
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు కోడి గుడ్లు, ఒక రోజు చికెన్, సన్న బియ్యంతో వండిన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్మీడియట్, ఆపై చదివే విద్యార్థులకు ప్రతిరోజు గుడ్డుతోపాటు వారంలో రెండు సార్లు చికెన్‌తో భోజనం అందించనుంది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో కొత్త మెనూను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విడుదల చేశారు.
ఎస్సీ వసతి గృహాల్లోని అందరికీ వర్తింపు: జగదీశ్‌రెడ్డి
ఇప్పటివరకు విద్యార్థులకు కోడిగుడ్లు వారానికి మూడు మాత్రమే పెడుతుండగా, ఇకపై వారానికి ఆరు కోడిగుడ్లు, ఒకరోజు కోడికూరతో కూడిన భోజనం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆదివారం చికెన్‌తో భోజనం పెడతామని, ఇంటర్మీడియట్, ఆపై తరగుతులు చదివే విద్యార్థులకు ప్రతి బుధవారం, ఆదివారాల్లో కోడికూరతో భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికి ఇది వర్తిస్తుందని చెప్పారు.
అలాగే పోషక పదార్థాలు కలిగిన కాయగూరలతో భోజనం అందించేలా కొత్త మెనూను రూపొందించినట్లు వివరించారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న దార్శనికతకు ఈ పథకం అద్దం పడుతోందన్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు విద్యార్థులకు టీ, బిస్కెట్ అందిస్తామని, 8 గంటలకు టిఫిన్ పెడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.