సాక్షి, విజయవాడ : మాజీమంత్రి రావెల కిషోర్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రావెల కిషోర్ బాబు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. ‘రావెలకు ఇష్టముంటే పార్టీలో ఉండొచ్చు...లేదంటే వెళ్లిపోవచ్చు’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోని అంశమని, చంద్రబాబును కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వర్గీకరణపై టీడీపీకి ఓ సిద్ధాంతం ఉందని అన్నారు.
ఆ వ్యాఖ్యలకు ఆయనే అర్థం చెప్పాలి
ఎవరో చెప్పే మాటలు వినే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుపట్టారు. మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. రావెల వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటో ఆయనే చెప్పాలని ...ఆ వ్యాఖ్యలు రావెల వ్యక్తిగతమన్నారు. ఆయన ఏదో మానసిక ఓత్తిడిలో ఉన్నట్లున్నారని జవహర్ అన్నారు. మాదిగలకు టీడీపీకి ఉన్న బంధాన్ని విడదీయాలని మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుల పునాదులపై రాజకీయ పార్టీలు పెట్టాలనుకోవడం వారి అపరిపక్వతకు నిదర్శనమన్నారు.
కాగా తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని గుర్రం జాషువా జయంతి ఉత్సవాలలో గురువారం మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం తాను శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధమన్న ఆయన...ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర పరిధిలోని అంశమని రావెల పేర్కొన్న విషయం విదితమే.