‘గుబాళిస్తున్న నా రాజకీయ జీవితం వెనుక గుబులెత్తించే వెతలెన్నో. కుటుంబ విషయాలపై సమష్టిగా చర్చించడం.. అంతిమ నిర్ణయాన్ని నాన్న అభీష్టానానికి వదిలేయడం. ఇది మా కుటుంబంలో కొనసాగుతున్న సంప్రదాయం. కుటుంబ ఆలనా.. పాలనా, భారం, బాధ్యత నా శ్రీమతి పువ్వాడ వసంతలక్ష్మి చూసుకుంటుంది. ఇందువల్లే నేను రాజకీయాలు, ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టగలుగుతున్నా. నా జీవితాన్ని అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, విషాదాలు వెంటాడాయి. కుటుంబపరంగా ఇద్దరిని కోల్పోయిన నష్టం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం. వాటి తాలూకు విషాద ఛాయలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి’ అంటున్న ఖమ్మం శాసనసభ్యుడు, టీఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఈవారం పర్సనల్ టైమ్.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదేళ్ల వయసున్న నా కూతురు హన్స అనారోగ్యంతో మృతి చెందడం మా కుటుంబాన్ని కోలుకోలేని మానసిక వ్యధకు గురిచేసింది. హన్స అకాల మరణంతో నా సతీమణి వసంతలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ప్రజల మధ్య.. ప్రజల కోసం పని చేస్తున్నామనే సంతృప్తి నా గత విషాద జ్ఞాపకాలను మర్చిపోయేలా చేస్తోంది. 1994లో హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో నాకు జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్రంగా కుంగదీసింది. మానసికంగా నేను సైతం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. డివైడర్‌కు కారు ఢీకొనడంతో కారు అద్దం పగిలి ముక్కలు కళ్లల్లో గుచ్చుకోవడంతో కంటికి తీవ్రంగా దెబ్బ తగిలింది. ఏడు నెలలపాటు ఏం చూడకుండానే గడపాల్సిన పరిస్థితి. శస్త్ర చికిత్సలు చేయించుకున్నాక మళ్లీ మామూలు స్థితికి రాగలిగాను. ఆ రోడ్డు ప్రమాదం మా కుటుంబానికి ఒక పీడకల లాంటిది.
ఇక నా కూతురు హన్స మా ఇంటి మహాలక్ష్మిలా వెలుగొందుతూ.. సందడి చేస్తున్న సమయంలో అనారోగ్య సమస్యలతో చనిపోవడం కుటుంబ సభ్యులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. ప్రతి పనిని ఛాలెంజ్‌గా తీసుకోవడం నాకిష్టం. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కొన్ని సందర్భాల్లో ఏటికి ఎదురీదడం తప్పదేమో.. అది నా జీవితంలో అనేకసార్లు జరిగింది. రాజకీయాల్లోనూ పెనుసవాళ్లు ఎదర్కొని తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐలో సీనియర్ నేతగా రెండుసార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా.. మరో రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసినా ఆయన ఏనాడూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. రాజకీయంగా పరిస్థితులకు అనుగుణంగా నేనే నిర్ణయం తీసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందే స్థాయిలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా ఆలోచనా విధానం మా ఇంట్లో ప్రత్యేకంగా ఉండేది. అత్యంత పట్టుదలగా.. అనుకున్నది సాధించే వ్యక్తిగా పేరుండేది. లక్ష్య సాధన కోసం ఎన్ని గంటలైనా పనిచేసే వ్యక్తిత్వం నాది.
కష్టాలకు కుంగిపోవడం, విజయాలకు ఉప్పొంగిపోవడం మా కుటుంబంలో లేదు. ఇప్పటికీ అమ్మ, నాన్న, అన్నయ్య ఉదయ్ భార్య జయశ్రీ, కుమారుడు నరేన్, నేను, మా అబ్బాయి నయన్‌రాజ్, నా సతీమణి వసంతలక్ష్మి అందరం కలిసి కుటుంబపరమైన అంశాలపై చర్చించుకునే సంప్రదాయం ఉంది. ఇక నయన్‌రాజ్‌కు లెక్కలంటే చిన్నప్పుడు చాలా భయం. పదో తరగతిలో మ్యాథ్స్ పరీక్ష అయిపోగానే ఇక లెక్కలతో నా కష్టాలు తీరాయని పడిన ఆనందం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. అతడి కోరిక మేరకే బైపీసీ చదివి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే ఎంఎస్ ఆర్థోలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. అమ్మమ్మకు, నానమ్మకు, తాతయ్యకు ఐదేళ్ల వయసులోనే ఉత్తుత్తి ఇంజక్షన్, స్టెతస్కోప్‌లతో పరీక్షలు చేస్తూ భావి డాక్టర్‌గా ఫోజ్ ఇచ్చేవాడని అజయ్ సతీమణి వసంతలక్ష్మి చమత్కరించారు. చదువుకోమని చెప్పే పరిస్థితి ఏరోజు నయన్ కల్పించలేదు.
ఇష్టమైన విద్య కావడంతో స్వతహాగానే చదువుకున్నాడు. ఇక బాస్కెట్‌బాల్ అంటే ఎడతెగని మక్కువ. కుటుంబపరంగా అందరం కలిసి షిరిడీ వంటి తీర్థయాత్రలకు వెళ్లిన సందర్భంలో మమ్మల్ని కాదనలేక వచ్చినా.. మళ్లీ గేమ్‌కు అటెండ్ అయ్యే విధంగా తన జర్నీని ప్లాన్ చేసుకునేవాడు. బాస్కెట్‌బాల్‌లో అనేక అవార్డులు సాధించాడు. అజయ్‌కుమార్‌ది కష్టించే మనస్తత్వం ఏదన్నా పట్టుపడితే ఆ పని పూర్తయ్యేంత వరకు రాత్రి పగలూ తేడా ఉండదు. ఆయన అగ్రికల్చర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న కాలంలో పొలం గట్లపై కిలోమీటర్ల కొద్దీ నడిచినా ఆ అలసటను మాత్రం ఇంటి వద్ద కనపడనిచ్చే వారు కాదు. మా మధ్య మాట పట్టింపులు ఉండవు. ఇంటి విషయాలు నేను, రాజకీయ విషయాలు ఆయన చూసుకుంటాం. ఇక గత ఎన్నికల్లోనూ.. 2014 ఎన్నికల్లోనూ ఆయన తరఫున పనిచేసిన అనేకానేక అంశాలు ప్రజల సమస్యలు నాకంట పడ్డాయి. వాటిని ఆయనతో చర్చించి పరిష్కారం చేయమని కోరేదాన్ని.
బతుకు పోరాటం చేశా..
నా సతీమణి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా.. నేను రాజకీయ కుటుంబంలోనే జన్మించినా సాధారణ నిరుద్యోగి మాదిరిగానే బతుకు పోరాటం చేయక తప్పలేదు. సొంతంగా ఖార్ఖానా ఉన్నా.. కార్మికుడి పాత్రను పోషించి బతుకు పోరాటం చేసి విజేతగా నిలిచాను. నేను రాజకీయాల్లోకి రాకముందు.. ఖమ్మంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకముందు అనేకమంది మాదిరిగా ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టా. తొలుత నగరంలోని ద్రాక్ష తోటలకు ఉద్యాన కన్సల్టెంట్‌గా పనిచేసి అనేక మంది ప్రముఖుల మన్ననలు పొందా. రాజకీయ దిగ్గజాలు, సినిమా యాక్టర్ల ద్రాక్ష తోటలను పర్యవేక్షించి సాంకేతిక సలహాలు ఇవ్వడం నా ఉద్యోగం. అందులో అనుభవాన్ని సంపాదించుకున్నా. అందువల్లే రైతుల, కూలీల కష్టాలను దగ్గరగా చూసే అద్భుత అవకాశం నేను చదువుకున్న ఎమ్మెస్సీ వ్యవసాయ విద్య ద్వారా లభించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి.. ఇష్టపడి ఎంచుకున్న వ్యవసాయ రంగంలోనూ.. వ్యాపారపరంగా అడుగిడిన వైద్య విద్యారంగంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నాకే విజేతనయ్యా. . చిన్నప్పట్నుంచే ప్రజల సమస్యలపై ఇంట్లోనే చర్చ జరుగుతుండడంతో సమాజంపై అవగాహన ఉండేది. ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగి ఉండే లక్షణం నాన్న నుంచే అబ్బింది. రాజకీయాల్లోకి రావాలి అనుకోలేదు.
వయోభారం రీత్యా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు క్రియాశీల రాజకీయాల నుంచి దూరం కావాలని అనుకుంటున్న తరుణమిది. ఇంట్లో రాజకీయాలపై మక్కువ, పట్టు ఉన్న అన్నయ్య పువ్వాడ ఉదయ్‌కుమార్ ఆకస్మికంగా మరణించడంతో ప్రజలతో మా కుటుంబానికి గల సత్సంబంధాలను కొనసాగించే బాధ్యత తీసుకోవాలని అనిపించింది. ఉదయ్ ఉంటే నేను వచ్చే వాణ్ణి కాదేమో. ఆయనకు రాజకీయ పరిపక్వత ఎక్కువ. రష్యాలో చదువుకోవడం వల్ల ఆయనకు సామాన్యుల జీవన విధానంపై, కమ్యూనిస్టు సిద్ధాంతంపై తిరుగులేని పట్టు ఉండేది. ప్రజా సమస్యలపై ముందు నుంచే అవగాహన ఉన్న నన్ను ప్రజలకు పరిచయం చేసింది మాత్రం ‘సాక్షి’ జనసభలు. ఖమ్మంలోని ప్రజా సమస్యలపై అవగాహన రావడానికి ఈ సభలు ఎంతో ఉపకరించాయి. మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో నేను ప్రింటింగ్ ప్రెస్‌ను చాలాకాలం నడిపి పని ఒత్తిడి ఉన్న రోజుల్లో అర్థరాత్రి వరకు ప్రింటింగ్ పని సొంతంగా చేసి డెలివరీ ఇచ్చేవాణ్ణి.
అర్థరాత్రి న్యూస్ పేపర్ రీళ్లు వస్తే కార్మికులతో సమానంగా నేను వాటిని భుజాలపై మోసేవాడిని. ఆది నుంచి కష్టపడటం తప్పు కాదనేది నా భావన. అయితే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల మాత్రం నాకు మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ. ఏటికి ఎదురీదడానికి ఇష్టపడే తత్వం నాది. ఇక కుటుంబ విషయాలకు వస్తే ప్రజా జీవితాన్ని ఇంత సాఫీగా నెట్టుకొస్తున్నానంటే రాజకీయంగా పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతున్నాను అంటే అందుకు నా సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి తోడ్పాటు, సహకారం మరువలేనిది. ఇక నా కూతురు హన్స, మా అన్నయ్య పువ్వాడ ఉదయ్‌కుమార్ కొద్దికాలం తేడాతో మరణించడంతో మా కుటుంబం యావత్తు కొద్ది సంవత్సరాలపాటు దుఃఖ సాగరంలో మునిగింది. అన్నయ్య మరణాన్ని అమ్మ, నాన్న జీర్ణించుకోవడానికి, సాధారణ జీవితంలోకి రావడానికి చాలాకాలం పట్టింది. నాకు ఉదయ్‌తో విపరీతమైన అనుబంధం.. ఆత్మీయత ఉండేది. ఒకవైపు అన్న.. మరోవైపు కన్న కూతురు కొద్ది తేడాతో మరణించడం మా కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment