Central Statistical Department
-
ఎస్సీలకు సాయంలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై కేంద్రం విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాల కన్నా 80 శాతం లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక విశ్లేషించింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో 37,64,308 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35,92,860 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక స్పష్టం చేసింది. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా తమిళనాడులో 29,706 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. స్వయం సహాయక సంఘాలకు భరోసా ► 2021–22 ఆర్థిక ఏడాదిలో లక్ష్యానికి మించి 8,336 శాతం మేర కొత్తగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహించింది. దేశ వ్యాప్తంగా 12.41 లక్షల సంఘాలను కొత్తగా ప్రోత్సహిస్తే, అందులో 8.54 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ► ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో1.46 లక్షలు, ఇతర రాష్ట్రాలు వేల సంఖ్యలో కొత్త సంఘాలను ప్రోత్సహించాయి. రాజస్థాన్‌లో 48,979, గుజరాత్లో 38,028, ఛత్తీస్‌గఢ్‌లో 25,427, ఒడిశాలో 37,777 సంఘాలను ప్రోత్సహించారు. ► ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం మంచి పనీతీరు కనపరిచాయి. 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) వంద శాతం బాగా పని చేశాయి. వ్యవసాయ పంపు సెట్లకు లక్ష్యానికి మించి 272 శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో 24,852 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఏకంగా 67,506 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎంజీఎస్‌వై కింద రాష్ట్రంలో 1,241 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టారు. -
పారిశ్రామికోత్పత్తి వృద్ధి పెరిగింది..?
నవంబర్‌లో 5.7 శాతం • లెక్కలను విడుదల చేసిన కేంద్ర గణాంకాల శాఖ • కనిపించని నోట్ల రద్దు ప్రభావం • తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల దన్ను • క్యాపిటల్ గూడ్స్‌దీ అప్‌ట్రెండే..! న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీనితో పారిశ్రామికవృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందన్న భయాలు నెలకొన్నాయి. అయితే ఇలాంటిదేమీ లేదని కేంద్ర గణాంకాల శాఖ నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు వెల్లడించాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 5.7 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీరంగం సహా మైనింగ్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు వెల్లడించాయి. కాగా 2016 అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి అసలు లేకపోగా (–)1.8 శాతం క్షీణత నమోదయ్యింది. బేస్ ఎఫెక్టే కారణమా? 2015 నవంబర్ ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా (–) 3.4 శాతం క్షీణత నమోదయ్యింది (2014 నవంబర్ ఉత్పత్తి విలువతో పోల్చితే). 2015 నవంబర్‌లో అసలు వృద్ధిలేకపోవడం వల్ల దానితో పోల్చి 2016 నవంబర్‌లో ఏ కొంచెం విలువ వృద్ధి నమోదయినా... అది శాతాల్లో అధికంగా ఉంటుందన్నది గమనార్హం. దీనినే బేస్ ఎఫెక్ట్‌గా పరిగణిస్తారు. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ చూస్తే... పారిశ్రామిక వృద్ధి 0.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 3.8 శాతం. వృద్ధి పుంజుకుంటుంది: ఫిక్కీ తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక వేదిక ఫిక్కీ ఒక నివేదిక విడుదల చేస్తూ... భవిష్యత్తుపై విశ్వాస ధోరణిని వ్యక్తం చేసింది. ‘‘పలు బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గించాయి. దీనితో వినియమ, పెట్టుబడుల డిమాండ్ పెరుగుతుంది. రానున్న నెలల్లో తయారీ రంగం వృద్ధికి దోహదపడే చర్య ఇది. వడ్డీరేట్ల విషయమై ఆర్బీఐ మరింత సరళతర విధానాన్ని అవలంభిస్తుందని భావిస్తున్నాం. దీనితో వృద్ధి మరింత పుంజుకుంటుంది’’ అని ఫిక్కీ తన ఈ ప్రకటనలో పేర్కొంది.