![Andhra University hostel students protest over poor quality food](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/au.jpg.webp?itok=T7FP_DtN)
హాస్టల్‌లో తాగు నీరు పరిశుభ్రంగా లేదని ఆవేదన
ముందు రోజు ఉడికించిన కూరలు పెడుతున్నారని వెల్లడి
భోజనం తినలేకపోతున్నామని ఆగ్రహం
చీఫ్ వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడంలేదని మండిపాటు
హాస్టల్ చీఫ్ వార్డెన్‌ను తొలగిస్తున్నట్లు వీసీ వెల్లడి
సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు హాస్టల్ బాధ్యతలు అప్పగింత
విశాఖ విద్య: హాస్టల్‌లో నీరు తాగలేకపోతున్నామని, భోజనం తినలేకపోతున్నామంటూ ఆంధ్ర యూనివర్సిటీలోని(Andhra University) పరిశోధక విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో జీఎంసీ బాలయోగి రీసెర్చ్ హాస్టల్ ముందు బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కదిలేది లేదని తెగేసి చెప్పారు. వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపల్ రామరాజుకు సూచించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడారు.
తాగు నీరు పరిశుభ్రంగా ఉండటంలేదని, మెనూ ప్రకారం కాకుండా, కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా సప్లై చేసే కూరగాయలతోనే వండి పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ముందురోజు సాయంత్రం ఉడకబెట్టిన దుంపలు, కూరగాయలనే మరుసటి రోజు పెడుతున్నారని, ఆ భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయం చీఫ్ వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని, స్కాలర్స్‌తో సమావేశం పెట్టమని కోరినా స్పందించలేదని తెలిపారు. దీంతో చీఫ్ వార్డెన్ విజయ్‌బాబును తొలగిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. రామరాజుకు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
సోమవారం రీసెర్చ్ స్కాలర్స్‌తో సమావేశం నిర్వహించాలని రామరాజుకు సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు సతమతం ఇటీవలే ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ హాస్టల్ విద్యార్థులు వీసీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ ముందు బైఠాయించారు. దీంతో వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నట్లు అర్ధమవుతోంది.
స్కాలర్‌షిప్‌లివ్వని కూటమి సర్కారు.. హాస్టళ్లలో విద్యార్థుల నుంచే వసూళ్లు
కూటమి ప్రభుత్వం వచ్చాక స్కాలర్‌షిప్‌లు కూడా రాలేదు. డబ్బులు చెల్లించిన వారికే వర్సిటీ హాస్టళ్లలో భోజనం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. సైన్సు హాస్టల్‌లో ఇటీవల మూడు కంప్యూటర్లు కొనుగోలు చేయగా, ఆ డబ్బు కూడా విద్యార్థుల నుంచే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇవ్వకపోవటంతో ప్రైవేటు హాస్టళ్ల మాదిరే, డబ్బులు పోగు చేసి అన్నీ తామే సమకూర్చుకోవాల్సి వస్తోందని, చివరకు వంట చేసే వారికిచ్చే జీతాలు కూడా తమ వద్దే వసూలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment