SC Welfare Department
-
అట్టడుగు వర్గాలకు సాయంలో.. 'ఏపీ అద్వితీయం'
సాక్షి, అమరావతి: ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలుచేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ అమలు చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 2022–23 మూడో త్రైమాసికం వరకు(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల అమలు పురోగతిపై నివేదికను ఆ శాఖ శనివారం విడుదల చేసింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ కుటుంబాలకు సాయం అందించడం, రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పట్టణ పేదలకు సాయం అందించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చాలామంచి’ పనితీరు కనబరించిందని ఆ నివేదిక కితాబిచ్చింది. లక్ష్యాల్లో 90 శాతానికి పైగా అమలుచేసిన రాష్ట్రాలను చాలామంచి పనితీరు కనబరిచినట్లు, 80–90 శాతం మేర అమలుచేసిన రాష్ట్రాలు ‘మంచి పనితీరు’ కనబరిచినట్లు.. అలాగే 80 శాతం లోపల అమలుచేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా నివేదిక వర్గీకరించింది. ఏపీలో 33.57 లక్షల కుటుంబాలకు సాయం.. ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 34,68,986 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. అందులో ఒక్క ఏపీలోనే ఏకంగా 33,57,052 కుటుంబాలకు సహాయం అందించారు. అలాగే, గతంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 29,10,944 కుటుంబాలకు సాయం అందించగా.. అదే ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య 33,57,052కు పెరిగింది. అంటే.. మూడునెలల వ్యవధిలో అదనంగా 4,46,108 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించింది. మిగతా మరే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం చేయలేదని నివేదిక స్పష్టంచేసింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 22,884 కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకన్నా తక్కువగా వేల, వందల సంఖ్యలోనే సహాయం అందించాయి. పట్టణ పేదలకు సాయంలో కూడా.. అలాగే, గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణాల్లోని 5,98,194 పట్టణ పేద కుటుంబాలకు సాయం అందించగా అందులో ఒక్క ఏపీలోనే 5,05,962 పేద కుటుంబాలకు సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే గతంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 3.47 లక్షల మందికి సాయం అందించినట్లు పేర్కొనగా ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో ఆ సంఖ్య 5,05,962కు పెరిగినట్లు పేర్కొంది. అంటే మూడు నెలల వ్యవధిలో పట్టణాల్లోని 1.58 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సాయం అందించినట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు సాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ‘వ్యవసాయ’ విద్యుత్ కనెక్షన్లలోనూ అగ్రగామి.. అంతేకాక.. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ ‘చాలామంచి’ పనితీరు కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2022–23లో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడో త్రైమాసికం నాటికి (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) లక్ష్యానికి మించి 98,447 వ్యవసాయ పంపు సెట్లకు ఏపీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయలేదు. ఉపాధి హామీ కింద రాష్ట్రంలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,78,182 మందికి కొత్తగా జాబ్‌కార్డులను మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, ఆ సమయంలో కూలీలకు వేతనాల రూపంలో రూ.3,898.20 కోట్లు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. -
ఎస్సీలకు సాయంలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై కేంద్రం విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాల కన్నా 80 శాతం లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక విశ్లేషించింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో 37,64,308 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35,92,860 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక స్పష్టం చేసింది. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా తమిళనాడులో 29,706 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. స్వయం సహాయక సంఘాలకు భరోసా ► 2021–22 ఆర్థిక ఏడాదిలో లక్ష్యానికి మించి 8,336 శాతం మేర కొత్తగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహించింది. దేశ వ్యాప్తంగా 12.41 లక్షల సంఘాలను కొత్తగా ప్రోత్సహిస్తే, అందులో 8.54 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ► ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో1.46 లక్షలు, ఇతర రాష్ట్రాలు వేల సంఖ్యలో కొత్త సంఘాలను ప్రోత్సహించాయి. రాజస్థాన్‌లో 48,979, గుజరాత్లో 38,028, ఛత్తీస్‌గఢ్‌లో 25,427, ఒడిశాలో 37,777 సంఘాలను ప్రోత్సహించారు. ► ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం మంచి పనీతీరు కనపరిచాయి. 257 ఐసీడీఎస్ బ్లాక్‌లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) వంద శాతం బాగా పని చేశాయి. వ్యవసాయ పంపు సెట్లకు లక్ష్యానికి మించి 272 శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో 24,852 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఏకంగా 67,506 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎంజీఎస్‌వై కింద రాష్ట్రంలో 1,241 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టారు. -
పీఎంఏజీవై అవార్డులకు ఏపీలోని రెండు జిల్లాలు ఎంపిక
సాక్షి, అమరావతి: షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను అందిస్తున్నారు. దేశంలోని మూడు జిల్లాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా.. అందులో రెండు జిల్లాలు రాష్ట్రానివే కావడం విశేషం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. చదవండి: Gold News: బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో -
వివాదంలో ఎస్సీ సంక్షేమ శాఖ!
సాక్షి, నిజామాబాద్: కక్ష సాధింపులు.. వేధింపులు.. వసూళ్లు.. ఈ మూడు అంశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలను కుదిపేస్తున్నాయి. ఆయా శాఖలను వివాదాల్లోకి లాగుతున్నాయి. తరచూ అధికారులకు, హాస్టల్ వార్డెన్ల నడుమ ఏర్పడుతున్న గొడవలు రచ్చకెక్కుతున్నాయి. సంక్షేమ శాఖల పాలనను పక్కన పెట్టి పోటాపోటీగా కలెక్టర్‌కు, ఆయా శాఖల ఉన్నతాధికారులకు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇంతటితో పోకుండా నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రత్యక్ష పంచాయితీలకూ కాలు దువ్వుతున్నారు. అయితే ప్రతీ చిన్న విషయానికి యూనియన్ నేతలను కలుపుకొని వివాదాలను రచ్చకెక్కిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇటు ఉన్నతాధికారులకు సైతం ఈ సంక్షేమ శాఖల గొడవలు విసుగు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం పాలన గాడి తప్పి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఐదారు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖలో ఓ అధికారికి, హాస్టల్ వార్డెన్ల నడుమ చాలా సినిమానే నడిచింది. సదరు అధికారి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని వార్డెన్లు కలెక్టర్‌తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇటు సదరు అధికారి కూడా వార్డెన్లపై పలు ఆరోపణలు చేశారు. అయితే, సదరు అధికారి ఉంటే తాము పని చేయలేమని, సెలవుల్లో వెళ్తామని వార్డెన్లు ముక్త కంఠంతో చెప్పాగా, ఓ ఉన్నతాధికారి ఎదుట విచారణ కూడా జరిగింది. కానీ చివరికి యూనియన్ నేతల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కొన్ని వాస్తవాలున్నప్పటికీ ఎవరిపై ఎలాంటి చర్యలు లేకుండానే చివరికి కథ ముగిసింది. ట్రైబల్ వెల్ఫేర్‌లో.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఇటీవల ఓ ద్వితీయ శ్రేణి అధికారి తీరుతో వేగలేక పోయిన హాస్టల్ వార్డెన్లు, ఆ శాఖ ఉద్యోగులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని వార్డెన్లు, శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు మచ్చ తెస్తున్న సదరు ద్వితీయ శ్రేణి అధికారిని పిలిపించి ఓ ఉన్నతాధికారి మందలించారు. కానీ ప్రస్తుతం కూడా సదరు అధికారి తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అధికారులకు, వార్డెన్ల మధ్య వివాదాలను మరిచిపోక ముందే జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. ఓ అధికారి తమను వేధిస్తున్నారంటూ కొంత మంది వార్డెన్లు యూనియన్ నాయకులతో కలిసి ఆ శాఖ అధికారితో పాటు కలెక్టర్‌కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ అధికారితో కలిసి మెలిసి పని చేసిన వారే వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. కావాలనే టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కూడా రచ్చకెక్కింది. వారిదే పెత్తనం.. మూడు సంక్షేమ శాఖలకు కలిపి నాయకులుగా పిలవబడే కొంత మంది తీరుతోనే ఆయా శాఖల పరువు బజారున పడుతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ అధికారైనా సరే తాము చెప్పినట్లు నడుచుకోవాలని, చెప్పిన పని చేయాలని ఆర్డర్లు వేసి మరీ పనులు చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒక వేళ అడ్డు చెబితే ఇక సదరు అధికారి పని అంతేనని, కక్ష సాధింపులకు దిగుతారని, అవసరమైతే సరెండర్ చేయిస్తారనే పేరుంది. కాగా తమ వర్గానికి చెందిన, మచ్చిక చేసుకున్న అధికారులుంటే వారిపై ఎన్ని అవినీతి, ఆరోపణలున్నా సరే వారిని రక్షించడానికి ఎలాంటి పనికైనా సిద్ధపడుతారనే మాట ప్రచారంలో ఉంది. ఫిర్యాదు అందింది.. ఎస్సీ సంక్షేమ శాఖలోని ఓ అధికారిపై వార్డెన్ల సంఘ నాయకులు చేసిన ఫిర్యాదు నాకు అందింది. అయితే, ఈ వివాదం ఇరువురి మధ్య నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది వాస్తవమో విచారణ జరిపి తేలుస్తాం. – రాములు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి -
‘పది’కి పదే లక్ష్యం
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి నుంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా షెడ్యుల్డు కులాల అభివృద్ధి శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ, వెనుకబడిన(బీసీ) తరగతుల అభివృద్ధి శాఖల అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక మెనూ తయారు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సదాశివపేట(సంగారెడ్డి): జిల్లాలో అన్ని శాఖల బాలుర, బాలికల వసతి గృహాలు ఎస్సీ 37, ఎస్టీ 10, బీసీ 22 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 713 మంది, ఎస్టీ బాలికల బాలుర వసతి గృహాల్లో 170 మంది, బీసీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 362 మంది ఉన్నారు. విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలపై జిల్లా అధికారులు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అంతే కాకుండా తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తరగతులు.. అల్పాహారం పదో తరగతి విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వంద శాతం ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వసతి గృహాల సంక్షేమ అధికారులు పదోతరగతి విద్యార్ధుల కోసం రాత్రి 12 గంటల వరకు స్టడీ అవర్లను నిర్వహిస్తున్నారు. నీరస పడకుండా ఉండటానికి రాత్రి 10.30 అల్పాహారం, టీ అందజేస్తున్నారు. వీటీ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. సబ్జెక్టు నిపుణులను అందుబాటులో ఉంచారు. రాత్రి సమయంలో విద్యార్థులతో పాటు అధికారులు వసతి గృహాల్లో నిద్రించాలని నిర్ణయించారు. విద్యార్థులపై పర్యవేక్షణ మార్చి 19న పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులపై పర్యవేక్షణ పెంచడానికి వసతి గృహాల సంక్షేమ అధికారులు వారంలో రెండు సార్లు వసతి గృహంలో విద్యార్థులతో కలసి భోజనం చేసి అక్కడే నిద్రించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వసతి గృహాల సంక్షేమాధికారులను సంబంధిత అధికారులు 100 శాతం ఫలితాలు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు, ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి సీ, డీ విభాగాలపై సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు ఎక్కువ సమయం కేటాయించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదికి పది జీపీఏ సాధిస్తా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు పదో తరగతి విద్యార్థులకు వసతి గృహంలోనే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు చదివిస్తున్నారు. మధ్యలో స్నాక్స్, టీ ఇస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధిస్తానని నమ్మకుముంది. – బి.రమేశ్, ఎస్సీ వసతి గృహం, సదాశివపేట -
వారికి పాకెట్ మనీ రూ.500 ..
సాక్షి, నిర్మల్ : విద్యతోనే ప్రగతి సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ఎస్సీ వసతి గృహాల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. ట్యూషన్ ఫీజు, మెస్‌బిల్లు, పరీక్ష ఫీజు ఇలా ఎన్నో మినహాయింపు ఇస్తున్నారు. అయితే విద్యార్థి దశ నుంచి కళాశాల స్థాయికి వచ్చే సరికి ఆర్థిక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. జేబు ఖర్చులు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో లోలోన మదనపడుతున్నారు. వీరి ఇబ్బందులు ఇక దూరం కానున్నాయి. కళాశాల విద్యార్థులకు నెలకు రూ.500 కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు జేబు ఖర్చుల కింద సాయం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వీరికి ప్రతి నెల ఠంచన్‌గా నెలకు రూ.500చొప్పున అందజేయనుంది. ప్రస్తుతం వసతి గృహాల్లో కేవలం పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే కాస్మోటిక్ చార్జీ లు అందిస్తున్నారు. బాలురకు రూ.62, బాలికలకు 3 నుంచి 7వ తరగతి చదివేవారికి రూ.55, అలాగే 8,9,10 తరగతుల వారికి రూ.75 అందిస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు విద్యనభ్యసించి, మధ్యలో ఆపివేయకుండా ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు సైతం నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేసింది. ఈ మేరకు షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతి గృహాలను జిల్లాలో ఇదివరకే ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలా అమలు.. నిర్మల్ జిల్లాలో మొత్తం ఐదు ఎస్సీ కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. నిర్మల్‌లో రెండు బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉండగా, భైంసాలో ఒకటి బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉంది. ఇందులో మొత్తం 366మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ వసతి గృహాల్లో పారామెడికల్, నర్సింగ్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం కేవలం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తోంది. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని ఇతర అవసరాలకు ఖర్చు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికభారం కావడంతో నెలనెలా అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నెలకు రూ.500 చొప్పున సాయం అందించనుంది. నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే ఈ సొమ్ము జ మ చేయనుంది. అయితే ప్రతి నెలా ఈ డబ్బు లు పొందాలంటే 75శాతం హాజరు, 20 రోజు ల పాటు వసతి గృహంలో ఉండాలన్న నిబంధనలు విధించింది. ఇందుకోసం విద్యార్థి ప్రతి నెలా హాజరుకు సంబంధించి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 75శాతం హాజరు తప్పనిసరి విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా డబ్బులు జమచేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల్లో 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి విద్యార్థుల అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అవసరాలకు మాత్రమే వినియోగించుకుని ఉత్తమ ఫలితాలపై దృష్టి సారించాలి. – కిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి -
స్కిల్ @ హాస్టల్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు హాస్టళ్లంటే కేవలం విద్యార్థులకు వసతితో పాటు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పించేవనే మనకు తెలుసు. తాజాగా ఈ కేంద్రాల్లో వసతి పొందే విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా కళాశాల వసతి గృహాల్లో (కాలేజీ హాస్టల్స్) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీ తరగతులు పూర్తికాగానే సంక్షేమ వసతిగృహానికి చేరుకోవడం, కాలేజీల్లో జరిగిన పాఠశాలను పునశ్చరణ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో కేవలం సబ్జెక్టుపరంగా వారికి కొంత అవగాహన పెరుగుతున్నప్పటికీ ఇతర అంశాల్లో పరిజ్ఞానం మాత్రం అంతంతమాత్రం గానే ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలుత నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇంగ్లిష్‌లో మాట్లాడేలా.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంతో పాటు కంప్యూటర్స్‌లో ప్రాథమికాంశాలపై (బేసిక్స్) అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించబోతోంది. హాస్టల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఇంగ్లిష్ వాడకాన్ని వృద్ధిచేస్తే భాషపై పట్టు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో పాటు కొంతసేపు కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ తరగతుల బోధనకు క్షేత్రస్థాయిలో నిపుణులైన ట్యూటర్లను ఎంగేజ్ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్స్ బేసిక్స్పైనా అవగాహన కల్పించి సర్టిఫికెట్ కూడా ఇచ్చేలా మరో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేయనుంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్లను కొనుగోలు చేసింది. ఒక కంప్యూటర్‌పై పది మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేసేలా టైమ్షెడ్యూల్ను సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి రూపొందిస్తారు. త్వరలో నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించేలా అధికారులు చర్యలు వేగిరం చేశారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ... వచ్చే ఏడాది నుంచి అన్ని వసతిగృహాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
ప్రతి జిల్లాకు ఓ స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో ఓ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో ఈ కేంద్రాలున్నాయి. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశంపై కసరత్తు చేపట్టింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దీంతోపాటు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తుండగా.. మిగతా చోట్ల ఇతర కేటగిరీల్లోని ఉద్యోగాలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాల శిక్షణలు ఇవ్వగా.. దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 15% మందికి కొలువులు వచ్చాయి. స్టడీ సర్కిల్ శిక్షణలతో సత్ఫలితాలు వస్తుండటంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఆవశ్యకతను పరిశీలించాలని ఈశ్వర్ ఆదేశించడంతో ఆ శాఖ చర్యలకు ఉపక్రమించింది. స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ..వీటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయిం చింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శిక్షణే కాకుండా ప్రైవేటు రంగంలో కీలక ఉద్యోగాలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టే అంశంతో పాటు డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
పేరెక్కదాయె.. బిల్లు రాదాయె..
సాక్షి, ఖమ్మం : సాంఘిక సంక్షేమ శాఖ ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల లెక్క పక్కాగా ఉంచడంతోపాటు.. వారి వివరాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేసేందుకు పూనుకుంది. వసతి గృహంలో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేలా గత ఏడాది నుంచి చర్యలు చేపట్టింది. అయితే కొత్త విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉంటే.. వాటిని సంక్షేమాధికారులు ఎస్సీ సంక్షేమ వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఆ ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి సమకూరే సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే కొత్త విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానం ఒక్క ఎస్సీ సంక్షేమ శాఖలోనే ఉండడం, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఇలాంటి విధానం లేకపోవడంతో ఆ శాఖల్లో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. జిల్లాలో 39 ప్రీ మెట్రిక్(పాఠశాలల విద్యార్థుల) వసతి గృహాలు ఉండగా.. వాటిలో మొత్తం 3,699 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 3వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారే. గత ఏడాది నుంచి ఆయా వసతి గృహాల్లో రెన్యూవల్ అయిన విద్యార్థులు 2,420 మంది ఉండగా.. కొత్తగా 1,279 మంది విద్యార్థులు వసతి గృహాల్లో చేరారు. అయితే పాత విద్యార్థుల వివరాలను రెన్యూవల్ చేయడమే కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. కొత్తగా చేరిన విద్యార్థుల విషయంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల కోసం ఎదురుచూపులు.. ఎస్సీ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుంటేనే వసతి గృహంలో డైట్, సోప్, ఆయిల్ బిల్లులు విద్యార్థులవారీగా విడుదలవుతాయి. కొత్తగా వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు స్టడీ, కండక్ట్తోపాటు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వారి ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. రెవెన్యూ అధికారులు వాటిని జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వసతి గృహాల సంక్షేమాధికారులకు అందజేయలేకపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా అవి ఇంతవరకు జారీ కాకపోవడంతో వసతి గృహాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రశీదు చూపించి చేరుతున్నారు. అయితే ఆన్లైన్లో విద్యార్థుల వివరాల నమోదు కోసం ధ్రువీకరణ పత్రాలు తప్పక అవసరం ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలలుగా నిలిచిన బిల్లులు.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభం కాగా.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు చేరారు. గత ఏడాది వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల వివరాలు రెన్యూవల్ కావడంతో వారికి ప్రభుత్వం నుంచి డైట్, సోప్ అండ్ ఆయిల్ బిల్లులు మంజూరవుతున్నాయి. అయితే కొత్త విద్యార్థుల వివరా లు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో రెండు నెలలుగా వారికి విడుదల కావాల్సిన డైట్, సోప్, ఆయిల్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో వసతి గృహ సంక్షేమాధికారులు అప్పు తెచ్చి మరి వారికి డైట్‌ను అందించడంతోపాటు పలు వసతి గృహాల్లో సోప్, ఆయిల్ బిల్లులను చెల్లిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి డైట్ కింద నెలకు రూ.950, సబ్బులు, ఆయిల్ కింద రూ.75 చొప్పున అందించాలి. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదైతేనే వారికి బిల్లులు విడుదల కానుండడంతో వసతి గృహ సంక్షేమాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు అప్పు తెచ్చి డైట్‌ను నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలి.. ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదైన విద్యార్థికే డైట్, ఇతర బిల్లులు చెల్లిస్తారు. కొత్తగా చేరిన విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక విద్యార్థులు వివరాలు నమోదు కావడం లేదని సంక్షేమాధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాగానే సదరు విద్యార్థులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తాం. – కస్తాల సత్యనారాయణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సడలింపు ఇవ్వాలి.. ఎస్సీ వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేస్తేనే బిల్లులు చెల్లిస్తారు. పలు కారణాలతో వసతి గృహాల్లో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు సకాలంలో ఆన్లైన్లో నమోదు కావడం లేదు. కొంత సడలింపు ఇచ్చి వివరాలు నమోదయ్యేలా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నిబంధనను తొలగించి, బిల్లులను విడుదల చేసి ఇబ్బందులను తొలగించాలి. అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలి. – తుమ్మలపల్లి రామారావు, తెలంగాణ వసతి గృహాల సంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బయోమెట్రిక్‌తో అక్రమాలకు చెల్లు..!
సాక్షి, నల్లగొండ: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇకనుంచి పిల్లల హాజరు అంతా బయోమెట్రిక్ పద్ధతిలోనే తీసుకుంటారు. ఏరోజు ఎంతమంది విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరువేస్తారో వారికే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. గతంలో రిజిష్టర్ల ద్వారా హాజరు తీసుకునేవారు. దాంతో పిల్లలు ఉన్నా లేకున్నా ఎక్కువ రాసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ యంత్రాల కారణంగా అలాంటి వాటికి అవకాశాలు ఉండవు. ప్రస్తుతం కళాశాలల్లో చదవని విద్యార్థులు కూడా హాస్టళ్లలో ఉంటూ వస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇక నుంచి చెక్ పడనుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగలనుంది. జిల్లాలో 61 ఎస్సీ హాస్టళ్లు జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 46 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉండగా 15 కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు యంత్రాలను పంపించారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలోని హాస్టళ్లన్నింటికీ బ యోమెట్రిక్ మిషన్లను బిగించగా దేవరకొండ డివిజన్లో ఇంకా కొనసాగుతోంది. వారం రోజుల్లోగా అన్ని హాస్టళ్లకు బయోమెట్రిక్ మిషన్లను బిగించనున్నారు. బయోమెట్రిక్ ద్వారానే హాజరు.. గతంలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల ద్వా రా కొనసాగేది. హాస్టల్లో ఉన్న విద్యార్థుల కంటే ఎ క్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా పేర్లు రాసుకోవడం.. వారు ఇళ్లకు వెళ్లినా ఉన్నట్లుగా నమోదు చేసి.. కొం దరు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పుడు బిల్లులు పొందేవారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంతో గండి పడేది. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ మిషన్ల కారణంగా అలాంటి వాటికి చెక్ పడనున్నాయి. ఏరోజు బిల్లు ఆరోజే జనరేట్ హాస్టల్లో విద్యార్థి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేస్తారు. దాంతో ఆరోజులో ఎంతమంది విద్యార్థులు ఆ హాస్టల్ నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రవేస్తారో వారికి హాజరు ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఆ రోజే పిల్లలు చేసిన భోజనానికి సంబంధించిన బిల్లు జనరేట్ అవుతుంది. అలా నెల రోజులపాటు హాజరైనటువంటి విద్యార్థులకు సంబంధించి బిల్లులను నెలనాడు సంబంధింత హాస్టల్ వెల్ఫేర్ అధికారి తీసుకొని బిల్లుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చదివే పిల్లలకే భోజనం.. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిన హాజరు తీసుకోవడం వల్ల కొన్ని హాస్టళ్లలో వార్డెన్లకు నచ్చజెప్పి కొందరు విద్యార్థులు ఉంటున్నారు. కొందరు చదువుకుంటుండగా మరికొందరు ఊరికే హాస్టల్లో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు హాస్టల్ అధికారులను కూడా బెదిరించిన హాస్టల్లో ఉంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బయోమెట్రిక్ విధానం అమలైతే.. ఇక బయటి వ్యక్తులు హాస్టల్లో ఉంటే వారికి భోజనం పెట్టలేని పరిస్థితి. ఒకవేళ పెట్టినా అతనికి సంబంధించిన బిల్లురాదు. దాంతో అధికారే జేబు లో నుంచి కట్టాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో వారు హాస్టల్లో భోజనం పెట్టే పరిస్థితి ఉండదు. చదువుకునే పిల్లలే హాస్టల్లో ఉండే అవకాశం రానుంది. బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తున్నారు.. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను బిగిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో యాంత్రాల బిగింపు పూర్తయింది. దేవరకొండ డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పూర్తి కాగానే విద్యార్థులకు నెంబర్ అలాట్ చేసి ఆతర్వాత బయోమెట్రిక్ ద్వారా ప్రతి రోజూ హాజరు నమోదు చేస్తాం. – రాజ్‌కుమార్, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ -
నిరుద్యోగుల ధైర్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగుల్లో ధైర్యం నింపుతోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో మెజార్టీ మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 779 మందికి ఉద్యోగాలు దక్కడం గమనార్హం. ఐదేళ్లలో 6,818 మంది శిక్షణ పొందితే వీరిలో 12శాతం మందిని సర్కారు కొలువులు వరించాయి. ఇతర స్టడీ సర్కిళ్లతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగ్గా ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ పేర్కొంటోంది. స్టడీ సర్కిళ్లలో శిక్షణల నిర్వహణ వ్యూహాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సివిల్ సర్వీసెస్‌కు ఐదుగురు.. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లున్నాయి. హైదరాబాద్‌లో మెయిన్ సెంటర్ ఉండగా, మిగతావి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. సివిల్స్ తదితర ప్రతిష్టాత్మక పరీక్షలకు సంబంధించిన శిక్షణలు మాత్రం హైదరాబాద్‌లో జరుగుతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు వివిధ నియామక బోర్డులు నిర్వహించే పరీక్షలకు విద్యార్థుల సంఖ్య, సౌకర్యం తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 779 మందికి సర్కారు కొలువులు దక్కాయి. ఇందులో అత్యధికంగా 454 మంది పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు పొందారు. టీజీటీ/పీజీటీ/టీఆర్టీ కేటగిరీలో 46 మంది కొలువులు సాధించారు. మరో 46 మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు సాధించారు. మొత్తంగా 45 రకాల విభాగాల్లో ఉద్యోగాలు సాధించినట్లు స్టడీ సర్కిల్ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలో హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 1,278 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకోగా.. మిగతా 10 స్టడీ సర్కిళ్లలో 5,540 మంది శిక్షణ తీసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో మరింత మేలు.. శిక్షణ తరగతుల నిర్వహణ, అభ్యర్థుల వసతి, స్టడీ మెటీరియల్, భోజన సౌకర్యం వాటికి ఐదేళ్లలో స్టడీ సర్కిళ్లకు చేసిన ఖర్చు రూ.37.71 కోట్లు. తాజాగా ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టింది. ఫలానా ఉద్యోగాల కోసం కాకుండా జనరల్ అంశాలతో రూపొందించిన శిక్షణ కోసం ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులు దాదాపు ప్రతి ఉద్యోగానికి 50 శాతం సిద్ధంగా ఉంటారని, నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత సబ్జెక్టు పరంగా శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ అభ్యర్థులకు అభినందన సభ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా 779 మందికి ఉద్యోగాలు రావడం గర్వంగా ఉంది. శాఖాధికారులు, ఉద్యోగులు, ఫ్యాకల్టీ కృషి, అభ్యర్థుల పట్టుదలతో ఈ ఉద్యోగాలు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఇప్పటివరకు ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను అనుసరిస్తాం. గత ఐదేళ్లలో ఐదుగురికి సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు దక్కాయి. వచ్చే నెలలో ఆయా అభ్యర్థులకు అభినందన సభ నిర్వహించాలని భావిస్తున్నాం. –పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
ఫలించిన పాలిసెట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల వైపు తీసుకెళ్లేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చేసిన ప్రయత్నం ఫలించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతిగృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి పాలిసెట్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. జిల్లాకో కేంద్రం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,250 మందిని శిక్షణకు ఎంపిక చేసింది. ఈ క్రమంలో 988 మంది విద్యార్థులు పాలిసెట్–2019 పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఏకంగా 949 మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో దాదాపు 96 శాతం మంది అర్హత సాధించడం పట్ల ఆ శాఖ సంచాలకులు పి.కరుణాకర్ హర్షం వ్యక్తంచేశారు. త్వరలో మరిన్ని సెట్లకు.. ఎస్సీ అభివృద్ధి శాఖ 2018–19 విద్యా సంవత్సరంలో కొత్తగా పాలిసెట్ శిక్షణ నిర్వహించింది. శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను ఎంపిక చేసింది. వారితో దాదాపు నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించింది. అదేవిధంగా పాలిసెట్‌కు సంబంధించిన మెటీరియల్‌ను ఉచితంగా పంపిణీ చేసింది. శిక్షణ సమయంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను సైతం ప్రభుత్వమే కల్పించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24.75 లక్షలు ఖర్చు చేసింది. వీటన్నిటి కారణంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీంతో ఇతర ప్రవేశ పరీక్షలకు సైతం శిక్షణ ఇచ్చే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, డిగ్రీ విద్యార్థులకు పీజీసెట్‌పై అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. -
ఎస్సీలకు కార్పొరేట్ విద్య!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉండటంతో జిల్లాకు 100 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా రెసిడెన్షియల్ విద్యను అందిస్తోంది. తాజాగా జిల్లాల సంఖ్య పెరగడంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాను యూనిట్‌గా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కావడంతో.. జిల్లాను యూనిట్‌గా తీసుకుని అన్ని జిల్లాలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,000 నుంచి 3,300కు పెరగనుంది. జిల్లా స్థాయిలో బీఏఎస్ లబ్ధిదారుల ఎంపిక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపిక కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రెసిడెన్షియల్ విద్యను కూడా అందిస్తారు. ఫీజులు పెంపు... బీఏఎస్ కింద ఎంపికైన వారిలో ఏడో తరగతిలోపు విద్యార్థులకు రూ. 20 వేలు, ఆపై తరగతుల వారికి రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. నిర్వహణ భారీగా పెరగడంతో ఫీజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తు త ఫీజులకు రెట్టింపు ఫీజులిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలో ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ అన్నారు. -
‘ఉపకార’ గడువు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు నమోదు గడువును నెలరోజుల పాటు పొడిగించాలని సంబంధిత సంక్షేమ శాఖలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాయి. ఈ నెల 31తో పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు గడువు ముగియనుంది. వాస్తవానికి ఈ దరఖాస్తుల ప్రక్రియ జూలై రెండో వారంలో మొదలవ్వగా అక్టోబర్ నెలాఖరుతో గడువు ముగిసింది. కానీ ఆలోపు కేవలం 4.72లక్షల మంది విద్యార్థులు మాత్రమే నమోదు చేసుకోవడంతో డిసెంబర్ నెలాఖరు వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దరఖాస్తు గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని సంక్షేమ శాఖ లు యోచిస్తున్నాయి. ఆ మేరకు గడువు తేదీ పెంపునకు అనుమతులు కోరుతూ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దరఖాస్తులు 10.45 లక్షలే.. పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 13.5 లక్షల మంది విద్యార్థులుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు కేవలం 10.45 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఆ మేర దరఖాస్తులు వచ్చే అవకాశం లేదు. దీంతో దరఖాస్తు స్వీకరణను మరో నెల పాటు కొనసాగించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ మేరకు భావించి ప్రభుత్వానికి నివేదించింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పాస్ సర్వర్‌లో స్వీకరణ గడువును అధికారులు పొడిగించనున్నారు. -
ఎస్సీ హాస్టళ్లకు సర్కారు కానుక
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకుని వసతిగృహ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదనపు కోటాకింద ప్రత్యేక సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం చలికాలాన్ని దృష్టి లో పెట్టుకుని పిల్లలు ఇబ్బంది పడకుండా నాణ్యమైన దుప్పట్లు, పరుపులు ఎస్సీ అభివృద్ధి శాఖ పంపిణీ చేస్తోంది. అలాగే 2 రకాల బూట్లు, స్కూల్ బ్యాగులనూ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 865 వసతి గృహాలున్నాయి. వీటిలో 677 ప్రీమెట్రిక్, 188 పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో దాదాపు 40వేల మంది పిల్లలు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ విద్యార్థులకు 2 రకాల వస్తువులను ఆ శాఖ అందించింది. దాదాపు 12.5 కోట్లు ఖర్చు చేసి మెటీరియల్‌ను కొనుగోలు చేసి వసతి గృహాలకు అందజేసింది. ప్రస్తుతం వసతి గృహ సంక్షేమాధికారులు పంపిణీని మొదలుపెట్టారు. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
వసతి గృహాల ప్రారంభమెప్పుడో..?
కరీంనగర్‌ఎడ్యుకేషన్: ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల కళాశాలస్థాయి వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోక వందలాది మంది విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి బాలురు, బాలికలకు రెండు కళాశాల స్థాయి వసతి గృహాలు, బీసీ సంక్షేమ శాఖ నుంచి రెండు బాలురు, ఒకటి బాలికల కళాశాలస్థాయి వసతి గృహాలు 40 రోజుల క్రితం మంజూరు కాగా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో చదువుతున్న నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు, వసతి లేకపోవడంతో చదువులను అర్ధంతరంగా ఆపివేయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రానికి 16 మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు చదువు నిమిత్తం జిల్లా కేంద్రానికి రోజూ వచ్చి పోవడంతో బస్సు చార్జీలతో బెంబేలెత్తిపోతున్నా రు. సంక్షేమ వసతి గృహాలకు అద్దెకివ్వడానికి భవ న యజమానులు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే.. అద్దెకు దొరికిన భవనాల కిరాయిల అద్దె రేట్లు ప్రభుత్వానికి గుదిబండగా మారడంతో వసతి గృహాల ప్రారంభానికి గ్రహణం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అద్దె ధరలు తక్కువగా ఉండటం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అద్దె ధరలు పెంచే అధికారం సంక్షేమ అధికారులకు లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. పోటాపోటీ దరఖాస్తులు.. బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వంద మంది విద్యార్థులు ఉండాల్సిన వసతి గృహాల్లో ఇప్పటికే 150కి మించి విద్యార్థులు ఉండడంతో ఏం చేయాలో పాలుపోక సంక్షేమ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలకు విద్యార్థుల ప్రవేశాల తాకిడి అధికమవ్వడంతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్న వసతి గృహాలకు తోడు ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి రెండు (బాలురు, బాలికలు), బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, వీణవంక, చొప్పదండి మండల కేంద్రాల్లోని ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మారుస్తూ జిల్లా కేంద్రానికి తరలించారు. ఐదు కళాశాల స్థాయి వసతి గృహాల్లో ప్రవేశాల కోసం 540 మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఐదు హా స్టళ్లను నెలకొల్పుతూ తీసుకున్న నిర్ణయం 40 రోజు లు గడుస్తున్నా భవనాలు లభించకపోవడం, లభిం చిన చోట కిరాయి రేట్లు నిబంధనల ప్రకారం పొం తన లేకుండా ఉండడంతో వసతి గృహాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఒక చదరపు అడుగుకు రూ.5.50 చెల్లించే అవకాశం ఉంది. నగరంలో అద్దెలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ధర మాత్రం తక్కువగా ఉంది. దీనికితోడు ఖాళీ స్థలం, కారిడార్‌తోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలకు అద్దె కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రహదారులు, భవనాల శాఖ అధికారులు ఇంటి నిర్మాణం కొలతలు చూసి అద్దె నిర్ణయిస్తారు. అధికారుల లెక్కలకు క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాల యజమానుల కిరాయి రేట్లకు పొంతన లేకుండా పోవడంతో వసతి గృహాల ప్రా రంభం కొలిక్కి రావడం లేదు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకోని సంక్షేమ శాఖల కళాశాల స్థాయి వసతి గృహాల ప్రారంభానికి కసరత్తు ముమ్మరం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘వసతి గృహాల భవనాల ప్రారంభానికి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాం. అద్దె భవనాల రేట్లు అధికంగా ఉండటం, ప్రభుత్వ నిబంధనలు సరిపోక పరిస్థితిని పైఅధికారులకు విన్నవించాం. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి’ అని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్‌కుమార్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వరం ప్రకటించింది. ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. విద్యుత్‌శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నిరుపేద షెడ్యూల్డ్ కులాలకు అండగా నిలవాలని భావించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్‌ను 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ వర్గాల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం తాజాగా 101యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీవీలు, ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వినియోగం ఎక్కువైందని భావించిన సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. 101 యూనిట్లకయ్యే విద్యుత్‌చార్జీలను డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఉమ్మడి సర్కిల్ పరిధిలో 26,069 సర్వీసులకు ప్రయోజనం చేకూరనుండగా.. ఇందుకయ్యే నెలకయ్యే రూ.50,60,101 విద్యుత్ చార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది. 26,069 సర్వీసులకు ప్రయోజనం కరీంనగర్ ఉమ్మడి సర్కిల్ పరిధిలోని 26,069 విద్యుత్ సర్వీసులకు ప్రయోజనం చేకూరుతుండగా.. ఇందుకు సంబంధించిన రూ.50,60,101 విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భరించనుంది. ఎస్సీ 24,778 సర్వీసులకు గాను రూ.47,88,299లు, ఎస్టీ 1291 సర్వీసులకు గాను రూ.2,71,802ల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనుంది. ఆదేశాలు రాగానే అమలు: కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను టీఎస్ ఎన్పీడీసీఎల్ నుంచి ఆర్డర్ రాగానే అమలు చేస్తాం. ఇంకా పేర్లు నమోదు చేసుకోని వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధిత ఏఈలకు దరఖాస్తు చేసుకోవాలి. -
విద్యానిధి.. ప్రతిభకు పెన్నిధి
20 లక్షలు - ఏఓవీఎన్ కింద పీజీ, పీహెచ్డీ కోర్సులకు.. 465 మంది - నాలుగేళ్లలో లబ్ధిపొందిన విద్యార్థులు 81.10 కోట్లు - మొత్తం అయిన ఖర్చు సాక్షి, హైదరాబాద్: సంపన్నులకే సాధ్యమయ్యే విదేశీ చదువు సామాన్యుడి చెంతకు చేరింది. తెలంగాణ ప్రభు త్వం తలపెట్టిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఏఓవీఎన్) పథకంతో వందలాది దళిత ప్రతిభావంతులు విదేశాల్లో పట్టభద్రులయ్యారు. అంతేకాదు, అక్కడున్న బహుళజాతీయ సంస్థల్లో ఉన్నత కొలువులు సంపాదించి తోటివారికిమార్గదర్శకులయ్యారు. నాలుగేళ్లలో ఏకంగా 465 మంది తెలంగాణ బిడ్డలు అమె రికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంతో లబ్ధిపొందిన వారి పరిస్థితి ఎలా ఉందనే కోణంలో ఆ శాఖ ఇటీవల పరిశీలన చేపట్టింది. ఎంపిక చేసిన జాబితా ఆధారంగా దాదాపు 65 మందితో మాట్లాడారు. ఇందులో దాదాపు 50 మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేసి బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తుండటంతో అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు సాయంతో... 2013–14 విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఏఓవీఎన్ కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసేవారు. విదేశీ విద్యకు ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు లబ్ధిపొందేవారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఎస్సీ, బీసీ, ఈబీసీలకు వేర్వేరు పేర్లతో విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలుత ఎస్సీలకు ఈ పథకాన్ని అమలుచేసిన క్రమంలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్, క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏఓవీఎన్ పథకం కింద 465 మంది ఎంపిక కాగా, రూ.81.10 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం రూపంలో అందించింది. లక్ష్యాన్ని సాధించా... హైదరాబాద్‌లో మాది మధ్యతరగతి కుటుంబం. అమెరికాలో పీజీ చదవాలనేది నా కోరిక. బీటెక్ పూర్తి చేసిన తర్వాత అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద దరఖాస్తు చేశా. డల్లాస్‌లోని బాప్టిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశా. తొలి ప్రయత్నంలోనే డెల్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుంటే విదేశీ విద్య అభ్యసించేదాన్ని కాదు. – కొల్లాబత్తుల సింధూజ ఉత్తమమైన పథకం ఇది.. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యానిధి పథకం ఎస్సీలకు వరమే. ఈ పథకం కింద రూ.20లక్షల ఆర్థిక సాయం అందుతుంది. వీసా ఖర్చు, యూనివర్సిటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు, ఫ్లైట్ చార్జీలు సైతం ఈ నిధుల నుంచే వినియోగించుకున్నా. ప్రతిభగల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం ఉత్తమమైనది. నా కుటుంబం ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. – నీరటి భాస్కర్ పథకంతో దశ తిరిగింది.. నాన్న అరకొర వేతనంతో మా జీవితం అంతంతమాత్రంగానే ఉండేది. డిగ్రీ వరకు ఎలా గోలా నెట్టుకొచ్చినా ఎమ్మెస్ చేయలేనని భావించా. అప్పుడే ఈ పథకం గురించి తెలిసింది. దరఖాస్తు ప్రక్రియంతా పారదర్శకంగా జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నా. మంచి మార్కులు రావడంతో అమెరికాలోని బ్రిడ్జిపోర్ట్ యూనివర్సిటీలో కంప్యూ టర్ సైన్స్‌లో ఎంఎస్‌లో చేరా. డిస్టింక్షన్లో పాసై అబ్వీ అండ్ ఇన్ఫినిటీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీలో ఐటీ అనలిస్ట్‌గా ఉద్యోగం సంపాదించా. – వూట్ల దివ్యశాంతి అపరిమిత సంఖ్యలో ఎంపిక.. ఏఓవీఎన్ పథకానికి ప్రస్తుతం ఎలాంటి సీలింగ్ లేదు. అర్హులు ఎంత మంది ఉన్నా వారికి ఆర్థిక సాయం అందిస్తాం. యూనివర్సిటీ ప్రవేశాలు, ఫీజుల ఆధారంగా ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నాం. అర్హత సాధించిన అనంతరం యూనివర్సిటీలో ప్రవేశం తీసుకున్నట్లు అడ్మిట్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసిన వెంటనే రెండు వాయిదాల్లో ఫీజులు చెల్లిస్తున్నాం. వందశాతంపారదర్శకంగా నిర్వహిస్తున్నాం. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు -
‘కాస్మొటిక్’ వెతలు!
ఆదిలాబాద్‌రూరల్: అమ్మానాన్నలకు దూరంగా ఉండి.. చదువే లక్ష్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు. ప్రభుత్వం హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొనడం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా కాస్మొటిక్ చార్జీలు చెల్లించకపోవడంతో ఆయా వసతిగృహ విద్యార్థులు విద్యపై దృష్టి సారించలేకపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలేవి..! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా ఆచరణలో అవి కనిపించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆయా వసతిగృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురై చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఖర్చులకు సరిపడా చార్జీలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా వాటిని కొనుగోలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలు చదువుతోనే బాగుపడుతాయని భావించి ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ విద్యార్థుల ఖర్చులకు నెలనెలా డబ్బులు పంపించాల్సి వస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్మొటిక్ చార్జీలు ఇలా.. జిల్లాలో ఎస్సీ బాలుర 19 వసతి గృహాలు ఉండగా, ఇందులో 821 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బీసీ ప్రీమెట్రిక్ 9 వసతిగృహాలు ఉండగా 573 మంది చదువుతున్నారు. గిరిజన వసతి గృహాలు 38 ఉండగా ఇందులో 10,621 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురకు కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.62 చెల్లిస్తున్నారు. ఆయా వసతి గృహాల్లో చదువుతున్న బాలుర విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల కింద ప్రభుత్వం నెలకు రూ.62 అందజేస్తుంది. ఇందులో విద్యార్థి రూ.50 తో సబ్బులు, నూనెలు, టూత్‌పేస్ట్, పౌడర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు హెయిర్ కటింగ్‌కు రూ.12 చెల్లిస్తుంది. ఎస్సీ, బీసీ వసతిగృహాల కాస్మొటిక్ చార్జీలను నేరుగా విద్యార్థులకు అందజేస్తారు. కాగా ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులకు సంబంధించి కాస్మొటిక్ చార్జీలను టెండర్ ద్వారా అందజేస్తారు. కటింగ్ చార్జీలకు సంబంధించిన సొమ్మును సంబంధిత వసతిగృహ ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలతో నాయీ బ్రాహ్మణులు హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా లేకపోవడం, బయట మార్కెట్లో హెయిర్ కటింగ్‌కు ఒక విద్యార్థికి రూ.40 నుంచి రూ.50 తీసుకుంటుండడంతో ఇవి ఎటూ సరిపోవడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆయా వసతి గృహ నిర్వాహకులకు తెలియజేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహ విద్యార్థులు ఒకరికొకరు క్షవరం (హెయిర్ కటింగ్) చేసుకోవడం సంచలనం కలిగించింది. లోపిస్తున్న నాణ్యత.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న కాస్మొటిక్లలో నాణ్యత లోపిస్తోందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టు దక్కించుకునే సమయంలో నాణ్యతగల వస్తువులను చూపించిన కాంట్రాక్టర్లు తీరా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్మొటిక్ కిట్ మాదిరిగా పంపిణీ చేయాలి.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కేసీఆర్ కిట్ అందిస్తున్న విధంగానే బాలుర వసతిగృహ విద్యార్థులకు సైతం కిట్లాగా అందజేస్తే బాగుంటుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – శివకుమార్, హెచ్‌డబ్ల్యూవో, బీసీ హాస్టల్, ఆదిలాబాద్ చార్జీలు సరిపోవడంలేదు ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న కాస్మొటిక్ చార్జీలు రూ.62 సరిపోవడంలేదు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలి. హెయిర్ కటింగ్ కోసం ప్రభుత్వం రూ.12 మాత్రమే చెల్లిస్తుంది. కటింగ్ కోసం బయట రూ.40 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా భారమవుతోంది. – సాయికృష్ణ, బీసీ హాస్టల్ విద్యార్థి, ఆదిలాబాద్ ప్రతిపాదనలు పంపించాం ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం కాస్మొటిక్ చా ర్జీల కింద ఒక్కొక్కరికి నెలకు రూ.62 అందజేస్తున్నాం. ఇందులో హెయిర్ కటింగ్ కోసం రూ.12, మిగితా రూ.50తో సబ్బులు, పౌడర్, నూనె కొనుగోలు చేసేందుకు అం దిస్తుంది. విద్యార్థినులకు కాస్మొటిక్ కిట్లు అందజేస్తున్నట్లుగా బాలురకు కూడా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి -
డేటా లేకుండా రిజర్వేషన్లు ఎలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని నిరూపించే సమాచారంతో రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడంలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు పరిమాణాత్మక సమాచారమే కీలకమని ఉద్ఘాటించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయాలన్న 12 ఏళ్ల నాటి కోర్టు తీర్పును కేంద్రం సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం పైవిధంగా స్పందించింది. పదోన్నతుల్లో దళితులకు 23 శాతం కోటా ఉండాలని కేంద్రం ఉద్ఘాటించింది. 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు వెనకబాటుతనం, తక్కువ ప్రాతినిధ్యాన్ని కోర్టు ప్రాదిపదికగా నిర్ధారించడం తెల్సిందే. దీంతో వారికి పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, ఆ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్ పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది. ‘క్రీమీలేయర్‌పై 12 ఏళ్ల క్రితం వెలువడిన తీర్పు తప్పని నిరూపించాలంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందనే సమాచారాన్ని గణాంకాలతో సహా సమర్పించాలి. ఇన్నేళ్లయినా ఆ వివరాలను రాష్ట్రాలు ఇంకా ఎందుకు సేకరించలేదు?’ అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ..వెనకబడిన తరగతులుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన వాళ్లమని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరంలేదన్న 1992 నాటి ఇందిరా సహానీ కేసును ఉదహరించారు. పరిమాణాత్మక సమాచారం అందుబాటులో ఉంటే నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కోర్టు బదులిచ్చింది. వారికి తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, వేగంగా పదోన్నతులు కల్పించే బాధ్యత రాష్ట్రాలదే అని పేర్కొంది. -
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలి
ములుగు రూరల్ వరంగల్ : సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని ఇంచర్ల గ్రామ ఎస్సీ కాలనీలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలలో ఆర్ధిక వనరులను కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దళితులకు మూడెకరాల భూమిని కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూ చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ కోరగా.. పంపిణీకి ప్రభుత్వ భూమి లేదని, అమ్మేవారు ఉంటే తహసీల్దార్ దృష్టిఇ తీసుకువెళ్లాలని సూచించారు. మంత్రి చందూలాల్‌తో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీసీరోడ్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని ఎంపీడీఓ విజయ్ స్వరూప్‌ను ఆదేశించారు. తన కూతురు కళ్యాణలక్ష్మీ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా పరిశీలించి పథకం వర్తింపజేయాలని తహసీల్దార్‌ను ఆవేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రవికిరణ్, ఎస్సై బండారి రాజు, జెడ్పీటీసీ సకినాల శోభన్, సర్పంచ్ ముడతనపల్లి కవితకుమార్, ఎంపీటీసీ సభ్యుడు శానబోయిన అశోక్, ఆర్ఐ అఫ్రీన్, యుగంధర్‌రెడ్డి, వీఆర్వో సూరయ్య పాల్గొన్నారు. -
సబ్‌ప్లాన్ చట్టానికి తూట్లు..!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం అమలుకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నోడల్ ఏజెన్సీ ద్వారా వివిధ శాఖల నుంచి జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులను రాబట్టి వాటిని సకాలంలో ఖర్చు చేయడంతోపాటు ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు లేకుండా చూడాల్సిన జిల్లా మానిటరింగ్ కమిటీ అందుకు తగినంతగా పనిచేయడం లేదన్న విమర్శలు దళిత, గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. చట్టం ఏర్పాటు ఇలా.. దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరంపై అనేక పోరాటల ఫలితంగా జనవరి 1, 2013లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం వచ్చింది. దేశంలో దళితులు 17.08 శాతం, గిరిజనులు 6 శాతం ఉన్నారు. ఈ చట్ట ప్రకారం దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాధికన బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగాలి. కేటాయించిన నిధులను ఈ రెండు సామాజిక వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. చట్టం ఏం చెబుతోంది..? ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడంతో ఏటా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవో నంబర్ 8, 23.12.2013 ప్రకారం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీకి చీఫ్ మినిస్టర్ చైర్మన్ కాగా 35 మందిని మెంబర్లుగా నియమిస్తారు. కన్వీనర్‌గా ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ నోడల్ ఏజెన్సీకి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన బడ్జెట్లో నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. జిల్లాలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు.. జీవో నంబర్ 34 ప్రకారం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటిలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటికి జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని జీవో చెబుతుంది. ఈ జీవోని 01.11.2013న ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులపై సమీక్షించిన దఖాలాలు ఏ మాత్రం కనిపించడంలేదని తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం జీవో నంబర్ 6 ని 2014లో విడుదల చేసింది. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఐటీడీఏ ఉన్న ప్రాంతాలలో ఆ శాఖ జిల్లా అధికారి కన్వీనర్‌గా ఉండగా మిగిలిన శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారని స్పష్టం చేసింది. ఐటీడీఏ లేని ప్రాంతాలలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీ జిల్లాలో ఉన్న ప్రభుత్వం శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. ఇంకా బడ్జెట్ ప్రతిపాదనలు, నిధుల సమీకరణ, వాటికి ఖర్చుకు సంబంధించిన మానిటరింగ్‌ను చేయాల్సి ఉంది. అంతే కాకుండా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అభివృద్ధి పథకాల అమలలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంది. అలాంటి పనులు జిల్లాలో ఏమాత్రం జరగటం లేదు. ఇంకా జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఉప ప్రణాళిక అమల తీరును పర్యవేక్షించాల్సి ఉంది. రెండు నెలలకొకసారి సమావేశాలు జరపాల్సి ఉందని జీవ 34 చెబుతుంది. మౌలిక సదుపాయలు లేక దళిత, గిరిజన గ్రామాలు విలవిల.. జిల్లాలో 56 మండలాలు ఉండగా కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లుగా పరిపాలన సాగుతుంది. మొత్తం 1028 గ్రామపంచాయితీలు వీటి పరిధిలో ఉన్నాయి. 33 లక్షల జనాభా ఉన్న జిల్లాలో అత్యధిక శాతం దళిత, గిరిజనులే ఉన్నారు. వీరిలో 50 శాతానికి పైగా భూములు లేని కుటుంబాలు ఉండి, కేవలం దినసరి కూలీపైనే ఆధారి పడి జీవిస్తున్నాయి. మట్టి రోడ్లకు నోచుకోని పల్లెలతో పాటు, తాగునీరు, వీధిలైట్లు ఇలాకనీస మౌళిక సదుపాయాలు లేని గ్రామాలు దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇంకా స్మశానాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉపప్రణాళిక నిధుల జమఖర్చులపై ప్రశ్నించిన నాధుడు లేడు. చట్టం రాకముందు దళిత, గిరిజన నిధులు దారిమళ్లుతున్నాయని ఘోషించిన దళిత, గిరిజన నాయకులు చట్టం వచ్చిన తరువాత నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలకు ఫిర్యాదులు.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కమిటీ సమావేశాలు, నిధుల ఖర్చు, సమావేశాలు ఏమి జరగటం లేదని అంబేద్కర్ ఫీపుల్స్ జేఏసీ నాయకులు ఎం.కిషోర్‌కుమార్, మిట్నసల బెంజిమెన్ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. తరువాత జాయింట్ కలెక్టర్–2 మార్కెండేయులకు పిర్యాదు చేశారు. సంబధిత నోడల్ ఏజెన్సీ కన్వీనర్‌ని పిలిపించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలిపారు. -
ఎవరికి ఏమిచ్చాం
సాక్షి, హైదరాబాద్ : రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళ్లే వ్యూహంతో అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. దేశానికే ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేశామని చెబుతున్న అధికార పార్టీ దానికి తగినట్లుగానే వివరాలన్నీ సేకరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను, ఆ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. సమగ్ర సమాచార నిధి.. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలవారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాలవారీగా, గ్రామ స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య, వారి వివరాలను సేకరించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం వివరాలు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నాయి. మిగిలిన వివరాలను సేకరించడంతోపాటు, ఉన్న వివరాలను సరిచూసుకుని తప్పులు లేని విధంగా సంక్షేమ సమాచార నిధి ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళుతోంది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఉన్నతాధికారులు ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసమే కాక రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలను పొందుపరిచే లక్ష్యంతో అధికారులు ఈ పని చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖాల వారీగా వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ శాఖల్లో అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్కే జోషి ఆయా శాఖల అధికారులను ఇటీవల ఆదేశించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తిస్థాయి డాటాబేస్‌ను రూపొందించాలని సూచించారు. డాటాబేస్ రూపకల్పన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక పేజీలో ఈ వివరాలు అందిరికీ తెలిసేలా ఉంచనున్నారు. వంద శాతం స్పష్టత.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా సంక్షేమ శాఖల ఆధర్యంలోనే అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి తదితర కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థిక చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు సబ్సిడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేజీటు పీజీ కార్యక్రమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి 2.5 లక్షల మంది పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. గ్రామీణాభివద్ధి శాఖ లక్షలాది మందికి ఆసరా పింఛన్లు ఇస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ కేసీఆర్ కిట్లు, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఆపద్భంధు, ఫ్యామిలీ బెనిఫిట్ పథకాలు రెవెన్యూ శాఖ అమలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, మత్సశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ.. ఇలా పెద్ద సంఖ్యలో పథకాలు అమలవుతున్నాయి. అయితే అన్ని పథకాల సమగ్ర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీన్ని సరి చేసేందుకు శాఖల వారీగా పథకాలు, కార్యక్రమాలు.. వీటి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. వంద శాతం సరైన గణాంకాలు, వివరాలు ఉండేలా ఈ ప్రక్రియ సాగుతోంది. సామాజిక వర్గాల వారీగా.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల నమోదు పక్కా ప్రణాళికతో సాగుతోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నమోదు చేయడంతోపాటు సామాజిక వర్గాల వారీ వివరాలనూ సేకరిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబాల వారీగానూ క్రోడీకరిస్తున్నారు. పథకాల వారీగా చేసిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య తెలిసేలా ప్రభుత్వ వెబ్సైట్లో ఈ వివరాలను అందుబాటులో పెట్టనున్నారు. కచ్చితమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పారదర్శకతతోపాటు, ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ ఉంటుందనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు ఇప్పటికే దాదాపుగా నమోదయ్యాయి. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంర్ధక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు వివరాలను సేకరిస్తున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు.. రాష్ట్రంలో ఎస్సీ జనాభా : 54 లక్షలు కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులు : 88,786 చేసిన ఖర్చు : రూ.504 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 8,74,443 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 2.50 లక్షలు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు : 2.67 లక్షలు ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకం లబ్ధిదారులు : 1,04,980 ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకానికి మంజూరు : రూ.1,136 కోట్లు ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు : 57,500 -
జనసేనలో లుకలుకలు
ఏలూరు టౌన్ : సమాజంలో మార్పుకోసమంటూ...పేద, బలహీన, దళిత వర్గాల అభ్యుదయవాదిగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజా క్షేత్రంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక రెండురోజుల్లో పశ్చిమలో పవన్ పర్యటన సైతం ఖరారైంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులుగా, కాపు సామాజికవర్గంలో నాయకుడిగా ఉన్న జల్లా హరికృష్ణ ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ జనసేనకు ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరిపోగా, తాజాగా ఎస్సీ సామాజివర్గానికి చెందిన యువనేత సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఏలూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఎప్పటినుంచో వపన్‌కళ్యాణ్‌కు వీరాభిమానిగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటే ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒక ఎస్సీ యువ నాయకుడికి సమావేశంలో ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోగా, అధినేత సామాజికవర్గానికి చెందిన నేతలు అతనిపై గొడవ దిగి బయటకు నెట్టి వేసినట్లు తెలుస్తోంది. తాను ఎస్సీ కావటం వల్లే చిన్నచూపు చూస్తున్నారని ఆ యువ నాయకుడు ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఇక మరో యువనేతపైనా పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడడం, కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేయటంపై పార్టీలో విభేదాలకు అద్దం పడుతున్నాయి. -
పదోన్నతులపై నితీష్ కీలక నిర్ణయం
పాట్నా : ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అధికారుల సలహా మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వ భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిపారసులకు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లలను కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏమేరకు ప్రతిఫలం ఇస్తుందో వేచి చూడాలి.