Minister Jagadish Reddy
-
పట్టపగలే అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్..!
-
మునుగోడులో ఓటమితోనే మోదీ విషం చిమ్ముతున్నారు: జగదీశ్‌రెడ్డి
నల్లగొండ: మునుగోడులో బీజేపీ ఓటమి పాలైందన్న అక్కసుతోనే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఏడాది క్రితమే ప్రారంభమై ఎరువులు ఉత్పత్తి చేస్తున్న ఫ్యాక్టరీని మళ్లీ ప్రారంభించేందుకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. నల్లగొండలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎనిమిదేళ్లలోనే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనివిధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చి ఇక్కడి అభివృద్ధిని చూసి వెళ్తున్నారని తెలిపారు. తల్లిని చంపి పిల్లను తెచ్చారని..తెలంగాణ సరైన పద్ధతిలో రాలేదని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించటంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. మోదీ కుట్రలు తెలంగాణ ప్రజల ముందు సాగవన్నారు. చదవండి: తెలంగాణ పట్ల అడుగడుగునా నిర్లక్ష్యమే.. రేవంత్ రెడ్డి ఫైర్ -
Telangana: మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు
నల్లగొండ క్రైం/ రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): రాష్ట్ర విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. నల్లగొండలోని తిరుమలనగర్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:15 గంటల వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 15 మంది ఐటీ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర పోలీసు బలగాల రక్షణలో సోదాలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన అధికారులను నోడల్ అధికారులుగా, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. జగదీశ్‌రెడ్డి పీఏ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో నగదు దాచిపెట్టారని వారికి అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌కు చెందిన ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లతోపాటు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును కూడా సీజ్ చేశారని.. దీనికి మంగళవారం సాయంత్రానికల్లా లెక్కలు చెప్పాలని ప్రభాకర్‌రెడ్డికి నోటీసు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్టు చెప్తున్నారు. కానీ çఅధికారులు దీనిని ధ్రువీకరించలేదు. ఐటీ అధికారుల బృందం రాత్రి 11:15 గంటలకు ప్రభాకర్‌రెడ్డి నివాసం నుంచి వెళ్లిపోయింది. కాగా సోదాల విషయం తెలిసి ప్రభాకర్‌రెడ్డి ఇంటి సమీపంలో స్థానికులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దాడులు మొదలైన తర్వాతే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కావేరీ సీడ్స్ కార్యాలయాలపైనా.. సికింద్రాబాద్‌లోని మినర్వా కాంప్లెక్స్‌లో ఉన్న కావేరీ సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థలపైనా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కేంద్ర బలగాల రక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థల యజమాని జీవీ భాస్కర్‌రావుకు ప్రభుత్వంలోని ముఖ్యులతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర -
బీజేపీ నేతలు ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా ప్రజలు నమ్మరు : మంత్రి జగదీష్ రెడ్డి
-
సన్నాల కొనుగోళ్లు షురూ : మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: సన్నాల కొనుగోళ్లు మొదలయ్యాయని, అందరూ ఏకకాలంలో మిల్లుల దగ్గరికిపోతే నష్టపోతారని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ వంకతో దళారులు ధర తగ్గించే ప్రమాదం ఉందన్నారు. మిల్లుల సామర్థ్యాన్ని బట్టి టోకెన్లు జారీచేస్తున్నామని వెల్లడించారు. శనివారం సాయంత్రం సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతాంగం పండించిన పంటకు టోకెన్ల జారీపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సజావుగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. 2014కు ముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పండిన పంట కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులేనని, ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట దిగుబడి 46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి పెరిగిందన్నారు. అందుకు తెలంగాణ సమాజం గర్వపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. -
కిషన్‌రెడ్డిది ప్రజావంచన యాత్ర: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ప్రజాఆశీర్వాద యాత్ర’పేరిట ప్రజలను మోసం చేసే యాత్ర నిర్వహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రూ.70 ఉన్న పెట్రోలు, డీజిల్ ధరను రూ.100 దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలి. కిషన్‌రెడ్డి తన యాత్రలో వాస్తవాలను కాకుండా గాలిమాటలు చెప్తున్నారు’అని మంత్రి విమర్శించారు. ‘నల్లడబ్బును రప్పిస్తామన్న ప్రధాని మోదీ మాటలు విని ప్రజలు తెల్లడబ్బు కూడా పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2 వేల సామాజిక పింఛన్లు ఇస్తున్నారా? కనీసం మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనైనా అమలు చేస్తున్నారా’అని నిలదీశారు. రాబోయే రోజుల్లో బీజేపీకి దేశ ప్రజలు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, రైతుల జేబులు కొట్టేందుకు తెస్తున్న కొత్త చట్టాలతో రైతాంగం నడ్డి విరుగుతోందని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకవాసులు కూడా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు... తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ పార్లమెంటులో ఒకలా, బయట మరోలా మాట్లాడుతోందని, తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలకు సాధ్యం కాదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘చట్టబద్ధంగా వచ్చిన నిధులు మినహా అదనంగా రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు’అని మంత్రి అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి సరిహద్దుల వద్ద కాపలా కాయడం చేతకాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఎద్దేవా చేశారు. -
జగదీశ్‌రెడ్డి వర్సెస్ రాజగోపాల్‌రెడ్డి
చౌటుప్పల్: మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వాదులాట చోటుచేసుకుంది. చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లక్కారంలో జరిగింది. అయితే కార్యక్రమం ప్రారంభానికి ముందే ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారికి పోటీగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు సమాచారం ఇచ్చి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే వెంటనే మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ.. 2014కు ముందు సిగ్గులేని పాలన చేశారని, అప్పటి చీకటి ఇంకా ఉంటే బాగుండని భ్రమపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనికి రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాను టీఆర్ఎస్ గురించి మాట్లాడలేదని, మంత్రి కాంగ్రెస్ ప్రస్తావన తేవడం సరికాదని పేర్కొన్నారు. కాగా, తాను ప్రసంగిస్తున్న సమయంలో తన చేతిలోని మైకు లాక్కోవడం ఏంటని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవన్నీ చిల్లర చేష్టలని, మీడియాలో ప్రచారం కోసం ఆడుతున్న నాటకాలంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఎమ్మెల్యేకు అధికారులు చెప్పారని గుర్తు చేశారు. రాత్రి ఓ మాట, పొద్దున మరో మాట మాట్లాడే అన్నదమ్ముల విషయం అందరికీ తెలుసని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి అన్నారు. తాము తలుచుకుంటే ఒక్క నిమిషంలో లోపల వేయిస్తామని, ఇకపై మునుగోడులో ప్రతి ఊరిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తానే స్వయంగా హాజరవుతానని, ఎవరు అడ్డువస్తారో చూస్తానని మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. మంత్రి తీరును నిరసిస్తూ హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై లక్కారం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి రాజగోపాల్‌రెడ్డి రాస్తారోకో చేశారు. -
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిని ఎవరూ ఆపలేరు: జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం జల విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానంపై జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలన్నది ఏపీ ప్రభుత్వం తీర్మానిస్తే అమలుపరిచేంత అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. విద్యుత్ ఉత్పత్తి మా హక్కు. దీన్ని ఆపమనే హక్కు ఏ కమిటీకి, కమిషన్లకు లేదు. తెలంగాణ రాష్ట్ర హక్కులు ఏమిటో.. కృష్ణా నదిలో మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసు’ అని అన్నారు. రైతులు ఎక్కడైనా రైతులేనని, సముద్రం పాలయ్యే నీళ్లను ఈ పద్ధతిలో వాడుకోండి అంటూ కేసీఆర్ విజ్ఞతతో చెబితే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ముమ్మాటికీ అక్రమమేనని, దుర్మార్గంగా పోతిరెడ్డిపాడును వెడల్పు చేసే ప్రయ త్నంలో నిజం లేదా అని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించారు. రాజకీయ చతురత తోటే కేసీఆర్ మహా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కాని పరిష్కారాన్ని కేసీఆర్ స్వల్ప వ్యవధిలో తేల్చిపడేశారని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందని చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని అతిథులుగా చూసుకోవాలని చెప్పారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై .వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కమిషనర్ రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపించండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొనసాగి స్తున్న ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను తక్షణమే ఆపించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఇప్పటికే ఆర్డీఎస్ కింద తెలంగాణకున్న వాటాలో యాభై శాతం దక్కడం లేదని, ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై చర్యలు తీసుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. లేఖతో పాటు ఆర్డీఎస్ కుడికాల్వ పనులకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. బోర్డు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను ఏపీ కొనసాగిస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీ చేపడుతున్న ఆ పనులను జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టిందని, రాష్ట్ర పునర్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏపీ చేపడుతున్న నిర్మాణ పనులను ఆక్షేపించిందని తెలిపారు. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి రాకుండానే చేపడుతున్న ఈ పనులను ఆపేలా బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. -
ఎన్ని పీతలు ఏకమైనా మమ్మల్నేమీ చేయలేవు
సాక్షి, హైదరాబాద్: నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు ఏకతాటి మీదకు రావడం పీతల కలయిక వంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డితో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో కూడా మీడియాతో ముచ్చటించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఎన్ని పీతలు ఏకమైనా తమను ఏమీ చేయలేవని.. గెలిచేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రస్తుత ఉప ఎన్నికను ముడిపెట్టొద్దని, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల తరహాలో ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉంటారన్నారు. ‘హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలాంటిదే. ఎంత మెజార్టీ సాధిస్తామని పోలింగ్ తేదీ సమీపించినపుడు వెల్లడిస్తాం. కాంగ్రెస్‌తోనే మాకు అక్కడ పోటీ.. బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనుభవంతో తగు జాగ్రత్తలు తీసుకుంటాం.మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు’అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గెలుపు మాకు బూస్టప్.. హుజూర్నగర్ నియోజవర్గాన్ని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదని, స్థానిక శాసనసభ్యుడి కృషి ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో తమ కార్యకర్తలను టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలన్నారు. టీఆర్ఎస్ రాజకీయ గొడవలకు పూర్తి దూరంగా ఉంటుందని, 2014 తర్వాత హుజూర్నగర్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు లేదన్నారు. హుజూర్‌నగర్‌లో గెలుపుతో తమకు బూస్టప్ వస్తుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ అంశంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సీఎంను కలిసిన సైదిరెడ్డి హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానా సైదిరెడ్డి శనివారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకున్న సైదిరెడ్డి మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం మంత్రితో పాటు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం, సమన్వయంలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవడంతో పాటు, అందరినీ కలుపుకొనివెళ్లి విజయం సాధించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. -
కాలేజీల షిఫ్టింగ్‌లపై సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీలను ఇష్టారాజ్యంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చేస్తున్న షిప్టింగ్‌ల వ్యవహారంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఇష్టారాజ్యంగా కాలేజీలను మండల పరిధి, జిల్లా పరిధి కాకుండా ఇతర జిల్లాలకు మార్చుతు న్నట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహేతుక కారణం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతించవద్దని స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులతో సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో విభాగాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేయాలని సూచించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన దృష్ట్యా దానిపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే దీనిని ప్రవేశ పెట్టేందుకు అనుమతించాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్లు ఈ డిగ్రీని చదవడం, అందులో తొలి ఏడాది నుంచే విద్యా బోధనకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉండటం ద్వారా మెరుగైన విద్య లభిస్తుందన్న భావనను వ్యక్తం చేశారు. ప్రమాణాలు పెరుగుతాయని, ప్రమాణాలు పాటించని కాలేజీలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుపై సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంటర్ ఫలితాల వెల్లడిపైనా సమీక్షించినట్లు తెలిసింది. ప్రవేశాలు, ఫలితాల ఆలస్యంపైనా సీరియస్ అయినట్లు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ పాల్గొన్నారు. -
టెట్ నిర్వహణకు చర్యలు చేపడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా టెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 2 టెట్ల వ్యాలిడిటీ ముగిసిపోయిందని, జూన్ గడిస్తే మరో టెట్ వ్యాలిడిటీ ముగిసిపోతుందని, ఇక టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లలు అనే వారే ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్, ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ లేకుండా చూడాలన్నారు. బడి మానేసే వారు ఎందుకు మానేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలుగా ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుంటుందన్నారు. గురుకులాల్లో సీట్లు లేకపోయినా అలాంటి వారిని చేర్చుకునేలా సీఎం కేసీఆర్‌తో చర్చించి ప్రత్యేక ప్రవేశాలకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రమాణాల పెంపునకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. మన విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. ఇతర దేశాలతో పోల్చినా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:17 ఉందన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు.. నాలుగేళ్లలో పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చామని, ఈసారీ పరీక్షలను పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశాల్లో విద్య కూడా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మంత్రులు, ఎంఎల్ఏల కాలేజీలను మూసేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తప్పవన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలని, అందుకు అవసరమైన మార్పులను సిలబస్‌లో తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెరిగాయన్నారు. ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలపై స్పందిస్తూ అవి కాలేజీల వారీగానే ప్రవేశాలు ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.ప్రైవేటు వర్సిటీల చట్టం తెచ్చామని, నిబంధనలను రూపొందించి ప్రైవేటు వర్సిటీలకు అనుమతిస్తామన్నారు. ఇంటర్మీడియట్ హాల్టికెట్లలో తప్పుల విషయంలో స్పందిస్తూ ఎవరైనా విద్యార్థులకు నష్టం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామన్నారు. డిగ్రీలు పూర్తయ్యాక కూడా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు. మీడియంపై లోతుగా పరిశీలన తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటుండగా, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న వాదనలు ఉన్నాయని, దీనిపై ఉన్నతస్థాయిలో మరింత లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి మరోసారి సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపడతామన్నారు. మహిళా యూనివర్సిటీ విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యకు బడ్జెట్లో ఎక్కువ నిధులే కేటాయించామని, అయితే అవి విద్యాశాఖ పేరుతో రానుందున అలా భావిస్తున్నారన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలకు మంచి నీటి కనెక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టా న్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో అట్రాసిటీ చట్టం అమలుపై నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 478 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు మంత్రి పేర్కొంటూ వీటిని పునఃసమీక్షించాలన్నారు. అట్రాసిటీ చట్టం కింద ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను నిరో ధించేందుకు పీసీఆర్, పీవోఏ చట్టాలకు పదును పెట్టాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఐదుగురు సభ్యులతో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని మంత్రి గుర్తుచేశారు. 79 మందికి కోర్టు శిక్షలు ఖరారు చేసిందని, స్టేమీద ఉన్న మరో 37 కేసుల్లో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్దేశంతో స్టే రద్దవుతుందని మంత్రి వివరించారు. అట్రాసిటీ చట్టం అమలును పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. -
మంత్రి వ్యాఖ్యలపై జనం ఆగ్రహం
సాక్షి, యాదాద్రి : వేములకొండ దుర్ఘటనపై మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యా యి. వేములకొండలో పోస్టుమార్టం జరుగుతున్న పీహెచ్సీ వద్ద మృతుల బంధువులను పరామర్శించా క ఆయన మీడియాతో మాట్లాడుతుండగా, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్‌కుమార్‌రెడ్డి, గ్రామస్తులు నినాదాలు చేశారు. ఆగ్రహించిన మంత్రి.. ‘రూ.15 లక్షలు సరిపోతాయా...? రూ.50 లక్షలు వద్దా?’ అని అనిల్‌తో వ్యంగ్యంగా అనడంతో వివాదం మొదలైంది. ‘మీలాంటి వాళ్లను చాలా మందిని చూశాం. బాధ్యతగా మెలగడం నేర్చుకోండి. శవాల మీద పేలాలు ఏరుతున్నారు. చచ్చినకాడ రాజకీయం చేస్తారా?’ అంటూ ఆందోళన చేస్తున్న వారిపైనా మంత్రి ఆగ్రహించడంతో వివాదం పెద్దదైంది. కాంగ్రెస్ నాయకులను, గ్రామస్తులను పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. మృతుల కుటుంబీకులతో చర్చించి రూ.2.5 లక్షల ప్రభుత్వ సాయం, సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, స్థలం లేని వారికి స్థలంతోపాటు ఇల్లు, చదువుకునే పిల్లలుంటే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని అనంతరం మంత్రి చెప్పారు. ఈలోపు గ్రామస్తులు, విపక్ష నేతలు గేటుకు అడ్డంగా బండరాళ్లు పెట్టి ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను బయటకు వెళ్లనీయలేదు. పరిహారం రూ.5 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. మంత్రి సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని మృతదేహాలను గ్రామానికి పంపారు. రూ.2.50 లక్షలు ప్రభుత్వం నుంచి, మరో లక్ష భువనగిరి ఎమ్మెల్యే నిధులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మంత్రి ప్రకటించడంతో గ్రామస్తులు శాంతించారు. దీంతో సుమారు 3 గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తతకు తెరపడింది. -
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపైనున్న మెజారిటీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, పెండింగ్ కేసులను కూడా త్వర లో ఎత్తివేస్తామని మంత్రులు నాయిని, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సచివా లయంలోని హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగ్ కేసులపై చర్చించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేసు షీట్లలో వివరాలు సరిగ్గా పేర్కొనకపోవడం వల్ల కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని డీజీపీ మంత్రులకు వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా ఉన్న అన్ని కేసులను ఇప్పటికే మాఫీ చేశామని డీజీపీ మంత్రులకు తెలిపారు. రెండు వారాల్లో పోలీస్ శాఖ పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీకి సూచించారు. ఇదే సమయంలో పార్టీ వైపు నుంచి కూడా సమాచార సేకరణ చేస్తామని, ఇదంతా క్రోడీకరించి మరోసారి సమావేశమై ఈ కేసుల ఎత్తివేతకు మార్గం సుగమం చేయాలని మంత్రులు నిర్ణయించారు. ఈ మొత్తం ప్రక్రియను డీజీపీ కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారికి అప్పగించి, సాధ్యమైనంత త్వరలో అన్ని కేసులను మాఫీ చేస్తామని మంత్రులకు డీజీపీ తెలిపారు. టీఆర్ఎస్కు కేసుల సమాచారం పంపండి ఈ సమావేశానంతరం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసులు ఎత్తివేస్తూ 1138 జీవో జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు తెలిపారు. ఇంకా 19 రకాల కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఉద్యమ కేసుల సమాచారాన్ని contact@trspartyonline.org వెబ్సైట్ లేదా వాట్సాప్ నంబర్ 8143726666 కు పంపవచ్చని సూచించారు. దీంతోపాటు హోంశాఖకు నేరుగా తమ వివరాలు అందజేయవచ్చని, ఇందుకు nnreddy.hm@ gmail.com, 04023451073ను సంప్రదిం చవచ్చని మంత్రులు తెలిపారు. ఉద్యమసమయంలో పెట్టిన కొన్ని రైల్వే కేసుల్లో పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర నాయకులు కూడా ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. అయితే, కేంద్ర పరిధిలో ఉన్న వాటిని వేరుగా పరిష్కరించాలని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. -
ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి..
సాక్షి, హైదరాబాద్ : మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గంలో వందలకోట్ల అవినీతి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. తెలంగాణ 31 జిల్లాలో లేని అవినీతి సూర్యాపేటలో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయం కోసం ఇప్పటి వరకూ స్థల సేకరణ జరగలేదని తెలిపారు. సూర్యపేటలో 70 ఎకరాల స్థలం కేటాయించి బోర్డు పెట్టారు కానీ ప్రస్తుతం అది కబ్జాకు గురువతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఈ విషయంపై సీఎం చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థల సేకరణ గురించి కలెక్టర్‌ను అడిగారు. ఆ సమయంలో అతను కేసు కోర్టులో ఉన్నట్టుగా చెప్పారు. గతంలో సీఎం కూడా వచ్చారు.. అప్పుడు కలెక్టర్ సీఎంకి మూడు ప్రతిపాదనాలు ఇచ్చారు. స్థానికంగా సూర్యాపేటలో 200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు చెప్పారు. నల్ల చెరువు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న 200 ఎకరాలు పేదవారి ఇళ్ల స్థలాలు చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతేకాక అమాయక ప్రజల భూములు కొని కలెక్టర్ కార్యాలయం కోసం ఇస్తున్నారు. దీంట్లో మంత్రి హస్తం కూడా ఉంది’ అని సంకినేని వెంకటేశ్వర రావు మండిపడ్డారు. అవే కాకుండా పేదల భూములు, ప్రైవేట్ భూములు కొని రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇది నిరూపణ అయితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని సక్కినేని సవాల్ విసిరారు. 18 లక్షల చొప్పున నాలుగున్నర కోట్లు కావాలని సీఎస్ ఎస్పీ సింగ్‌ని అడిగారు. ఇందులో మంత్రి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హస్తం కూడా ఉందని ఆయన అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి.. లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని అన్నారు. వైద్యశాఖలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్ చేసినట్టుగా.. మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది నిరూపణ కాకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సక్కినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. -
ఎన్నికలకు భయపడుతున్నట్టేనా?
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నికలకు భయపడి శాసనసభ్యత్వం రద్దుపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోర్టుకు వెళ్తున్నారా అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో కలిసిన విలేకరులతో ఆయన గురువారం మాట్లాడుతూ ఇద్దరు శాసనసభ్యుల బహిష్కరణపై ప్రజాక్షేత్రానికే వెళ్తామన్న కాంగ్రెస్ నేతలు కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు భయపడటమంటే జానారెడ్డి ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. ఉపఎన్నికల్లోనే గెలవలేని వాళ్ళు సాధారణ ఎన్నికల్లో ఇంకేమి గెలుస్తారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుంటే సభలో బోర్ కొడుతుందని, 2019 ఎన్నికల తర్వాత శాసనసభలో ఉండేవి టీఆర్ఎస్, మజ్లిస్‌లేనని జోస్యం చెప్పారు. కొన్ని పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటనేది సీఎం కేసీఆర్ ఉద్దేశం కాదని, దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నదే ఆయన ప్రధాన ధ్యేయమని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రజల కనీస అవసరాలు, మౌలిక వసతులకోసం 70 ఏళ్ల భారతంలోనూ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమిటన్నదే ఆయన ప్రశ్న అని చెప్పారు. తెలంగాణ ప్రజలను ఉద్యమంలో ఏకతాటి పైకి తెచ్చినట్టే దేశ ప్రజలను ఐక్యంగా నడిపించే శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు. -
గడువులోగా నిధుల ఖర్చు: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్డీఎఫ్)కి ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. 2017–18 వార్షిక సంవత్సరం ముగియడానికి నెలన్నర గడువుందని ఆలోపు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ ఎస్డీఎఫ్ అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించినట్లు జగదీశ్‌రెడ్డి చెప్పారు. జనవరి ఆఖరు నాటికి రూ.6,689 కోట్లు ఖర్చయ్యాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దళితుల అభివృద్ధికి 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. -
గురుకుల సమస్యలకు త్వరలో పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం మంత్రి నివాసంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ శాలల ఉద్యోగుల సంఘం రూపొందించిన 2018 డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్క రించారు. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిం చటంతో పాటు 2007లో రెగ్యులర్ అయిన టీజీటీలకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సంఘం అధ్యక్షులు కొల్లు వెంకట్‌రెడ్డి, యం.వెంకటేశ్వర్లు కోరారు. రూల్ 28ఏ కింద ఇంక్రిమెంట్ల కోతను నిలిపివేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సీఆర్‌కే శంకర్‌దాస్, రఘునందన్‌రావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యసాధనపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే దానికి ప్రతికూల అంశాలే ఎక్కువగా ఎదురవుతాయి. ప్రోత్సహించే వాళ్లకంటే విమర్శించే వాళ్లే చాలా మంది ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది’అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సదస్సుకు ఆయన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను ప్రోత్సహించేందుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు రాయితీలిస్తున్నాయని వివరించారు. బ్యాంకులతోనే ఇబ్బందులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు బ్యాంకులతో ముడిపడి ఉండటంతో లక్ష్యసాధన ఇబ్బందిగా మారుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి యూనిట్లపై ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోందని, కానీ అవన్నీ బ్యాంకులతో ముడిపడి ఉండటంతో ఔత్సాహికులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. బ్యాంకుల నిబంధనల్లో మార్పులు రావాలని, ఆమేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు స్పందించడంలేదు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్) ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో రాయితీలిస్తోందని ఎంఎస్ఎంఈ సంచాలకుడు పీజీఎస్ రావు పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఖర్చు చేస్తోందని, కానీ వీటిని వినియోగించుకోవడంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడంలేదని అన్నారు. -
దళిత శాఖ రెడ్డికా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఉనికి కోల్పోయిందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత శాఖను రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీనియర్లైన దళిత శాసనసభ్యులు 15 మంది ఉన్నారని, అలాంటి వారిని పక్కనపెట్టి ఒక్కసారి ఎమ్మె ల్యేగా గెలిచిన జగదీశ్‌రెడ్డిని దళిత మంత్రిగా నియమించడంలో ఆంతర్యమేమిటన్నారు. జగదీశ్‌రెడ్డిని తొలగించకుంటే ఉద్యమం ఎస్సీ అభివృద్ధి శాఖకు ఏటా రూ. 15 వేల కోట్ల బడ్జెట్ ఉందని, అంతటి పెద్ద శాఖకు ప్రాతినిధ్యం వహించే జగదీశ్‌రెడ్డి డిల్లీ వెళ్లినప్పుడు కేవలం విద్యుత్ శాఖ మంత్రిగా చలామణి కావడం, అందుకు సంబంధించిన కేంద్ర మంత్రులు, అధికారులను మాత్రమే కలవడం జరుగుతుందని, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రిగా వెళితే అతన్ని దళితుడు అనుకుంటారనే ఉద్దేశంతో అలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. వెంటనే జగదీశ్‌రెడ్డిని మంత్రిపదవి నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఎస్సీ అభివృద్ధి శాఖకు కేటాయించిన నిధులు పూర్తిగా దారి మళ్లుతున్నాయన్నారు. జనాభాలో కేవలం ఒకశాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం మెజారిటీ వర్గాలను అవమానించడమేనన్నారు. -
ఎస్సీ వసతి గృహాలకు కొత్త మెనూ!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు కోడి గుడ్లు, ఒక రోజు చికెన్, సన్న బియ్యంతో వండిన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్మీడియట్, ఆపై చదివే విద్యార్థులకు ప్రతిరోజు గుడ్డుతోపాటు వారంలో రెండు సార్లు చికెన్‌తో భోజనం అందించనుంది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో కొత్త మెనూను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విడుదల చేశారు. ఎస్సీ వసతి గృహాల్లోని అందరికీ వర్తింపు: జగదీశ్‌రెడ్డి ఇప్పటివరకు విద్యార్థులకు కోడిగుడ్లు వారానికి మూడు మాత్రమే పెడుతుండగా, ఇకపై వారానికి ఆరు కోడిగుడ్లు, ఒకరోజు కోడికూరతో కూడిన భోజనం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు జగదీశ్‌రెడ్డి తెలిపారు. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆదివారం చికెన్‌తో భోజనం పెడతామని, ఇంటర్మీడియట్, ఆపై తరగుతులు చదివే విద్యార్థులకు ప్రతి బుధవారం, ఆదివారాల్లో కోడికూరతో భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికి ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే పోషక పదార్థాలు కలిగిన కాయగూరలతో భోజనం అందించేలా కొత్త మెనూను రూపొందించినట్లు వివరించారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న దార్శనికతకు ఈ పథకం అద్దం పడుతోందన్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు విద్యార్థులకు టీ, బిస్కెట్ అందిస్తామని, 8 గంటలకు టిఫిన్ పెడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్డీఎఫ్ యాక్ట్ దేశానికే తలమానికం
జాతీయ సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ యాక్ట్ దేశానికే తల మానికమని ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎస్డీఎఫ్ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎంగా బాధ్యతలు చేపట్టకముందు నుంచే కేసీఆర్ దళిత, ఆదివాసీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధాస క్తులతో ఉన్నారన్నారు. సీడీఎస్ డైరెక్టర్ వై.బి. సత్య నారాయణ అధ్యక్షత వహించిన ఈ సభలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఇటువంటి చట్టం కోసం పౌర, ప్రజాసంఘాలు కృషి చేయాలని ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు మాట్లాడుతూ చట్టంలో కొన్ని విషయాలపట్ల త్వరలో రూపొందించబోయే రూల్స్‌లో స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రూపొందిన చట్టం స్ఫూర్తితో వివిధ రాష్ట్రాల్లో చట్టం రూపకల్పనకు త్రిముఖ వ్యూహాన్ని అవలంభిం చాలని కోరారు. కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్, డీబీఎఫ్ శంకర్, 12 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈ వంతెన పొలాలకు నీళ్లిస్తుంది!
వందేళ్ల బ్రిడ్జికి కొత్త బాధ్యతలు.. - సాగునీటి ప్రాజెక్టుగా మారనున్న టేకుమట్ల బ్రిడ్జి - నిజాం హయాంలో నిర్మితమైన వంతెన.. - హైదరాబాద్–విజయవాడ హైవేపై మూసీనది మీద నిర్మాణం - ఇప్పటికీ చెక్కుచెదరని పటుత్వం - చెక్‌డ్యాంగా మార్చాలని రోడ్లు భవనాల శాఖ ప్రతిపాదన - 1.5 టీఎంసీ సామర్థ్యం.. 10 వేల ఎకరాలకు సాగునీరందించే వీలు సాక్షి, హైదరాబాద్: అదో వంతెన.. వయసు 107 ఏళ్లు. ఇటీవలే అది ‘విశ్రాంతి’లోకి వెళ్లింది. శతాబ్దం పాటు వాహనాలను నది దాటించి అలసిపోవటంతో దాని స్థానంలో ప్రభుత్వం మరో భారీ వంతెన నిర్మించింది. కానీ తనలో పటుత్వం ఏమాత్రం తగ్గలేదన్న ట్లు ఇప్పటికీ రాచఠీవీ ఒలకబోస్తూ సగర్వంగా నిలిచిన ఈ కట్టడం మరో బాధ్యతను తన భుజాలపై వేసుకోనుంది. నది నీటిని నిల్వ చేసి రైతుల మోములో చిరునవ్వు చిందించే బాధ్యత నిర్వర్తించబోతోంది. బ్రిడ్జి నుంచి చెక్‌డ్యాంగా.. హైదరాబాద్– విజయవాడ హైవేపై వెళ్లేవారికి సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద మూసీ నదిపై కళాత్మకంగా ఉండే వంతెన సుపరిచితమే. పేరుకు వంతెన అయినా దాని నిర్మాణ కౌశలం మాత్రం ఇట్టే కట్టిపడేస్తుంది. ఆర్చి ఆకారంలో ఉండే నీటి తూములు, దానికి పేర్చిన రాళ్లు, వంతెన పైన రోడ్డుకు వాడిన రాతి దిమ్మెలు.. ఓ అద్భుత నిర్మాణంగా కనిపిస్తుంది. వందేళ్ల వయసు పైబడటం, విజయవాడ హైవే విస్తరణలో భాగంగా దాని స్థానంలో ఇటీవలే ప్రభుత్వం కొత్త వంతెన నిర్మించింది. ఈ కొత్త బ్రిడ్జిపై వెళ్తూ పాత వంతెన కళాత్మకతను కనులారా వీక్షించే భాగ్యం వాహనదారులకు కలుగుతోంది. ఇటీవల రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ఈ బ్రిడ్జి పటుత్వాన్ని పరిశీలించి ఇప్పటికీ పటిష్టంగానే ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వాగులపై నిర్మించే వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 120 వరకు వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 324 మీటర్ల పొడవుతో మూసీ నదిపై టేకుమట్ల వద్ద ఉన్న ఈ వంతెనను నీరు నిల్వచేసే ప్రాజెక్టుగా మార్చాలన్న ఆలోచన అధికారుల్లో కలిగింది. దీంతో వారు ప్రతిపాదనలు సిద్ధం చేసి నీటి పారుదల శాఖ ఆమోదానికి పంపారు. ఒకటి, ఒకటిన్నర టీఎంసీ సామర్థ్యం.. మూసీనదిపై సోలిపేట వద్ద నిర్మించిన ఆనకట్ట ద్వారా సాగునీరందిస్తున్నారు. ఇప్పుడు టేకుమట్ల రోడ్డు వంతెనను చెక్‌డ్యాంలోకి మారిస్తే దిగువ ప్రాంతాల్లోని రైతులకు సాగునీరందించే అవకాశం ఉంటుంది. దాదాపు 324 మీటర్ల పొడవున్న ఈ వంతెనకు నదీగర్భంలో దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తుతో మత్తిడి గోడను నిర్మిస్తే ఒకటి నుంచి ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యంలో నీరు నిలుస్తుందని అంచనా. ఈ నీరు దాదాపు పదివేల ఎకరాలకు ఉపయోగపడనుంది. ఇంతటి నిల్వ సామర్థ్యంతో కొత్త చెక్‌డ్యాం నిర్మించాలంటే దాదాపు రూ.30 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. కానీ ఈ పాత వంతెనను డ్యాంగా మార్చాలంటే కేవలం రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. పర్యాటకానికీ ఊతం: తుమ్మల ఈ పాత వంతెనను చెక్‌డ్యాం నమూనాలోకి మారిస్తే సాగుతో పాటు పర్యాటకానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది. కళాత్మకంగా ఉన్న వంతెన ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మారిస్తే పర్యాటకులు వస్తారు. పర్యాటక కేంద్రంగా మారుతుంది. శనివారం దీనిపై మంత్రి జగదీశ్‌రెడ్డితో చర్చించా. ఆయన కూడా సానుకూలం వ్యక్తం చేశారు. మరో నాలుగైదు రోజుల్లో నీటిపారుదల శాఖ నుంచి అనుమతి వచ్చే అవకాశముంది. -
కోమటిరెడ్డి, జగదీష్‌రెడ్డిల తీవ్రవాగ్వాదం
నల్లగొండ: నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. జిల్లాలో ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపించారు. అధికారులు సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ దానికి మీరే కారణం అంటూ ఎదురు దాడికి దిగారు. రౌడీ రాజకీయాలు చేస్తూ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకానొక దశలో ఏం జరుగుతుందో... ఎవరేమి మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిలు ఒకరి వైపు ఒకరు చేతులు చూపుకుంటు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పంచాయితీ పెట్టుకున్నారు. దీంతో సభలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సర్దిచెప్పే యత్నం చేశారు. ఇరుపార్టీల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో బాహాబాహికి దిగే పరిస్థితి కనిపించింది. జెడ్సీ చైర్మన్ బాలునాయక్, ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అనంతరం సభలో మంచినీటి సమస్యలపై చర్చించారు. Nalgonda district , zp General Meeting, mla komatireddy, minister jagadish reddy, సర్వసభ్య సమావేశం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, -
దాహార్తి తీరింది..!
♦ బోరు అద్దెకు తీసుకుని నీటి సరఫరా ♦ మరో బోరుకు కూడా మరమ్మతులు ♦ రాజనాయక్ తండావాసుల్లో సంబరం తుంగతుర్తి: పదేళ్లుగా తాగునీటి కోసం అల్లాడుతున్న ఆ తండా వాసుల దాహర్తి తీరింది. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఆ తండాకు పిల్లను కూడా ఎవరూ ఇవ్వడం లేదు. వారి ఆవేదనను వివరిస్తూ ‘పానీ చేనికన్.. ఛార్విన్ దేరేకొని’ శీర్షికన శనివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ క్రమంలో మంగళవారం తండాకు నీటి సరఫరా చేశారు. సూర్యాపేట జిల్లా లోని తిరుమలగిరి మండలం మారుమూల గ్రామమైన జలాల్పురం శివారు రాజనాయక్ తండాలో పదేళ్లుగా గిరిజనులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. తండాలో బోర్లు వేసినా నీరు పడకపోవడంతో కిలోమీటర్ల దూరం నడిచి వ్యవసాయ బావులు, బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్.. నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరలో తండావాసుల నీటి కష్టాలు తీర్చాలని ఆదేశించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సోమ, మంగళవారాల్లో తండాను సందర్శించి నీటి వనరులను సమీక్షించారు. తండాకు కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోరులో నీరు ఉండటంతో ఆ రైతును పిలిచి డబ్బులు చెల్లిస్తాం వేసవిలో నీటి సరఫరా చేయాలని కోరారు. అనంతరం తండా వెలుపల ఉన్న మరో బోరుకు మరమ్మతులు చేయడంతో కొద్దిగా నీరు వస్తోంది. ఈ రెండు బోర్లద్వారా తండాలోని ట్యాంక్‌ను నింపి మంగళవారం నీటిని సరఫరా చేశారు. నీటి సమస్య తీరడంలో ఆ తండావాసుల ఆనందానికి హద్దులు లేవు. నీటి సమస్య పరిష్కారానికి తోడ్పడిన సాక్షి దినపత్రికకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ‘సాక్షి’కి కృతజ్ఞతలు మా తండాకు 10 ఏళ్ల నుంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సాక్షి పత్రిక వారు మా బాధలను తెలుసుకొని కథనాన్ని రాశారు. దీంతో అధికారులు స్పందించి మా తండాకు నీటిని సరఫరా చేశారు. సాక్షి పత్రికవారికి కృతజ్ఞతలు. – మాలోతు హరిలాల్, రాజనాయక్ తండా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడ్డాం. వేసవిలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించి, మా తండాకు నీటిని తెచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా. కిలోమీటర్ దూరం నడిచే బాధ తీరింది. – మాలోతు బుజ్జి, రాజనాయక్ తండా