
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో
గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమకు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం.
గతం కంటే పెరిగిన నోటా ఓట్లు
మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్‌లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో వచ్చిన నోటా ఓట్లు
నియోజకవర్గం 2014లో 2018లో
సిర్పూర్ 1,752 1,579
చెన్నూరు 1,609 2,135
బెల్లంపల్లి 769 2,598
మంచిర్యాల 1,472 1,394
ఆసిఫాబాద్ 2,829 2,715
ఖానాపూర్ 2,421 2,776
ఆదిలాబాద్ 850 1,149
బోథ్ 2,242 2,275
నిర్మల్ 1,360 1,367
ముథోల్ 1,791 2,267
మొత్తం 17,095 20,255
Comments
Please login to add a commentAdd a comment