రోడ్డు భద్రత వారోత్సవాలు
జిల్లాలో వాహనాలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. సగటున ప్రతి రెండు రోజులకు ముగ్గురు చొప్పున ప్రాణాలు తీస్తున్నాయి. గత మూడు వారాల్లో 34 మంది దుర్మరణం పాలయ్యారు. పెరిగిపోతున్న ప్రమాదాలకు ఈ సంఖ్య అద్దం పడుతోంది. ప్రధానంగా అతి వేగం, అజాగ్రత్త వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. సోమవారం నుంచి జిల్లాలో 29వ భద్రత వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమయ్యే చర్యలు చేపట్టనున్నట్టు ఉప రవాణా కమిషనర్‌డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు ప్రకటించారు.
సాక్షి, విశాఖపట్నం : రోజూ ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మృత్యు ఘంటికలు మోగిస్తూ జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఆయా కుటుంబాల్లో చీకట్లను నింపుతున్నాయి. లారీలు, కార్లు, జీపులతో పాటు ద్విచక్ర వాహనాలే యమపాశాలుగా మారుతున్నాయి. ప్రధానంగా అతి వేగం, అజాగ్రత్త వెరసి రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆదివారం వరకు ఈ 22 రోజుల్లో 34 మంది దుర్మరణం పాలయ్యారు. పెరిగిపోతున్న ప్రమాదాలకు ఈ సంఖ్య దర్పణం పడుతోంది.
వేగమే ప్రధాన శత్రువు
ప్రమాదాల్లో ప్రాణాలు హరించడానికి వేగమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తమ వాహనాలు గాని, ఎదురుగా వస్తున్న వాహనాలు గాని అతి వేగంగా నడపడంతో ప్రమాదాలకు హేతువవుతున్నాయని పోలీసు అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇవే ఎక్కువగా ఉంటున్నాయని వీరు చెబుతున్నారు. వేగంగా దూసుకుపోతున్నప్పుడు వాటిని అదుపు చేయలేక ప్రమాదాల పాలవడమో, లేక ఎదుటి వారిని ఢీకొట్టడమో జరుగుతున్నాయని వీరు పేర్కొంటున్నారు. ప్రమాద కారకుల్లో యువకులు, విద్యార్థులే అధికంగా ఉంటున్నారు. వీరిలో దూకుడు స్వభావమే దీనికి కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త కూడా దుర్ఘటనల పాలవడానికి దారి తీస్తున్నట్టు వీరి లెక్కల్లో తేలింది.
ఇదీ కార్యాచరణ ప్రణాళిక
మర్రిపాలెం : రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా కార్యాచరణ ప్రణాళికను డీటీసీ ప్రకటించారు.
ప్రజలకు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన
వివిధ వర్గాల డ్రైవర్లకు ప్రత్యేక పునఃశ్చరణ తరగతులు
డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాలు
పలు కళాశాలల్లో హెల్మెట్ ధారణ, సీటు బెల్ట్ వినియోగం, రహదారి భద్రత గురించి విద్యార్థులకు అవగాహన సదస్సులు
స్కూల్ వాహనాల డ్రైవర్లు, విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,కరపత్రాలు, బ్రోచర్లతో ప్రచారం
ట్రాఫిక్ ఉల్లంఘనల మీద ప్రత్యేక తనిఖీలు
పాదచారులకు రహదారి నిబంధనల గురించి వివరిస్తారు.- లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ మేళాలు ఏర్పాటు చేస్తారు.
ప్రమాదాల నివారణకు చర్యలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార రథం ద్వారా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నాం. డ్రైవర్లకు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహిస్తాం. విశాఖ, అనకాపల్లి, గాజువాకల్లో లారీ, ఆటో డ్రైవర్లకు బీపీ, మధుమేహం, కంటి వైద్య పరీక్షలు చేయిస్తాం. హెల్మెట్‌లు, లైసెన్స్‌ల ఆవశ్యకతపై కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. రోడ్డు భద్రతపై లఘుచిత్రాలను ప్రదర్శిస్తాం. నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్పెషల్ డ్రైవ్ ద్వారా కేసులు నమోదు చేస్తున్నాం. హెల్మెట్, సీట్ బెల్ట్‌ల ధారణపై అవగాహనా ర్యాలీలు నిర్వహిస్తాం. ఇంకా పాదచారులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం.
– వెంకటేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్
వేగ నియంత్రణ లేకే..
హైస్పీడు బైక్‌లతో ప్రమాదమని తెలిసినా వేగంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. రాంగ్‌రూట్‌లో రావడం ప్రమాదాలకు మరో కారణం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం.
–రమేష్‌కుమార్, ఏడీసీపీ, ట్రాఫిక్
Comments
Please login to add a commentAdd a comment