నల్లగొండ క్రైం : నా కుమారుడు అడిగినా బైకు కొనివ్వలేదని, మీ పిల్లలను కూడా గారాబం చేసి బైక్‌లు కొనిస్తే మనకే నష్టం జరుగుతుందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రోడ్డు భద్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక క్లాక్‌టవర్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. దేశంలో నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుందని, నెలకు 400 మంది, సంవత్సరానికి 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 99 శాతం మానవతప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. సీటుబెల్ట్, హెల్మెట్ పెట్టుకోకపోవడం, అతివేగం, మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్లలో వెనుక సీట్లో కూర్చున్న వారే ఎక్కువగా మరణిస్తున్నారని, ఆ సీట్లో కూర్చున్న వారు కూడా సీటుబెల్ట్ పెట్టుకోవాలన్నారు. లైసెన్స్ లేని వారికి బండి ఇస్తే యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విద్యార్థులు తమ తండ్రి చెప్పాలని సూచించారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు కేసులు రాస్తుంటారని అన్నారు.
భద్రత ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు, డ్రైవర్లకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కమిటీతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ గత 14 రోజులుగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వివిధ అంశాలపై విద్యార్థులకు, ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదరహితంగా మార్చాలన్నారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు జాగ్రత్తలపై ఆలోచన ఉంటుందని, ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం వ్యాసరచన, పెయింటింగ్, స్లో సైక్లింగ్, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రశంసప్రతాలు, హెల్మెట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఆర్డీఓ వెంకటాచారి, డీఎస్పీ సుధాకర్, సీఐలు ఉన్నారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
Published Tue, Jan 31 2017 2:14 AM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
Advertisement
Advertisement