అశ్వారావుపేటరూరల్: స్వార్థ రాజకీయాలు, కొన్ని కుట్రల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓడిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఈ రెండింటినీ సమానంగా చూడాలని, ఉభయ జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, వేరే వాళ్లను నిందించవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నష్టపోవడంపై తమతోపాటు సీఎం కేసీఆర్ గుండెల్లో కుడా బాధ నెలకొందన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన సత్తుపల్లి నియోజకవర్గంలో గెలుస్తామని ఆశపడ్డానని, అలాగే అశ్వారావుపేట అసెంబ్లీ సీటు మొదట గెలవాల్సిన స్థానమని, ఇలాంటి చోట స్వార్థ రాజకీయాల కోసం బలి పెట్టుకున్నారని, ఓడిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పారు.
ఈ స్థానాన్ని చేజేతులారా పొగట్టుకున్నామని, ఇప్పుడు ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని, జరిగింది మనస్సులో పెట్టుకోవద్దని, జరగాల్సినది చూడాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కొనసాగే బాధ్యత తనదేనని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గడిచిన నాలుగేళ్లలో మిగిలిన జిల్లాల కంటే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వివరించారు. జిల్లాలో ఇప్పటికే 800 మెగావాట్లతో కేటీపీఎస్‌ను, 12వందల మెగావాట్లతో భద్రాద్రి పవర్ ప్లాంట్‌లను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో కలిసి పని చేయాలని, కొట్లాడుకొని వేరే పార్టీల వద్ద చులకన కావద్దని కోరారు. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ అంతా సిద్ధం కావాలని, సర్పంచ్ టికెట్ల కోసం పొట్లాడుకోవద్దన్నారు. గ్రామ నాయకులు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకొని గెలిపించుకోవాలని కోరారు. అన్ని సర్పంచ్ స్థానాలనూ గెలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ నూకల నరేష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవీందర్, మండలాధ్యక్షుడు బండి పుల్లారావు, నాగమణి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ కమిటీ బాధ్యులు జూపల్లి రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి రావాలి: తాటి
నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పార్టీకి నష్టం జరిగిందన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మరోసారి అవకాశం ఇవ్వాలని, ఆయనకు మంత్రి పదవి వస్తేనే జిల్లా లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.
సస్పెండ్ డిమాండ్‌తో రసాభాస
టీఆర్‌ఎస్ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ ఇన్‌చార్జ్ రవీందర్ ప్రసంగిస్తున్న క్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే వర్గీయులు, ఖమ్మం ఎంపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని సస్పెంచ్ చేయాలంటూ.. ఎమ్మెల్యే వర్గీయులు డిమాండ్ చేశారు. ఒకరినొకరు నెట్టుకుంటున్న క్రమంలో స్థానిక నేత జూపల్లి రమేష్ ఇరువర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించినా వినలేదు. 10 నిమిషాలపాటు సభలో గందరగోళం నెలకొంది. తోపులాట, మాటల యుద్ధం సాగింది. పార్టీ ఇన్‌చార్జ్ హెచ్చరించడంతో వారంతా శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment