రోడ్డు ప్రమాదాలకు చెక్..
- బ్లాక్ స్పాట్‌ల గుర్తింపునకు ఆదేశాలు
- ఇప్పటికే సగం స్థలాలకు మరమ్మతులు
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినచర్యలు
సాక్షి, ముంబై: తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను ‘బ్లాక్ స్పాట్’గా గుర్తించి, వాటిని సరిచేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల ట్రాఫిక్, రవాణా విభాగాల ఉన్నతాధికారులు బ్లాక్ స్పాట్‌లకు సంబంధించి పూర్తి వివరాలతో ఢిల్లీకి రావాల్సిందిగా ఇటీవల హైవే రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ఆదేశించారు. మాజీ మంత్రి గోపీనాథ్ ముండే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ వహిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, ఏడాదిలో మూడు అంతకంటే ఎక్కువ ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలు వరుసగా జరిగితే ఆ ఘటన స్థలాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తిస్తారు.
రాష్ట్రంలో ప్రతి ఏడాదీ 13 వేల మంది రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. అయితే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న స్థలాలను ఇప్పటివరకూ ప్రభుత్వం సరిచేయకపోవడం గమనార్హం. ప్రమాదాలు జరుగుతున్న 150 స్థలాలను ‘బ్లాక్ స్పాట్స్’గా గుర్తించారు. ఇందులో 131 స్థలాలను నేషనల్ హైవేపైనా, 19 స్థలాలను స్టేట్ హైవేపైనా గుర్తించారు. వీటిలో జాతీయరహదారిపైన గుర్తించిన 63 స్థలాలను, రాష్ట్ర హైవేపైనా గుర్తించినా అన్ని స్థలాలను బాగుచేయించారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
హైవే పోలీసు అధికారులు అందజేసిన వివరాల మేరకు.. ముంబై-అహ్మదాబాద్ హైవేపైన ఉన్న ఠాణే జిల్లాలోని కుడే నుంచి సతివాలి సెక్షన్ వరకు ఉన్న మార్గం రాష్ట్రంలోనే చాలా అపాయకరమైందిగా గుర్తించారు. ఈ స్థలంలో 2011-13 మధ్య కాలంలో దాదాపు 14 ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్యను కొంత మేర తగ్గించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అధికారి తెలిపారు.
బ్లాక్ స్పాట్లను హైవే పోలీస్ విభాగం గుర్తిస్తుండగా, ప్రజా పనుల విభాగం, నేషనల్ హైవే అథారటీ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ఘటనా స్థలాలను సరి చేయనున్నాయని హైవే డిప్యూటీ సూపరింటెండెంట్ బలిరామ్ కదమ్ తెలిపారు.
రాష్ట్ర పోలీసులు అందజేసిన గణాంకాల ప్రకారం.. 2011లో 68,438 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన 58,41,782 మందిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా రూ.70.44 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు. 2012లో 66,316 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 53,60,536 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించినందుకు గాను కేసు నమోదు చేసి రూ.68.31 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు.
2013లో 63,019 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 51,97,460 మందిపై ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించిన కేసులు నమోదు చేసి, వారినుంచి రూ.63.62 కోట్లను వసూలు చేశారు. కాగా, 2014లో ఏప్రిల్ వరకు 21,049 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 18,85,498 మందిపై ట్రాఫిక్ నియమ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.23.20 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేశారు.