సచిన్ టెండూల్కర్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : నాణ్యత లేని హెల్మెట్‌లను తయారీ చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీమిండియా క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. భద్రత కోసం వాడే వస్తువులు చాలా నాణ్యతగా ఉండాలని, క్రికెటర్లు మైదానంలో వాడే వస్తువులంతా నాణ్యమైనవిగా ఉండాలని సచిన్ లేఖలో ప్రస్తావించారు.
ఇక దేశంలోని 70 శాతం ద్విచక్ర వాహనదారులు నకిలీ హెల్మెట్‌లు వాడుతున్నారని, చాలా కంపెనీలు ఎలాంటి నాణ్యమైన ప్రమాణాలు పాటించకుండా నకిలీ ఐఎస్‌ఐ ముద్రను ముద్రించి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇవి వాహనదారుల భద్రతకు ప్రమాదమని, ప్రమాదాల తీవ్రతను మరింత పెంచేలా చేస్తాయన్నారు. నకిలీ హెల్మెట్‌లు తలకు అయ్యే గాయల నుంచి రక్షించలేవన్నారు.
దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా టూవీలర్స్ రైడర్సే మరణిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రజా రక్షణ కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని తాను భావిస్తున్నానని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కంపెనీల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన హెల్మెట్‌లు అందించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించేలా ప్రభుత్వం తరఫున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ విషయంలో తనవంతు సాయం చేస్తానని సచిన్ స్పష్టం చేశారు. నకిలీ హెల్మెట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సచిన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గత కొద్ది రోజులుగా సచిన్ ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలుసార్లు ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment