సాక్షి, అమరావతి: ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలుచేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ అమలు చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 2022–23 మూడో త్రైమాసికం వరకు(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల అమలు పురోగతిపై నివేదికను ఆ శాఖ శనివారం విడుదల చేసింది.
ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ కుటుంబాలకు సాయం అందించడం, రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పట్టణ పేదలకు సాయం అందించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చాలామంచి’ పనితీరు కనబరించిందని ఆ నివేదిక కితాబిచ్చింది. లక్ష్యాల్లో 90 శాతానికి పైగా అమలుచేసిన రాష్ట్రాలను చాలామంచి పనితీరు కనబరిచినట్లు, 80–90 శాతం మేర అమలుచేసిన రాష్ట్రాలు ‘మంచి పనితీరు’ కనబరిచినట్లు.. అలాగే 80 శాతం లోపల అమలుచేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా నివేదిక వర్గీకరించింది.
ఏపీలో 33.57 లక్షల కుటుంబాలకు సాయం..
ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 34,68,986 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. అందులో ఒక్క ఏపీలోనే ఏకంగా 33,57,052 కుటుంబాలకు సహాయం అందించారు.
అలాగే, గతంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 29,10,944 కుటుంబాలకు సాయం అందించగా.. అదే ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య 33,57,052కు పెరిగింది. అంటే.. మూడునెలల వ్యవధిలో అదనంగా 4,46,108 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించింది.
మిగతా మరే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం చేయలేదని నివేదిక స్పష్టంచేసింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 22,884 కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకన్నా తక్కువగా వేల, వందల సంఖ్యలోనే సహాయం అందించాయి.
పట్టణ పేదలకు సాయంలో కూడా..
అలాగే, గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణాల్లోని 5,98,194 పట్టణ పేద కుటుంబాలకు సాయం అందించగా అందులో ఒక్క ఏపీలోనే 5,05,962 పేద కుటుంబాలకు సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది.
ఇదే గతంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 3.47 లక్షల మందికి సాయం అందించినట్లు పేర్కొనగా ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో ఆ సంఖ్య 5,05,962కు పెరిగినట్లు పేర్కొంది.
అంటే మూడు నెలల వ్యవధిలో పట్టణాల్లోని 1.58 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సాయం అందించినట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు సాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
‘వ్యవసాయ’ విద్యుత్ కనెక్షన్లలోనూ అగ్రగామి..
అంతేకాక.. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ ‘చాలామంచి’ పనితీరు కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2022–23లో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడో త్రైమాసికం నాటికి (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) లక్ష్యానికి మించి 98,447 వ్యవసాయ పంపు సెట్లకు ఏపీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది.
మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయలేదు. ఉపాధి హామీ కింద రాష్ట్రంలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,78,182 మందికి కొత్తగా జాబ్‌కార్డులను మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, ఆ సమయంలో కూలీలకు వేతనాల రూపంలో రూ.3,898.20 కోట్లు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలోని 55,607 అంగన్‌వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment