
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ పాలను అందించేందుకు ఏపీ డెయిరీ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 32,59,042 మందికి ప్రభుత్వం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల్లో పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. వీరిలో 3,24,378 మంది గర్భిణులు, 2,23,085 మంది బాలింతలు, 15,64,445 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 11,47,134 మంది మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. తల్లీ బిడ్డలకు ప్రతి నెలా పాల ప్యాకెట్లను అందిస్తున్నారు.
ఆ పాలను ప్రస్తుతం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ద్వారా ఏపీకి సరఫరా చేస్తున్నారు. తొలుత 181 మిల్క్ స్టాక్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి జరుగుతున్న పాల సరఫరాలో ఇబ్బందులు అధిగమించేందుకు, పారదర్శకత కోసం ఇటీవల ఏపీ డెయిరీ కార్పొరేషన్ మిల్క్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో అమూల్ పాల సేకరణకు ఒప్పందం కుదుర్చుకోవడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా స్థానికంగానే సరఫరా చేస్తే ఇబ్బందులు తొలుగుతాయని భావిస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేలా పశ్చిమగోదావరి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగాత్మకం(పైలట్ ప్రాజెక్ట్)గా అమలు చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ పాలు అందించేందుకు పరిశీలన జరుగుతోందన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment