quality food
-
Andhra Pradesh: పసందైన భోజనం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కేంద్రాలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారాన్ని పంపిణీ చేయాలని, ఇందులో ఏమాత్రం అలక్ష్యం వహించరాదని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ (నాణ్యమైన) బియ్యాన్ని అందించాలని సూచించారు. మహిళా–శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ–1, పీపీ–2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి. నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్ఎంఎఫ్ తరహాలోనే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి. దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు.. రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది. మనో వైకల్య బాధితులకు పెన్షన్లు మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్లో పెన్షన్లు మంజూరు కానున్నాయి. పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్వాడీ సూపర్వైజర్ (గ్రేడ్–2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సూపర్ వైజర్ల పర్యవేక్షణతోపాటు అంగన్వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా అంగన్వాడీల్లో పాలు, ఆహారం సరఫరా మెరుగైన రీతిలో పర్యవేక్షించనున్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు నాణ్యమైన ఫుడ్
-
గతంకంటే మిన్నగా..
అమలాపురం టౌన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద కుటుంబాల్లోని ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇక నుంచి పూర్తి పారదర్శకతతో, నాణ్యతతో భోజనం, ఆహార పదార్థాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను మొక్కుబడి తంతుగా నిర్వహించేది. సాదాసీదా బియ్యంతో భోజనం పెట్టి చేతులు దులుపుకొనేది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన బియ్యం, పౌష్టికాహారం అందించాలని నిశ్చయించింది. వారి ఆరోగ్యానికి మరింత ఊతమిచ్చేలా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే భోజనం, ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి సారించింది. ధనికుల ఇళ్లల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా పేద పిల్లలకు, తల్లులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, మట్టిబెడ్డలు ఉండేవి. వాటిని ఏరిన తర్వాతే అన్నం వండాల్సిన పరిస్థితి. ఇటువంటి సమస్యలకు తావు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్ బియ్యం సరఫరా చేస్తోంది. బాలామృతం పేరుతో చిన్నారులకు గతంలోనూ సిరిలాక్, నెస్లే వంటివి అందించేవారు. ఈ బాలామృతాన్ని కూడా ఇప్పుడు మరింత నాణ్యతతో అందిస్తున్నారు. కరోనాతో మారిన సరఫరా విధానం కరానాకు ముందు వరకూ జిల్లాలోని 5,546 అంగన్వాడీ కేంద్రాల్లో రోజూ అన్నం, ఇతర ఆహార పదార్థాలు వండి, పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు భోజనం పెట్టేవారు. కోడిగుడ్లు, పాలు కూడా అందించేవారు. ప్రత్యేకించి గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని పేరుతో అర కేజీ ఖర్జూరం, కేజీన్నర వేరుశనగ పప్పు అచ్చు, కేజీ చోడిపిండి, కేజీ పాత బెల్లం ఇచ్చేవారు. ఇక నుంచి ఇవి మరింత నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా ఆంక్షలతో అంగన్వాడీ కేంద్రాలు ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో భోజనం తయారీకి అవసరమైన దినుసులు, పౌష్టికాహార పదార్థాలను నెలకు లెక్క కట్టి అంగన్వాడీ సిబ్బంది నేరుగా ఇళ్లకే తీసుకుని వెళ్లి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. జిల్లాలో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 85,770 మంది ఉన్నారు. ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 15,540 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 69,519 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లాలో ప్రతి నెలా 2,085 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పమణి తెలిపారు. గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కిలోల వంతున, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు నెలకు 2 కిలోల వంతున బియ్యం అందిస్తున్నారు. అరుగుదల బాగుంటుంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు తినేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోంది. దీనివలన వారి ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. గతంలో బియ్యంలో రాళ్లు, బెడ్డలు ఉండేవి. ఇప్పుడు బియ్యం ఒక్క రాయి, బెడ్డ లేకుండా పూర్తి నాణ్యతతో ఇస్తున్నారు. ఇవి తిన్న వారికి అరుగుదల కూడా బాగుంటుంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం వీటిని సరఫరా చేయడం మంచి పరిణామం. లాక్డౌన్ కారణంగా అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నేరుగా ఇంటికే తీసుకు వెళ్లి బియ్యాన్ని లబి్ధదారులకు అందిస్తున్నారు. – ఐ.విమల, సీడీపీఓ, అమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఇష్టంగా తింటున్నారు అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇప్పుడు అందిస్తున్న బియ్యం చాలా బాగుంటున్నాయి. మా పిల్లాడు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేవాడు. ఇప్పుడు నెలకు సరిపడే బియ్యం, బలవర్ధక ఆహారాన్ని ఇంటికే తెచ్చి ఇవ్వడం చాలా బాగుంది. కరోనాతో ఇల్లు కదలకుండా ప్రభుత్వం ఇంటికే పంపించడం మంచి పని. గతంలో మామూలు బియ్యంతో వండిన అన్నాన్ని తినేందుకు పిల్లలు కొంత ఇబ్బంది పడేవారు. అప్పుడప్పుడు సరైన అరుగుదల లేక కడుపు ఇబ్బందిగా ఉందనేవారు. నాణ్యమైన బియ్యంతో ఇప్పుడు అన్నాన్ని చాలా ఇష్టంగా తింటున్నారు. – అరిగెల అన్నపూర్ణ, అంగన్వాడీ బాలుడి తల్లి, అంబాజీపేట -
శబరిమలలో పాడైన ఆహారమిస్తే చర్యలు
శబరిమల: శబరిమలలో ఉన్న హోటళ్లు తమ కస్టమర్లకు తాజాగా ఉన్న ఆహారాన్ని కాకుండా, పాడైన ఆహారాన్ని అందిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు హెచ్చరించింది. నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువకు అమ్మినా చర్యలు తప్పవని స్పష్టంచేసింది. స్థానికంగా ఉన్న హోటళ్లలోని ఉద్యోగులకు హెల్త్ కార్డులను తప్పనిసరి చేస్తూ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని టీడీబీ అధ్యక్షుడు వాసు తెలిపారు. -
ఈ రాజా చెయ్యి వేస్తే అంతా మంచే
ఆయన ప్రజాసేవలోనే కాదు.. దాతృత్వంలో సైతం రాజానే. పాఠశాలల్లో పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బాగోలేదని గుర్తించిన ఎమ్మెల్యే రాజా తన సొంత ఖర్చుతో వారికి భోజనాలు పంపిస్తున్నారు. రోజూ వందలాది విద్యార్థులకు ఆయన రుచికరమైన భోజనాలు పెడుతున్నారు. అలా పెద్దల్లోనే కాదు.. పిల్లల మనస్సులో సైతం చెరగని ముద్ర వేసుకుంటున్నారు. సాక్షి, తుని : ధనం అందరికీ ఉంటుంది కానీ దాతృత్వ గుణం కొందరికే ఉంటుంది. దాతృత్వం ఉన్న వారిలో తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అగ్రగణ్యుడు. మధ్యాహ్న భోజనం బాగుండక పోవడంతో తినలేకపోతున్న విద్యార్థుల అవస్థలను గుర్తించి 740 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చుతో పదిరోజులుగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన బెండపూడిలోని ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు. ఆ భోజనాలు మెనూ ప్రకారం అందకపోవడంతోపాటు పురుగులు పట్టిన అన్నం, సాంబారు సరఫరా చేస్తుండటంతో పిల్లలు పురుగులను తొలగించి తినాల్సిన దుస్ధితి ఏర్పడింది. కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేస్తుండటంతో వాటిని తినకుండా పారేస్తున్నారు. దీనిపై పై అధికారులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసినా పట్టించుకొనేవారే లేకుండా పోయారు. ఆ పరిస్థితుల్లో ఈనెల ఆరో తేదీన ఎమ్మెల్యే రాజా పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలు తింటున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. భోజనం బాగుండడం లేదని, దాన్ని తినలేక పారేస్తున్నామని వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అలాగే తొండంగి మండలం శృంగవృక్షంలోని జెడ్పీ హైస్కూల్‌ను, ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అదికూడా అలాగే అధ్వానంగా ఉండడంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించేలా ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అంతవరకూ తన సొంత ఖర్చుతో విద్యార్థులకు భోజనాన్ని పంపుతామన్నారు. ఇచ్చిన హామీ మేరకు సన్న భియ్యం అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిస్తున్నారు. తుని గర్ల్స్ హైస్కూల్లో 300 మందికి, శృంగవృక్షం జెడ్పీ హైస్కూల్లో 290 మందికి, ప్రాథమిక పాఠశాలలో 150 మందికి మొత్తం 740 మందికి రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పంపించారు. అధ్వానంగా ఉండే భోజనాన్ని తినలేక, ఇళ్ల నుంచి క్యారేజీలు తెచ్చుకునే ఆర్థిక స్థోమతలేని పేద, మద్యతరగతి వర్గాల పిల్లలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా భోజనాలు పంపించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. రుచికరమైన భోజనం అందించి పిల్లల మనస్సుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. -
ఆటగాళ్లకు ఇదేం భోజనం!
న్యూఢిల్లీ: బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఏర్పాటు చేసిన భోజన వసతి అత్యంత అధ్వాన్నంగా ఉందని భారత హాకీ చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ హాకీ ఇండియా (హెచ్ఐ)కి ఫిర్యాదు చేశారు. చాంపియన్స్ ట్రోఫీ కోసం హాకీ జట్టు ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ తీసుకుంటుంది. కానీ అక్కడి వంటలు రుచిగా లేవని, కలుషిత వాతావరణంలో ఇవి తయారవుతున్నాయని, ఆటగాళ్లకు ఇస్తున్న ఆహారంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని కోచ్ హెచ్‌ఐకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ‘హాకీ జట్టు ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఆసియా క్రీడలు, ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న కీలక తరుణంలో ఎలాంటి పోషక విలువల్లేని ఆహారం వండుతున్నారు, శుచి–శుభ్రత లేని వాతావరణంలో ఈ వంటలు తయారవుతున్నాయి. నాణ్యత, శక్తి–శుభ్రత లేని ఆహారం ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని కోచ్ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఇక్కడ శిక్షణ పొందుతున్న 48 మంది అథ్లెట్ల రక్త నమూనాలను పరీక్ష చేయగా శక్తిహీనత కనబడిందని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ఇక్కడికి విచ్చేసి నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఎలాంటి మార్పు లేదన్నారు. -
విద్యార్థుల సంక్షేమం పట్టదా?
– నాసిరకం భోజనంతో అనారోగ్యం – మూడు గంటలపాటు విద్యార్థుల ఆందోళన ఎస్కేయూ : వర్సిటీలోని హాస్టళ్లలో నాసిరకమైన భోజనం అందజేస్తున్నారని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. నిత్యం కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నా చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవన్నారు. ఇందుకు నిరసనగా వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వరకు విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. 3 గంటలపాటు ఆందోళన చేశారు. కొందరు విద్యార్థులు టీసీలు ఇచ్చేస్తే వెళ్లిపోతామన్నారు. రెక్టార్ శ్రీధర్, రిజిస్ట్రార్ వెంకటరమణ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.లింగా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, క్రాంతికిరణ్, జయచంద్రా రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి , అంకే శ్రీనివాసులు, అశ్వర్థ, శ్రీనివాసులు, ఓబులేసు, బాలరాజు, నారాయణ రెడ్డి, గోవర్ధన్, లింగ, నల్లప్ప, మనోహర్, ఎస్ఎఫ్ఐ చంద్రశేఖర్, జీవీఎస్ అశోక్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రైళ్లలో ‘పొదుపు’ రుచులు
► ఈ కేటరింగ్‌లో స్వయం సహాయక సంఘాలకు అవకాశం ► మహిళా గ్రూపులకు ఐఆర్సీటీసీ ఆహ్వానం ► ఈ కేటరింగ్ ద్వారా ప్రయాణికులకు చిరుతిళ్లు సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు రుచికరమైన, నాణ్యమైన ఆహార పదార్ధాలను అందజేసేందుకు గాను ఐఆర్సీటీసీ సరికొత్త పంధాను ఎంచుకుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్టణంలో ప్రారంభించిన ఈ విధానాన్ని నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ఆసక్తి గల మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ఫ్ వంటి సంస్థల్లో నమోదై ఉండి ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న స్వయం సహాయక సంఘాలకు ఉపాధిని కల్పించడంతో పాటు, ప్రయాణికులకు రుచికరమైన ఆహార పదార్ధాలను అందజేసేందుకు ఐఆర్‌సీటీకి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విజయవాడ, విశాఖ నగరాల్లో ఈ పద్ధతి విజయవంతం కావడంతో హైదరాబాద్‌లోని మహిళా సంఘాలను కూడా భాగస్వాములను చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే చిరుతిళ్లు త యారు చేసి విక్రయిస్తున్న మహిళా గ్రూపులు, లేదా తయారు చేసేందుకు సంసిద్ధంగా ఉన్న గ్రూపులు ఐఆర్సీటీసీలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఆన్లైన్లో నమోదు... అరిశెలు, జంతికలు, సున్నుండలు, పూతరేకులు, హైదరాబాద్ బిరియానీ, తెలంగాణ సర్వపిండి, చక్కిలాలు, మురుకులు వంటి రకరకాల పిండివంటలు, ఆహార పదార్ధాలు తయారు చేసే సంఘాలు ఐఆర్సీటీసీలో తమ వివరాలను నమోదు చేసుకొంటే చాలు. ఐఆర్సీటీసీ నిర్వహించే ఈ -కేటరింగ్‌లో ఆహార పదార్ధాల మెనూ సిద్ధం చేసి పెడుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణంతో పాటే ఆహార పదార్ధాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆహారపదార్ధాలపై వచ్చిన డబ్బులను ఐఆర్సీటీసీ సదరు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తుంది. మహిళా సంఘాలు తమ వస్తువులను తాము నిర్ణయించిన ధరలకే విక్రయించవచ్చు. ప్రయాణికులు, మహిళా గ్రూపుల వంటలకు మధ్య ఐఆర్సీటీసీ ఒక ఆన్లైన్ మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఆసక్తి గల మహిళా సంఘాలు నేరుగా తమ ఉత్పత్తులను రైళ్లలో విక్రయించుకోవచ్చునని,(క్యాష్ ఆన్ డెలివరీ) ఆ సదుపాయాన్ని కూడా ఐఆర్సీటీసీ కల్పిస్తుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. పిండివంటలతో పాటు పచ్చళ్లు, తేనె వంటి వాటిని కూడా మహిళా సంఘాలు విక్రయించవచ్చు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాలు సికింద్రాబాద్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అన్ని ఎ, ఎ-1 స్టేషన్లలో ఈ-కేటరింగ్ సేవలు... ప్రస్తుతం విజయవాడ, విశాఖలో మాత్రమే అమలులో ఉన్న ఈ విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని ఏ, ఏ-1 కేటగిరీ రైల్వేస్టేషన్లలో విస్తరించాలని ఐఆర్ సీటీసీ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని మూడు ప్రధాన స్టేషన్ల ద్వారా కూడా ప్రయాణికులకు ఈ తరహా ఆహార పదార్ధాలను అందజేయడంపై అధికారులు దృష్టి సారించారు. డామినోస్, కేఎఫ్‌సీ, హలో కర్రీస్, సందర్శిని, బీమాలకు చెందిన వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్‌తో పాటు ప్రయాణికులు ఈ సంప్రదాయ వంటలను కూడా రుచి చూడవచ్చు. -
తిని చూడండి
ఎస్కేయూ, న్యూస్‌లైన్ : ‘అన్నమో.. రామకృష్ణ ప్రభూ’ అంటూ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. నాణ్యమైన ఆహారం అందించడం లేదని వర్సిటీ అధికారులపై మండిపడ్డారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినకుండా ప్లేట్లు, గ్లాసులతో వర్సిటీ ఎదురుగా ఉన్న అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. అంతకు ముందు వారు ‘మహానంది’ హాస్టల్ సిబ్బందిని బయటకు పంపి తాళం వేశారు. వార్డెన్‌గా ప్రొఫెసర్ వి.రంగస్వామి బాధ్యతలు చేపట్టి రెండు నెలలు దాటినా ఏనాడూ తమ బాగోగులను పట్టించుకోలేదని విద్యార్థులు మండిపడ్డారు. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము తిన్నదాని కంటే మెస్ బిల్లులు ఎక్కువగా చెల్లిస్తున్నామని, అయినా ఆహారం నాణ్యతగా ఉండడం లేదని వాపోయారు. దాదాపు 600 మంది విద్యార్థులుంటున్న మహానంది హాస్టల్లో కొన్ని నెలల నుంచి మెనూ ప్రకారం ఆహారం అందించకపోయినా సర్దుకుపోయామని తెలిపారు. వారం రోజుల నుంచి పెరుగు లేకుండా భోజనం వడ్డిస్తున్నారని చెప్పారు. ఇదేమిటని స్టీవార్డులు, హెడ్కుక్లను అడిగితే తమకు సంబంధం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్కేయూ రిజిస్ట్రార్ గోవిందప్ప, చీఫ్ వార్డెన్ ఫణీశ్వరాజు నచ్చజెప్పడానికి వచ్చారు. అయితే, విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘మీ పిల్లలకైతే ఇలాంటి భోజనం పెడతారా? మెనూలో పూరి, చపాతి, దోసె, ఇడ్లీ, వడ ఉన్నా ...అరకొరగానే ఇస్తున్నారు. అన్నంతో కూడిన అల్పాహారం పెడుతున్నారు. ఒకసారి హాస్టల్‌కు వచ్చి కూరలు, భోజనం రుచి చూస్తే అర్థమవుతుంద’ంటూ మండిపడ్డారు. దీంతో వారుమహానంది హాస్టల్‌కు చేరుకుని సిబ్బందితో ఆరా తీశారు. అధికారుల మెనూ ప్రకారమే విద్యార్థులకు ఆహారం అందజేస్తున్నామని, మూడు రోజుల నుంచి పెరుగు ఇవ్వడం లేదని వారు తెలిపారు. శనివారం నుంచి నాణ్యమైన ఆహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎస్కేయూ కార్యదర్శి ఒ.కొండన్న, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు రఘు, హరీష్‌కుమార్, గంగాధర్, నాగరాజు, చిదానంద, మనోజ్, సుఖేష్ తదితరులు పాల్గొన్నారు. అనుమతి లేకుండా రోడ్డుపైకి వస్తే ఎలా? అనుమతి లేకుండా ప్రతి చిన్న సమస్యకు రోడ్డుపైకి రావడం భావ్యం కాదని ఎస్కేయూ విద్యార్థులకు ఎస్ఐ శేఖర్ పేర్కొన్నారు. వర్సిటీలో సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని, ఇలా రోడ్డుపైకి వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఎదురవుతుంద ని అన్నారు. వార్డెన్ రంగస్వామి స్పందించకపోవడంతోనే తాము ఇలా రావాల్సి వచ్చిందని విద్యార్థులు సమాధానమిచ్చారు. దీంతో వార్డెన్‌ను ఎస్ఐ ఫోన్లో సంప్రదించగా... ఆ విషయాన్ని డిప్యూటీ వార్డెన్ చూసుకుంటారని సమాధానమిచ్చినట్లు సమాచారం.