ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య భైరాగిరెడ్డి
సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆచార్య టి.భైరాగిరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొణిజేడు నుంచి విశాఖపట్నం వరకు ఆయన ప్రస్తానాన్ని ‘సాక్షి’కి వివరించారు. చిన్నతనం నుంచి చిన్నాన్నల నుంచి స్ఫూర్తి పొందానని, కళాశాల రోజుల నుంచి సివిల్ సర్వెంట్‌గా మారి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండేదని ఆయన వివరించారు.
వ్యవసాయ కుటుంబం..
తండ్రి కోటిరెడ్డి వ్యవసాయదారుడు, తల్లి అచ్చమ్మ గృహిణి. కొణిజేడులో పాఠశాల విద్య, ఒంగోలు సీఎస్‌ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశారు. ఏయూ నుంచి 1980–82లో వృక్షశాస్త్రంలో పీజీ కోర్సును పూర్తిచేశారు.
చిన్నాన్నల ప్రభావంతో..
చిన్నాన్న వెంకారెడ్డి ఐఏఎస్, మరో చిన్నాన్న టి.గోపాలరెడ్డి అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పని చేశారు. వీరి ప్రభావం చిన్నతనం నుంచి భైరాగి రెడ్డిపై బలంగా పడింది. వారి బాటలోనే సివిల్ సర్వెంట్ కావాలని పరితపించారు. పీజీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు వెళ్లిపోయారు.
పరిశోధనలన్నీ సమాజ హితాలే..
పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ప్రాజెక్టులో భాగంగా ఆచార్య సుబ్బారెడ్డి వద్ద సీనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరి అండమాన్ ఐలాండ్స్‌లో పరిశోధనకు వెళ్లాం. అంతరించి పోతున్న గిరిజన జాతులు, వారి జీవనం, ఆహార శైలి, కట్టుబాట్లు తదితర అంశాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ పరిశోధన అందించింది. అక్కడే 9 నెలలు ఉండి 30 ఐలాండ్స్‌లో పరిశోధన జరిపాం. ప్రమాదకరమైన గిరిజన జాతుల నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొని సమర్థవంతంగా పరిశోధన ముగించాం. ఆచార్య ఎం.వి.సుబ్బారావు పర్యవేక్షణలో తూర్పు కనుమలపై చేసిన మమ్మేలియన్ సర్వే విస్తృత అవగాహన, అడవుల్లో జీవులపై పరిశోధనకు మార్గం చూపింది.
వర్సిటీలో ఉద్యోగం...
► వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1994లో చేరారు. 2003లో అసోసియేట్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా పదోన్నతలు సాధించారు. ఆచార్య ఎన్.సోమేశ్వరరావుతో సంయుక్తంగా విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు విభిన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు.
► బార్క్, కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ ప్రతిపాదిత స్థలాల్లో జీవావరణ పరిస్థితులపై పరిశోధన, నగరంలో నీటి నాణ్యతపై పరిశోధన వంటి సమాజ హిత అంశాలపై పరిశోధనలు జరిపించారు.
వీసీ సింహాద్రి వదలలేదు..
► ఆచార్య వై.సి.సింహాద్రి వీసీగా పనిచేసిన కాలంలో నన్ను పరీక్షల విభాగంలో కో కన్వీనర్‌గా నియమించారు. అక్కడ నుంచి వై దొలగాల ని నేను కోరినా ఆయన ఒప్పుకోలేదు. మూడేళ్ల కాలం పరీక్షల విభాగంలోనే పనిచేశాను.
చీఫ్ వార్డెన్‌గా ఎంచుకున్నాను..
► పరిశోధకుడిగా నేను ఎదుర్కొన్న సమస్యలే నన్ను రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్‌గా పనిచేసేలా ప్రేరేపించాయి. అక్కడ పరిశోధకుల సమస్యలు తెలుసుకుని వసతి, భోజన ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు పనిచేశాను.
మెరుగు పరచాలి..
పర్యావరణ శాస్త్ర ఆచార్యుడిగా వర్సిటీలో పర్యావరణాన్ని మార్పు చేసే దిశగా కొంత పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విభాగంలో పరిశుభ్రమైన తాగునీరు లభించే ఏర్పాటు చేస్తాను. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతాం. వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, ఎరువుగా మార్చే దిశగా కృషిచేస్తాం. వర్సిటీ విద్యార్థుల ప్రయోగశాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటిని ఎంతో మెరుగు పరచి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలి. హాస్టల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దుతాను.
బయాలజీలో పరిశోధనకు గోల్డ్‌మెడల్..
1984లో ఆచార్య సి.సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పర్యావరణ శాస్త్రంలో పీహెచ్‌డీకి చేరారు. ప్లాంట్, యానిమల్ ఇంటరాక్షన్ అంశంపై జరిపిన పరిశోధనకు 1988లో డాక్టరేట్‌తో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు.
విభాగమే ఆశ్రయమిచ్చింది..
పరిశోధక విద్యార్థిగా చేరిన నాటి నుంచి విభాగమే ఇల్లుగా మారింది. ఉదయం 8 గంటలకు విభాగానికి చేరుకుని పరిశోధన ప్రారంభించేవారు. మధ్యాహ్నం ఒక గంట విరామం తీసుకుని తిరిగి తన మార్గదర్శి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లే వరకు విభాగంలోనే ఉండేవారు.
Comments
Please login to add a commentAdd a comment