
టీ.నగర్: నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలని భర్త కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. రాశిపురం తాలూకా పట్టణం మునియప్పపాళయం ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి. ఇతని భార్య అత్తాయి (50). రామస్వామి తన భార్య నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని, ఆమెను విడిపించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఒక పిటిషన్ అందజేశారు. అందులో.. తన భార్య అత్తాయి, కుమారుడు పళనిస్వామి కొన్ని నెలల కిందట బెంగళూరులోని నిత్యానంద మఠానికి ధ్యానం చేసేందుకు వెళ్లారని, తర్వాత వారు తిరిగి రాలేదని తెలిపారు. దీనిపై నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు బెంగళూరుకు వెళ్లి తన కుమారుడు పళనిస్వామిని విడిపించి తనకు అప్పగించినట్లు తెలిపారు.
అయితే అత్తాయి రాలేదని, ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. తన భార్య పేరిట వడుకం ఇండియన్ బ్యాంకులో రూ.5లక్షలు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.5లక్షలు, నగల రుణం రూ.30 వేలు, బయటి వ్యక్తుల రుణాలు రూ.11 లక్షల వరకు ఉన్నాయని, ఈ నగదును ధ్యాన తరగతులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి నగదు చెల్లించాలని కోరుతున్నారని, ఎనిమిది నెలలుగా మానసిక క్షభకు గురవుతున్నట్లు తెలిపారు. తనకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని, తన భార్యను నిత్యానంద ఆశ్రమం నుంచి విడిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment