బాలింతలు, గర్భిణులకు బియ్యం, పౌష్టికాహార పదార్థాలను అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది
అమలాపురం టౌన్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పేద కుటుంబాల్లోని ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఇక నుంచి పూర్తి పారదర్శకతతో, నాణ్యతతో భోజనం, ఆహార పదార్థాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను మొక్కుబడి తంతుగా నిర్వహించేది. సాదాసీదా బియ్యంతో భోజనం పెట్టి చేతులు దులుపుకొనేది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం నాణ్యమైన బియ్యం, పౌష్టికాహారం అందించాలని నిశ్చయించింది.
వారి ఆరోగ్యానికి మరింత ఊతమిచ్చేలా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే భోజనం, ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి సారించింది. ధనికుల ఇళ్లల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల మాదిరిగానే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కూడా పేద పిల్లలకు, తల్లులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, మట్టిబెడ్డలు ఉండేవి. వాటిని ఏరిన తర్వాతే అన్నం వండాల్సిన పరిస్థితి. ఇటువంటి సమస్యలకు తావు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్ బియ్యం సరఫరా చేస్తోంది. బాలామృతం పేరుతో చిన్నారులకు గతంలోనూ సిరిలాక్, నెస్లే వంటివి అందించేవారు. ఈ బాలామృతాన్ని కూడా ఇప్పుడు మరింత నాణ్యతతో అందిస్తున్నారు.
కరోనాతో మారిన సరఫరా విధానం
కరానాకు ముందు వరకూ జిల్లాలోని 5,546 అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజూ అన్నం, ఇతర ఆహార పదార్థాలు వండి, పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు భోజనం పెట్టేవారు. కోడిగుడ్లు, పాలు కూడా అందించేవారు. ప్రత్యేకించి గర్భిణులు, బాలింతలకు బాల సంజీవని పేరుతో అర కేజీ ఖర్జూరం, కేజీన్నర వేరుశనగ పప్పు అచ్చు, కేజీ చోడిపిండి, కేజీ పాత బెల్లం ఇచ్చేవారు. ఇక నుంచి ఇవి మరింత నాణ్యతగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా ఆంక్షలతో అంగన్‌వాడీ కేంద్రాలు ప్రస్తుతం తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో భోజనం తయారీకి అవసరమైన దినుసులు, పౌష్టికాహార పదార్థాలను నెలకు లెక్క కట్టి అంగన్‌వాడీ సిబ్బంది నేరుగా ఇళ్లకే తీసుకుని వెళ్లి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు.
జిల్లాలో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలు 85,770 మంది ఉన్నారు. ఆరు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 15,540 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 69,519 మంది ఉన్నారు. వీరి కోసం జిల్లాలో ప్రతి నెలా 2,085 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నామని ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పమణి తెలిపారు. గర్భిణులు, బాలింతలకు నెలకు 3 కిలోల వంతున, మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లలకు నెలకు 2 కిలోల వంతున బియ్యం అందిస్తున్నారు.
అరుగుదల బాగుంటుంది
పిల్లలు, బాలింతలు, గర్భిణులు తినేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తోంది. దీనివలన వారి ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. గతంలో బియ్యంలో రాళ్లు, బెడ్డలు ఉండేవి. ఇప్పుడు బియ్యం ఒక్క రాయి, బెడ్డ లేకుండా పూర్తి నాణ్యతతో ఇస్తున్నారు. ఇవి తిన్న వారికి అరుగుదల కూడా బాగుంటుంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం వీటిని సరఫరా చేయడం మంచి పరిణామం. లాక్‌డౌన్ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది నేరుగా ఇంటికే తీసుకు వెళ్లి బియ్యాన్ని లబి్ధదారులకు అందిస్తున్నారు.
– ఐ.విమల, సీడీపీఓ, అమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్
ఇష్టంగా తింటున్నారు
అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ఇప్పుడు అందిస్తున్న బియ్యం చాలా బాగుంటున్నాయి. మా పిల్లాడు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లేవాడు. ఇప్పుడు నెలకు సరిపడే బియ్యం, బలవర్ధక ఆహారాన్ని ఇంటికే తెచ్చి ఇవ్వడం చాలా బాగుంది. కరోనాతో ఇల్లు కదలకుండా ప్రభుత్వం ఇంటికే పంపించడం మంచి పని. గతంలో మామూలు బియ్యంతో వండిన అన్నాన్ని తినేందుకు పిల్లలు కొంత ఇబ్బంది పడేవారు. అప్పుడప్పుడు సరైన అరుగుదల లేక కడుపు ఇబ్బందిగా ఉందనేవారు. నాణ్యమైన బియ్యంతో ఇప్పుడు అన్నాన్ని చాలా ఇష్టంగా తింటున్నారు.
– అరిగెల అన్నపూర్ణ, అంగన్‌వాడీ బాలుడి తల్లి, అంబాజీపేట
Comments
Please login to add a commentAdd a comment