వెయ్యి పంచాయతీలకు కొత్త భవనాలు
130 కోట్ల నిధుల కేటాయింపు
♦ మలి విడతలో మరో 1,271 పంచాయతీలకు..
♦ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 8770 గ్రామ పంచాయతీలకుగాను 1,650 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని పురపాలక, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తొలి విడతగా రూ. 130 కోట్లతో వెయ్యి పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని, మిగిలిన 650 పంచాయతీలతోపాటు మరో 621 ‘ఒకే గది’ పంచాయతీలకు (మొత్తం 1,271) మలి దశలో భవనాలను నిర్మిస్తామన్నారు. సర్పంచ్, సిబ్బంది, ఈ-పంచాయతీకి ప్రత్యేక గదులు, సమావేశ మందిరంతో కూడిన భవనాలకు ప్రత్యేక డిజైన్ రూపొందించామని చెప్పారు. గతంలో ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయింపులు జరగ్గా తాము రూ. 13 లక్షలకు పెంచామన్నారు. ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, బోడిగ శోభ, చల్లా ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఐదు వేలు జనాభాగల మేజర్ గ్రామ పంచాయతీల భవనాలకు మరిన్ని నిధులిస్తామని...మండల కేంద్రాల్లో సచివాలయాల నిర్మాణం కోసం స్థానిక పంచాయతీలు రూ. 25 లక్షల చొప్పున నిధులు సమకూర్చితే ప్రభుత్వ వాటాను రూ. 25 లక్షలకు పెంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 220 కోట్లు
ఎంఎంటీఎస్ రెండో దశను భక్తుల సౌకర్యార్థం ఘట్‌కేసర్-రాయిగిర్ (యాదాద్రి) వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసిం దని ఈ అంశంపై సభ్యులు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, కె.ప్రభాకర్‌రెడ్డిల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. రూ. 330 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ. 110 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 220 కోట్ల వాటాను భరిస్తుందన్నారు.
ఎస్సీ ఉప ప్రణాళిక కింద 3,773 కోట్ల ఖర్చు: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఎస్సీ ఉప ప్రణాళిక కింద 2015-16లో కేటాయించిన రూ. 8,089.24 కోట్లలో రూ. 3,773.33 కోట్లు ఖర్చు చేశామని, ప్రభుత్వ సాయం వల్ల 48,98,069 మంది ఎస్సీలు లబ్ధిపొందారని రాష్ట్ర ఎస్సీల అభివృద్ధి, విద్యుత్‌శాఖల మంత్రి జి. జగదీశ్‌రెడ్డి తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయించిన రూ. 5,035.687 కోట్లలో రూ. 2,671.67 కోట్లు ఖర్చుపెట్టామని, దీనివల్ల 15,38,726 మంది ఎస్టీలు లబ్ధి పొందారని ఈ అంశంపై సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య, ఎ.రేవంత్‌రెడ్డి, సున్నం రాజయ్య, మల్లు భట్టి విక్రమార్క, జెట్టి గీత, ఎస్.ఎ సంపత్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, రవీంద్ర కుమార్ రమావత్‌ల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. విద్యుత్ పొదుపు చర్యల కోసం ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రోగ్రాం (డీఈఎల్‌పీ)ను అమలు చేస్తున్నామని సభ్యులు సతీశ్ కుమార్, బానోత్ మదన్‌లాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్.సత్యనారాయణ, వేముల వీరేశం, చల్లా ధర్మారెడ్డి, డి.కె అరుణల ప్రశ్నలకు జగదీశ్‌రె డ్డి సమాధానమిచ్చారు.
ఉర్దూ బడులకు మౌలిక సదుపాయాలు: కడియం
రాష్ట్రంలోని 1,571 ఉర్దూ మాధ్యమ పాఠశాలలకుగాను 219 పాఠశాలలు మౌలిక సదుపాయాలతో ఉన్న ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 1:25 దామాషాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఉందన్నారు. స్థల లభ్యత ప్రాతిపదికన పాఠశాలల భవనాలను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని ఈ అంశంపై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్‌ఖాన్, మొజంఖాన్, జాఫర్ , అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఉద్యానవన కార్పొరేషన్: పోచారం
ఉద్యానవనాలు, పూల పెంపకం, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సభ్యులు మనోహర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, వేముల వీరేశంల ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. రాష్ట్రంలో 1.28 కోట్ల గొర్రెలు, 46.75 లక్షల మేకల యూనిట్లను మంజూరు చేశామని ఎమ్మెల్యే ఎ.అంజయ్య అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు.