ప్రగతిభవన్‌లో దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో హరీశ్‌రావు, వినోద్‌కుమార్, బండా శ్రీనివాస్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ ‘దళిత బంధు’పథకం అమలు చేస్తామని, ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేసేందుకు రూ.80 వేల కోట్ల నుంచి లక్ష కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. కాళ్లు, రెక్కలే ఆస్తులుగా ఉన్న దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండా శ్రీనివాస్ శనివారం తన అనుచరులతో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ఈ సందర్భంగా బండా శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి మాట్లాడారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ‘దళిత బంధు’పథకం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ దళితాభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర సాధన ఉద్యమంలా చేపట్టాలని.. దేశవ్యాప్తంగా ఈ పథకం విస్తరించాలని ఆకాంక్షించారు.
దేశ సమాజానికే దారులు వేయాలి
‘దళిత బంధు’ను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణకే కాకుండా దేశ దళిత సమాజానికే హుజూరాబాద్ దారులు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘గత పాలనలో తెలంగాణ ప్రజలు గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులిపిల్ల లాంటి వారనే సంగతిని స్వయం పాలన వచ్చిన తర్వాత ప్రపంచం పసిగట్టింది. నేడు తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నివ్వెరపోతోంది. మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కళ్లలో సంతోషం కనిపిస్తోంది. అదే రీతిలో దళితుల ము ఖాల్లో కూడా ఆనందం చూడాలన్నదే నా పట్టుదల. ఇన్నాళ్లూ ఏవేవో పథకాలు పెట్టి బ్యాంకుల గ్యారెంటీ అడిగేవారు. కాళ్లు రెక్కలే ఆస్తులుగా ఉన్న దళితులు బ్యాంకు గ్యారంటీ ఎక్కడి నుంచి తెస్తరు? అందుకే దళిత బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం పూర్తిగా ఉచితం. అది అప్పుకాదు. తిరిగి ఇచ్చేది కాదు. దళారులన్న మాటే ఉండదు. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం వచ్చి చేరుతుంది’’అని సీఎం చెప్పారు. దళితబంధు అనేది ఒక పథకం కాదని, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు.. ఒకరి అభివృద్ధి కోసం ఇంకొకరు పాటుపడే యజ్ఞమని వ్యాఖ్యానించారు.
ఉపాధి కోసమే ఖర్చు చేయాలి
‘‘దళిత బంధు ద్వారా ఇచ్చిన పైసలను పప్పులు, పుట్నాలకు ఖర్చు చేయకుండా.. ప్రతి పైసాను ఉపాధి, వ్యాపారం కోసం ఖర్చు చేయాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’’అని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ల ఆశయాలను కొనసాగిస్తోందని, దళితుల అభివృద్ధిని సాధించి చూపెడతామని చెప్పారు. పార్టీలకతీతంగా దళిత బంధును అమలు చేసుకుందామని, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని సూచించారు. కక్షలు కార్పణ్యాలు, కొట్లాటలు, ద్వేషాలు లేని దళిత వాడలు పరిఢవిల్లాలని.. దళిత జాతిలో ఎవరూ పేదలుగా మిగలకూడదని ఆకాంక్షించారు. తాను పార్టీ పెట్టిన నాటి నుంచి నిబద్ధతతో పనిచేసుకుంటూ వస్తున్న బండ శ్రీనివాస్‌కు కార్పొరేషన్ పదవి మాత్రమే ఇవ్వలేదని.. దళిత సమాజాన్ని అభివృద్ధి చేసే బాధ్యతతో కూడిన బండను పెట్టానని సీఎం కేసీఆర్ అనడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని దళితులందరినీ దళిత బంధు పథకం ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తి చేస్తుంది. పట్టుదలతో అందరం కలిసి పనిచేసి ఈ పథకాన్ని విజయవంతం చేయాలి. ఇందుకోసం ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్ పుట్టాలి.
– సీఎం కేసీఆర్
‘దళిత బంధు’పై అనుమానాలొద్దు
‘‘రాజులు, జాగీర్దార్లు, జమీందార్లు, భూస్వాములు, తర్వాత వలస పాలకులతో కలిపి వందల ఏండ్ల పాటు అనేక పీడనలను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నరు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వస్తున్నం. తెలంగాణ గాడిలో పడింది. మొదట్లో తెలంగాణ వస్తదా అన్నరు.. 24 గంటల కరెంటు అయ్యేదా పొయ్యేదా.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు అయితదా అన్నరు. రైతుబంధు తెచ్చినప్పుడు కూడా కొందరు పెదవి విరిచారు. ఇప్పుడు దళితబంధు పథకాన్ని కొందరు అనుమానిస్తున్నరు. అలాంటి అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తం. దళితబంధు పథకాన్ని విజయవంతం చేస్తం.’’
– సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment