సాక్షి, ఖమ్మం : శాసనసభ ఎన్నికల్లో ప్రజలు అంతిమ తీర్పునిచ్చారు. గెలుస్తామని ధీమాగా ఉన్న దిగ్గజాలను ఓటమిబాట పట్టించారు.. కొత్త నేతలను అక్కున చేర్చుకుని అసెంబ్లీ బాట చూపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కొనసాగిన ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను ప్రజాకూటమి కైవసం చేసుకోగా.. ఖమ్మంలో టీఆర్‌ఎస్.. వైరాలో స్వతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠగా కౌంటింగ్ కేంద్రం ఎదుట ఎదురుచూసిన ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు.. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ.. రంగులు చల్లుకుంటూ.. బాణసంచా కాలుస్తూ.. స్వీట్లు పంచుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు విశిష్ట.. విలక్షణ తీర్పునిచ్చారు. టీఆర్‌ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రభంజనాల పర్వంలో టీఆర్‌ఎస్ సత్తా చాటుకుంటుందని భావించినా.. జిల్లా ఓటర్లు మాత్రం ఆ పార్టీని అనూహ్యంగా ఒక్క సీటుకే పరిమితం చేశారు. పార్టీలో నెలకొన్న ఇంటిపోరే కొంపముంచిందనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే స్వల్ప తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు అని విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో అనేక రాజకీయ పక్షాలకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం లభించగా.. ఈసారి మూడే మూడు పక్షాలకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ ఒకే ఒక్క స్థానాన్ని కైవసం చేసుకోవడం.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తూ.. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది.
ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్.. తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి టీఆర్‌ఎస్ తరఫున జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక హోరాహోరీ పోరు సాగిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క.. వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఆయన 3,567 ఓట్ల మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లింగాల కమల్‌రాజ్ ప్రతిరౌండ్‌లో గట్టి పోటీ ఇవ్వడం.. ఏ రౌండ్‌లో ఎవరు వెనుకబడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో క్షణ క్షణం ఉత్కంఠ రేపింది.
సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్య 19,002 ఓట్ల ఆధిక్యంతో వరుసగా మూడోసారి గెలిచారు. ఆయన సమీప ప్రత్యర్థి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవికి 81,210 ఓట్లు లభించాయి. ఒకటి, రెండు రౌండ్లలో పిడమర్తి రవి కొంత ఆధిక్యత చూపినా.. మిగతా అన్ని రౌండ్లలో సండ్ర వెంకటవీరయ్య ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఇక అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగిన వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి లకావత్ రాములునాయక్.. 2,013 ఓట్ల మోజార్టీతో తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌పై గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గత శాసనసభలోనూ సభ్యులుగా ఉండగా.. వారు మరోసారి అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించే అవకాశం ప్రజలు కల్పించారు. ఇక పువ్వాడ అజయ్‌కుమార్ రెండోసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
తొలిసారిగా..
పాలేరు నుంచి గెలుపొందిన కందాళ ఉపేందర్‌రెడ్డి, వైరా నుంచి గెలుపొందిన లావుడ్యా రాములునాయక్ శాసనసభలో తొలిసారి ప్రవేశించనున్నారు. ఇదే రీతిలో ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు విశిష్టతను చాటిచెప్పింది. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఏకపక్ష తీర్పు ఇవ్వడం.. ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంతో.. ఆ జిల్లాలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌కు ఒక్కసీటు లభించని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానమైన కొత్తగూడెంలో ఈసారి కాంగ్రెస్ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించగా.. భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థిగా 20 రోజుల క్రితమే అడుగిడిన పార్టీ సీనియర్ నేత పొదెం వీరయ్య అనూహ్య రీతిలో విజయం సాధించారు. ఇక ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థిగా బాణోతు హరిప్రియ, పినపాకలో రేగా కాంతారావు విజయం సాధించడంతో ఆ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు శాసనసభ స్థానమే లేని పరిస్థితి నెలకొనడం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో ఈ పరిస్థితి రావడంపై గులాబీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
‘పువ్వాడ’పైనే..
జిల్లాలో గత ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితి ఉందో.. ఈసారి సైతం అదే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్న రాజకీయ వర్గాలు ఈసారి జిల్లా నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌కు రాజకీయ చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆయనకు కేసీఆర్ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మంత్రి తుమ్మల ఓటమి భారంతో ఉన్న క్షణంలో సీఎం కేసీఆర్ ఫోన్ చేసి హైదరాబాద్‌కు పిలిపించుకోవడం రాజకీయంగా కొంత చర్చనీయాంశంగా మారినా.. పువ్వాడ అజయ్‌కుమార్‌కు పార్టీలోని యువ నేతతో ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయ అందలానికి అవకాశం కల్పిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ దాదాపు పది రౌండ్ల వరకు ఎన్నికల ఫలితాలపై ఊపిరి బిగబట్టాల్సిన పరిస్థితే నెలకొంది.
గెలుపు తీర్పు జిల్లా ఓటర్లు ఏకపక్షంగానే ఇచ్చినా.. మెజార్టీ విషయాన్ని మాత్రం ప్రతి రౌండ్‌లో పలువురు అభ్యర్థులకు చుక్కలు చూపించాయి. మెజార్టీ విషయంలో ఆయా పార్టీల అభిమానుల అంచనాలు దాదాపు తలకిందులయ్యాయి. తమ పార్టీ నేతలకు భారీ మెజార్టీ వస్తుందని ఊహించినా.. ఫలితాల సరళి మాత్రం అందుకు భిన్నంగా ఉండడంతో నేతలందరూ ఖిన్నులయ్యారు. ఇక చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్‌ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు మినహా ఇతర రాజకీయ పక్షాలేవీ ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో కనీసం డిపాజిట్లను సైతం సాధించలేకపోయాయి. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద, సీపీఎం బలపరిచిన బీఎల్‌పీ అభ్యర్థి పాల్వంచ రామారావు డిపాజిట్లు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభంజనం వీచినా.. జిల్లాలో మాత్రం ప్రజాకూటమి సానుకూల పవనాలే మెజార్టీ నియోజకవర్గాల్లో కనిపించాయి. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ప్రజాకూటమిగా ఏర్పడి పోటీ చేయగా.. జిల్లాలో సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో ఓడిపోగా.. టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానంలో ఓటమి చెందగా.. కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాలను గెలుపొందింది. ఇక సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఈ ఎన్నికల్లో తమ గత ప్రాభవాన్ని కాపాడుకోలేకపోయాయనే భావన ఈ ఎన్నికల ఫలితాలు కల్పించాయి.
తుమ్మలకు స్వల్ప అస్వస్థత
కాగా.. ఎన్నికల ఫలితాల అనంతరం పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇంతలోనే సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment