
న్యూఢిల్లీ : పెరుగుతున్న వాహనాలతో ప్రస్తుతం పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ సమస్య నేపథ్యంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ క్రమంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి త్వరలో కేంద్రం చట్టం తేనున్నది. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను పంపిన వ్యక్తికి సైతం రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలకు అడ్డకట్ట వేసేలా చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాంగ్ పార్కింగ్ కారణంగా తరచూ రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవుతున్నాయన్నారు. రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి మొబైల్‌లో ఫొటో తీసి పంపితే.. సదరు వాహనదారుడికి రూ.1000 జరిమానా విధిస్తామని, ఫొటోను పంపిన వ్యక్తికి రూ.500 రివార్డ్ ఇస్తామన్నారు. దీంతో పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రజలు వాహనాలకు సంబంధించి పార్కింగ్ స్థలం కల్పించుకోకపోవడం, రోడ్లను ఆక్రమించడంపై కేంద్రమంత్రి విచారం వ్యక్తం చేశారు.