
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్‌డీఎఫ్)కి ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. 2017–18 వార్షిక సంవత్సరం ముగియడానికి నెలన్నర గడువుందని ఆలోపు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో ఎస్సీ ఎస్‌డీఎఫ్ అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీఎస్‌డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించినట్లు జగదీశ్‌రెడ్డి చెప్పారు. జనవరి ఆఖరు నాటికి రూ.6,689 కోట్లు ఖర్చయ్యాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దళితుల అభివృద్ధికి 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు.