడ రెండుసార్లు వెంకటవీరయ్యే విజయం సాధించారు. 2018లో సీన్మారిపోయింది. రెండున్నర దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా తలపడిన సంభాని చంద్రశేఖర్,సండ్ర వెంకటవీరయ్యలు ప్రజాకూటమి పేరుతో మిత్రులుగా ఒక్కటయ్యారు.ఇద్దరు ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ వర్గాలలో చర్చానీయాంశమైంది. సండ్ర–సంబాని .. టీడీపీలో తుమ్మల నాగేశ్వరరావుతో సండ్ర వెంకటవీరయ్యకు సాన్నిహిత్యం ఉండేది. 2009 ఎన్నికల్లో సండ్ర వెంకటవీరయ్యను సత్తుపల్లి టీడీపీ నేతలకు పరిచయం చేసి గెలిపించా ల్సిన బాధ్యతను భుజస్కంధాలపై పెట్టారు. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య ఒక్కరే గెలిచారు. ఖమ్మంలో తుమ్మల ఓటమి చెందారు. అనంతరం ఆయన టీఆర్ఎస్లో చేరారు. మంత్రి పదవి చేపట్టారు. తుమ్మ ల నాగేశ్వరరావును సండ్ర వెంకటవీరయ్య అనుసరించక పోవటంతో ఇద్దరి మధ్య రాజకీయ విబేధాలు తలెత్తాయి. 2018 ఎన్నికల్లో సండ్రకు వ్యతిరేకంగా తుమ్మల అనుచరులు టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు అందరు కలిసి వ్యూహా లు రచించినవారు ఇప్పుడు వైరి పక్షంగా మారారు. తుమ్మల–సండ్ర .. తుమ్మల–జలగం .. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావులకు దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. సత్తుపల్లిలో టీడీపీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జలగం ప్రసాదరావు రెండుసార్లు తలపడ్డారు. ఒకసారి తుమ్మల, ఒకసారి ప్రసాదరావు గెలిచారు. ప్రస్తుతం వీరిద్దరూ టీఆర్ఎస్లో ఉన్నారు. తుమ్మలపై జలగం ప్రసాదరావు సోద రుడు జలగం వెంకటరావు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో సత్తుపల్లి ఎస్వీ రిజర్వ్‌గా మారడంతో వీరిద్దరూ మరోసారి ఖమ్మంలో తలపడ్డారు. జలగం వెంకటరావు(ఇండిపెండెంట్)పై తుమ్మల విజయం సాధించారు. అనంతర పరి ణామాల్లో 2014 సాధారణ ఎన్నికల కంటే ముందే జలగం వెంకటరావు టీఆర్ఎస్ లో చేరారు. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015లో తుమ్మల కూడా టీఆర్ఎస్లో చేరారు. దీంతో జలగం వెంకటరావుతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇటీవలే మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కూడా టీఆర్ఎస్లో చేరారు. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న జలగం సోదరులు, తుమ్మల నాగేశ్వరరావు ఒకే పార్టీలో ఒకే వేదికను పంచుకోవటం రాజకీయ విశ్లేషణకు దారితీసింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు అందరు కలిసి టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగటం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. -
ఆఖరి రోజు..నామినేషన్ల జోరు
ఈ నెల 12న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటి(19వ తేదీ)తో ముగిసింది. సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు తమ అనుచరులు, మద్దతుదారులతో ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకున్నారు. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. పాలేరులో మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్, మధిరలో కూటమి(కాంగ్రెస్) అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క, సత్తుపల్లిలో కూటమి(టీడీపీ) అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెంలో కూటమి(కాంగ్రెస్) అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. పాలేరులో తుమ్మల ఖమ్మంరూరల్: పాలేరు టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దశర«థ్‌కు అందించారు. తుమ్మల వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత తదితరులు ఉన్నారు. నామివేషన్ వేసిన అనంతరం తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గంలో దశాబ్దాల నుంచి కరువు పరిస్థితులు ఉండేవని, ప్రజల కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి భక్తరాదాసు ప్రాజెక్ట్‌ను రూ.100కోట్లతో చేపట్టి పాలేరు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొత్తగూడెంలో వనమా కొత్తగూడెంరూరల్: కొత్తగూడెంలో కూటమి (కాంగ్రెస్) అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తరఫున ఆయన మనవరాళ్లు(తనయులు రాఘవేంద్రరావు, రామకృష్ణల కూమార్తెలు) డాక్టర్ అలేఖ్య, హర్షిణి, మనీషా, వనమా అల్లుళ్లు మనోహర్, లక్ష్మణ్‌రావు నామినేషన్ వేశారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. బీఫాంను ఎన్నికల అధికారికి అందజేశారు. కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, ఎంఎ రజాక్, కాసుల వెంకట్, తూము చౌదరి, ముత్యాల వీరభద్రం, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాసుల ఉమారాణి, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు పాల్గొన్నారు. సత్తుపల్లిలో సండ్ర సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి(టీడీపీ) అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య సోమవారం నామినేషన్ వేశారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మధిరలో మల్లు భట్టి మధిర: తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్ర మార్క సోమవారం రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రజాకూటమి బలపర్చి న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భట్టి తన అనుచరులతో కలిసివెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతికి నామినేషన్ అందజేశారు. ఆయన మూడుసెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంనుంచి తన సతీమణి మల్లు నందిని, కుమారులు మల్లు సూర్యవిక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్యలతో కలిసివచ్చారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే.శ్రీనివాసరావుకు అజయ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అజయ్‌కుమార్‌కు మద్దతుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. అంతకుముందు అజయ్ నగరంలోని పవనసుత జలాంజనేయ స్వామి దేవస్థానం, చెరువు బజార్ హనుమాన్ గుడిలో పూజలు చేశారు. -
గ్రామీణాభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తాం!
సాక్షి, హైదరాబాద్: గ్రామ సర్పంచ్ల అధికారాలు, బాధ్యతలతోపాటు పంచాయతీలకు నిధులు పెంచుతూ కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ప్రస్తుత సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం ద్వారా గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. శాసనసభలో శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బడ్జెట్ పద్దులపై చర్చకు ఆయన సమాధానమిచ్చారు. శాసనసభ్యుల గృహాలు సిద్ధం: తుమ్మల రాష్ట్ర శాసనసభ్యుల కోసం నిర్మించిన 120 గృహాల నిర్మాణం పూర్తయిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల కోసం 44 నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం కొత్తగూడెం 720 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించే ప్రతిపాదనలు ఉన్నా యని విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి శాసనసభలో వెల్లడించారు. తొమ్మిది శాఖల పద్దులకు ఆమోదం శాసనసభ శుక్రవారం ఆర్అండ్బీ, నీటిపారు దల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, పురపాలక, రెవెన్యూ, రవాణా, ఎౖMð్సజ్ శాఖల బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపింది. -
చంద్రబాబూ కేసీఆర్ స్కూల్ నుంచే వచ్చారు: తుమ్మల
సత్తుపల్లి: ‘చంద్రబాబూ మేము మీ స్కూల్లో చదవలేదు.. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ స్కూల్లో టీచర్‌గా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠాలు చెపుతుంటే చంద్రబాబు వచ్చారు. అటువంటి చంద్రబాబు మా స్కూల్లో కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు చదివారని చెప్పటం విడ్డూరంగా ఉంది’ అని ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం రాత్రి జరిగిన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.