Dalits development
-
లక్ష కోట్ల ఖర్చుకైనా సిద్ధం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ ‘దళిత బంధు’పథకం అమలు చేస్తామని, ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు రూ.80 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కాళ్లు, రెక్కలే ఆస్తులుగా ఉన్న దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండా శ్రీనివాస్ శనివారం తన అనుచరులతో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ఈ సందర్భంగా బండా శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి మాట్లాడారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ‘దళిత బంధు’పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ దళితాభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర సాధన ఉద్యమంలా చేపట్టాలని.. దేశవ్యాప్తంగా ఈ పథకం విస్తరించాలని ఆకాంక్షించారు. దేశ సమాజానికే దారులు వేయాలి ‘దళిత బంధు’ను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణకే కాకుండా దేశ దళిత సమాజానికే హుజూరాబాద్ దారులు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘గత పాలనలో తెలంగాణ ప్రజలు గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులిపిల్ల లాంటి వారనే సంగతిని స్వయం పాలన వచ్చిన తర్వాత ప్రపంచం పసిగట్టింది. నేడు తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నివ్వెరపోతోంది. మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కళ్లలో సంతోషం కనిపిస్తోంది. అదే రీతిలో దళితుల ము ఖాల్లో కూడా ఆనందం చూడాలన్నదే నా పట్టుదల. ఇన్నాళ్లూ ఏవేవో పథకాలు పెట్టి బ్యాంకుల గ్యారెంటీ అడిగేవారు. కాళ్లు రెక్కలే ఆస్తులుగా ఉన్న దళితులు బ్యాంకు గ్యారంటీ ఎక్కడి నుంచి తెస్తరు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం పూర్తిగా ఉచితం. అది అప్పుకాదు. తిరిగి ఇచ్చేది కాదు. దళారులన్న మాటే ఉండదు. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది’’అని సీఎం చెప్పారు. దళితబంధు అనేది ఒక పథకం కాదని, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు.. ఒకరి అభివృద్ధి కోసం ఇంకొకరు పాటుపడే యజ్ఞమని వ్యాఖ్యానించారు. ఉపాధి కోసమే ఖర్చు చేయాలి ‘‘దళిత బంధు ద్వారా ఇచ్చిన పైసలను పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకుండా.. ప్రతి పైసాను ఉపాధి, వ్యాపారం కోసం ఖర్చు చేయాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’’అని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ, అంబేడ్కర్ల ఆశయాలను కొనసాగిస్తోందని, దళితుల అభివృద్ధిని సాధించి చూపెడతామని చెప్పారు. పార్టీలకతీతంగా దళిత బంధును అమలు చేసుకుందామని, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని సూచించారు. కక్షలు కార్పణ్యాలు, కొట్లాటలు, ద్వేషాలు లేని దళిత వాడలు పరిఢవిల్లాలని.. దళిత జాతిలో ఎవరూ పేదలుగా మిగలకూడదని ఆకాంక్షించారు. తాను పార్టీ పెట్టిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేసుకుంటూ వస్తున్న బండ శ్రీనివాస్‌కు కార్పొరేషన్ పదవి మాత్రమే ఇవ్వలేదని.. దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే బాధ్యతతో కూడిన బండను పెట్టానని సీఎం కేసీఆర్ అనడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని దళితులందరినీ దళిత బంధు పథకం ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి చేస్తుంది. పట్టుదలతో అందరం కలిసి పనిచేసి ఈ పథకాన్ని విజయవంతం చేయాలి. ఇందుకోసం ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్ పుట్టాలి. – సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై అనుమానాలొద్దు ‘‘రాజులు, జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములు, తర్వాత వలస పాలకులతో కలిపి వందల ఏండ్ల పాటు అనేక పీడనలను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నరు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వస్తున్నం. తెలంగాణ గాడిలో పడింది. మొదట్లో తెలంగాణ వస్తదా అన్నరు.. 24 గంటల కరెంటు అయ్యేదా పొయ్యేదా.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అయితదా అన్నరు. రైతుబంధు తెచ్చినప్పుడు కూడా కొందరు పెదవి విరిచారు. ఇప్పుడు దళితబంధు పథకాన్ని కొందరు అనుమానిస్తున్నరు. అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తం. దళితబంధు పథకాన్ని విజయవంతం చేస్తం.’’ – సీఎం కేసీఆర్ -
సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో అఖిలపక్షం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో 'సీఎం దళిత్ ఎంపవర్మెంట్' పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. '' సామాజికంగా, ఆర్ధికంగా దళితులు అభివృద్ధి చెందాలి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి. దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడతాం. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలి. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి.. వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా పర్యవేక్షించాలి. ఈ బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. మరో రూ.500 కోట్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వచ్చే నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ విజయవంతం చేయాలనేదే నా సంకల్పం. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలి.దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం.రాజకీయాలకతీతంగా సమిష్టి కార్యాచరణ బాధ్యత తీసుకుందాం. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలు వెతకాలి. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని విధానం రైతుబంధు పథకం, ఆసర పెన్షన్ల మాదిరిగా.. నేరుగా దళితులకు ఆర్థికసాయం అందేలా సూచనలు ఇవ్వాలి'' అని కేసీఆర్ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్లినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వార్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు, అందుకే ఈ బాధలు పోవాలన్నారు. తాము కూడా పురోగమించగలం అనే ఆత్మ స్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో తగిన సూచనలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అఖిలపక్ష నాయకులను కోరారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత భట్టి, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ ఆదేశాలు పట్టించుకోకుండా మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు. బీజేపీ ఆఫీస్‌లో దళిత నేతల భేటీకి డుమ్మా కొట్టిన మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్‌గా ఉంది. చదవండి: మరియమ్మ కుమారుడికి డీజీపీ మహేందర్‌రెడ్డి పరామర్శ -
దళితులకు దగ్గరి బంధువు కరుణానిధి
సాక్షి, న్యూఢిల్లీ : అన్నాదురై మరణంతో 1969లో ఎం. కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. అప్పటి వరకు అన్నాదురై మంత్రి వర్గంలో హిందీ వ్యతిరేక, ఢిల్లీ వ్యతిరేక ఉద్యమాల స్ఫూర్తి కలిగిన వారు, విద్యావేత్తలు, వాక్ఛాతుర్యం కలిగిన వారు, యువకులు ఉండేవారు. ఆ తర్వాత 1969 నుంచి 1976 వరకు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మంత్రివర్గంలోకి, ముఖ్యంగా అధికార యంత్రాంగంలోకి ఈ రంగాలతోపాటు వెనకబడిన వర్గాలు, మరీ ఎక్కువ వెనకబడిన వర్గాల వారు, దళితులను తీసుకున్నారు. పాలనా వ్యవహారాల్లో కిందిస్థాయి పార్టీ కార్యకర్తలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు. పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార సలహా కమిటీల్లో అధికారులతోపాటు పార్టీ నాయకులకు కూడా కరుణానిధి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులుగానీ, పార్టీ నాయకులుగానీ అవినీతికి పాల్పడకుండా ఈ సలహా సంఘాలు పర్యవేక్షణ సంస్థలుగా పనిచేసేవి. 1969 నుంచి 1976 మధ్య తమిళనాడు పబ్లిక్ కమిషన్ సర్వీస్ నియామకాల తీరును పరిశీలించగా, అంతకుముందు ఎన్నడు లేని విధంగా వెనకబడిన వర్గాలు, బాగా వెనకబడిన వర్గాల వారు, దళితులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉద్యోగాలు రావడం విశేషం. పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో దళితులకు ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, వాటి సంఖ్యా బలం, ఇప్పటికే ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత ? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ వర్గం వారికి ఎన్ని ఉద్యోగాలో ముందుగా ఓ ప్రణాళికను రచించి దానికి అనుగుణంగా నియామక ప్రక్రియను పూర్తి చేయడం వల్ల వెనకబడిన వర్గాల వారికి, దళితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమాజంలో కూడా వారికి సరైన ప్రాతినిధ్యానికి బాటలు వేయవచ్చన్నది కరుణానిధి ఆచరించిన సిద్ధాంతం. దళితులకు, బీసీలకు సామాజిక హక్కులను సాకారం చేయాలంటూ 1925లో జరిగిన కాంచీపురం కాంగ్రెస్‌లో పెరియార్ రామస్వామి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొనే వారి అభ్యున్నతికి కరుణానిధి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కరుణానిధి నాటి యంత్రాంగం గ్రామీణాభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ పంచాయతీ స్థాయి, సమతి స్థాయి కార్యక్రమాలనే ఎక్కువగా అమలు చేసింది. బ్రిటీష్ కాలం నాటి నుంచి పరిపాలనారంగంలో కలెక్టర్లదే ప్రధాన పాత్ర. జిల్లా డీఎంకే నాయకులకు నేరుగా ఇటు జిల్లా కలెక్టర్లు, అటు పార్టీ అదిష్టాన నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. అందుకని రోజువారి పాలనా వ్యవహారాల్లో జిల్లా పార్టీ నాయకులు జోక్యం చేసుకునే వారు. గ్రామీణస్థాయి నుంచి వచ్చిన ఉద్యమం కారణంగా డిఎంకే బలపడడంతో దిగువ స్థాయిలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఏర్పడింది. 1971లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జిల్లా నాయకులు మరింతగా బలపడ్డారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్‌తోపాటు జిల్లా డిఎంకే నాయకుడు ప్రత్యక్ష ప్రధాన పాత్రదారుడయ్యారు. ఇటు పార్టీది, అటు ప్రభుత్వ యంత్రాంగానిది ఒకటే లక్ష్యం. రాష్ట్రాభివృద్ధి. అందులోనూ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగడం. (గమనిక: ‘ది ద్రావిడియన్ ఇయర్స్’ పేరిట ఎస్. నారాయణ్ రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలివి. నారాయణ్, కరుణానిధి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడమే కాకుండా ఆ తర్వాత వాజపేయి ప్రధానికి ఉన్నప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు) -
గడువులోగా నిధుల ఖర్చు: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్డీఎఫ్)కి ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. 2017–18 వార్షిక సంవత్సరం ముగియడానికి నెలన్నర గడువుందని ఆలోపు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ ఎస్డీఎఫ్ అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించినట్లు జగదీశ్‌రెడ్డి చెప్పారు. జనవరి ఆఖరు నాటికి రూ.6,689 కోట్లు ఖర్చయ్యాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దళితుల అభివృద్ధికి 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. -
'చంద్రబాబు దళిత వ్యతిరేకి'
►నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు పొన్నూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వారి ఎదుగుదలకు సంబంధించిన అన్ని ద్వారాల్ని మూసివేస్తున్నారని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు విమర్శించారు. ఆయన శనివారం గుంటూరు జిల్లా పొన్నూరు అంబేడ్కర్ నగర్‌లోని లుంబినీవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్లకు గండి కొట్టడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామకాల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లు పాటించాలని, పోస్ట్ డాక్టరేట్ స్కాలర్షిప్లు డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా మంజూరు చేయాలని, దళితులకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రాధమిక విద్యను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని, బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని కత్తి పద్మారావు కోరారు. -
మహిళల పేరు మీదే భూమి రిజిస్ట్రేషన్: కేసీఆర్
హైదరాబాద్: దళితుల అభివృద్ధే తమ ప్రభుత్వ మొదటి లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణను 510 యూనిట్లుగా విభజించి దళితుల అభివృద్ధి పథకాల అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌పై తెలంగాణ కలెక్టర్లతో కేసీఆర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా దళితుల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. భూములు లేని పేద దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామని హామీయిచ్చారు. దళితుల అభివృద్ధి కోసం ఏడాదికి జిల్లాకు రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. పథకాల అమలు, పర్యవేక్షణ, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను అండగా ఉంటానని కలెక్టర్లకు భరోసాయిచ్చారు. దళితులకు ఇచ్చే భూమి మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.