ఖమ్మం, మయూరిసెంటర్: ఖమ్మం నియోజకవర్గంలో ఓటర్లు ఈ ఎన్నికల్లో భిన్నంగా ఆలోచించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను సైతం కాదని నోటా వైపు మొగ్గు చూపారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్‌ఎస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్, టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ఉప్పల శారద, బీఎల్‌పీ నుంచి పాల్వంచ రామారావు పోటీ చేయగా పోటీ అంతా టీఆర్‌ఎస్, టీడీపీల మధ్యనే జరిగింది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్లు 2,06,428. మొదటి నుంచి గట్టి పోటీదారులుగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ 1,02,760 ఓట్లు సాధించగా, నామ నాగేశ్వరరావు 91,769 ఓట్లు సాధించారు.
వీరిద్దరు మినహా ఇతర పార్టీల అభ్యర్థులు కనీస ఓట్లను కూడా సాధించలేకపోయారు. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి నోటా నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచింది. నోటా దెబ్బకి బీజేపీ, బీఎల్‌పీ అభ్యర్థులు 4, 6 స్థానాలల్లో నిలిచారు. ఇక బీఎస్‌పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీల అభ్యర్థులు సైతం కనీస ఓట్లను పొందలేకపోయారు. అయితే నోటాకు ఖమ్మం నియోజకవర్గంలో గతం కంటే ఈ దపా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1,408 మంది పోటీలో ఉన్న అభ్యర్థులు సరైనవారు కాదని నోటాకు ఓటు వేయగా, ఈసారి 3,513 మంది నోటాను నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థులు సరైన వారు కాదని భావించారు.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు పలువురు నోటాను ఎంచుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 19 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. దీంతో ఎన్నిక ఎన్నికకు నోటాకు ఆదరణ పెరుగుతుంది. నోటాకు ఉన్న ఆదరణ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దక్కడం లేదని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment