
డ్రైవర్లకు ప్రశాంతత అవసరం
రోడ్డు భద్రతా వారోత్సవాలలో కలెక్టర్ కేవీ రమణ
కడప అర్బన్ : డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరిలో ప్రశాంతత ఉండాలని జిల్లా కలెక్టర్ కేవీరమణ పేర్కొన్నారు. 26వ రహదారి భద్రత వారోత్సవాలను రవాణా శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ ఆవరణంలోని సమావేశ మందిరంలో వివిధ కళాశాలల విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో, ట్రాలీ డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారుల వల్ల జరుగుతున్నాయన్నారు.
డ్రైవింగ్ చేసే వారు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండి వాహనాలు నడపాలన్నారు. వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గత యేడాది కాలంలో 2 లక్షల మందికి పైగా కేవలం రోడ్డు ప్రమాదాల వల్ల మృతి చెందారన్నారు. కుటుంబ యజమాని ప్రమాదంలో మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడినట్లేనన్నారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. డీటీసీ బసిరె డ్డి మాట్లాడుతూ అనేక రకాల కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరసింహారెడ్డి వాహనదారులు అప్రమత్తంగా ఉండే గీతానికి నృత్య ప్రదర్శన చేశారు. పలు కరపత్రాలను, గోడ పత్రాలను కలెక్టర్, ఎస్పీఆవిష్కరించారు. సమావేశంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్‌ఎం గోపీనాధ్‌రెడ్డి, జెడ్పీ సీఈవో మాల్యాద్రి ప్రసంగించారు. కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, ఎంవీఐలు శ్రీకాంత్, వేణు, ఏఎంవీఐ లు హేమకుమార్, వివిధ కళాశాలల విద్యార్థులు, ఆర్టీసీ, ఆటోడ్రైవర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.