పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న బైరాగిరెడ్డి
సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా పర్యావరణ శాస్త్ర విభాగ ఆచార్యులు టి.బైరాగి రెడ్డి నియమితులయ్యారు. వీసీ ఆచార్య నాగేశ్వరరావు శని వారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయనకు ఉత్తర్వులు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన 5.15 గంటలకు ఆచార్య కె.నిరంజన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
వర్సిటీలో ఉదయం నుంచి సందడే..
ఏయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య బైరాగిరెడ్డిని నియమిస్తున్నట్లు శనివారం ఉదయం నుంచే వర్సిటీలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో పర్యావరణ విభాగంలోని ఆయన కార్యాలయం ఆచార్యులు, ఉద్యోగులతో ఉదయం నుంచే సందడిగా మారింది. అయితే మధ్యాహ్నం వరకు ఎటువంటి అధికారిక సమాచారం అందకపోవడంతో ఉత్కం ఠ నెలకొంది. సాయంత్రం 5గంటలకు ఉత్తర్వులు వెలువడడం, బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి.
అనంతరం ఆచార్య బైరాగి రెడ్డి వర్సిటీలోని వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, సి. ఆర్.రెడ్డి, అంబేడ్కర్, జ్యోతిరావుపూలే, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచా ర్య ఎం.ప్రసాదరావు మీడియా రిలేషన్స్ అసోసియేట్ డీన్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బైరాగి రెడ్డికి వర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు, ఆచార్యులు, పరిశోధకులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
అందరికీ ఆప్తుడు
పర్యావరణ ఆచార్యుడిగా సుపరిచితులైన బైరాగిరెడ్డి అందరికీ ఆప్తులు. ఎన్విరాన్‌మెంటల్ మైక్రో బయాలజీ, ప్లాంట్ యానిమల్ ఇంటరాక్షన్, సాయిల్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ అంశాల్లో నిష్ణాతులు. జీఐఎస్ స్టడీస్ అండ్ పంప్ సెట్స్ ఆఫ్ విశాఖపట్నం, కాకినాడ అంశాల్లో పరిశోధనలు చేశారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రాంతాల్లో పరిశోధన ప్రాజెక్టులను నిర్వహించారు.
పర్యావరణ హితుడు
పర్యావరణ, సామాజిక ప్రాధాన్యం గల అంశాలపై ఆయన పరిశోధనలు సాగాయి. అరకు, పాడేరు మండలాల్లో భూగర్భజలాల నాణ్యత, బార్క్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో జీవ వైవిధ్యంపైన, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రాంతలో జీవ, వృక్ష సంపదపైన, కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాల నాణ్యతపై పరిశోధన చేశారు. ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలుస్తున్న పైడి భీమవరంలో భూగర్భజలాల పరిశీలన, విశాఖ నగరంలో 60 ప్రాంతాల్లో నీటి నాణ్యతపై అధ్యయనం, భారత అణుసంస్థ పరిశోధన ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు.
పదవులకు వన్నె తెచ్చారు
ఆచార్య బైరాగి రెడ్డి అలంకరించిన పదవులన్నింటికీ వన్నె తెచ్చారు. పరిశోధకుల వసతిగృహం చీఫ్ వార్డెన్, ఏయూ దివ్యాంగుల కేంద్రం కన్వీనర్‌గా, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా, సైన్స్ కళాశాల డిప్యూటీ వార్డెన్‌గా, ఏయూ పరీక్షల విభాగం సహ కన్వీనర్‌గా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ పర్యావరణ పర్యవేక్షణ కమిటీ సభ్యునిగా, ఆటా సభ్యునిగా, ఏ యూ కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ సభ్యునిగా, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా, యూపీఎస్సీ సబ్జెక్ట్ నిపుణుడిగా, వివిధ డిగ్రీ, పీజీ కళాశాల గవర్నింగ్ సభ్యునిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఏయూను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా
ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌లకు కృతజ్ఞతలు. నాపై ప్రభుత్వం ఉంచిన సమున్నత బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తాను. దేశంలోనే నంబర్ వన్ విశ్వవిద్యాలయంగా ఏయూను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తాను. వర్సిటీ ఉద్యోగులు, ఆచార్యులు సహకరించాలని కోరుతున్నాను. అందరి సూచనలు, సలహాలు స్వీకరిస్తాను. విద్యార్థుల సంక్షేమం, ఉద్యోగుల శ్రేయస్సు ప్రధాన అజెండాగా ప్రతిక్షణం పని చేస్తాను. – ఆచార్య టి.బైరాగి రెడ్డి, రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment