Road Transport and Safety Bill
-
జూన్ 1నుంచి బీఐఎస్ హెల్మెట్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఏడాది(2021) జూన్ 1నుంచి దేశంలో బీఐఎస్ ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర రోడ్ రవాణా శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులను కొంతమేర ప్రమాదాల నుంచి రక్షించే యోచనలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. దేశంలో వార్షికంగా 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారవుతున్నట్లు ఆటో రంగ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా.. దేశీ పరిస్థితులకు అనుగుణంగా బీఐఎస్ ప్రమాణాలతో తేలికపాటి హెల్మెట్ల తయారీ, వినియోగానికి అనుమతించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తలకు తగిలే గాయాలు రోడ్డు ప్రమాదాలలో 45 శాతం తలకు గాయాలవుతుంటాయని ఎయిమ్స్ ట్రౌమా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ గుప్తా పేర్కొంటున్నారు. వీటిలో 30 శాతం తీవ్రంగా గాయపడిన సందర్భాలుంటాయని తెలియజేశారు. దేశీయంగా హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫెకెట్(ఐఎస్ఐ మార్క్)ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా రోడ్ రవాణా శాఖ ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సుమారు 44,000-56,000 మంది హెల్మెట్లను ధరించకపోవడంతో మరణించినట్లు అనధికార లెక్కలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. దేశీయంగా రోజూ 2 లక్షల హెల్మెట్లు విక్రయమవుతాయని ద్విచక్ర వాహన హెల్మెట్ల తయారీదారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ కపూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం ప్రమాణాలులేనివే ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలతో వేలమంది ప్రాణాలకు రక్షణ లభించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
4 గంటలు.. 143 కేసులు..
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత ఉల్లంఘనలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనాయణ్‌రెడ్డి నేతృత్వంలో నాలుగు గంటల పాటు జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 11 నుంచి రెండు గంటల పాటు, మధ్యాహ్నం 1.30 నుంచి మరో రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. వీటిలో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న 44 మంది ద్విచక్ర వాహనచోదకులు, రాంగ్‌సైడ్‌లో వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న 60 మంది, ఆటో పైలెటింగ్‌కు పాల్పడుతున్న 26 మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న ఏడుగురితో పాటు టు వీలర్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసు పెట్టడంతో పాటు ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘనులకు చెక్ చెప్పడం, ప్రమాదాలు తగ్గించడానికి ఉద్దేశించిన ఈ స్పెషల్ డ్రైవ్స్ కొనసాగుతాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మీనాయణ్‌రెడ్డి తెలిపారు. -
రోడ్డు ప్రమాదాలపై సుప్రీం ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని రహదారుల ప్రమాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన రహదారులపై పడిన గుంతుల కారణంగా అనేక మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వారికంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని జస్టిస్ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం అభిప్రాయపడింది. ఈ అంశంపై రహదారుల భద్రతా సంస్థ దృష్టిసారించాలని కోర్టు ఆదేశించింది. పౌరుల జీవిత, మరణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని కోర్టు వ్యాఖ్యానించింది. రహదారులపై జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం గుంటల కారణంగానే సంభవిస్తున్నాయని, ప్రభుత్వాలు వారికి నష్టపరిహారం కూడా చెల్లించవలసి వస్తోందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో తమకు నివేదికను అందజేయల్సిందిగా రహదారుల భద్రతా సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. -
రోడ్డు ప్రమాదాలు అడ్డుకునేదెలా?
సాక్షి, అమరావతి: మొక్కుబడి నిధుల కేటాయింపు, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో రాష్ట్రంలో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కళ్లెం వేయాలంటే ఏటా రహదారి భద్రతకు రూ.30 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా రూ.10 కోట్లు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. రవాణా శాఖలో అదనపు పోస్టులతో పాటు అవసరమయ్యే నిధులను, మౌలిక వసతులు కేటాయించాలని రవాణా శాఖ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించినా.. సర్కారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. రవాణా శాఖకు అదనంగా సిబ్బంది, నిధులు కేటాయిస్తే 2020 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 15 శాతానికి తగ్గిస్తామని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్ఫోర్సుమెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని రవాణా శాఖ ప్రతిపాదించింది. రాష్ట్ర స్థాయి రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీ కింద 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. రవాణా శాఖ ప్రతిపాదనలివే... రాష్ట్ర స్థాయిలో రోడ్డు భద్రతకు ప్రత్యేకంగా 18 పోస్టులు, జిల్లా స్థాయిలో 21 పోస్టులను కేటాయించాలి. రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ప్రాంతీయ రవాణా అధికారి స్థాయిలో ఓ అసిస్టెంట్ సెక్రటరీ, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్–2 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, సర్కిల్ ఇన్స్పెక్టర్–2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (ఆర్అండ్బీ), హోం గార్డులు–5, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–2, పరిపాలనాధికారి స్థాయిలో ఓ మేనేజరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం 18 పోస్టులు మంజూరు చేయాలి. జిల్లా స్థాయిలో ప్రాంతీయ రవాణా అధికారి, మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టరు–2, హోం గార్డులు–10, సర్కిల్ ఇన్స్పెక్టరు, సబ్ ఇన్స్పెక్టర్లు–2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, మేనేజరు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 21 మందిని రహదారి భద్రత కోసం కేటాయించాలి. ఈ పోస్టులకుగాను పే అండ్ అలవెన్సుల కింద మొత్తం రూ.15.10 కోట్లు, వాహనాలకు రూ.81 లక్షలు, కార్యాలయ భవనాలకు రూ.45 లక్షలు కలిపి మొత్తం ఏడాదికి రూ.16.36 కోట్లు, రహదారి భద్రత కింద స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, ఇతర సాంకేతిక పరికరాలకు రూ.15 కోట్ల కలిపి మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ నిధులు కేటాయించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదించినా.. ఇంతవరకు పట్టించుకోలేదు. రూ.3 వేల కోట్లకు పైగా రవాణా ఆదాయం రవాణా శాఖ ఆదాయం రూ.3 వేల కోట్లకు చేరింది. రయ్ రయ్‌మని ఆదాయం ఏ ఏటికాయేడు గణనీయంగా పెరుగుతోంది. కానీ ప్రభుత్వం రహదారి భద్రత కోసం నిధుల కేటాయింపులు మాత్రం మొక్కుబడిగా విదిల్చడం గమనార్హం. -
ప్రాణాల కోసం ప్రయాణం
ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేసే యువతలో అవేర్నెస్ కలిగించడం కోసం రామ్ చల్లా చార్మినార్ టు థేమ్స్ ప్రయాణించబోతున్నారు. రోడ్డు మీద 19000 కి.మీలు. సింగిల్ డ్రైవింగ్. యాభై రోజుల ట్రిప్. ఇలా ప్రయాణించే మొదటి తెలుగు వ్యక్తి ఇతడే. నేను ఎంబిఏ చదువుకున్నాను. నాన్నగారు చల్లా రాధాకృష్ణ పోలీసు శాఖలో పని చేసేవారు. తల్లి వసంతకుమారి నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్‌గా చేసి రిటైరయ్యారు. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. ప్రస్తుతం యుకేలోని యుఏఈ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నాను. ‘‘నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మా నాన్నగారు మరణించారు. అది ఆయన చేసిన తప్పు కారణంగా కాదు. ఇతరులు చేసిన తప్పు వల్ల. కాని ఫలితం? చిన్న వయసులోనే నేను తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది. నాన్నగారు ట్రాఫిక్ రూల్స్ మాత్రమే కాదు అన్ని విషయాలలోనూ చాలా క్రమశిక్షణతో ఉండేవారు. రోడ్డుకి ఎడమపక్కగా వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో కావడం... అన్నీ పద్ధతిగానే ఉండేవారు. ఆ రోజు ఇంటి నుంచి కారులో బయటకు పని మీద బయలుదేరారు. సీటు బెల్టు పెట్టుకున్నారు. నెమ్మదిగానే కారు నడుపుతున్నారు. అంతలోనే రాంగ్రూట్లో పదిహేడు సంవత్సరాల ఒక కుర్రాడు కారులో వేగంగా వచ్చాడు. నాన్న కారుని గట్టిగా ఢీకొట్టాడు. అక్కడికక్కడే నాన్న కన్ను మూశారు. ఆ కుర్రవాడికి కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. బాధ్యత తెలియని ఒక కుర్రవాడు చేసిన తప్పుకి నా తండ్రి బలి కావలసి వచ్చింది. అప్పటికి నేను లండన్‌లో ఉన్నాను. ఆయన సడెన్‌గా పోవడంతో నాలో ఏదో తెలియని దిగులు బయలుదేరింది. జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మన టైమ్ లిమిటెడ్ అనే విషయం ఈ సంఘటన ద్వారా ప్రాక్టికల్‌గా అర్థం అయ్యింది. ఆరు నెలల వరకు కోలుకోలేకపోయాను. మరో ఆరు నెలల వరకు ఏం చేయాలా అనే విషయం మీద ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాను. 2006 నుంచి నాతో స్నేహంగా ఉన్న కొందరు మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. పెద్ద స్థాయిలో కాకపోయినా, చేతనైన పనులు చేయడం మొదలుపెట్టాను. ఒక సంస్థగా రిజిస్టర్ చేశాం. 2015 లో నా మిత్రుడు కల్యాణ్‌తో కలిసి, ఎన్జీవోని ఏడుగురు బోర్డు సభ్యులతో సొసైటీగా రిజిస్టర్ చేశాం. చాలా మందికి ఎన్జీవో అనగానే... 50 సంవత్సరాలు దాటినవారనో, సోమరిగా ఉండేవారనో ఒక ముద్ర పడిపోయింది. ఎవ్వరి దగ్గరా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ ఆర్గనైజేషన్‌ని ప్రారంభించాను. మా సంపాదనలో నుంచే ఇందులో 17 లక్షలు పెట్టుబడి పెట్టాం. సేవా కార్యక్రమాలతో పాటు డ్రైవింగ్ పట్ల చైతన్యం కలిగించడమే మా ప్రధాన కార్యక్రమం. అయితే ఏదైనా పెద్ద పని చేసి ఆ విషయంలో అందరి దృష్టిని ఆకర్షించాలనిపించింది. ఆలోచించగా నాకు వచ్చిన ఆలోచనే చార్మినార్ నుంచి లండన్ వరకు రోడ్ ట్రిప్. ఇదీ ప్రయాణం చార్మినార్ నుంచి లండన్ బ్రిడ్జి వరకు ప్రయాణించేలా రెండు చారిత్రాక ప్రదేశాలను ఎంచుకున్నాను. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకుంటున్నాను. 50 రోజుల పాటు ఒంటరి ప్రయాణం. ఇలా ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ ప్రయాణిస్తున్న మొదటి తెలుగు వ్యక్తిని నేనే. ఇతర రాష్ట్రాల నుంచి కొందరు ఇలా ప్రయాణించారు. అయితే ఇద్దరు ముగ్గురు కలిసి టీమ్‌గా వెళ్లారు. ముంబై నుంచి ఎస్యువి మహీంద్రా మోటార్ కార్ స్పాన్సర్ చేస్తారని భావిస్తున్నాను. ఈ ప్రయాణం ఖర్చు 50 లక్షలు. జూన్ 1 వ తేదీన ఇక్కడ నుంచి బయలుదేరాలనుకుంటున్నాను. మొత్తం 19000 కి.మీ. ప్రయాణం. అన్ని దేశాల నుంచి లెటర్స్ తీసుకున్నాను. ‘కార్నెట్’ అని వెహికల్ పాస్‌పోర్టు ఉంటుంది. అది కూడా తీసుకున్నాను. ‘అలెర్ట్ టుడే అలైవ్ టుమారో’ అనేది మా స్లోగన్. కజగిస్థాన్లో కూడా తెలుగు ఎంబసీలు ఉంటారు. ఇలా ప్రతి దేశంలోనూ ఉన్న ఎంబసీలను ముందుగానే అవేర్నెస్ కోసం కలిసినవారితో మాట్లాడతాను. దారిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వచ్చు కానీ, అన్నిటినీ అధిగమించడానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నాను. అంతా సవ్యంగా సాగితే యాభై రోజులలో పూర్తవుతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను ఈ ప్రయాణం కోసం డైట్ ప్లాన్ చేసుకుంటున్నాను. బయటి ఆహారం తీసుకోకుండా, నాకు నేను స్వయంగా వండుకునేలా అన్నీ సమకూర్చుకుంటున్నాను. బేసిక్ ఫిట్నెస్ గురించి జాగ్రత్త పడుతున్నాను. ప్రతి నాలుగు గంటలకి కారు ఆపి, సుమారు అరగంటసేపు వాకింగ్ చేస్తాను. రోజూ తొమ్మిది గంటలకు మించకుండా డ్రైవ్ చేస్తాను.అది కూడా బ్రేకులు తీసుకుంటూ. నైట్ డ్రైవ్ చేయను. సాధారణమైన హోటల్స్‌లో అకామడేషన్ ముందుగానే బుక్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న అనారోగ్యాలకు సంబంధించిన మందులు నా వెంట తీసుకువెళ్తాను. కారు రిపెయిర్ వస్తే, నేనే స్వయంగా బాగుచేసుకునేలాగ పది రోజులు ట్రయినింగ్ తీసుకుంటున్నాను. జంప్లీడ్ బ్యాటరీ, జిపిఎస్ ట్రాకింగ్, ఫిజికల్ మ్యాప్స్ నాతో తీసుకువెళ్తాను. లోకల్‌గా ఉండే ఎంబసీ కాంటాక్ట్ నంబర్లు ఉంచుకుంటున్నాను. ఇంతకుముందు ఇలా లాంగ్ డ్రైవ్ చేసినవారి నుంచి వారి అనుభవాలు, ఇతర సమాచారం సేకరించాను. నా ఆశయం అక్కడ మొదలవుతుంది... తిరుగు ప్రయాణంలో పాఠశాలలకి, కాలేజీలకు వెళ్లి రోడ్ సేఫ్టీ గురించి వివరించాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ప్రయాణిస్తే ఎంత దూరమైనా ప్రయాణించవచ్చనడానికి నేనే ఉదాహరణ అని చూపిస్తాను. యాక్సిడెంట్ వీడియోలను ప్రదర్శిస్తూ, చిన్న చిన్న విషయాలే ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. నాన్నగారి పట్ల నాకున్న గ్రాటిట్యూడ్‌ను ఇలా చూపించాలనుకుంటున్నాను. సురక్షిత ప్రయాణం కోసం ఎక్కడకు వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సరైన సమయానికి బయలుదేరాలి. సేఫ్టీ రూల్స్‌ను అనుసరించాలి. ఇంట్లో వారిని గుర్తు చేసుకోవాలి. -
రోడ్డు భద్రత పట్టేదెవరికి..!
అతివేగం అనర్థదాయకం.. ఓవర్ లోడ్ ప్రమాదకరం.. ఇవి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగాఅధికారులు పలికే నినాదాలు. కేవలం వారోత్సవాల్లో తప్ప ఆచరణలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా.. అధికారుల కంటికి మాత్రం కన్పించడం లేదు. వారోత్సవాల్లో నినాదాలివ్వడమే కాదు.. ఏడాది మొత్తం నిబంధనలపై నిఘా వేయాల్సిన అవసరం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చూసీ చూడనట్లు విడిచిపెట్టకుండా అధికారులు కఠినంగా వ్యవహరిస్తే ఇలా ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడకుండా కాపాడిన వారవుతారు. అంతేకాక రోడ్డు భద్రత అందరి బాధ్యత అనేది అధికారులు గుర్తించాల్సిన అంశం. ఇటీవల ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన కొన్ని ప్రమాదకర ప్రయాణ దృశ్యాలు. – ఫొటో జర్నలిస్ట్, భద్రాద్రి కొత్తగూడెం -
మృత్యు శకటాలు
జిల్లాలో వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. సగటున ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున ప్రాణాలు తీస్తున్నాయి. గత మూడు వారాల్లో 34 మంది దుర్మరణం పాలయ్యారు. పెరిగిపోతున్న ప్రమాదాలకు ఈ సంఖ్య అద్దం పడుతోంది. ప్రధానంగా అతి వేగం, అజాగ్రత్త వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో 29వ భద్రత వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమయ్యే చర్యలు చేపట్టనున్నట్టు ఉప రవాణా కమిషనర్డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు ప్రకటించారు. సాక్షి, విశాఖపట్నం : రోజూ ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృత్యు ఘంటికలు మోగిస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపుతున్నాయి. లారీలు, కార్లు, జీపులతో పాటు ద్విచక్ర వాహనాలే యమపాశాలుగా మారుతున్నాయి. ప్రధానంగా అతి వేగం, అజాగ్రత్త వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు ఈ 22 రోజుల్లో 34 మంది దుర్మరణం పాలయ్యారు. పెరిగిపోతున్న ప్రమాదాలకు ఈ సంఖ్య దర్పణం పడుతోంది. వేగమే ప్రధాన శత్రువు ప్రమాదాల్లో ప్రాణాలు హరించడానికి వేగమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తమ వాహనాలు గాని, ఎదురుగా వస్తున్న వాహనాలు గాని అతి వేగంగా నడపడంతో ప్రమాదాలకు హేతువవుతున్నాయని పోలీసు అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయని వీరు చెబుతున్నారు. వేగంగా దూసుకుపోతున్నప్పుడు వాటిని అదుపు చేయలేక ప్రమాదాల పాలవడమో, లేక ఎదుటి వారిని ఢీకొట్టడమో జరుగుతున్నాయని వీరు పేర్కొంటున్నారు. ప్రమాద కారకుల్లో యువకులు, విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. వీరిలో దూకుడు స్వభావమే దీనికి కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త కూడా దుర్ఘటనల పాలవడానికి దారి తీస్తున్నట్టు వీరి లెక్కల్లో తేలింది. ఇదీ కార్యాచరణ ప్రణాళిక మర్రిపాలెం : రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా కార్యాచరణ ప్రణాళికను డీటీసీ ప్రకటించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన వివిధ వర్గాల డ్రైవర్లకు ప్రత్యేక పునఃశ్చరణ తరగతులు డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలు పలు కళాశాలల్లో హెల్మెట్ ధారణ, సీటు బెల్ట్ వినియోగం, రహదారి భద్రత గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు స్కూల్ వాహనాల డ్రైవర్లు, విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,కరపత్రాలు, బ్రోచర్లతో ప్రచారం ట్రాఫిక్ ఉల్లంఘనల మీద ప్రత్యేక తనిఖీలు పాదచారులకు రహదారి నిబంధనల గురించి వివరిస్తారు. లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు ఏర్పాటు చేస్తారు. ప్రమాదాల నివారణకు చర్యలు.. రోడ్డు ప్రమాదాల నివారణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార రథం ద్వారా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాం. డ్రైవర్లకు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహిస్తాం. విశాఖ, అనకాపల్లి, గాజువాకల్లో లారీ, ఆటో డ్రైవర్లకు బీపీ, మధుమేహం, కంటి వైద్య పరీక్షలు చేయిస్తాం. హెల్మెట్లు, లైసెన్స్‌ల ఆవశ్యకతపై కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు భద్రతపై లఘుచిత్రాలను ప్రదర్శిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్పెషల్ డ్రైవ్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. హెల్మెట్, సీట్ బెల్ట్‌ల ధారణపై అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తాం. ఇంకా పాదచారులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – వెంకటేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వేగ నియంత్రణ లేకే.. హైస్పీడు బైక్‌లతో ప్రమాదమని తెలిసినా వేగంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. రాంగ్రూట్లో రావడం ప్రమాదాలకు మరో కారణం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం. –రమేష్‌కుమార్, ఏడీసీపీ, ట్రాఫిక్ -
హైదరా‘బ్యాడ్’ రోడ్లు!
ఇలా ఎవరన్నారు? ఎందుకన్నారు? సోది లేకుండా స్ట్రెయిట్‌గా పాయింట్లోకి పోదాం.. ఎవరన్నారు? మారుతీ సుజుకీ రహదారి భద్రత సూచిక.. ఏటా ఆ సంస్థ ఈ నివేదికను విడుదల చేస్తుంది. 2017కి సంబంధించినది తాజాగా విడుదలైంది. ఆ నివేదికలో ఓవరాల్‌గా నగరానికి చివరి స్థానం దక్కింది. ఎందుకన్నారు? రహదారి భద్రత సూచిక కోసం ఓ 12 పరామితులను ప్రామాణికంగా పెట్టుకున్నారు. దాని ఆధారంగా దేశంలోని 10 ప్రముఖ నగరాల్లో క్షుణ్నంగా సర్వే చేశారు. ఒక్కో నగరానికి సంబంధించి 1,000–1,200 మందిని ప్రశ్నించి..వివిధ అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. అందులో తేలిన అంశాల ఆధారంగా ఈ నిర్ణయానికొచ్చారు. ఏమిటా 10 నగరాలు? ఏమిటా 12 పరామితులు? సర్వే చేసిన నగరాలు: హైదరాబాద్, రాయ్‌పూర్, ఇండోర్, ఢిల్లీ, పుణే, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై పాదచారుల హక్కులు: రద్దీ ఉన్న రహదారులపై జీబ్రా క్రాసింగ్స్, సైకిలింగ్ ట్రాక్స్..కొన్ని చోట్ల నో వెహికల్ డేలు పాటించడం వంటివి జరగాలి. ముఖ్యంగా మెట్రో వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు పాదచారులు నడవటానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉండాలి. ఇలాంటి పనులు జరిగినప్పుడు తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. - ఈ విభాగంలో విజేత: రాయ్‌పూర్ రోడ్ల నిర్వహణ, లైటింగ్: బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై తగినంత లైటింగ్ ఉండాలి. సుందరీకరణలో భాగంగా విభిన్నమైన లైటింగ్‌ను ఏర్పాటు చేయడం, పర్యావరణ అనుకూలమైన సౌర విద్యుత్‌ను వినియోగించుకోవడం.. విజేత: కోల్‌కతా మోటారు చట్టాలు, ట్రాఫిక్ నియంత్రణ: రాత్రి వేళల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే తగు జరిమానాలు..ప్రజల్లో అవగాహన కల్పించడానికి సోషల్ మీడియాను వినియోగించుకోవడం, రద్దీ వేళల్లో సమర్థవంతంగా ట్రాఫిక్‌ను నియంత్రించడం.. విజేత: చెన్నై అత్యవసర సేవలు: ఏ ఉత్పాతం జరిగినా తగు విధంగా స్పందించేలా అత్యవసర సేవల విభాగాలను తీర్చిదిద్దడం.. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు వంటివాటికి దారి ఇచ్చేలా వాహన చోదకులకు అవగాహన కల్పించడం, ఫుట్‌పాత్‌లు, రోడ్లపై అక్రమణలను తొలగించేలా చేయడం.. దీని వల్ల అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు వెళ్లడానికి వీటిని వాడుకోవచ్చు. విజేత: అహ్మదాబాద్ రోడ్ల శుభ్రత: ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేయడం.. ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం.. చెత్త తరలించే వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ట్రాకింగ్ చేయడం.. నగరంలో ఉత్పత్తయ్యే ప్లాస్టిక్‌ను రోడ్లు నిర్మాణం, రిపేర్లకు పునర్వినియోగించడం. విజేత: ఇండోర్ కనెక్టివిటీ: అంతర్గత రోడ్లకు, ప్రధాన రహదారులకు మధ్య కనెక్టివిటీ.. ఫ్లైఓవర్లు.. నగరంలో విస్తృతంగా మెట్రో, ట్రామ్, రైలు సదుపాయాలు.. విజేత: ఢిల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: బస్సుల ప్రయాణానికి ప్రత్యేకమైన లేన్లు, తగు పార్కింగ్ సదుపాయాలు, వరదలు వంటివి రాకుండా నీరు నిలవకుండా సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ విజేత: అహ్మదాబాద్ రహదారి భద్రత: ప్రమాదాల నియంత్రణ, సీటుబెల్టు, హెల్మెట్లు పెట్టుకునేలా చూడటం.స్పీడ్ బ్రేకర్లు, స్పీడ్ గన్స్, ట్రాఫిక్ సైన్స్ ఏర్పాటు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో ప్రజలు అనుసరించే తీరు.. విజేత: రాయ్‌పూర్ చిన్నపిల్లల భద్రతకు అనుకూలమైన వాతావరణం: స్కూళ్లు, నివాస ప్రాంతాల వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు. సురక్షిత డ్రైవింగ్‌పై బస్సు డ్రైవర్లకు, రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. విజేత: కోల్‌కతా దివ్యాంగులకు అనుకూలంగా: రవాణా వాహనాల్లో వీరికి ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేయడం.. రద్దీ ప్రదేశా ల్లో రోడ్లు దాటడానికి వాయిస్ ఇండికేటర్స్.. వాళ్ల కోసం ప్రత్యేకమైన క్యాబ్‌లు.. బస్సుల్లో రాయితీ టికెట్‌పై ప్రయాణం.. విజేత: ముంబై రోడ్ల నాణ్యత: గుంతలు లేకుండా అత్యుత్తమమైన రహదారుల నిర్మాణం.. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, తక్కువ సమయంలో మరమ్మతులు చేయడం.. విజేత: ఢిల్లీ భారీ వాహనాల ట్రాఫిక్ నియంత్రణ: రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించకుండా కచ్చితమైన పర్యవేక్షణ, వాటి కోసం ప్రత్యేకమైన రహదారుల ఏర్పాటు..వాహనాల ఓవర్ లోడింగ్ నియంత్రణ విజేత: అహ్మదాబాద్.. చివరగా... ఈ 12 విభాగాల్లోనూ వచ్చిన మార్కుల ఆధారంగా రాయ్‌పూర్‌కు మొదటి స్థానం దక్కగా.. హైదరాబాద్‌కు చివరి స్థానం దక్కింది. రహదారుల భద్రత, చిన్నపిల్లల భద్రతకు అనుకూల వాతావరణం విభాగాల్లో తప్ప అన్నింటిలోనూ నగరానికి చివరి స్థానమే వచ్చింది. ఈ రెండింటిలో 9వ స్థానం దక్కింది. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
‘స్లెడ్జింగ్ చేయను.. హారన్ కొట్టను’
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో స్లెడ్జింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తుండగా హారన్ కొట్టడం ఇష్టం ఉండదని టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే తెలిపాడు. మహారాష్ట్ర మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్(ఎమ్వీడీ), టాటా గ్రూప్ సంయుక్తంగా రోడ్డు భద్రత, శబ్ద కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మార్చి 24న ముంబై వాంఖడే మైదానంలో రోడ్ సేఫ్టీ ఎలెవన్-నో హాంకింగ్ ఎలెవన్ అనే జట్ల పేరుతో ఓ టీ20 మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రహానేతో పాటు యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రహానె మాట్లాడుతూ.. మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ఇష్టం ఉండదని, అలాగే డ్రైవింగ్ చేసే సమయంలో అనవసరంగా కారు హారన్ మోగించడం కూడా తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. ముంబై వంటి మెట్రో నగరాల్లో శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద సమస్యగా మారిందని చెప్పుకొచ్చాడు. క్రికెట్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నాడు. -
తగ్గిన మరణాలు.. పెరిగిన జరిమానాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య కంటే గతేడాది మృతుల సం ఖ్య గణనీయంగా తగ్గిందని రోడ్డు భద్రత విభాగం నివేదిక వెల్లడించింది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారని స్పష్టం చేసింది. బుధవారం రోడ్డు భద్రత డీజీపీ కృష్ణ ప్రసాద్ ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రమాద గణాంకాలను పొందుపరిచినట్టు తెలిపారు. దేశవ్యాప్త ప్రమాద గణాంకాలు.. దేశవ్యాప్తంగా 2014–2016 వరకు జరిగిన ప్రమా దాలు, మృతులపై రోడ్డు భద్రత విభాగం గణాంకాలు విడుదల చేసింది. అదే విధంగా రాష్ట్ర గణాంకాలను సైతం విశ్లేషించింది. 2014లో దేశవ్యాప్తంగా 4.89లక్షల ప్రమాదాలు జరగ్గా.. అందులో 1.39 లక్షలమంది మృత్యువాతపడ్డారు. 2015లో 5.01 లక్షల ప్రమాదాలు జరగ్గా 1.46 లక్షల మంది మృతిచెందారు. 2016లో 4.80లక్షల ప్రమాదాలు జరగ్గా అందులో 1.50 లక్షలమంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 2శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మృతుల సంఖ్యలో 10శాతం తగ్గుదల కనిపిస్తోందని కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రతీ 100 రోడ్డు ప్రమాదాల్లో 2014లో 34 మంది చనిపోతే, 2015లో 33మంది, 2016లో 31మంది, 2017లో 29 మంది మృతి చెందారని తెలిపారు. ఉల్లం‘ఘనమే’..: నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు భారీస్థాయిలోనే జరిమానాలు చెల్లిస్తున్నా రు. ఏటా జరిమానాల చెల్లింపులు 20–30శాతం పెరిగిపోతే గతేడాది మాత్రం 50శాతానికి పైగా పెరిగిన ట్టు రోడ్డు భద్రత విభాగం అధ్యయనంలో తేలింది. -
రోడ్డు సేఫ్టీపై క్రికెట్ మ్యాచ్
ముంబై : రోడ్డు ప్రమాదలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు భారత క్రికెటర్లు నడుం బిగించారు. కిక్రెట్ ను అమితంగా ప్రేమించే దేశంలో ప్రజలకు క్రికెట్ ద్వారానే మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పలువురు క్రికెటర్లు ముందుకొచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేలా.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 24న క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్, శిఖర్ ధావన్, అంజిక్యా రహానేలతో పాటు పలువురు దేశవాళీ కిక్రెటర్లు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా నకిలీ హెల్మెట్లు తయారు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సచిన్ లేఖ కూడా రాశారు. ఇక దేశంలో రోడ్డు ప్రమాదాల వలన ఎక్కవ మంది చనిపోతున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంవల్లే ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు సర్వేల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలకు అవగాహన కలిగించేందుకు క్రికెటర్లు ముందుకొచ్చారు. -
‘త్వరలో డ్రైవింగ్ లైసెన్స్–ఆధార్ లింక్’
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం ఓ కమిటీ తెలిపింది. రహదారి భద్రతపై గతంలో కోర్టు సుప్రీంకోర్టు మాజీ జడ్టి జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. గత నవంబరు 28న తాము రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శితో సమావేశం నిర్వహించామనీ, నకిలీ లైసెన్స్‌లను ఏరివేసేందుకు ఆధార్ అనుసంధానాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు సదరు అధికారి తమకు చెప్పారని కమిటీ పేర్కొంది. అందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) రూపొందిస్తోందంది. సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆధార్‌తో అనుసంధానించే పనిని కేంద్రం మొదలుపెడుతుందని కమిటీ తన నివేదికలో చెప్పింది. -
పాత వాహనాలకు కాలం చెల్లు!
సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లు దాటిన వాహనాలు రోడ్డు ఎక్కకుండా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలం చెల్లిన వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నందున వాటి విషయంలో అలసత్వం సరికాదన్న నిపుణుల సూచనతో ఏకీభవించింది. అలాగే మద్యం తాగి నడిపేవారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. రహదారి భద్రతపై ఏర్పడ్డ మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సోమవారం సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నా రు. వచ్చే నెలలో జరగనున్న మలిదఫా సమా వేశంలో వీటిపై ప్రకటన చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో కమిటీ సభ్యులు మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, పి.మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతోపాటు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే పోలీసు డీజీ కృష్ణప్రసాద్, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జాతీయ రహదారుల విభాగం ఈఎన్ సీ గణపతిరెడ్డి, రాష్ట్ర రహదారుల ఈఎన్సీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు.. వాహన ప్రమాదాలు, వాటి రూపంలో ఏటా సగటున ఏడు వేల మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించి రోడ్డు భద్రతను ఎలా పటిష్టం చేయాలో సిఫారసు చేసేందుకు సీఎం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కొన్ని నిర్దిష్ట సూచనలు చేసే బాధ్యతను కమిటీ.. జేఎన్టీయూ ప్రొఫెసర్ లక్ష్మణరావు, ఓయూ ప్రొఫె సర్ ఎం.కె.కుమార్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ ప్రసాద్, ఇండియన్ ఫెడరేషన్ ఫర్ రోడ్ సేఫ్టీ ప్రతినిధి వినోద్, రోడ్‌సేఫ్టీ క్లబ్ ప్రతినిధి పి.శ్రీనివాస్ తదితరులకు అప్పగించింది. ఈ సమావేశంలో వారంతా పాల్గొని తమ సూచనలిచ్చా రు. మద్యం తాగి వాహనం నడిపే వారిపై, నిబంధనలు పాటించని వారి విషయంలో కఠిన చర్యలు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ నిబంధనలు, వేగ నియంత్రణ తదితర అంశాలపై చర్చించారు. వచ్చే జనవరి తొలివారంలో రహదారి భద్రతావారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇçప్పుడు తీసుకున్న నిర్ణయాలపై మలిదఫా సమావేశంలో చర్చించి ప్రకటించనున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ ఏడాది మృతుల సంఖ్య 5,931.. 2015లో 21,552 ప్రమాదాల్లో 7,110 మృతిచెందగా, 2016లో 22,811 ప్రమాదాల్లో 7,219 మంది, ఈ సంవత్సరం నవంబర్ వరకు 20,0172 ప్రమాదాలు చోటు చేసుకోగా 5,931 మంది చనిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడిం చారు. మృతుల సంఖ్య స్వల్పంగా తగ్గినంత మాత్రాన దీన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. దేశంలో రోడ్డు భద్రత చర్యలు పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరసలో ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా పోలిస్తే బాగా వెనకబడిన విషయాన్ని మరవవద్దని పేర్కొన్నారు. -
రోడ్డు భద్రత పోలీసుల బాధ్యత
కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో రహదారి భద్రతకు పోలీసులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసులకు సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సెట్‌కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తీసుకున్న రహదారి భద్రత చర్యల కారణంగా ప్రమాదాల సంఖ్య తగ్గించగలిగామని చెప్పారు. అదే స్ఫూర్తితో పోలీసు అధికారులు జిల్లాలో భద్రత చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా సిబ్బంది ఎంపిక చేయాలన్నారు. అధికంగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించేందుకు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. -
నాన్నకు ప్రేమతో..
♦ రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు ♦ పోస్టుకార్డులను రాయించిన పోలీసులు హిందూపురం : ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రులు రోడ్డు భద్రత నియామాలు పాటించేవిధంగా విద్యార్థులతో వారి నాన్నకు రోడ్డుభద్రత గురించి వివరించాడానికి విద్యార్థులతో నాన్నకు ప్రేమతో అంటూ పోస్టుకార్డులు రాయించారు పోలీసులు. బుధవారం కిరికెరలోని ఎల్‌ఆర్‌జీ పాఠశాలలో పెనుకొండ డీఎస్పీ కరీమూల్లా షరీఫ్, రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్యర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలతో వారి నాన్నకు ఒక కార్డుపై రోడ్డు భద్రత గురించి హెల్మ్‌ట్ ధరించామని, తాగిబండి నడపొద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లో మాట్లాడావద్దని మీ ప్రాణలకు ప్రమాదం జరిగితే మేము అనాథలవుతామని పోస్టుకార్డులపై రాయించి పోస్టు చేయించారు. అనంతరం డీఎస్పీ కరీమూల్లా షరీఫ్ మాట్లాడుతూ హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారన్నారు. ప్రమాదాలను పూర్తీగా నివారించాలనే ఉద్ధేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ ఆంజినేయులు, ఎల్‌ఆర్‌జీ పాఠశాల ఏఓ నరేష్ ప్రధానోపాధ్యాయులు ప్రసాధ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
టీనేజ్ స్పీడ్‌కు బ్రేక్
►పిల్లలకు రహదారి భద్రతా పాఠాలు ►స్కూళ్లు, కాలేజీల్లో ఆర్టీఏ రోడ్ సేఫ్టీ క్లబ్‌లు ►1,450 విద్యా సంస్థల్లో ఏర్పాటుకు ప్రణాళికలు సిటీబ్యూరో: అసలే కుర్రాళ్లు. ఆపైన టాప్‌గేర్‌లో హైస్పీడ్. కళ్లు మూసి తెరిచేలోగా మాయమైపోవాలనుకుంటారు. మరోవైపు బైక్, కార్ రేసింగ్‌లు. అయితే రోడ్డు నిబంధనలపై అవగాహన ఉండదు. స్కూల్ దశల్లోనే బైక్ రైడింగ్ చేయాలనే ఉత్సాహంతో ప్రాణాలు కోల్పోతున్న టీనేజ్ కుర్రాళ్లు. అలాంటి పిల్లల వాహన డ్రైవింగ్‌కు కళ్లెం వేసేందుకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు ఆర్టీఏ ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర శివార్లలోని స్కూళ్లు, కళాశాలలు, తదితర విద్యాసంస్థల్లో వినూత్నంగా రోడ్డు భద్రతా క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. సుమారు 1,450 విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇవి పూర్తిగా పిల్లల క్లబ్‌లు ∙ఈ రోడ్డు సేఫ్టీ క్లబ్బుల నిర్వహణలో పిల్లలే ప్రధాన భాగస్వాములు. ఒకరిద్దరు టీచర్లు, కొందరు పిల్లలతో కలిపి క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. రోడ్డు భద్రతపై స్కూల్లో చేపట్టవలసిన కార్యక్రమాలను ఈ క్లబ్‌లే చేపడతాయి. ఈ క్లబ్‌లకు ఆర్టీఏ శిక్షణనిస్తుంది. ∙ఉదయం ప్రార్థన సమయంలో రోడ్డు భద్రత నిబంధనలను గుర్తు చేసుకోవడంతో పాటు, రోడ్డు భద్రతపై రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను ప్రదర్శిస్తారు. ∙పిల్లలే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ఆర్టీఏ శిక్షణనిస్తుంది. అవసరమైన మెటీరియల్‌ను ఆర్టీఏ అందజేస్తుంది. ∙8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, కాలేజీల్లో ఇంటర్ స్టూడెంట్స్‌ను భాగస్వాములుగా చేస్తూ ఈ క్లబ్‌లు ఏర్పాటు చేస్తారు. ∙కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ, ఉప్పల్, బోడుప్పల్, అల్వాల్, మల్కాజిగిరి, బాలానగర్, షామీర్పేట్ తదితర ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లోనే బ్లాక్స్పాట్లు కూడా అధికంగా ఉన్నట్లు రవాణా అధికారులు గుర్తించారు. ∙స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌డే వంటి వేడుకల్లో రోడ్డు భద్రతపై పిల్లలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. ప్రమాద రహిత జీవనమే లక్ష్యంగా.. ముందస్తుగానే పిల్లల్లో అవగాహన కల్పించడం, ఉపాధ్యాయులను, స్కూళ్లను, తల్లిదండ్రులను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా భవిష్యత్ తరాలు ప్రమాదరహిత జీవనం కొనసాగించాలన్నదే మా ఆకాంక్ష. అందుకే ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా అధికారి, మేడ్చల్. -
రోడ్డు భద్రత యాప్‌లో ప్రమాద దృశ్యాలు
– అప్లోడ్ చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం కర్నూలు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా ఆ దృశ్యాలను ఫొటోలు తీసి.. రోడ్డు భద్రత యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని పోలీసు అధికారులను డీజీపీ సాంబశివరావు ఆదేశించారు. బుధవారం ఉదయం విజయవాడ నుంచి అన్ని జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, ఎస్పీ ఆకె రవికృష్ణ, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ..వాహనాలను రాంగ్ రూట్లో నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. జిల్లాల వారీగా రోడ్డు ప్రమాదాల సమచారాన్ని అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల్లోని హాస్పిటల్స్ ఫోన్ నంబర్లు పోలీసు సిబ్బంది కలిగి ఉండాలన్నారు. కొత్తగా ఎంపికైన ఎస్ఐలు శిక్షణకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని చెక్‌పోస్టుల సమాచారం అందజేయాలన్నారు. డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు మహేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, సుబ్రమణ్యం, ఆదిలక్ష్మీ, రామాంజనేయులు (కమ్యూనికేషన్), ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, ఈ.కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, డీఐజీ సీసీ నారాయణ, డీసీఆర్బీ ఎస్ఐ పులిశేఖర్, ఈ.కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
విజయనగరం టౌన్: రోడ్డు భద్రతా కమిటీతో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన భద్రతా చర్యలను వి«విధ శాఖాధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ యూసీజీ నాగేశ్వరరావు, ఎస్పీ ఎల్‌కెవి.రంగారావులు నిర్వహించిన సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో కారణాలను అధికారులకు విశ్లేషించారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను విస్తరించాలని, ఆక్రమణలు తొలగించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. అధిక లోడ్లతో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని, ప్రత్యేక దాడులను పోలీసులు, ఆర్టీవో, ఆర్టీసీ అధికారులతో సంయుక్తంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై ట్రక్ బేలను మరింతగా విస్తరించాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖాధికారులు రాత్రి సమయాల్లో ఎక్కువ కాంతి ఉండే విధంగా లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై ట్రామా కేర్ సెంటర్లు మరింతగా ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రేడియం, రిఫ్లక్టివ్ టేప్‌లను , హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించాలని జాతీయ రహదారులకు కనీసం 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఎస్పీ సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టేప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు మరింత సమర్ధవంతంగా రూపొందించాలని జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు కృష్ణవేణి, అదనపు ఎస్పీ ఎవి.రమణ, ఆర్టీసీ రీజనల్ మేనేజరు అప్పారావు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, విజయనగరం డీఎస్పీ ఎవి.రమణ, బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు, రోడ్డు భద్రతా నోడల్ అధికారి త్రినాథరావు, మున్సిపల్ కమిషనరు నాగరాజు, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు, జాతీయ రహదారుల నిర్మాణ కాంట్రాక్టర్లు, పోలీస్, ఆర్టీసీ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు ఇవీ
అనంతపురం సెంట్రల్ : రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోడ్డు నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న వారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి. లేకుంటే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని రోడ్డు, రవాణాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఎవరైనా వాహనం నడపాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. – రిజిస్ట్రేషన్ లేకపోతే వాహన చట్టం సెక్షన్ 39, 192 ప్రకారం జరిమానా విధిస్తారు. – డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సెక్షన్ 3, 4 , 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష వేస్తారు. – పొల్యూషన్ సర్టిఫికెట్స్ లేకపోతే సెక్షన్ 190(2) ప్రకారం రూ. 1000 జరిమానా విధిస్తారు. – ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196(ఏ) ప్రకారం 3 నెలలు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తారు. మద్యం తాగి నడిపితే : మద్యం సేవించి వాహనం నడుపరాదు. మోటారు వాహన చట్టం సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే : ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ నేరంగా పరిగణిస్తారు. మోటారు వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా విధిస్తారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణిస్తే : పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులకు ఎక్కించుకొని వెలితే మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు. సీట్ బెల్ట్ ధరించకపోతే : సీఎంవీ రూల్ 138(3) ప్రకారం విధిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ ధరించకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 177 ప్రకారం జరిమానా రూ.100 విధించబడుతుంది. స్కూల్ బస్సులు నిబంధనలు పాటించకపోతే : ఏపీ మోటారు వాహనాల నియమావళి 1989 నందు 185(జి) ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, 60 ఏళ్లు దాటిన వారు డ్రైవింగ్ చేసినా, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించినా మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా లేదా పర్మిట్‌పై చర్యలు తీసుకుంటారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే : సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం, నిబందన అతిక్రమించిన వారికి వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం రూ. 1000 జరిమానా లేదా సీఎంవీ రూల్ 21(6) ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే : హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. లేని రూ.100 జరిమానా విధిస్తారు. అతి వేగం ప్రమాదకరం : వాహనాలను అతివేగంగా నడపటం అత్యంత ప్రమాదకరం. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 112, 183 (1) ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది. -
రోడ్డు సేఫ్టీపై డీజీపీ రివ్యూ
విజయవాడ: రోడ్డు ప్రమాదాల నివారణపై బుధవారం డీజీపీ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రోడ్డు సేఫ్టీ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మన రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది.. అధికారులకు చెడ్డపేరు వచ్చినా నిబంధనలను కఠినంగా అమలు చేసి హెల్మెట్ తప్పనిసరి చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో 77 శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు 32 శాతం మంది, నాలుగు చక్రాల వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు 17 శాతం మంది మృతి చెందుతున్నారని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 'రోడ్డు ప్రమాదాలపై శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే హడావిడి చేసి ఆ తర్వాత వదిలేస్తున్నారు. ఏర్పేడులో జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏర్పేడు తరహా ప్రమాదాలు జరగకూడదని సీఎం సీరియస్‌గా చెప్పారు. యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్ బాధ్యత కూడా ఓనర్‌పై ఉండాలి. రోడ్డు సేఫ్టీ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు. హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను కళ్లారా చూసి కూడా ఏం చేయలేకపోతున్నాం.. పెద్దాపురం రోడ్లు వర్షం వస్తే చాలు అధ్వాన్నంగా తయారవుతున్నాయి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలని అన్నారు. -
ప్రమాదాలు జరిగితే కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత
శాఖాధిపతుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: జిల్లాల్లో జరిగే ఏ ప్రమాద ఘటనకైనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రులు, శాఖాధిపతులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని సూచించారు. ఉచిత ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలని, ఎక్కడైనా వసూళ్లు జరిగితే పీడీ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. అధికారులు తప్పు చేసినా ఉపేక్షించనని, ఏ స్థాయి అధికారి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. అధికారు ల్లో నైపుణ్యం, సామర్థ్య పెంపు బాధ్యతల్ని విశ్రాం త సీఎస్ ఎస్పీ టక్కర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో మరుగుదొడ్డి కట్టుకోని వారిని ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించేందుకు త్వరలో చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖపై సమీక్ష సందర్భంగా భవానీ ద్వీపాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్లతో వాటర్ స్క్రీన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాకు అనుకూలంగా పనిచేయాల్సిందే.. అధికారులంతా తమకు అనుకూలంగా పనిచేయాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. తమ ప్రభుత్వానికి, పార్టీకి కొందరు అధికారులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దీన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన కాంతీలాల్ దండే.. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ విధానం సరిగా లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని తాను పలుమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే అందులోని వాస్తవాన్ని పట్టించుకోకుండా సీఎం ఏకంగా శాఖాధిపతుల సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి విరుచుకుపడ్డారు. హద్దు మీరితే ఉన్నతాధికారులయినా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టే బాధ్యతను రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖ మంత్రులకు అప్పగిస్తున్నానన్నారు. -
హెచ్చరించిన సచిన్.. ఎందుకో తెలుసా..!
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా వాహనదారుల వైఖరిలో పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండంటూ మాజీ క్రికెటర్ సచిన్ తన ఫేస్ బుక్ లో ఆదివారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కేవలం గంటలోనే 20 లక్షల మంది వీక్షించడం విశేషం. అరకోటికి పైగా షేర్లు, లక్షల మంది లైక్స్ తో దుమ్మురేపుతుంది. రోడ్డు భద్రతా అంటే హెల్మెట్ ధరించడమని తనతో సెల్ఫీ దిగేందుకు రోడ్డుపై ఆగిన ఇద్దరు యువకులకు సచిన్ చెప్పారు. ఈ వీడియో గమనించినట్లయితే.. ఓ యువకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దయచేసి హెల్మెట్ ధరించండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. మరోసారి తనకు బైకుపై కనిపిస్తే హెల్మెట్ తోనే కనిపించాలని యువకుడికి సూచించగా .. ఒకే అంటూ అతడు బదులిచ్చాడు. ఆపై సచిన్ ను గుర్తించి నమస్కారం పెట్టిన మరికొందరికి కూడా సచిన్ ఇదే విషయాన్ని సూచించారు. -
ప్రాణనష్టం నివారణకు రోడ్డుసేఫ్టీ వెహికల్స్
ప్రారంభించిన అర్బన్ ఎస్పీ రాజకుమారి అందుబాటులో మూడు వాహనాలు రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేశామని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ పి.రాజకుమారి తెలిపారు. శనివారం సాయంత్రం మోరంపూడి సెంటర్లో మూడు వాహనాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ వాహనాలు ఆ ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను తీసుకుని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చుతాయన్నారు. అర్బ¯ŒS జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 45 మంది, 2014లో 75 మంది మృత్యువాత పడ్డారన్నారు. రాజానగరం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో నరేంద్రపురం, బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో మోరంపూడి, కడియం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో బుర్రిలంక గ్రామాల్లో జాతీయరహదారి పక్కన ఈ వాహనాలు ఉంటాయన్నారు. ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందని, ప్రమాదం తెలిసిన వెంటనే ఐదు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటాయన్నారు. అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ : రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ–బీట్ సిస్టమ్‌లో ఆఫ్లై¯ŒS యాప్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్బ¯ŒS జిల్లాలో 68 బీట్లు ఉన్నాయన్నారు. బీట్ షెడ్యూల్ ప్రకారం పది నుంచి 20 పాయింట్లు ఉంటాయన్నారు. ప్రతి పాయింట్ వద్ద బీట్ కానిస్టేబుల్ 20 నుంచి 30 నిమిషాలు ఉండాలన్నారు. ఇప్పటికే 26 సెల్ఫోన్లకు ఈ–బీట్ సిస్టమ్ అప్లోడ్ చేశామన్నారు. కార్యక్రమాల్లో డీఎస్పీలు రమేష్‌బాబు, కులశేఖర్, నారాయణరావు, సత్యానందం, త్రినాథరావు, జి.శ్రీనివాసరావు, రామకృష్ణ, ఇ¯ŒSస్పెక్టర్లు చింతా సూరిబాబు, కనకారావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కె.వరప్రసాదరావు, సురేష్, కృపానందం, రవీంద్ర, రవికుమార్, రామకోటేశ్వరరావు, సాయిరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకటి నుంచే ‘ట్రాఫిక్ బోధన’
►రహదారి భద్రతను సబ్జెక్ట్‌గా చేర్చాలని నిర్ణయం ►ఎస్సీఈఆర్టీ బృందంతో ట్రాఫిక్ కాప్స్ కసరత్తు ►ఇప్పటికే పాఠ్యాంశాలు సిద్ధం చేసిన పోలీసులు ►ఈ ఏడాదికి ఆన్లైన్లో ఈ–బుక్స్ సాక్షి, సిటీబ్యూరో: ⇒రహదారిపై ఏఏ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసుకోవాలి? పార్కింగ్‌లో ఉన్న రకాలను వివరించండి. ⇒ ట్రాఫిక్ సిగ్నల్‌లో ఎన్ని లైట్లు ఉంటాయి? ఏఏ రంగు దేన్ని సూచిస్తుందో సోదాహరణగా రాయండి. ⇒రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? ⇒అత్యవసర సమయాల్లో ఏఏ నెంబర్లకు సంప్రదించాలో పేర్కొనండి. ....ఇకపై విద్యార్థులకు పరీక్షల్లో ఈ తరహా ప్రశ్నలూ ఎదురుకానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ‘రహదారి భద్రత విద్య (రోడ్డు భద్రత, జాతి భవిష్యత్తు)’ పేరుతో అదనంగా ఓ సబ్జెక్ట్ చేరనుంది. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) వారు కసరత్తు పూర్తి చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఉద్దేశించి మూడు పుస్తకాలను డిజైన్ చేశారు. ఆరు నుంచి ఎనిమిది వరకు అనుకున్నా... రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌ను కేవలం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వారికి మాత్రమే పరిచయం చేయాలని, వారిలో అవగాహనకు కృషి చేయాలని ప్రాథమికంగా ట్రాఫిక్ విభాగం అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు గత ఏడాదే ప్రాథమికంగా పాఠ్యాంశాలను సైతం సిద్ధం చేశారు. అయితే నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆలోచన, ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రోడ్డు క్రాసింగ్, లైన్ డిసిప్లేన్ వంటి ప్రాథమిక అంశాలను బోధించనున్నారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు రహదారి భద్రతకు సంబంధించి లోతైన అంశాలతో పాటు ఎంవీ యాక్ట్‌లోని కీలక నిబంధనలు, వాటిని పాటిస్తే కలిగే లాభాలు, విస్మయిస్తే చోటు చేసుకునే పరిణామాలు తదితర అంశాలను పాఠ్యాంశంగా చేర్చనున్నారు. తొమ్మిది పది తరగతులకు పార్కింగ్ విధానాలు, వాటిలో ఉండే లోటుపాట్లు, రహదారి భద్రత నిబంధనల్నీ వివరించనున్నారు. ఈ ఏడాదికి ఈ–బుక్స్ రూపంలో... ఈ విద్యా సంవత్సరం (2017–18) నుంచే రహదారి భద్రత విద్యను ఓ సబ్జెక్ట్‌గా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఎస్సీఈఆర్టీ ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. అయితే తుది కసరత్తులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాదికి టెక్ట్స్‌బుక్స్ అందించడం కష్టసాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌కాపీలను సిద్ధం చేసి పాఠశాలలకు ఆన్లైన్లో ఈ–బుక్స్ రూపంలో పంపించాలని భావిస్తున్నారు. వాటిని ఆయా పాఠశాలలకు చెందిన వారు ప్రింట్‌ఔట్స్ రూపంలో విద్యార్థులకు ఇచ్చేలా చర్యలు తీçసుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం (2018–19) నుంచి సోషల్ లేదా మోరల్ సైన్స్లకు అనుబంధంగా రహదారి భద్రత విద్య సబ్జెక్ట్ టెక్ట్స్‌బుక్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎస్సీఈఆర్టీతో భేటీ అయిన ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ సబ్జెక్టులు, అందులోని అంశాలను పరిశీలించారు. ఇతర ఉపయుక్తమైన అంశాలు... రహదారి భద్రత విద్య సబ్జెక్ట్‌లో కొన్ని ఇతర ఉపయుక్తమైన అంశాలను చేర్చాలని ట్రాఫిక్–ఎస్సీఈఆర్టీ అధికారులు నిర్ణయించారు. 100, 101, 108 వంటి ఎమర్జెన్సీ నెంబర్ల ఉద్దేశం, వాటిని వినియోగించాల్సిన విధానం, దుర్వినియోగం చేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు తదితర వివరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు ఇంటి పరిసరాలు, వీధులు, కాలనీలు పరిశుభ్రంగా ఉంచడానికి పాటించాల్సిన అంశాలనూ పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర, కేంద్ర సిలబస్‌లతో నడిచే పాఠశాలలు ఉన్నాయి. తొలి దశలో స్టేట్ సిలబస్‌లోని పాఠ్యపుస్తకాల్లో ట్రాఫిక్ పాఠాలను చేరుస్తున్నారు. సెంట్రల్ సిలబస్ అమలులో ఉన్న పాఠశాలలకు బుక్‌లెట్స్‌ను సరఫరా చేసి ప్రత్యేక పీరియడ్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో అమలైన తర్వాత కేంద్రం పరిధిలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌కు (ఎన్సీఈఆర్టీ) లేఖ రాయడం ద్వారా ఆ సిలబస్‌లోనూ పాఠ్యాంశాలుగా చేర్చేలా ప్రయత్నాలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాఠ్యాంశంగా కాకుండా సబ్జెక్ట్‌గా.. ‘ఏటా వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న, అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులుగా మారుస్తున్న రోడ్డు ప్రమాదాలను నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి సంబంధించి అవసరమైన అన్ని రకాలైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అంశాలను సబ్జెక్టుగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తొలుత దీన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చాలని భావించాం. అయితే ప్రతి విద్యార్థి నేర్చుకోవడమేనేది కచ్చితంగా చేయడానికే సబ్జెక్టుగా పెట్టాలని నిర్ణయించాం. బడి ఈడు నుంచే బాధ్యతల్ని పెంచితే సత్ఫలితాలు ఉంటాయి. ఆ మేరకు విద్యాశాఖ అధికారులతో కలిసి కసరత్తు పూర్తి చేస్తున్నాం’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ ఏఏ తరగతుల వారికి ఏం బోధిస్తారంటే... ఒకటో తరగతి: ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యత రెండో తరగతి: పాదచారులు–జాగ్రత్తలు మూడో తరగతి: రవాణా సౌకర్యాలు –వాహనాలపై ప్రయాణం 4,5,6,7 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, ట్రాఫిక్ సిగ్నల్స్–సైన్ బోర్డులు, రోడ్ ప్రమాదాలు–కారణాలు, భద్రతా చర్యలు–సురక్షిత ప్రయాణం, విద్యార్థులు, రవాణా సౌకర్యాలు 8,9,10 తరగతులు: రోడ్డు భద్రత–ప్రాముఖ్యత, వాహనాలు నిలుపు విధానం, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ప్రమాదాలు– నిరోధించే మార్గాలు, భద్రతా చర్యలు, తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు. (ప్రతి తరగతి వారికీ కొన్ని వీడియో క్లాసులు ఉండేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి) -
9 పట్టణాల్లో ట్రాఫిక్ పార్కులు
ఏలూరు సిటీ : జిల్లాలోని 9 పట్టణాల్లో మే 15 నాటికి 9 ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ కె.భాస్కర్ చెప్పారు. మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని, ఈ పరిస్థితిని నివారించేందుకు రోడ్డు భద్రతపై అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏలూరు నగరపాలక సంస్థతో పాటు 9 పురపాలక సంఘాల్లో ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ పార్కులను మే 15 నాటికి పట్టణాల్లో ఏర్పాటు చేస్తే కమిషనర్లకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని చెప్పారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రతిరోజూ రెండు, మూడు ప్రమాదాలు జరిగుతుంటే ఐదారుగురు చనిపోతున్నారని, ఈ పరిస్థితిని నివారించాలి్సన బా«ధ్యత అందరిపై ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు తొలగింపు జిల్లాలోని జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఏప్రిల్ 1 నుంచి ఒక్క మద్యం దుకాణాలు కనిపించేందుకు వీలులేదని కలెక్టర్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం తాగాలనే కోరిక కలిగించే ప్రచార బోర్డులు కూడా కనిపించేందుకు వీలులేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర ప్రధాన రహదారుల్లోనూ మద్యంషాపులు ఇకపై కనిపించబోవని స్పష్టం చేశారు. జాతీయ రహదారిపై ఏ చిన్న గొయ్యి కనిపించినా సహించబోమని, టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసుకుని ప్రజల నుంచి ఎలా పన్నులు వసూలు చేస్తున్నారో అదేస్థాయిలో జాతీయ రహదారులపై నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ చెప్పారు. జాతీయ రహదారులపై 27 చోట్ల గుంటలు ఉన్నట్లు పరిశీలనలో తేలిందని, వాటిని మూడురోజుల్లోగా మరామ్మత్తులు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇకపై గొయ్యి కన్పించిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో గోతులు సంబంధిత అధికారులు పూడ్చివేయకుంటే కలెక్టర్‌గా కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో బా«ధ్యులను జైలుకు పంపించేందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. జిల్లాలో 45 ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. సమావేశంలో డీటీసీ సత్యనారాయణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ ఎంవీ నిర్మల, పంచాయితీరాజ్ ఎస్ఈ ఇ.మాణిక్యం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.కోటేశ్వరి, డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, నగరపాలక సంస్థ కమిషనర్ యర్రా సాయి శ్రీకాంత్, నేషనల్ హైవే అథారిటీ అధికారి వెంకటరత్నం, నేషనల్ హైవే విజయవాడ పీడీ టి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.