Personal Interview
-
చిన్నాన్నే రోల్ మోడల్
సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆచార్య టి.భైరాగిరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొణిజేడు నుంచి విశాఖపట్నం వరకు ఆయన ప్రస్తానాన్ని ‘సాక్షి’కి వివరించారు. చిన్నతనం నుంచి చిన్నాన్నల నుంచి స్ఫూర్తి పొందానని, కళాశాల రోజుల నుంచి సివిల్ సర్వెంట్‌గా మారి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండేదని ఆయన వివరించారు. వ్యవసాయ కుటుంబం.. తండ్రి కోటిరెడ్డి వ్యవసాయదారుడు, తల్లి అచ్చమ్మ గృహిణి. కొణిజేడులో పాఠశాల విద్య, ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశారు. ఏయూ నుంచి 1980–82లో వృక్షశాస్త్రంలో పీజీ కోర్సును పూర్తిచేశారు. చిన్నాన్నల ప్రభావంతో.. చిన్నాన్న వెంకారెడ్డి ఐఏఎస్, మరో చిన్నాన్న టి.గోపాలరెడ్డి అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పని చేశారు. వీరి ప్రభావం చిన్నతనం నుంచి భైరాగి రెడ్డిపై బలంగా పడింది. వారి బాటలోనే సివిల్ సర్వెంట్ కావాలని పరితపించారు. పీజీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు వెళ్లిపోయారు. పరిశోధనలన్నీ సమాజ హితాలే.. పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ప్రాజెక్టులో భాగంగా ఆచార్య సుబ్బారెడ్డి వద్ద సీనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరి అండమాన్ ఐలాండ్స్‌లో పరిశోధనకు వెళ్లాం. అంతరించి పోతున్న గిరిజన జాతులు, వారి జీవనం, ఆహార శైలి, కట్టుబాట్లు తదితర అంశాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ పరిశోధన అందించింది. అక్కడే 9 నెలలు ఉండి 30 ఐలాండ్స్‌లో పరిశోధన జరిపాం. ప్రమాదకరమైన గిరిజన జాతుల నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొని సమర్థవంతంగా పరిశోధన ముగించాం. ఆచార్య ఎం.వి.సుబ్బారావు పర్యవేక్షణలో తూర్పు కనుమలపై చేసిన మమ్మేలియన్ సర్వే విస్తృత అవగాహన, అడవుల్లో జీవులపై పరిశోధనకు మార్గం చూపింది. వర్సిటీలో ఉద్యోగం... ► వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1994లో చేరారు. 2003లో అసోసియేట్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా పదోన్నతలు సాధించారు. ఆచార్య ఎన్.సోమేశ్వరరావుతో సంయుక్తంగా విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు విభిన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు. ► బార్క్, కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ ప్రతిపాదిత స్థలాల్లో జీవావరణ పరిస్థితులపై పరిశోధన, నగరంలో నీటి నాణ్యతపై పరిశోధన వంటి సమాజ హిత అంశాలపై పరిశోధనలు జరిపించారు. వీసీ సింహాద్రి వదలలేదు.. ► ఆచార్య వై.సి.సింహాద్రి వీసీగా పనిచేసిన కాలంలో నన్ను పరీక్షల విభాగంలో కో కన్వీనర్‌గా నియమించారు. అక్కడ నుంచి వై దొలగాల ని నేను కోరినా ఆయన ఒప్పుకోలేదు. మూడేళ్ల కాలం పరీక్షల విభాగంలోనే పనిచేశాను. చీఫ్ వార్డెన్‌గా ఎంచుకున్నాను.. ► పరిశోధకుడిగా నేను ఎదుర్కొన్న సమస్యలే నన్ను రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్‌గా పనిచేసేలా ప్రేరేపించాయి. అక్కడ పరిశోధకుల సమస్యలు తెలుసుకుని వసతి, భోజన ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు పనిచేశాను. మెరుగు పరచాలి.. పర్యావరణ శాస్త్ర ఆచార్యుడిగా వర్సిటీలో పర్యావరణాన్ని మార్పు చేసే దిశగా కొంత పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విభాగంలో పరిశుభ్రమైన తాగునీరు లభించే ఏర్పాటు చేస్తాను. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతాం. వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, ఎరువుగా మార్చే దిశగా కృషిచేస్తాం. వర్సిటీ విద్యార్థుల ప్రయోగశాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటిని ఎంతో మెరుగు పరచి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలి. హాస్టల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దుతాను. బయాలజీలో పరిశోధనకు గోల్డ్‌మెడల్.. 1984లో ఆచార్య సి.సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పర్యావరణ శాస్త్రంలో పీహెచ్‌డీకి చేరారు. ప్లాంట్, యానిమల్ ఇంటరాక్షన్ అంశంపై జరిపిన పరిశోధనకు 1988లో డాక్టరేట్‌తో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. విభాగమే ఆశ్రయమిచ్చింది.. పరిశోధక విద్యార్థిగా చేరిన నాటి నుంచి విభాగమే ఇల్లుగా మారింది. ఉదయం 8 గంటలకు విభాగానికి చేరుకుని పరిశోధన ప్రారంభించేవారు. మధ్యాహ్నం ఒక గంట విరామం తీసుకుని తిరిగి తన మార్గదర్శి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లే వరకు విభాగంలోనే ఉండేవారు. -
ఆ ప్రమాదం మా కుటుంబానికి ఓ పీడకల: ఎమ్మెల్యే
‘గుబాళిస్తున్న నా రాజకీయ జీవితం వెనుక గుబులెత్తించే వెతలెన్నో. కుటుంబ విషయాలపై సమష్టిగా చర్చించడం.. అంతిమ నిర్ణయాన్ని నాన్న అభీష్టానానికి వదిలేయడం. ఇది మా కుటుంబంలో కొనసాగుతున్న సంప్రదాయం. కుటుంబ ఆలనా.. పాలనా, భారం, బాధ్యత నా శ్రీమతి పువ్వాడ వసంతలక్ష్మి చూసుకుంటుంది. ఇందువల్లే నేను రాజకీయాలు, ప్రజా సమస్యలపై మరింత దృష్టి పెట్టగలుగుతున్నా. నా జీవితాన్ని అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, విషాదాలు వెంటాడాయి. కుటుంబపరంగా ఇద్దరిని కోల్పోయిన నష్టం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం. వాటి తాలూకు విషాద ఛాయలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి’ అంటున్న ఖమ్మం శాసనసభ్యుడు, టీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఈవారం పర్సనల్ టైమ్. సాక్షిప్రతినిధి, ఖమ్మం: పదేళ్ల వయసున్న నా కూతురు హన్స అనారోగ్యంతో మృతి చెందడం మా కుటుంబాన్ని కోలుకోలేని మానసిక వ్యధకు గురిచేసింది. హన్స అకాల మరణంతో నా సతీమణి వసంతలక్ష్మి మానసికంగా కుంగిపోయింది. కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ప్రజల మధ్య.. ప్రజల కోసం పని చేస్తున్నామనే సంతృప్తి నా గత విషాద జ్ఞాపకాలను మర్చిపోయేలా చేస్తోంది. 1994లో హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో నాకు జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్రంగా కుంగదీసింది. మానసికంగా నేను సైతం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. డివైడర్‌కు కారు ఢీకొనడంతో కారు అద్దం పగిలి ముక్కలు కళ్లల్లో గుచ్చుకోవడంతో కంటికి తీవ్రంగా దెబ్బ తగిలింది. ఏడు నెలలపాటు ఏం చూడకుండానే గడపాల్సిన పరిస్థితి. శస్త్ర చికిత్సలు చేయించుకున్నాక మళ్లీ మామూలు స్థితికి రాగలిగాను. ఆ రోడ్డు ప్రమాదం మా కుటుంబానికి ఒక పీడకల లాంటిది. ఇక నా కూతురు హన్స మా ఇంటి మహాలక్ష్మిలా వెలుగొందుతూ.. సందడి చేస్తున్న సమయంలో అనారోగ్య సమస్యలతో చనిపోవడం కుటుంబ సభ్యులందరినీ విషాదంలోకి నెట్టివేసింది. ప్రతి పనిని ఛాలెంజ్‌గా తీసుకోవడం నాకిష్టం. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కొన్ని సందర్భాల్లో ఏటికి ఎదురీదడం తప్పదేమో.. అది నా జీవితంలో అనేకసార్లు జరిగింది. రాజకీయాల్లోనూ పెనుసవాళ్లు ఎదర్కొని తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐలో సీనియర్ నేతగా రెండుసార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా.. మరో రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసినా ఆయన ఏనాడూ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు. రాజకీయంగా పరిస్థితులకు అనుగుణంగా నేనే నిర్ణయం తీసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందే స్థాయిలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా ఆలోచనా విధానం మా ఇంట్లో ప్రత్యేకంగా ఉండేది. అత్యంత పట్టుదలగా.. అనుకున్నది సాధించే వ్యక్తిగా పేరుండేది. లక్ష్య సాధన కోసం ఎన్ని గంటలైనా పనిచేసే వ్యక్తిత్వం నాది. కష్టాలకు కుంగిపోవడం, విజయాలకు ఉప్పొంగిపోవడం మా కుటుంబంలో లేదు. ఇప్పటికీ అమ్మ, నాన్న, అన్నయ్య ఉదయ్ భార్య జయశ్రీ, కుమారుడు నరేన్, నేను, మా అబ్బాయి నయన్‌రాజ్, నా సతీమణి వసంతలక్ష్మి అందరం కలిసి కుటుంబపరమైన అంశాలపై చర్చించుకునే సంప్రదాయం ఉంది. ఇక నయన్రాజ్కు లెక్కలంటే చిన్నప్పుడు చాలా భయం. పదో తరగతిలో మ్యాథ్స్ పరీక్ష అయిపోగానే ఇక లెక్కలతో నా కష్టాలు తీరాయని పడిన ఆనందం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. అతడి కోరిక మేరకే బైపీసీ చదివి.. ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే ఎంఎస్ ఆర్థోలో జాయిన్ అయ్యాడు. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు. అమ్మమ్మకు, నానమ్మకు, తాతయ్యకు ఐదేళ్ల వయసులోనే ఉత్తుత్తి ఇంజక్షన్, స్టెతస్కోప్‌లతో పరీక్షలు చేస్తూ భావి డాక్టర్‌గా ఫోజ్ ఇచ్చేవాడని అజయ్ సతీమణి వసంతలక్ష్మి చమత్కరించారు. చదువుకోమని చెప్పే పరిస్థితి ఏరోజు నయన్ కల్పించలేదు. ఇష్టమైన విద్య కావడంతో స్వతహాగానే చదువుకున్నాడు. ఇక బాస్కెట్‌బాల్ అంటే ఎడతెగని మక్కువ. కుటుంబపరంగా అందరం కలిసి షిరిడీ వంటి తీర్థయాత్రలకు వెళ్లిన సందర్భంలో మమ్మల్ని కాదనలేక వచ్చినా.. మళ్లీ గేమ్‌కు అటెండ్ అయ్యే విధంగా తన జర్నీని ప్లాన్ చేసుకునేవాడు. బాస్కెట్‌బాల్‌లో అనేక అవార్డులు సాధించాడు. అజయ్కుమార్ది కష్టించే మనస్తత్వం ఏదన్నా పట్టుపడితే ఆ పని పూర్తయ్యేంత వరకు రాత్రి పగలూ తేడా ఉండదు. ఆయన అగ్రికల్చర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న కాలంలో పొలం గట్లపై కిలోమీటర్ల కొద్దీ నడిచినా ఆ అలసటను మాత్రం ఇంటి వద్ద కనపడనిచ్చే వారు కాదు. మా మధ్య మాట పట్టింపులు ఉండవు. ఇంటి విషయాలు నేను, రాజకీయ విషయాలు ఆయన చూసుకుంటాం. ఇక గత ఎన్నికల్లోనూ.. 2014 ఎన్నికల్లోనూ ఆయన తరఫున పనిచేసిన అనేకానేక అంశాలు ప్రజల సమస్యలు నాకంట పడ్డాయి. వాటిని ఆయనతో చర్చించి పరిష్కారం చేయమని కోరేదాన్ని. బతుకు పోరాటం చేశా.. నా సతీమణి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా.. నేను రాజకీయ కుటుంబంలోనే జన్మించినా సాధారణ నిరుద్యోగి మాదిరిగానే బతుకు పోరాటం చేయక తప్పలేదు. సొంతంగా ఖార్ఖానా ఉన్నా.. కార్మికుడి పాత్రను పోషించి బతుకు పోరాటం చేసి విజేతగా నిలిచాను. నేను రాజకీయాల్లోకి రాకముందు.. ఖమ్మంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకముందు అనేకమంది మాదిరిగా ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టా. తొలుత నగరంలోని ద్రాక్ష తోటలకు ఉద్యాన కన్సల్టెంట్‌గా పనిచేసి అనేక మంది ప్రముఖుల మన్ననలు పొందా. రాజకీయ దిగ్గజాలు, సినిమా యాక్టర్ల ద్రాక్ష తోటలను పర్యవేక్షించి సాంకేతిక సలహాలు ఇవ్వడం నా ఉద్యోగం. అందులో అనుభవాన్ని సంపాదించుకున్నా. అందువల్లే రైతుల, కూలీల కష్టాలను దగ్గరగా చూసే అద్భుత అవకాశం నేను చదువుకున్న ఎమ్మెస్సీ వ్యవసాయ విద్య ద్వారా లభించింది. నన్ను నేను నిరూపించుకోవడానికి.. ఇష్టపడి ఎంచుకున్న వ్యవసాయ రంగంలోనూ.. వ్యాపారపరంగా అడుగిడిన వైద్య విద్యారంగంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నాకే విజేతనయ్యా. . చిన్నప్పట్నుంచే ప్రజల సమస్యలపై ఇంట్లోనే చర్చ జరుగుతుండడంతో సమాజంపై అవగాహన ఉండేది. ఎంత ఎత్తు ఎదిగినా.. ఒదిగి ఉండే లక్షణం నాన్న నుంచే అబ్బింది. రాజకీయాల్లోకి రావాలి అనుకోలేదు. వయోభారం రీత్యా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు క్రియాశీల రాజకీయాల నుంచి దూరం కావాలని అనుకుంటున్న తరుణమిది. ఇంట్లో రాజకీయాలపై మక్కువ, పట్టు ఉన్న అన్నయ్య పువ్వాడ ఉదయ్‌కుమార్ ఆకస్మికంగా మరణించడంతో ప్రజలతో మా కుటుంబానికి గల సత్సంబంధాలను కొనసాగించే బాధ్యత తీసుకోవాలని అనిపించింది. ఉదయ్ ఉంటే నేను వచ్చే వాణ్ణి కాదేమో. ఆయనకు రాజకీయ పరిపక్వత ఎక్కువ. రష్యాలో చదువుకోవడం వల్ల ఆయనకు సామాన్యుల జీవన విధానంపై, కమ్యూనిస్టు సిద్ధాంతంపై తిరుగులేని పట్టు ఉండేది. ప్రజా సమస్యలపై ముందు నుంచే అవగాహన ఉన్న నన్ను ప్రజలకు పరిచయం చేసింది మాత్రం ‘సాక్షి’ జనసభలు. ఖమ్మంలోని ప్రజా సమస్యలపై అవగాహన రావడానికి ఈ సభలు ఎంతో ఉపకరించాయి. మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో నేను ప్రింటింగ్ ప్రెస్‌ను చాలాకాలం నడిపి పని ఒత్తిడి ఉన్న రోజుల్లో అర్థరాత్రి వరకు ప్రింటింగ్ పని సొంతంగా చేసి డెలివరీ ఇచ్చేవాణ్ణి. అర్థరాత్రి న్యూస్ పేపర్ రీళ్లు వస్తే కార్మికులతో సమానంగా నేను వాటిని భుజాలపై మోసేవాడిని. ఆది నుంచి కష్టపడటం తప్పు కాదనేది నా భావన. అయితే ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల మాత్రం నాకు మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ. ఏటికి ఎదురీదడానికి ఇష్టపడే తత్వం నాది. ఇక కుటుంబ విషయాలకు వస్తే ప్రజా జీవితాన్ని ఇంత సాఫీగా నెట్టుకొస్తున్నానంటే రాజకీయంగా పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతున్నాను అంటే అందుకు నా సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి తోడ్పాటు, సహకారం మరువలేనిది. ఇక నా కూతురు హన్స, మా అన్నయ్య పువ్వాడ ఉదయ్‌కుమార్ కొద్దికాలం తేడాతో మరణించడంతో మా కుటుంబం యావత్తు కొద్ది సంవత్సరాలపాటు దుఃఖ సాగరంలో మునిగింది. అన్నయ్య మరణాన్ని అమ్మ, నాన్న జీర్ణించుకోవడానికి, సాధారణ జీవితంలోకి రావడానికి చాలాకాలం పట్టింది. నాకు ఉదయ్‌తో విపరీతమైన అనుబంధం.. ఆత్మీయత ఉండేది. ఒకవైపు అన్న.. మరోవైపు కన్న కూతురు కొద్ది తేడాతో మరణించడం మా కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం -
నాకు నేను... ‘సో క్యూట్’ అనుకున్నా!
అనుష్క... తెర మీద సూపర్‌స్టార్. తెర వెనుక ముద్దుగా... ‘స్వీటీ’. మాట తీరులో, మనిషి నడతలో ఎక్కడా సగటు సినిమా స్టార్ల తాలూకు హిపోక్రసీ లేని అసలు సిసలు స్వీటీ. అక్టోబర్ 9 నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 3డీలో అలరించనున్న అభినవ ‘రుద్రమదేవి’. ఆ చిత్ర ప్రమోషన్‌కి చెన్నై, బొంబాయిల మధ్య టూర్స్‌తో ఆమె బిజీ బిజీ. ఆ క్రమంలో హఠాత్తుగా జూబ్లీహిల్స్ ‘యునెటైడ్ కిచెన్స ఆఫ్ ఇండియా’లో తారసపడ్డారు. అందమంటే, మానసిక - శారీరక ఆరోగ్యాలు రెండూ అనే ఈ మాజీ యోగా టీచర్ అచ్చమైన గోలీ సోడాను ఆస్వాదిస్తూ మామూలు మధ్యతరగతి అమ్మాయిలా కనిపించారు. ‘సైజ్ జీరో’ కోసం పెరిగిన బరువును ఇప్పుడు తగ్గించుకొనే పనిలో ఉన్నా, చిన్నప్పటి గోలీ సోడా ఆనందాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక, ఆరెంజ్ రంగు గోలీసోడా రెండోది లాగిస్తూ, రీల్ లైఫ్ ‘రుద్రమదేవి’ నుంచి తన రియల్ లైఫ్ ఫిలాసఫీ దాకా అనేక విషయాలు మనసు విప్పి పంచుకున్న ఈ బెంగళూరు భామతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ‘బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో’ - వరుసగా మూడు విలక్షణప్రాజెక్ట్లు చేస్తున్న హీరోయిన్ మీరే! (నవ్వుతూ...) థ్యాంక్స్. ఒకేసారి ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ రావడం నా అదృష్టం. మేకర్స్ గుణశేఖర్, రాజమౌళితో ఒకేసారి వర్క చేయడం...? ఇద్దరూ ఇద్దరే! ఇద్దరివీ వేర్వేరు స్కూల్స్. కానీ, ఇద్దరికీ పని మీదే ఏకాగ్రదృష్టి. సక్సెస్ రేట్‌తో సంబంధం లేకుండా ఇద్దరూ చాలా మంచి టెక్నీషియన్స్. ఒకేసారి ఇద్దరితో కలసి పనిచేయడం బాగుంది. ముందుగా ఏ సినిమా ఆఫర్ వచ్చింది? సరిగ్గా గుర్తులేదు. ‘రుద్రమదేవి’ అనుకుంటా. దాదాపు అప్పుడే ‘బాహుబలి’ ఆఫర్. రెండూ ఒప్పుకున్నా. ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి మారడం కష్టమనిపించలేదా? బేసిక్‌గా అయామ్ ఎ డెరైక్టర్స్ యాక్టర్. వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని చేస్తుంటాను. సెట్స్‌కు వెళ్ళగానే ఐ విల్ స్విచ్చాన్ విత్ డెరైక్టర్. స్విచ్చాఫ్ విత్ డెరైక్టర్. నిజానికి, ఇప్పటికీ నేను నటన నేర్చుకొంటున్నా. నిజంగానే అంటున్నారా? పదేళ్ళు అయిపోయిందిగా? నిజమే. నాగార్జున ‘సూపర్’తో నటిగా నా జర్నీ మొదలుపెట్టి, ఇప్పటికి పదేళ్ళయింది. ‘సూపర్’ నాటికి అసలు నటనంటే ఏమిటని కూడా తెలీదు. నాగ్, పూరీ జగన్నాథ్ చాలా ప్రోత్సహించారు. మేకప్, డ్యాన్స్, యాక్టింగ్ - ఇలా అన్నీ పూరీ దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి నుంచి ఒక్కో సినిమాకు, ఒక్కో డెరైక్టర్ దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నా. తొలి రోజుల్లో ఈ రంగం వదిలిపోదామనుకొని, చివరకింత స్టారయ్యారే! (ఆలోచనలోకెళుతూ...) మొదట ఏడాదిన్నర పాటు అయితే, వెళ్ళిపోవాలనే అనుకున్నా. తరువాత కుదురుకున్నా. ఇప్పటికీ నాకు స్టిల్ కెమేరాలంటే కూడా అయామ్ వెరీ షై. ఇప్పుడిప్పుడే ఆ సిగ్గు వదిలించుకోగలుగుతున్నా. ఈ పదేళ్ళ సినీ అనుభవంతో నటిగానే కాదు, వ్యక్తిగానూ ఎదిగా. ఈ రంగాన్ని వదిలేసి, పారిపోయి ఉంటే చాలా బాధపడి ఉండేదాన్ని. ఈ ప్రయాణంలో వ్యక్తిగా మీలో వచ్చిన మార్పు, పరిణతి ఏమిటి? చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో అర్థమవుతుంటుంది. ఎంత ఎదిగినా, కాళ్ళు నేల మీదే ఉండాలనే భావన మరీ దృఢమైంది. నాతో నేను దగ్గరగా ఉంటున్నా. నా స్నేహితులు, నా యోగా గురువు భరత్ ఠాకూర్ లాంటి నా వాళ్ళకు దగ్గరయ్యా. ఇక్కడకు వచ్చాక మీరు మార్చుకున్న గుణం? నాకో చెడ్డ అలవాటుండేది. ఫోన్ సెలైంట్ మోడ్‌లో ఉంచేదాన్ని. ఫోన్‌కాల్స్ వచ్చినా, తీసి మాట్లాడేదాన్ని కాదు. ఏదో పని చూసుకొంటూ ఉండేదాన్ని. దాని వల్ల నాకు ఏమైందో, ఏమిటోనని అవతలివాళ్ళు కంగారుపడేవాళ్ళు. ఆ అలవాటు మార్చుకున్నా. ఫోన్లు కూడా తీయనంటున్నారు. ఎమోషనల్‌గా మీరు ఎవరి మీదా ఆధారపడరేమో? అదేమీ లేదు. ఎమోషనల్‌గా ఇతరుల మీద చాలా ఆధారపడుతుంటా. చెన్నైలో నా మేకప్ ఉమన్ భాను, అక్కడి ఫ్రెండ్స్, నా యోగా ఫ్రెండ్స్ - ఇలా పెద్ద లిస్టే ఉంది. మీకు మీరు నచ్చని సందర్భాలు ఉంటాయా? అయామ్ నాట్ వెరీగుడ్ ఎట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనిపిస్తుంటుంది. మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు నా గురించి అన్నీ తెలుసు. వాళ్ళతో అన్నీ పంచుకుంటా. వాళ్ళందరూ తమ కష్టాలు నాతో చెప్పుకుంటారు. వాళ్ళ ఒత్తిడి నాకూ ఉంటుంది. ఒకప్పుడు యోగా టీచరైన మీకు మానసిక ఒత్తిడా? నేనూ మనిషినేగా! ఒత్తిడి ఉంటుంది. అయితే, విందులు, వినోదాలు, పార్టీలకు వెళ్ళను. ఇంట్లోనే ఉంటా. నా యోగా ఫ్రెండ్స్ దుబాయ్, మలేసియా - ఇలా రకరకాల చోట్ల ఉన్నారు. టైమ్ దొరికితే, వాళ్ళను కలుస్తా. ‘రుద్రమదేవి’ లాంటి పాత్రలకు చాలా శారీరక శ్రమ చేస్తారు. షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక ఎలా ఉంటుంది? శారీరక శ్రమ వల్ల ఒంటి నిండా నొప్పులు, గాయాలే. షూటింగై ఇంటికి వచ్చాక, అలసటతో పాటు, వెర్రెత్తిపోయుంటాం. అలాంటప్పుడు నా సహాయకులతో ‘మీరు నన్ను సరిగ్గా చూసుకోవడం లేద’ని కాస్తంత మారాం చేస్తా. అలుగుతా. అలాంటప్పుడు వాళ్ళు గారం చేసి, బుజ్జగించాలనుకుంటా. ఇంట్లో ప్రతి ఒక్కరి అటెన్షన్ నా మీదే ఉండాలని పిచ్చిగా కోరుకుంటా. ఇప్పటికీ బెంగళూరులో మా ఇంటికి వెళితే, అన్నయ్య రూమ్‌లో హాయిగా పడుకుంటా. కొన్నిసార్లు ఎవరితోనూ పెద్దగా మాట్లాడను కూడా మాట్లాడను. అయితే, నా చుట్టూ మనుషులుండాలి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి. అలా ఉంటే నా కిష్టం. చాలామందిలా మీ అమ్మ, నాన్న మీ వెంట కనిపించరే! వాళ్ళ జీవితం వదిలేసి, రాత్రింబగళ్ళు నా వెంటే సెట్స్‌లో ఉండి టైమ్ వేస్ట్ చేసుకోవడమెందుకు? పైగా, వాళ్ళుంటే వాళ్ళ బాగోగుల మీదే నా ఫోకస్ ఉంటుందని సినిమా ఫంక్షన్లకు కూడా రానివ్వను. చూడాలనిపిస్తే వాళ్ళు రావడమో, నేను వెళ్ళడమో చేస్తాం. వరంగల్‌లో వేలమంది మధ్య ‘రుద్రమ..’ ఆడియోకు తొలిసారి వచ్చినట్లున్నారు! అది ఏదో అనుకొని కావాలని చేసింది కాదు. గుణశేఖర్ భార్య రాగిణి గారితో సాన్నిహిత్యంతో అలా కుదిరింది. గుణశేఖర్ గారు ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడిన ఆ ఆడియో ఫంక్షన్లో వేలాది జనం మధ్య మా అమ్మా నాన్న గురించి నేను కొంచెం ఆందోళన పడ్డాను. కానీ, వాళ్ళు మాత్రం ‘రుద్రమదేవి’ పాత్ర నేను పోషించినందుకు చాలా సంతోషించారు. వాళ్ళు కూడా ఈ సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా రుద్రమదేవి గెటప్‌లో అద్దంలో చూసుకున్నప్పుడూ, ట్రైలర్ ఆవిష్కరణలో ‘ఐమ్యాక్స్’ తెరపై చూసుకున్నప్పుడూ మీ మనసులో కలిగిన భావం? షూటింగ్లో 3 - 4 కేజీల బంగారు నగలు వేసుకున్నా. బరువైన కాస్ట్యూమ్స్ కూడా ధరించా. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను ‘సో క్యూట్’ అనుకున్నా. ఇక, అంత మంది ముందు, ఐమ్యాక్స్ తెరపై చూసుకొనే ముందు కొద్దిగా టెన్షన్ ఫీలయ్యా. అలాంటి చోట్ల ఎలా రియాక్ట్ కావాలో నాకు తెలీదు. అందుకే, నా పక్కనే కూర్చొన్న నా సన్నిహితుల బుర్ర తినేస్తుంటా. అందరూ బాగుందనడంతో టెన్షన్ తీరింది. మీరు దేవుణ్ణి నమ్ముతారా? కచ్చితంగా. బేసిక్‌గా నేను గాడ్ లవింగ్ తప్ప గాడ్ ఫియరింగ్ కాదు. గుడి, దర్గా, చర్చి - అన్నిటికీ వెళతా. దేవుళ్ళందరిలోకీ నాకు శివుడంటే ఇష్టం. అలాగే, షిర్డీ సాయి, దుర్గాదేవి అంటే కూడా ఇష్టం. అయితే, పూజలు, వ్రతాలు లాంటివి అలవాటు లేదు. అవి చేయను, తెలియదు కూడా! నాకు అనిపించినట్లు చేస్తానే తప్ప, ఫలానాగా చేయాలని ఎవరైనా చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎవరైనా ఫలానా లాగా చేయాలని బలవంతపెడితే, నాలో ప్రతిఘటన మొదలైపోతుంది. కానీ, నేను బేసిక్‌గా ప్రకృతిని ఆరాధిస్తా. ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇంట్లో దీపారాధన చేస్తా. అలాగే, నీళ్ళు, పువ్వులు పెడతా. ఇలా గాలి, నీరు, నిప్పు లాంటి పంచభూతాలు మనసుకు ఆహ్లాదమిస్తాయి. డిఫరెంట్, సీరియస్ పాత్రల్లో ఇమిడిపోయారు. మళ్ళీ గ్లామర్ హీరోయిన్గా ఎప్పుడు? (నవ్వేస్తూ) నాకూ ఇప్పుడలాంటి పాత్ర చేయాలని ఉంది. సీరియస్, గ్లామర్ పాత్రలు - రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం నాకిష్టం. వేర్వేరు తరహా చిత్రాలు, పాత్రలు చేయాల నుంది. కానీ ముందుగా ప్లాన్ చేసుకోను. ఎందుకంటే, అది నాకు సూట్ కాదు. దానంతట అది జరగాలంతే! అంటే, మీరు విధి మీద వదిలేస్తారన్న మాట! విధిని నమ్ముతాను, కానీ డెస్టినీకి వదిలేయకూడదు. మన బెస్ట్ ఇవ్వాలి. చివరకేం జరిగితే అది డెస్టినీ. ‘సైజ్‌జీరో’ను కూడా పోటీగా ఈ 9వ తేదీనే రిలీజ్ చేయాలని ఆ మధ్య కొందరు ఆలోచన చేసినట్లున్నారే? లేదు. ఎప్పుడూ రెండూ ఒకేరోజు రిలీజ్ అనుకో లేదు. ఒకవేళ ఒక సినిమా రిలీజ్ కాకపోతే, రెండోదనే అనుకున్నారు. ‘సైజ్‌జీరో’ను లేట్‌గా రిలీజ్ చేస్తారు. మరి సినిమాల రిలీజ్ ముందురోజు ఎలా ఉంటారు? నేను నటించిన ఏ సినిమాకూ ఎవరికీ నష్టం రాకూడదనుకుంటా. రిలీజ్ ముందు రోజు చాలా నెర్వస్‌గా ఉంటుంది. ఎలా రియాక్టవాలో తెలీదు. స్ట్రెస్ భరించలేక అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో కూర్చొని రాత్రి మాట్లాడుతూంటా. రిలీజయ్యాక జనం మధ్య సినిమా చూస్తా. లేడీ ఓరియంటెడ్ ‘రుద్రమదేవి’కి రూ. 70 కోట్ల బడ్జెటని మన హీరోలు ఉడుక్కోరూ? అలా ఏమీ లేదు. రానా, ప్రభాస్, అల్లు అర్జున్ అంతా ఎంకరేజ్ చేశారు. రుద్రమదేవి, దేవసేన లాంటి పాత్రల్లో మీరు కాకుంటే, మరెవరిని మీరు ఊహిస్తారు? నన్ను ఇలాంటి సినిమాల్లో, పాత్రల్లో ఊహించుకొని, ‘అరుంధతి’ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారికి థ్యాంక్స్. ఆయన లేకపోతే ఇవాళ నాకీ పాత్రలు లేవు. ఇప్పటి హీరోయిన్స్‌లో ఇలాంటి రాజసిక పాత్రలకు నయనతార ఫేస్ సూట్ అవుతుంది. ‘రుద్రమదేవి’ సినిమా, పాత్ర... ఒక నటిగా సరే, ఒక వ్యక్తిగా మీకు ఇచ్చిందేమిటి? ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. నేను చూస్తుండగానే, గుణశేఖర్ గారి పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. పెద్దమ్మాయి నీలిమ నాకు అన్న, చిన్నమ్మాయి యుక్త నా తమ్ముడు. ‘రుద్రమదేవి’ లాంటి ఛాన్స మీకు మళ్ళీ వస్తే? తప్పకుండా చేస్తా! గుణశేఖర్ లాంటి క్రియేటర్స్ దగ్గర ఛాన్సొస్తే కాదంటామా! ‘రుద్రమదేవి’కి సీక్వెల్ ‘ప్రతాపరుద్రుడు’ తీస్తారని టాక్ అది నాకు తెలీదు కానీ, నేను చేసిన ఏ ప్రాజెక్ట్‌కైనా సీక్వెల్ చేయమంటే, ఆలోచించకుండా అంగీకరిస్తా. ఇలాంటి అవకాశాలు ‘రుద్రమదేవి’పై ఇప్పుడు మీ మనసులోని ఆలోచన? ‘రుద్రమదేవి’ కథే తప్ప, వేషభాషల లాంటి రిఫరెన్స్లేమీ హిస్టరీలో లేవు. పాత్రల ‘లుక్’ నుంచి అన్నీ దర్శక - నిర్మాత గుణశేఖర్ చాలా కష్టపడి రీ-క్రియేట్ చేశారు. చరిత్రను డాక్యుమెంటరీలా కాక, మంచి ఎమోషనల్ స్టోరీగా, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీశారు. చాలా ఏళ్ళుగా ఆయన కంటున్న కల ఇది. దాన్ని నిజం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టి, మూడేళ్ళు శ్రమపడ్డారు. ఆయన భార్య, పిల్లలిద్దరూ కష్టపడ్డారు. ఇది నాకు మోస్ట్ ఎమోషనల్ జర్నీ. వాళ్ళ సపోర్ట్, చూపిన దీక్ష మర్చిపోలేను. టెక్నీషియన్లు ప్రాణం పెట్టి, నిజాయతీగా పనిచేస్తే, మరెన్నో కుటుంబాలు ఆధారపడ్డ ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. తెలుగువారి చరిత్రను ప్రపంచానికి చాటిన వెండితెర కృషిగా చరిత్ర సృష్టించాలి. సినీచరిత్రలో ప్రత్యేకంగా నిలవాలి. అందరికీ రావు కదా! - రెంటాల జయదేవ