ఆ పద్ధతిలో మార్పురావాలి:సచిన్
న్యూఢిల్లీ:క్రికెట్ లో స్ట్రైకర్కు నాన్ స్ట్రైకర్ కు ఉన్న అవగాహనే రోడ్డు ప్రయాణంలోనూ పాటించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. వాహనాలపై వెళ్లేవారు పాదచారులను గౌరవిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నాడు. నగరంలో ఆదివారం రహదారి భద్రతా ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించిన అనంతరం సచిన్ తనదైన క్రికెట్ భాషలో మాట్లాడాడు. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్ మెన్కు అవతలి ఎండ్లో ఉన్న ఆటగాడికి చక్కని సమన్వయం ఎంతో ముఖ్యమైనదో.. అదే తరహా విధానాన్ని రోడ్లుపై వెళుతున్నప్పుడు కూడా పాటిస్తే మంచిదన్నాడు. ఈ రకంగా మనం స్వచ్ఛందంగా రూల్స్ ను పాటించిన రోజున భారతీయ రోడ్లు అత్యంత సురక్షితమైన రహదారులుగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదని మాస్టర్ తెలిపాడు. దీనిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సచిన్ పిలుపునిచ్చాడు.
ఈ సందర్భంగా తాను రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలను సచిన్ పంచుకున్నాడు. చాలా మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వారి ఇష్టానుసారం వెళ్లే విషయం చాలాసార్లు చూశానన్నాడు. 'కొంతమంది డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ పెట్టుకోరు. వారి వద్ద హెల్మెట్ ఉంటుంది. అయితే ఆ హెల్మెట్ ను వారి చేతుల్లోనూ, లేకపోతే బైక్ హ్యాండిల్ పైనో ఉంచుతారు. ఈ విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది' అని సచిన్ తెలిపాడు.
ఇదిలాఉండగా, ప్రతీ మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్య వ్యవధిలో ఒక జీవితం రోడ్డు ప్రమాదాల బారిన పడి అర్థాంతరంగా ముగిసిపోతున్న విషయాల్ని గణాంకాలు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సంవత్సరానికి 10 లక్షలకు మందికి పైగా మృత్యువాత పడుతుండగా, దాదాపు 50 లక్షల మంది వరకూ తీవ్రమైన గాయాలుపాలవుతున్నారు.