హెచ్చరించిన సచిన్.. ఎందుకో తెలుసా..!
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా వాహనదారుల వైఖరిలో పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండంటూ మాజీ క్రికెటర్ సచిన్ తన ఫేస్ బుక్ లో ఆదివారం ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో కేవలం గంటలోనే 20 లక్షల మంది వీక్షించడం విశేషం. అరకోటికి పైగా షేర్లు, లక్షల మంది లైక్స్ తో దుమ్మురేపుతుంది.
రోడ్డు భద్రతా అంటే హెల్మెట్ ధరించడమని తనతో సెల్ఫీ దిగేందుకు రోడ్డుపై ఆగిన ఇద్దరు యువకులకు సచిన్ చెప్పారు. ఈ వీడియో గమనించినట్లయితే.. ఓ యువకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దయచేసి హెల్మెట్ ధరించండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. మరోసారి తనకు బైకుపై కనిపిస్తే హెల్మెట్ తోనే కనిపించాలని యువకుడికి సూచించగా .. ఒకే అంటూ అతడు బదులిచ్చాడు. ఆపై సచిన్ ను గుర్తించి నమస్కారం పెట్టిన మరికొందరికి కూడా సచిన్ ఇదే విషయాన్ని సూచించారు.