pump sets
-
అట్టడుగు వర్గాలకు సాయంలో.. 'ఏపీ అద్వితీయం'
సాక్షి, అమరావతి: ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలుచేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ అమలు చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 2022–23 మూడో త్రైమాసికం వరకు(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల అమలు పురోగతిపై నివేదికను ఆ శాఖ శనివారం విడుదల చేసింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ కుటుంబాలకు సాయం అందించడం, రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పట్టణ పేదలకు సాయం అందించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చాలామంచి’ పనితీరు కనబరించిందని ఆ నివేదిక కితాబిచ్చింది. లక్ష్యాల్లో 90 శాతానికి పైగా అమలుచేసిన రాష్ట్రాలను చాలామంచి పనితీరు కనబరిచినట్లు, 80–90 శాతం మేర అమలుచేసిన రాష్ట్రాలు ‘మంచి పనితీరు’ కనబరిచినట్లు.. అలాగే 80 శాతం లోపల అమలుచేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా నివేదిక వర్గీకరించింది. ఏపీలో 33.57 లక్షల కుటుంబాలకు సాయం.. ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 34,68,986 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. అందులో ఒక్క ఏపీలోనే ఏకంగా 33,57,052 కుటుంబాలకు సహాయం అందించారు. అలాగే, గతంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 29,10,944 కుటుంబాలకు సాయం అందించగా.. అదే ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య 33,57,052కు పెరిగింది. అంటే.. మూడునెలల వ్యవధిలో అదనంగా 4,46,108 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించింది. మిగతా మరే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం చేయలేదని నివేదిక స్పష్టంచేసింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 22,884 కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకన్నా తక్కువగా వేల, వందల సంఖ్యలోనే సహాయం అందించాయి. పట్టణ పేదలకు సాయంలో కూడా.. అలాగే, గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణాల్లోని 5,98,194 పట్టణ పేద కుటుంబాలకు సాయం అందించగా అందులో ఒక్క ఏపీలోనే 5,05,962 పేద కుటుంబాలకు సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే గతంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 3.47 లక్షల మందికి సాయం అందించినట్లు పేర్కొనగా ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో ఆ సంఖ్య 5,05,962కు పెరిగినట్లు పేర్కొంది. అంటే మూడు నెలల వ్యవధిలో పట్టణాల్లోని 1.58 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సాయం అందించినట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు సాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ‘వ్యవసాయ’ విద్యుత్ కనెక్షన్లలోనూ అగ్రగామి.. అంతేకాక.. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ ‘చాలామంచి’ పనితీరు కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2022–23లో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడో త్రైమాసికం నాటికి (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) లక్ష్యానికి మించి 98,447 వ్యవసాయ పంపు సెట్లకు ఏపీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయలేదు. ఉపాధి హామీ కింద రాష్ట్రంలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,78,182 మందికి కొత్తగా జాబ్‌కార్డులను మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, ఆ సమయంలో కూలీలకు వేతనాల రూపంలో రూ.3,898.20 కోట్లు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. -
పంపుసెట్లకు దొంగల బెడద
సాక్షి, మోర్తాడ్: వరద కాలువకు ఇరువైపుల ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లకు దొంగల బెడద ఎక్కువైంది. పంపుసెట్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్న దొంగలు రాగి (కాపర్) తీగెలను ఎత్తుకెళుతున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, ముప్కాల్, బాల్కొండ మండలాల్లోని పలు గ్రామాల మధ్య వరద కాలువను తవ్వారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవనం పథకంలో భాగంగా కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వర్షపు నీరు వరద కాలువలో నిలిచింది. ఆ నీటిని పంట పొలాలకు తరలించేందుకు అనేక మంది రైతులు పంపుసెట్లను ఏర్పాటు చేసుకున్నారు. పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఉన్న బోర్డులలోని ఫ్యూజ్లను దొంగలు తొలగించి విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లలో ఉన్న రాగి తీగలను తొలగించి వాటిని కొన్ని రోజుల నుంచి దొంగలు ఎత్తుకెళుతున్నారు. కాళేశ్వరం నీరు వరద కాలువలో చేరడంతో తాము పండిస్తున్న పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలకు సాగునీటిని అందించేందుకు రైతులు సిద్ధం కాగా ఆదివారం కాపర్ తీగెల కోసం విద్యుత్ కనెక్షన్లను తొలగించినట్లు ఆధారాలు లభించాయి. మోర్తాడ్, పాలెం, తిమ్మాపూర్, గాండ్లపేట్, దొన్కల్ తదితర గ్రామాలకు చెంది న రైతుల పంపుసెట్ల కనెక్షన్లు కట్ చేసినట్లు ఉన్నాయి. కాపర్ తీగెలు చోరీకి గురి కావడంతో పంట పొలాలకు రైతులు సాగునీటిని అందించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. కొద్ది రోజులుగా ఇలా వరుస చోరీలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఫ్యూజ్లను తొలగించి విద్యుత్ తీగెలను దొంగలు కట్ చేస్తుండటంతో తాము ఆర్థికంగాను నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాగి తీగెలను దొంగిలించే వారిని పట్టుకునేందుకు రైతులు గతంలో గస్తీ తిరిగారు. అయితే వర్షాలు కురుస్తుండటంతో గస్తీని నిలిపివేశారు. అంతలోనే మళ్లీ చోరీలు మొదలయ్యాయి. పోలీసులు స్పందించి వరద కాలువ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. -
సౌర సుజల యోజనతో..
రాయ్‌పూర్: అది మారుమూల గిరిజన కొండ ప్రాంతం. అక్కడి రైతులకు ఎలాంటి ఆదాయ మార్గాలులేవు. కనీసం విద్యుత్ కూడా ఉండేది కాదు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వారికి వరంలా మారింది. రెండేళ్లలో వారి దశ తిరిగింది. ఆదాయం లక్షల్లోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సౌర సుజల యోజన’ పుణ్యమే ఇదంతా. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ పథకం కింద మిరప వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని రైతులకు తక్కువ ధరకే సౌర విద్యుత్ పంప్సెట్లు సమకూర్చింది. కోపా గ్రామానికి చెందిన గుజ్‌నాథ్ రామ్ ఆహార పంటలను సాగుచేస్తూ సరైన దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ పథకం అమలు తర్వాత తనకున్న ఐదెకరాల్లో రెండేళ్లుగా ఆయన మిర్చితోపాటు, టమాటా, వరి కూడా సాగు చేస్తున్నారు. రామ్ ఏమంటున్నారంటే.. ‘ఇప్పటి వరకు వచ్చిన మిర్చి, టమాటాలను విక్రయించగా రూ.80వేలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా దిగుబడులు చేతికందుతాయి. ఇలా ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతాయి’. ‘సౌర్ సుజల యోజన’ ద్వారా లబ్ధి పొందుతున్న బగీచా, మనోరా ప్రాంతాల్లోని 50 గ్రామాలకు చెందిన 500 మంది రైతుల్లో రామ్ కూడా ఒకరు. ‘2016 వరకు జిల్లాలో కేవలం 300 ఎకరాల్లో మాత్రమే మిరప సాగు జరుగుతుండేది. ఇప్పుడు అది రెండువేల ఎకరాలకు పెరిగింది. దీంతో ఇక్కడి రైతుల జీవనప్రమాణాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని జష్పూర్ జాయింట్ కలెక్టర్ ప్రియాంక శుక్లా తెలిపారు. -
రైతులకు ఉచితంగా రిమోట్ పంపుసెట్లు
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రైతులకు రిమోట్ ఆపరేట్ సిస్టమ్‌తో కూడిన పంపుసెట్లను ఉచితంగా అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి నారాయణతో కలసి ఆయన మాట్లాడారు. 15లక్షల మంది రైతులకు గాను మొదటి దశలో 2 లక్షల మందికి వీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్ల పాటు ఈ పంపుసెట్ల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వీటి వినియోగంతో రైతులకు 400 మిలియన్ యూనిట్ల కరెంట్ ఆదా అయ్యే అవకాశముందన్నారు. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై వచ్చే నెల 7న విజయవాడలోని హోటల్ తాజ్ గేట్‌వేలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.