బండ్ల గణేశ్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్‌చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు.
అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో సదరు టీవీచానెళ్లు బండ్ల గణేశ్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాయి. కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఓటమి రేపు విజయానికి పునాదని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment