సాక్షి, అమరావతి: ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై కేంద్రం విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాల కన్నా 80 శాతం లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక విశ్లేషించింది.
ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో 37,64,308 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35,92,860 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక స్పష్టం చేసింది. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా తమిళనాడులో 29,706 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..
స్వయం సహాయక సంఘాలకు భరోసా
► 2021–22 ఆర్థిక ఏడాదిలో లక్ష్యానికి మించి 8,336 శాతం మేర కొత్తగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహించింది. దేశ వ్యాప్తంగా 12.41 లక్షల సంఘాలను కొత్తగా ప్రోత్సహిస్తే, అందులో 8.54 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి.
► ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో1.46 లక్షలు, ఇతర రాష్ట్రాలు వేల సంఖ్యలో కొత్త సంఘాలను ప్రోత్సహించాయి. రాజస్థాన్‌లో 48,979, గుజరాత్‌లో 38,028, ఛత్తీస్‌గఢ్‌లో 25,427, ఒడిశాలో 37,777 సంఘాలను ప్రోత్సహించారు.
► ఏపీలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం మంచి పనీతీరు కనపరిచాయి. 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) వంద శాతం బాగా పని చేశాయి. వ్యవసాయ పంపు సెట్లకు లక్ష్యానికి మించి 272 శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు.
► 2021–22 ఆర్థిక ఏడాదిలో 24,852 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఏకంగా 67,506 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎంజీఎస్‌వై కింద రాష్ట్రంలో 1,241 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment