మహిళల పేరు మీదే భూమి రిజిస్ట్రేషన్: కేసీఆర్
హైదరాబాద్: దళితుల అభివృద్ధే తమ ప్రభుత్వ మొదటి లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణను 510 యూనిట్లుగా విభజించి దళితుల అభివృద్ధి పథకాల అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌పై తెలంగాణ కలెక్టర్లతో కేసీఆర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాల వారిగా దళితుల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్లకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
భూములు లేని పేద దళితులకు మూడెకరాల సాగు భూమి ఇస్తామని హామీయిచ్చారు. దళితుల అభివృద్ధి కోసం ఏడాదికి జిల్లాకు రూ.5 వేల కోట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. పథకాల అమలు, పర్యవేక్షణ, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను అండగా ఉంటానని కలెక్టర్లకు భరోసాయిచ్చారు. దళితులకు ఇచ్చే భూమి మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.