శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో మంత్రి చందూలాల్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే దానికి ప్రతికూల అంశాలే ఎక్కువగా ఎదురవుతాయి. ప్రోత్సహించే వాళ్లకంటే విమర్శించే వాళ్లే చాలా మంది ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది’అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు ఆయన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను ప్రోత్సహించేందుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు రాయితీలిస్తున్నాయని వివరించారు.
బ్యాంకులతోనే ఇబ్బందులు...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు బ్యాంకులతో ముడిపడి ఉండటంతో లక్ష్యసాధన ఇబ్బందిగా మారుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి యూనిట్లపై ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోందని, కానీ అవన్నీ బ్యాంకులతో ముడిపడి ఉండటంతో ఔత్సాహికులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. బ్యాంకుల నిబంధనల్లో మార్పులు రావాలని, ఆమేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలు స్పందించడంలేదు
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రెన్యూర్) ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో రాయితీలిస్తోందని ఎంఎస్‌ఎంఈ సంచాలకుడు పీజీఎస్ రావు పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఖర్చు చేస్తోందని, కానీ వీటిని వినియోగించుకోవడంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడంలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment